రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేసిన రిలయన్స్.. ఇక, అమెరికా సుంకాలు తగ్గిస్తుందా?

ముడి చమురు, రష్యా , రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికా సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ముడి చమురులో అతి పెద్ద వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వెళుతోంది.
    • రచయిత, చెరిలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్.. గుజరాత్‌లోని తమ జామ్‌నగర్‌ ఆయిల్ రిఫైనరీకి రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను నిలిపివేసింది.

ఇక్కడ శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తారు.

పెట్రోల్, డీజిల్ కోసం అనేక దేశాలు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నాయి.

అయితే, రష్యన్ ముడిచమురు దిగుమతులపై యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసింది.

రష్యన్ చమురు సంస్థలు రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై అమెరికా విధించిన ఆంక్షలు కూడా శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"2026, జనవరి 21 నుంచి అమల్లోకి రానున్న దిగుమతుల ఆంక్షలకు అనుగుణంగా ముందుగానే ఈ మార్పులు అమలు చేశాం" అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

రిలయన్స్ నిర్ణయాన్ని వైట్ హౌస్ స్వాగతించింది.

"ఈ మార్పును స్వాగతిస్తున్నాం. భారత్ అమెరికా వాణిజ్య చర్చలలో అర్థవంతమైన పురోగతి కోసం ఎదురుచూస్తున్నాం" అని వైట్ హౌస్ ప్రెస్ ఆఫీస్ వాషింగ్టన్ పోస్టుకు తెలిపింది.

ముడి చమురు, రష్యా , రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికా సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ -సైట్ శుద్ధి సముదాయం.

దిగుమతుల తగ్గుదల

రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేయడమే భారత్- అమెరికా మధ్య వివాదానికి ప్రధాన కారణం.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆగస్టులో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ఇందులో రష్యన్ చమురు, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు 25 శాతం జరిమానా కూడా ఉంది.

రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా యుక్రెయిన్- రష్యా యుద్ధంలో, భారత్ రష్యాకు సాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్ ఈ ఆరోపణలను తిరస్కరించింది.

2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు కేవలం 2.5 శాతంగా ఉండేవి. అవి 2024-25 నాటికి 35.8 శాతానికి పెరిగాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి అధికంగా ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి భారత్‌కు వచ్చే ముడిచమురులో 50 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వస్తోంది.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌కు చెందిన రిఫైనరీ ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను దేశీయ మార్కెట్లకు సరఫరా చేయడంతో పాటు ఎగుమతులు కూడా చేస్తారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించాలని అమెరికా చేస్తున్న ఒత్తిడి భారత్ కొద్దినెలలుగా ప్రతిఘటిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

పలు నివేదికల ప్రకారం, భారత ఆయిల్ రిఫైనరీలు కొద్ది నెలలుగా చమురు దిగుమతులు తగ్గించుకుంటూ వస్తున్నాయి.

ముడి చమురు, రష్యా , రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికా సుంకాలు

ఫొటో సోర్స్, ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty

ఫొటో క్యాప్షన్, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని రిఫైనరీలు కూడా రష్యన్ ముడిచమురు దిగుమతులను పక్కన పెట్టినట్లు కథనాలు వచ్చాయి.

మరి, అమెరికా సుంకాలు తగ్గిస్తుందా?

కార్నెగీ ఎండోమెంట్ రిపోర్ట్ ప్రకారం, ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యన్ కంపెనీల నుంచి దిగుమతులను రిలయన్స్ 13 శాతం తగ్గించింది. మరోవైపు, సౌదీ అరేబియా నుంచి భారత్‌కు దిగుమతులు అక్టోబర్‌లో 87 శాతం, ఇరాక్ నుంచి 31 శాతం పెరిగాయి.

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని రిఫైనరీలు కూడా డిసెంబర్‌లో చమురు దిగుమతుల కోసం రష్యన్ కంపెనీలను పక్కనపెట్టినట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు తగ్గించింది కాబట్టి, అమెరికా "భారతీయ వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని వెంటనే తొలగించాలి" అని గ్లోబల్ ట్రేడ్ అండ్ రీసర్చ్ ఇనిషియేటివ్ థింక్ ట్యాంక్‌కు చెందిన అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

"అమెరికా ఆశించినట్లు నిర్ణయాలు తీసుకున్నా అధిక సుంకాలను కొనసాగించడం రెండు దేశాల సంబంధాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల ఇప్పటికే సున్నితమైన దశలో ఉన్న వాణిజ్య చర్చలను నెమ్మదింపజేస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యా చమురు కొనుగోళ్లు భారత్ - అమెరికా మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పంద చర్చలను తీవ్రంగా దెబ్బతీశాయి. నెలల తరబడి అనిశ్చితి తర్వాత ఇప్పుడు ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)