ఇందిరా గాంధీ తొలి, ఆఖరి బంగ్లాదేశ్ పర్యటనలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అహ్రార్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఢాకా
1972, మార్చి 17... ఉదయం 10:30 గంటల సమయం.. భారత వైమానిక దళ విమానం 'హన్సా' ఢాకాలోని తేజ్గావ్ విమానాశ్రయంలో దిగింది.
విమానాశ్రయంలో భారత జాతీయ పతాకంతో పాటు ఎరుపు, ఆకుపచ్చ రంగుల నూతన బంగ్లాదేశ్ జాతీయ పతాకం రెపరెపలాడుతున్నాయి.
హన్సా వస్తున్న సమయంలో ఢాకాలోనే కాకుండా బంగ్లాదేశ్ అంతటా ఇతర విమానాల రాకపోకలను నిలిపేశారు.
అంతకుముందు ఏడాదే బంగ్లాదేశ్‌కు తొలి స్నేహితులుగా మారిన నేత ఆ విమానంలో ఉన్నారు. ఆ నేత నాయకత్వంలో, భారత్ ఒక కోటి మందికి పైగా బంగ్లాదేశ్ శరణార్థులకు ఆశ్రయమివ్వడమే కాక, ఆహారం, వైద్య సదుపాయాలను కల్పించింది.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న తూర్పు బెంగాల్ గెరిల్లా పోరాట యోధులకు ఆయుధాలు సమకూర్చారు. వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు పలికారు.
తూర్పు బెంగాల్‌ను బంగ్లాదేశ్‌గా గుర్తించాలని అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగా గళమెత్తారు. ఆ దేశం బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో నేరుగా జోక్యం చేసుకుంది.

ఇంతకీ ఆ విమానంలో ఎవరున్నారంటే.. అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ. ఆమెకు స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చారు.
షేక్ ముజిబుర్ రెహమాన్ జన్మదినం కూడా అదే రోజు. స్వతంత్ర బంగ్లాదేశ్‌లో ఆయనకు అదే తొలి పుట్టినరోజు. ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ పర్యటనకు అదే రోజును ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Front Pages 1953-1972
పడవ ఆకారంలో వేదిక...
అదే సమయంలో, బంగ భవన్‌లో బంగ్లాదేశ్ అధ్యక్షుడికి ప్రత్యేకాధికారిగా మహబూబ్ తాలూక్‌దార్‌ను నియమించారు. కొత్తగా ఏర్పాటైన బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌కు ఆయన కమిషనర్ కూడా.
ఇందిరా గాంధీ పర్యటన సందర్భంగా బంగ భవన్‌ను ప్రత్యేకంగా అలంకరించారని మహబూబ్ తాలూక్‌దార్ తన 'బంగ భవన్ మే పంచ్ వర్ష్' అనే పుస్తకంలో రాశారు.
'బంగ భవన్ అలంకరణకు కలకత్తా నుంచి శ్రీమతి చౌదరిని ప్రత్యేకంగా పిలిపించారు. ఆమె బెంగాలీ నాటక రచయిత, ప్రసిద్ధ కళాకారుడైన వసంత చౌదరి భార్య' అని ఆయన అందులో ప్రస్తావించారు.
1972, మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఢాకాలోని సుహ్రవర్దీ పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇందిరా గాంధీ పాల్గొన్నారు.
'ఈ బహిరంగ సభ కోసం పార్కులో ఒక పెద్ద పడవ ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. దానికి ఇందిరా మంచ్ అని నామకరణం చేశారు' అని మహబూబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
'ఇందిరా గాంధీ తన ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించారు' అని బంగ్లాదేశ్ పత్రిక ఇత్తిఫాక్ మరుసటి రోజు సంచికలో ప్రచురించింది.
ఆ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన ఇందిరా గాంధీ, మొదటి 2 నిమిషాలు బెంగాలీలో మాట్లాడారు. రవీంద్రనాథ్ రాగూర్ రాసిన బెంగాలీ కవిత 'ఏక్లా చలో రే' నుంచి ఒక పంక్తిని కూడా ఆమె వినిపించారు.
మర్నాడు మధ్యాహ్నం, బంగ భవన్‌లో జరిగిన ప్రజా సన్మాన సభకు ఇందిరా గాంధీ లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర ధరించి హాజరయ్యారు.
ఆమె గౌరవార్థం జరిగిన ఈ కార్యక్రమానికి ముజీబ్‌నగర్ ప్రణాళికాధికారి, బెంగాల్ ప్రొఫెసర్ అనీసుజ్జమా కూడా హాజరయ్యారు.
''ఆ రోజు ఇందిరా గాంధీ చాలా భావోద్వేగానికి గురయ్యారు. నా కోరిక మేరకు, కబీర్ చౌదరి అతిథుల గౌరవార్థం ప్రసంగించారు. ప్రతిస్పందనగా ఇందిరా గాంధీ కూడా చాలా బాగా ప్రసంగించారు'' అని అనీసుజ్జమా తన జీవిత చరిత్రలో ప్రస్తావించారు. ఈ పుస్తకం 2015లో ప్రచురితమైంది.
ఆ రోజు బంగ భవన్‌లో జరిగిన విందు సందర్భంగా, ''భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అంతర్గత, బాహ్య శక్తులు ప్రయత్నించవచ్చు. కానీ, ఉభయ దేశాల మధ్య స్నేహం రోజురోజుకూ పటిష్టమవుతుందని, మరింత విజయవంతమవుతుందని నాకు నమ్మకం ఉంది'' అని ఇందిరా గాంధీ అన్నారని ఇత్తిఫాక్ పత్రిక ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహం, సహకారానికి ఇరుదేశాల ఒప్పందం..
బంగ్లాదేశ్‌లో ఇందిరా గాంధీ తొలిసారి పర్యటనలో భాగంగా మూడో రోజున భారత్, బంగ్లాదేశ్ మధ్య 25 ఏళ్ల పాటు స్నేహం, సహకారానికి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇందిరా గాంధీ, షేక్ ముజిబుర్ రెహమాన్ సంతకాలు చేశారు.
అయితే, అప్పటి బంగ్లాదేశ్ ప్రోటోకాల్ చీఫ్ ఫరూఖ్ చౌదరి మాత్రం.. ఇందిరా గాంధీ ఢాకా పర్యటనకు వచ్చిన రెండో రోజు, అంటే మార్చి 18న రెండు దేశాల మధ్య స్నేహ ఒప్పందంపై సంతకాలు జరిగాయని చెప్పారు. ఆయన 2018 మే 17వ తేదీన మరణించారు.
2011లో, ఫరూఖ్ చౌదరి బీబీసీ బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ''సీతాలక్ష్మి నదిపై నిర్మించిన నావికా స్థావరాన్ని ఇందిరా గాంధీ సందర్శించారు. అక్కడే, ఇద్దరు నాయకులు ఒప్పందంపై సంతకాలు చేశారు'' అని చెప్పారు.
అయితే, 'ముజిబుర్ - ఇందిర చర్చలు విజయవంతమయ్యాయి' అంటూ 1972 మార్చి 19న ఇత్తిఫాక్ ప్రచురించిన వార్తల ప్రకారం, నావికా స్థావరంలో ఇరుదేశాల అగ్ర నాయకుల మధ్య చర్చలు అరగంట మాత్రమే జరిగాయి.
వాస్తవానికి, రెండు దేశాల మధ్య స్నేహ ఒప్పందంపై సంతకాలు మార్చి 19న జరిగాయి. అది ఇందిరా గాంధీ ఢాకా పర్యటనలో చివరి రోజు. మరుసటి రోజు, అంటే మార్చి 20న ఇత్తిఫాక్ పత్రిక మొదటి పేజీలో 'దోస్తీన్, సహయోగ్ ఔర్ శాంతి' అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. 'పర్యటన ముగించుకుని ఢాకా నుంచి బయల్దేరే ముందు ఇందిరా గాంధీ, షేక్ ముజిబుర్ 12 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశారు' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Jiboner Balukabelay/Faruq Choudhury
భారత్ - రష్యా ఒప్పందం మాదిరిగానే..
భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఈ మైత్రి ఒప్పందానికీ, 1971లో భారత్, సోవియట్ యూనియన్ మధ్య కుదిరిన మైత్రి ఒప్పందానికి మధ్య చాలా సారూప్యత ఉంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు ఒప్పందాలూ సరిగ్గా ఒకేలా ఉన్నాయి.
ఒకే ఒక్క తేడా ఏమిటంటే, 'భారత్, సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం 20 ఏళ్ల కాలపరిమితి కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒప్పందానికి 25 ఏళ్ల కాలపరిమితి ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను పరస్పరం గౌరవించుకోవాలి, ఏ దేశం కూడా మరో దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు.
ఏ దేశమూ మరో దేశానికి ప్రమాదకరమైన ఏ సైనిక కూటమిలోనూ భాగం కాకూడదు. ఏ దేశమూ మరో దేశంపై దాడి చేయదు, ఏ దేశమూ మరో దేశ భద్రతకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఇంకో దేశం ఉపయోగించుకోవడానికి అనుమతించకూడదు.
ఈ ఒప్పందంలో శాంతి, భద్రతలకు సంబంధించిన అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల మధ్య విద్య, క్రీడలు, సైన్స్, సాంకేతిక సహకారం గురించి కూడా ఈ ఒప్పందంలో ప్రస్తావించారు.
2021లో, ఫరూఖ్ చౌదరి బీబీసీతో మాట్లాడుతూ, ఒప్పందంలో ఒక్క 'కొత్త విషయం' కూడా లేదని చెప్పారు.
"ఈ ఒప్పందం భారత్ - సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందానికి నకలు (కాపీ) లాంటిది" అని చౌదరి అన్నారు.

ఫొటో సోర్స్, Front Pages 1953-1972
ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం
ఫరూఖ్ చౌదరి మాటల్లో చెప్పాలంటే, ఈ ఒప్పందం 'ఆర్థిక సహకారం, భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ఒక అడుగు'.
"ఇది మా భద్రతను బలోపేతం చేస్తుందని మేం భావించాము. ఆ సమయంలో, పాకిస్తాన్ ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు? భవిష్యత్తులో ఏం జరుగబోతోందో కూడా తెలియదు? అందుకే మా సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం విషయంలో మేం సమానత్వం ఆధారంగా పొరుగు దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాం" అని చౌదరి అన్నారు.
అరుంధతి ఘోష్ (మరణం: 2016 జూలై 25) ఆ సమయంలో ఢాకాలోని భారత హైకమిషన్‌లో మొదటి కార్యదర్శిగా ఉన్నారు.
ఆమె దృష్టిలో, ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య బలమైన సంబంధానికి చిహ్నం. "మా స్నేహం చాలా బలంగా ఉందనే దానికి నిదర్శనంగా మేం ఈ ఒప్పందంపై సంతకం చేశాం" అని అరుంధతి ఘోష్ 2011లో బీబీసీతో చెప్పారు.
ఈ ఒప్పందం ఇందిరా గాంధీ ఢాకా పర్యటన సందర్భంగా కుదిరినప్పటికీ.. అంతకుముందు నెలలోనే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హోదాలో షేక్ ముజిబుర్ రెహమాన్ తన తొలి అధికారిక పర్యటనగా భారత్‌కు వచ్చినప్పుడు ఒప్పందంపై సంతకాలు జరిగాయని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
స్వతంత్ర దేశ ప్రధాన మంత్రిగా షేక్ ముజిబుర్ 1972 ఫిబ్రవరిలో రెండు రోజుల కలకత్తా పర్యటనకు వచ్చారు. ఇందిరా గాంధీ కూడా కలకత్తా చేరుకున్నారు. ఆ సమయంలో, ఇద్దరు నాయకులు కలకత్తాలోని రాజ్ భవన్‌లో సమావేశమయ్యారు. ఆ సమయంలో, షేక్ ముజిబుర్ రెహమాన్.. ఇందిరా గాంధీని బంగ్లాదేశ్ పర్యటనకు ఆహ్వానించారు.
ఫరూఖ్ చౌదరి తన ఆత్మకథ 'బలూక్‌బెలాయా ఆఫ్ లైఫ్'లో, "షేక్ ముజిబుర్ తన రెండు రోజుల కలకత్తా పర్యటనలో కూడా బంగ్లాదేశ్ నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పంపడానికి అన్ని ప్రయత్నాలు చేశారు" అని రాశారు.
షేక్ ముజిబుర్ రెహమాన్ కలకత్తా పర్యటన, ఇందిరా గాంధీతో సమావేశం తరువాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం '1972 మార్చి 25 నాటికి బంగ్లాదేశ్ నుంచి అన్ని భారత దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ, వాస్తవం ఏమిటంటే ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభానికి ఐదు రోజుల ముందే బంగ్లాదేశ్ నుంచి భారత సైన్యం ఉపసంహరణ పూర్తయింది.

ఫొటో సోర్స్, Front Pages 1953-1972
ఒప్పందంపై విమర్శలు
ఫరూఖ్ చౌదరి మాటల్లో చెప్పాలంటే, 'ఈ ఒప్పందానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు'.
కానీ, ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే, దానిపై విమర్శలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు, వాటి అనుకూల పత్రికలు (మౌత్‌పీస్‌లు) ఈ ఒప్పందాన్ని విమర్శించడం, వ్యతిరేకించడం ప్రారంభించాయి.
అబ్దుల్ కోథాకు చెందిన 'హక్', మౌలానా అబ్దుల్ హమీద్ ఖాన్ భాసానీకి చెందిన (ఫిర్దౌస్ అహ్మద్ ఖురేషి సంపాదకుడిగా ఉన్న) 'దేశ్ బంగ్లా', కొత్త వార్తాపత్రిక 'గణకంఠ్' ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష గళంగా మారాయి.
ఆ సమయంలో సీనియర్ జర్నలిస్ట్ అబిద్ ఖాన్ 'రోజ్నాంచా ఇత్తిఫాక్'కి సహ సంపాదకుడిగా ఉన్నారు. "ఈ ఒప్పందంపై ఒకే ఒక విమర్శ ఉంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడమంటే.. షేక్ ముజిబుర్ బంగ్లాదేశ్‌ను భారత్‌కు తాకట్టు పెట్టడమే" అని అబిద్ ఖాన్ బీబీసీ బంగ్లాతో అన్నారు.
ఉప ఎన్నికల్లో పాల్గొనబోమని, తమ నిరసనను కొనసాగిస్తామని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.
రాజకీయ పార్టీల ఈ వైఖరి కేవలం అవి ప్రతిపక్ష పార్టీలుగా కావడం వల్లే అని రచయిత, రాజకీయ పరిశోధకులు మొహియుద్దీన్ అహ్మద్ అన్నారు.
ఇందిరా గాంధీ, ముజిబుర్ మధ్య కుదిరిన మైత్రి ఒప్పందం భారత్, సోవియట్ యూనియన్ మధ్య 1971 ఆగస్టులో కుదిరిన ఒప్పందానికి నకలు (కాపీ) లాంటిది. ఆ సమయంలో, సోవియట్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందానికి భారత్‌లో ఎలాంటి వ్యతిరేకత లేదు.
అయితే, "ఆ సమయంలో భారత్ - బంగ్లాదేశ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఏ రాజకీయ పార్టీ కూడా బంద్ ప్రకటించినట్లు లేదా సమ్మె చేసినట్లు నాకు గుర్తు లేదు. నిరసనకారులు నిరసన పేరుతో అభ్యంతరాలు మాత్రమే లేవనెత్తారు. వారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు" అని అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఒప్పందానికి కాలం చెల్లిపోయింది..
అయితే, భారత్ - బంగ్లాదేశ్ మైత్రి ఒప్పందం ఎంత ఫలవంతమైంది? పూర్తిగా అమలైందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
డాక్టర్ అనీసుజ్జమా తన ఆత్మకథ 'బిపుల పృథ్వీ'లో, "ఒప్పందంపై ఎన్ని విమర్శలొచ్చాయనేది పక్కనపెడితే, అందులో కనీసం కొంత భాగం కూడా ఎప్పుడూ అమలు కాలేదు" అని రాశారు.
అరుంధతి ఘోష్ కూడా, ''ఈ ఒప్పందం ఫలప్రదం కాకపోవడానికి 1975లో బంగ్లాదేశ్‌లో అధికార మార్పు కూడా ప్రధాన కారణంగా విశ్వసిస్తున్నారు.
2011లో, అరుంధతి ఘోష్ బీబీసీతో మాట్లాడుతూ, "షేక్ సాహెబ్ మరణం తర్వాత, రెండు దేశాల మధ్య చాలా విభేదాలు తలెత్తాయి. ఈ ఒప్పందం లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని భావిస్తున్నా. నేను ఢాకాలో ఉన్నంతవరకు, రెండు దేశాల మధ్య స్నేహం ఉంది, కానీ మా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి" అని ఆమె చెప్పారు.
భారత్ - బంగ్లాదేశ్ మైత్రి ఒప్పందం 1997 మార్చితో ముగిసినప్పుడు, అవామీ లీగ్ ఇంకా బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉంది. 1975 నాటి రాజకీయ మార్పుల తర్వాత చాలాకాలానికి అవామీ లీగ్ తిరిగి బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.
బంగ్లాదేశ్ కానీ, భారత్ కానీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించలేదు.
ఫరూఖ్ చౌదరి దృష్టిలో, ఇది 'అవసరమైన, హానికరం కాని ఒప్పందం'.
ఫరూఖ్ చౌదరి 2011లో బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ, "1997 నాటి ప్రపంచం 1972 నాటి ప్రపంచం కంటే పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పటికే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. రష్యా చాలా బలహీనంగా మారింది. ఆ సమయంలో, భారత్ - బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కూడా అసంబద్ధంగా మారింది. కాలక్రమేణా ఈ ఒప్పందం ముగిసింది. ప్రస్తుత కాలంలో, ఈ ఒప్పందం ఇకపై అవసరం లేదు. ఇది సహజ మరణం పొందింది" అని వ్యాఖ్యానించారు.
"ఈ ఒప్పందం పునరుద్ధరిస్తారేమోనన్న భయాలు తప్పు అని నిరూపితమయ్యాయి" అని చౌదరి అన్నారు.
"ఇది కాలానికి సంబంధించిన విషయం. ఈ ఒప్పందం కుదిరినప్పుడు, అది మమ్మల్ని ప్రోత్సహించింది. మాకు బలాన్నిచ్చింది. మా సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసింది. ఆ సమయంలో ఇది చాలా ముఖ్యమైనది" అని ఆయన చెప్పారు.
పర్యటన ముగిసిన అనంతరం, భారత వైమానిక దళ విమానం 'హన్సా' ఇందిరా గాంధీ, ఆమెతో పాటు వచ్చిన ప్రతినిధి బృందంతో ఢాకా నుంచి కలకత్తాకు తిరిగి ప్రయాణమైంది.
షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన మంత్రివర్గం ఇందిరా గాంధీకి వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో, షేక్ ముజిబుర్ రెహమాన్ తన దేశం తరఫున ప్రేమ సందేశంగా పుష్ఫగుచ్ఛాన్ని ఇందిరా గాంధీకి బహూకరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














