షేక్ హసీనాను విమర్శిస్తే 'అదృశ్యమైపోతారు', బంగ్లాదేశ్ రహస్య జైలు గురించి భయానక కథలు

ఫొటో సోర్స్, BBC/Aamir Peerzada
- రచయిత, సమీరా హుస్సైన్
- హోదా, బీబీసీ న్యూస్
అధికారులు ఆ గోడను బద్దలు చేసినప్పుడు, దాని వెనుక వారికో రహస్య కారాగారం కనిపించింది. బయటి ప్రపంచానికి కనిపించకుండా, ఈ జైలు ద్వారాన్ని హడావుడిగా ఇటుకరాళ్లతో గోడలా కట్టేశారు.
మీర్ అహ్మద్ బిన్ ఖాసీంతోపాటు మరికొందరు ఈ జైలు గురించి గుర్తు చేయకపోయినట్లయితే ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రహస్య జైలును విచారణాధికారుల బృందం బహుశా ఎన్నడూ చూసి ఉండేది కాదేమో.
పదవీచ్యుతురాలైన షేక్ హసీనాను విమర్శించిన ఖాసీం 8 ఏళ్లు ఈ జైలులో గడిపారు. జైలులో ఆయన ఎక్కువ కాలం కళ్లకు గంతలతోనే ఉన్నారు. దీంతో ఆయన తన పరిసరాల నుంచి వచ్చే శబ్దాలను గమనించేవారు. ప్రత్యేకించి విమానాలు దిగే శబ్దం ఆయనకు స్పష్టంగా గుర్తుండిపోయింది.
ఇదే విచారణా బృందాన్ని విమానాశ్రయంలోని సైనిక స్థావరం వైపు నడిపించింది. అక్కడి ప్రధాన భవనం వెనుక వారికి బందీలను ఉంచిన ప్రదేశం కనిపించింది. అది ఇటుకలు, కాంక్రీట్‌తో నిర్మించిన కట్టడం. దానికి ఎటువంటి కిటికీలు లేవు. చాలా కట్టుదిట్టంగా నిర్మించిన చిన్నజైలు అది.
అయితే ఈ జైలు నిర్మాణం సైట్ ప్లాన్‌లో లేదు.


ఫొటో సోర్స్, BBC/Aamir Peerzada
‘కాలు బయటపెట్టాలంటే భయం’
కిందటి ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత ఈ జైలులోని బందీలను విడుదల చేశారు.
విచారణాధికారులు ఖాసీంలాంటి వందలాదిమంది బాధితులతో మాట్లాడారు. ఇక్కడ అనేకమందిని అన్యాయంగా చంపేశారని బాధితులు కొందరు ఆరోపించారు.
ఢాకా విమానాశ్రయం నుంచి రోడ్డుపై ఉన్న జైళ్లతో సహా రహస్య జైళ్లను నడుపుతున్న వ్యక్తులు ఎక్కువగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అనే ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందినవారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
వీరు నేరుగా హసీనా నుంచి వచ్చే ఆదేశాలను పాటించేవారని విచారణాధికారులు చెప్పారు.
" చాలామంది గల్లంతుకావడం అనేది ప్రధాని అనుమతి లేదా ఆదేశాలతోనే జరిగాయని సంబంధిత అధికారులు చెప్పారు" అని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం బీబీసీతో చెప్పారు.
అయితే తమకు తెలియకుండానే ఈ నేరాలు జరిగాయని, దీనికి ఎలాంటి బాధ్యత లేదని, సైనిక వ్యవస్థ సొంతంగా పనిచేస్తోందని హసీనా పార్టీ చెబుతోంది . కానీ, ఈ ఆరోపణను సైన్యం తోసిపుచ్చింది.
ఏడు నెలల తరువాత, ఖాసీం ఇతరులు విడుదలయ్యారు. కానీ తమను బంధించినవారు ఇప్పటికీ సైన్యంలో కొనసాగుతుండటంతో వారు భయపడుతున్నారు.
తాను మాస్క్, టోపీ ధరించకుండా ఇంటి నుంచి కాలుబయటపెట్టనని ఖాసీం చెప్పారు.
''నేను ఎక్కడకు వెళుతున్నా, నా వెనుక ఎవరైనా వస్తున్నారేమోనని పదేపదే వెనక్కి తిరిగి గమనిస్తూ ఉంటాను'' అని ఖాసీం చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Aamir Peerzada
‘ప్రాణాలతో పాతిపెట్టినట్టు అనిపించేది’
ఖాసీం తాను 8 ఏళ్లపాటు నిర్బంధంలో ఉన్న తన గదిని బీబీసీకి చూపించేందుకు నెమ్మదిగా కాంక్రీట్ మెట్లు ఎక్కారు. తలవంచి ఓ భారీ ఇనుపతలుపు నుంచి వెళ్లి, మరో ఇరుకైన ద్వారం నుంచి తాను ఒకప్పుడు నిర్బంధంలో ఉన్న గదిలోకి వెళ్లారు.
‘‘బయటి ప్రపంచంతో సంబంధాలన్నీ తెగిపోవడంతో ప్రాణాలతో పాతిపెట్టినట్టు అనిపించింది’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఆ గదికి కిటికీలు, తలుపులు లేవు. గదిలో ఉన్నప్పుడు పగలు, రాత్రి తేడా తెలిసేది కాదని చెప్పారు.
ఖాసీం న్యాయవాది. వయసు 40 ఏళ్లు. అంతకుముందు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తనను బంధించిన చిన్నగదిని వివరంగా చూపేందుకు ఆయన మొదటిసారి మీడియాను తీసుకువెళ్లారు.
ఆ గది ఎంత చిన్నదో టార్చ్‌లైట్ వెలుగులో తెలుస్తోంది. ఓ మనిషి కనీసం నిటారుగా నిలబడటానికి వీలులేదు. గదంతా కంపు కొడుతోంది. కొన్ని గోడలు పడిపోయాయి. ఇటుకరాళ్ల ముక్కలు, కాంక్రీట్ పెచ్చులు నేలపై పడి ఉన్నాయి.
‘‘ ఇదో నిర్బంధ కేంద్రం. దేశవ్యాప్తంగా ఇలాంటివి 5 వందల నుంచి 7 వందల వరకు ఉన్నట్లు గుర్తించాం. ఇది విస్తృతంగా, వ్యవస్థీకృతంగా ఉంది'' అని ప్రాసిక్యూటర్ ఇస్లాం చెప్పారు. ఆయన బీబీసీతో కలిసి జైలు సందర్శనకు వచ్చారు.
ఖాసీం తాను గడిపిన సెల్‌లో సన్నని నీలిరంగు టైల్స్ చాలా స్పష్టంగా గుర్తున్నాయి. అందుకే విచరాణాధికారులు నేరుగా అక్కడకు వెళ్లగలిగారు. ఇప్పడా నీలిరంగు టైల్స్ ముక్కలైపోయి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని గదులతో పోలిస్తే, ఇది చాలా పెద్దది, 10 x 14 అడుగులు (3 మీ x 4.3 మీ). ఒక వైపు మరుగుదొడ్డి ఉంది.
బందీగా ఉన్నప్పుడు తాను అక్కడ ఎలా గడిపిందీ ఖాసీం గదిలో తిరుగుతూ వివరించారు. వేసవిలో అక్కడ భరించలేనంత వేడిగా ఉండేదని, దీంతో కొంచెమైనా గాలివస్తుందేమోనని తాను నేలపై కూర్చుని మొహాన్ని గుమ్మానికి దగ్గరగా పెట్టేవాడినని చెప్పారు.
''అది చావుకంటే ఘోరమైనది'' అని చెప్పారు.
అలాంటి నరకం అనుభవించిన ప్రదేశానికి తిరిగి రావడం క్రూరంగా కనిపించవచ్చు. కానీ అక్కడేం జరిగిందో ప్రపంచం చూడటం ముఖ్యమని ఖాసీం భావిస్తున్నారు.
''ఫాసిస్టు పాలనకు సహకరించిన ఉన్నతాధికారులు ఇప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతున్నారు" అని ఆయన అన్నారు.
''మా కథ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కనిపించకుండా పోయినవారికి న్యాయం జరిగేలా చూడగలగడం, బతికి ఉన్నవారి జీవితం తిరిగి గాడినపడేలా మనవంతు సాయం చేయాల్సిన అవసరంఉంది'' అన్నారాయన.
ఢాకాలోని ప్రధాన ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం లోపల అయనాఘర్ లేదా "హౌస్ ఆఫ్ మిర్రర్స్" గా చెడ్డపేరు తెచ్చుకున్న నిర్బంధ కేంద్రంలో, ఖాసీంను బంధించినట్టు గతంలో రిపోర్టులు తెలిపాయి.
కానీ, పరిశోధకులు ఇప్పుడు అలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయని భావిస్తున్నారు. మొదటి 16 రోజులు మినహా తన నిర్బంధమంతా ఆర్ఏబీ స్థావరంలోనే గడిపానని ఖాసీం బీబీసీతో చెప్పారు.
ఖాసీం గడిపిన మొదటి ప్రదేశం ఢాకాలోని పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ అని దర్యాప్తు అధికారులు ఇప్పుడు అనుమానిస్తున్నారు.
తన అదృశ్యానికి కారణం తన కుటుంబం రాజకీయాలలో ఉండటమేనని ఆయన నమ్ముతున్నారు. ఖాసీం తండ్రి బంగ్లాదేశ్‌లో అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ జమాతే ఇస్లామీలో సీనియర్ సభ్యుడు.
2016లో ఆయన ఎదుర్కొంటున్న కేసులో తండ్రి తరపున విచారణలో ఖాసీం పాల్గొన్నారు. కానీ తరువాత ఆయన తండ్రికి ఉరి శిక్ష విధించారు.

ఫొటో సోర్స్, BBC/Neha Sharma
‘ఎప్పటికీ బయటపడలేననుకున్నా’
కళ్లకు గంతలుకట్టి, చేతులకు బేడీలు వేసి, బయటి ప్రపంచానికి తెలియని చీకటి కొట్టాలలో నిర్బంధించారని బీబీసీతో మాట్లాడిన మరో ఐదుగురు చెప్పారు. చాలా సందర్భాలలో తమను కొట్టి చిత్రహింసలకు గురిచేశారన్నారు.
వీరి కథనాలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ఏదో ఒకరోజు తాము రోడ్డుమీద నడుస్తున్నప్పుడో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడో, తమను బంధించినవారు కనపడతారనే భయం దాదాపు ప్రతివారిలోనూ కనిపించింది.
''నేను కారు ఎక్కినప్పుడల్లా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో తలుచుకుంటే భయం వేస్తుంటుంది.'' అని 35 ఏళ్లు అతికుర్ రెహ్మాన్ రస్సెల్ చెప్పారు. ''నేనెలా బతికి బయటపడ్డానా అని ఆశ్చర్యపోతుంటా'' అని చెప్పారు.
తన ముక్కు విరిగిందని, చేయి ఇంకా నొప్పిగా ఉందని ఆయన చెప్పారు. ''వాళ్లు నా చేతులకు బేడీలు వేసి తీవ్రంగా కొట్టారు'' అన్నారాయన.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చిన తరుణంలోఢాకా పాతబస్తీలోని ఓ మసీదు బయట గత జులైలో తన వద్దకు కొందరు వచ్చారని, తాము పోలీసులమని చెప్పి, తమతోపాటు రావాలని చెప్పారని రస్సెల్ తెలిపారు.
ఆ మరు నిమిషంలోనే తనను బూడిద రంగు కారులో ఎక్కించుకుని, చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారని, నలభై నిమిషాల తర్వాత కారులో నుంచి బయటకు లాగి ఓ భవనంలోకి తీసుకెళ్లి ఓ గదిలో పడేశారని ఆయన వెల్లడించారు.
దాదాపు అరగంట తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ప్రశ్నలు అడిగారని, నువ్వు ఎవరు? ఏం చేస్తావు?" అని అడిగి ఆ తర్వాత కొట్టడం మొదలెట్టారని రస్సెల్ చెప్పారు.
‘‘అక్కడ ఉండటం భయానకంగా ఉంది. ఎప్పటికీ బయటకు రాలేనేమో అనిపించింది.'' అని రస్సెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Bangladesh Chief Advisor Office of Interim Government via AFP
రస్సెల్ ప్రస్తుతం తన సోదరి, ఆమె భర్తతో కలిసి నివసిస్తున్నారు. తాను బందీగా గడిపిన రోజులను వివరించారు.
తన నిర్బంధం కూడా రాజకీయ ప్రేరేపితమేనని రస్సెల్ నమ్ముతున్నారు. ఆయన తన తండ్రి సీనియర్ సభ్యునిగా ఉన్న విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగ నాయకుడు. విదేశాలలో నివసించే రస్సెల్ సోదరుడు కూడా తరచూ హసీనాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.
తనను ఎక్కడ నిర్బంధించారో తెలిసే అవకాశమే లేదని రస్సెల్ చెప్పారు. కానీ ఈ ఏడాది మొదట్లో తాత్కాలిక నేత మొహమ్మద్ యూనస్ మూడు నిర్బంధ కేంద్రాలను సందర్శించినప్పుడు, తనను అగర్‌గావ్ జైలులో నిర్బంధించినట్టుగా రస్సెల్ గుర్తుపట్టారు.

ఫొటో సోర్స్, AFP
ఎంతమంది ‘అదృశ్యమయ్యారు’?
రాజకీయ అసమ్మతిని హసీనా సహించరనేది బహిరంగ రహస్యం. ఆమెను విమర్శిస్తే జాడ తెలియకుండా 'అదృశ్యమైపోతారు' అని మాజీ ఖైదీలు, ప్రత్యర్థులు, పరిశోధకులు చెబుతున్నారు.
అయితే గల్లంతైన వారి సంఖ్య మాత్రం ఎప్పటికీ స్పష్టంగా తెలియకపోవచ్చు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కనీసం 709మంది అదృశ్యమైనట్టు సమాచారాన్ని సేకరించింది. వీరిలో ఇంకా 155మంది కనిపించడం లేదు.
ఇలా కనిపించకుండా పోయినవారిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని సెప్టెంబర్ లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధితుల నుంచి 1,676 ఫిర్యాదులు అందాయని, మరింత మంది ముందుకు వస్తూనే ఉన్నారని తెలిపారు.
అయితే ఇది మొత్తం సంఖ్యకాదు. ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.
ఖాసీం వంటి వారితో మాట్లాడటం ద్వారానే షేక్ హసీనాతో సహా నిర్బంధ కేంద్రాలకు బాధ్యులైన వారిపై తాజుల్ ఇస్లాం కేసు పెట్టగలిగారు. వేరు వేరు ప్రదేశాలలో బందీలుగా ఉండటం తప్ప, వారి అనుభవాలన్నీ ఒకేలా ఉన్నాయి.
ఈ నిర్బంధాలలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అధికార ప్రతినిధి మొహమ్మద్ అలీ అరాఫత్ అన్నారు. ఒకవేళ ప్రజలు కిడ్నాప్‌కు గురైతే, అది హసీనా ఆదేశాల మేరకు జరిగింది అనుకోవడం సరికాదని చెప్పారు.
భారత్‌కు పారిపోయిన హసీనా కానీ, ఆమె మంత్రివర్గ సహచరుల ఆధ్వర్యంలో కానీ ఇవి జరగలేదన్నారు.
ఒకవేళ అలాంటి నిర్బంధం ఏదైనా జరిగి ఉంటే అది సైనిక కారణాల వల్ల అయ్యుంటుందని అరాఫత్ అన్నారు. అవామీ లీగ్ కు గానీ, ప్రభుత్వంలోని వ్యక్తులకు ఇలా కొందరిని రహస్య నిర్బంధంలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నారు.
''ఇందులో ఎలాంటి అంశాలు దాగున్నాయో నాకు తెలియదు'' మిలిటరీ చీఫ్ అధికార ప్రతినిధి చెప్పారు.
''అలాంటి నిర్బంధ కేంద్రాలను నిర్వహించడాన్ని సైన్యం నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.'' అని లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా ఇబన్ జైద్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఈ లోకం నుంచే మాయమైపోతావు’
ఈ జైళ్లలో ఉన్నవారినిబట్టి చూస్తే అది అవామీ లీగ్ పనే అనడానికి ఉదాహరణ అని తాజుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు.
''ఇక్కడ నిర్భంధించినవారందరూ వివిధ రాజకీయపక్షాలకు చెందినవారు. వీరంతా గత ప్రభుత్వంపై గొంతెత్తినవారే. అందుకే వారిని ఇక్కడకు తీసుకువచ్చారు..'' అన్నారాయన.
ఇప్పటిదాకా 122 అరెస్టు వారెంట్లు జారీచేసినా ఎవరికీ న్యాయం జరగలేదు. అందుకే ఇక్బాల్ చౌధురి లాంటి 71 ఏళ్ళ బాధితులు కూడా తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నమ్ముతున్నారు. అందుకే బంగ్లాదేశ్‌ను వీడిపోవాలనుకుంటున్నారు చౌధురి.
2019లో ఆయన విడుదలయ్యాక ఇల్లువిడిచి బయటకు రాలేదు. కనీసం మార్కెట్‌కు కూడా వెళ్లలేదు. తనను బంధించిన విషయాన్ని ఎక్కడా ఎప్పుడూ మాట్లాడకూడదని ఆయనను బంధించినవారు హెచ్చరించారు.
"మీరు ఎక్కడున్నారో, ఏం జరిగిందో ఎప్పుడైనా బయటపెడితే, మళ్ళీ తీసుకెళ్తే, మిమ్మల్ని మళ్లీ ఎవరూ కనుగొనలేరు, చూడలేరు. నువ్వు ఈ లోకం నుంచే మాయమైపోతావు' అని హెచ్చరించినట్టు చెప్పారు.
'విద్యుత్ షాక్‌తో నాపై భౌతిక దాడి చేయడంతో పాటు కొట్టారు. కరెంట్ షాక్‌తో నా వేళ్లలో ఒకటి బాగా దెబ్బతింది. శారీరకంగా బలాన్ని కోల్పోయాను. నేను ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాను" అని చౌధురి చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Neha Sharma
‘తలుచుకోవాలంటేనే భయంగా ఉంది’
మరో బాధితుడు రహ్మతుల్లా కూడా భయపడుతున్నారు. ఆయన వయసు 23 ఏళ్లు. ''వారు నా జీవితంలోంచి ఏడాదిన్నర సమయాన్ని లాగేసుకున్నారు. అది ఎప్పటికీ తిరిగి రాదు'' అని ఆయన చెప్పారు.
రహ్మతుల్లా ఎలక్ట్రిషియన్‌గా శిక్షణ పొందుతూ పొరుగునే ఉన్న పట్టణంలో షెఫ్‌గా పని చేస్తున్నారు. ఆగస్టు 29, 2023 అర్థరాత్రి పూట ఆర్‌ఏబీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. కొందరు యూనిఫామ్‌లో ఉండగా, మరికొందరు సాధారణ దుస్తులలో ఉన్నారు. ఇంటినుంచి రహ్మతుల్లాను తీసుకువెళ్లారు.
పలుసార్లు విచారణను ఎదుర్కొన్న తరువాత తాను ఇండియాకు, ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు తనను నిర్బంధించినట్టు రహ్మతుల్లాకు అర్థమైంది. తనను బంధించిన గది ఎలా ఉందో బొమ్మ గీసి చూపించారాయన.
''ఢాకాలోని ఆ ప్రదేశాన్ని తలుచుకోవాలన్నా భయంగానే ఉంది. సరిగ్గా పడుకోవడానికి స్థలం లేదు. చాచడానికి వీలులేకపోవడంతో కాళ్లు ముడుచుకుని పడుకోవాల్సి వచ్చేది.’’ అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, BBC/Neha Sharma
‘ఆ భయం చచ్చేదాకా పోదు’
రహస్య జైళ్ల గురించి, లోపల ఏం జరిగిందనే విషయాలను వెల్లడించేందుకు మరో ఇద్దరు మాజీ ఖైదీలు మైఖేల్ చక్మా, మస్రూర్ అన్వర్‌లను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.
నిర్బంధంలో అయిన శారీరక గాయాలతో బాధితులు జీవిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా తమకు కలిగిన మానసిక వేదనే గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఏళ్ల తరబడి నిరంకుశ పాలన తర్వాత పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్, తన చరిత్రలో కీలక ఘట్టంలో ఉంది. ఈ నేరాలకు పాల్పడిన వారికి నిష్పాక్షికమైన విచారణ జరిపించగలగడం ప్రజాస్వామ్యం దిశగా దేశ పురోగతికి కీలకమైన పరీక్ష.
తన కాంక్రీట్ సెల్‌లో నిలబడిన ఖాసీం మాట్లాడుతూ ''వీలైనంత త్వరగా విచారణ జరిపితే దేశం ఈ అధ్యాయాన్ని ముగిస్తుంది'' అని చెప్పారు.
కానీ ఇదంత సులువు అనిపించడం లేదు రహ్మతుల్లాకు.
''నాలో భయం పోలేదు. నేను చచ్చేంతవరకు అది నాతోనే ఉంటుంది'' అన్నారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














