బెంగళూరులో సినీఫక్కీలో రూ.7 కోట్ల దోపిడీ, పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారంటే..

దోపిడీ, నగదు రికవరీ

ఫొటో సోర్స్, Imran Qureshi

ఫొటో క్యాప్షన్, దోపిడీకి గురైన నగదులో పెద్దమొత్తాన్ని రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

బెంగళూరులో బ్యాంకుల మధ్య నగదును రవాణ చేస్తున్న వ్యాన్ నుంచి 7.11 కోట్ల రూపాయల నగదును దొచిన కేసును చేధించామని, ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. దోపిడీ నగదులో మొత్తం 6.29 కోట్లు రికవరీ చేసినట్టు చెప్పారు.

దర్యాప్తు సరైన దిశలో ఉందని, మిగిలిన నగదు మొత్తంతో పాటు ఈ నేరానికి పాల్పడిన ఇతర నిందితులను త్వరలో పట్టుకుంటామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

అరెస్టైన ఆరుగురిలో సెక్యూరిటీ గార్డు గోపాల్ ప్రసాద్, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (సీఎంఎస్)లో పనిచేసే జేవియర్, బెంగళూరు పశ్చిమప్రాంతంలోని పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహించే అన్నప్ప నాయక్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కర్ణాటక పోలీసులు

ఫొటో సోర్స్, Imran Qureshi

ఫొటో క్యాప్షన్, దోపిడీ జరిగిన తీరు, నిందితులను పట్టుకున్న వైనాన్ని పోలీసు కమిషనర్ సీమంత్ సింగ్ (మధ్యలో వ్యక్తి) వివరించారు

200మందితో వేట

నిందితులను పట్టుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవాలో 200మంది పోలీసులతో గాలింపు జరిపారు.

నగదు దోచుకున్న తరువాత నిందితులు తమవాహనాన్ని మార్చేశారు. నకిలీ నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తూ సీసీటీవీ కెమెరాల నిఘా లేనిచోటా, ఉన్నా పెద్దగా పట్టించుకోని చోట ఆగి క్యాష్ బాక్సులను మార్చుకున్నారు.

ఈ దోపిడీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు జరిగిందని పోలీస్ కమిషనర్ చెప్పారు. అయితే సీఎంఎస్ సంస్థ ఈ విషయాన్ని మధ్యాహ్నం 1గంట 20 నిమిషాలకు పోలీసులకు తెలిపింది.

కర్ణాటక, దోపిడి, 7 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దొంగలను పట్టుకోవడానికి పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

అసలేం జరిగింది, ఎలా జరిగింది?

బెంగళూరులో బ్యాంకు బ్రాంచీల మధ్య నగదును రవాణా చేస్తున్న వ్యాన్‌ను రిజర్వ్ బ్యాంక్ అధికారులమంటూ ఆపిన కొందరు సాయుధ వ్యక్తులు 7 కోట్లరూపాయల నగదును దోచుకున్నారని పోలీసులు చెప్పారు.

బెంగళూరు నడిబొడ్డున ఈ దోపిడీ చేసిన వారి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు చర్యలు మొదలుపెట్టారు.

" బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. నగరంలో రద్దీగా ఉండే రహదారిపై బ్యాంకు బ్రాంచీల మధ్య డబ్బు తరలిస్తున్న వ్యాన్‌ను ఎస్‌యూవీలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఆపారు'' అని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ బీబీసీకి తెలిపారు.

వ్యాన్ లోపల డ్రైవర్, క్యాష్ కస్టోడియన్, ఇద్దరు సాయుధ గార్డులు ఉన్నారు.

"తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులమని, అంత పెద్ద మొత్తంలో డబ్బును రవాణా చేయడానికి సరైన పత్రాలు ఉన్నాయో లేదో ధ్రువీకరించుకోవాలని దొంగలు వ్యాన్‌లోని సిబ్బందికి చెప్పారు " అని సీమంత్ కుమార్ సింగ్ చెప్పారు.

క్యాష్ కస్టోడియన్, గార్డులను ఆయుధాలను వ్యాన్‌లోనే వదిలి తమ ఎస్‌యూవీలోకి ఎక్కమని వారు ఆదేశించినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం, క్యాష్ వ్యాన్‌ను నడపడం కొనసాగించాలని డ్రైవర్‌కు చెప్పారని తెలిపారు.

ఆ వ్యాన్‌ను ఎస్‌యూవీ కొన్ని కిలోమీటర్ల వరకు వెంబడించింది. తర్వాత దొంగలు వ్యాన్ డ్రైవర్‌ను బలవంతంగా బయటకు పంపించారు.అలాగే కస్టోడియన్, గార్డులను తుపాకీతో బెదిరించి ఎస్‌యూవీ నుంచి కిందకు దింపారు. తరువాత వ్యాన్ నుంచి నగదును ఎస్‌యూవీలోొకి తరలించి పరారయ్యారు.

ఆ ప్రాంతంలో చాలా తక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఆ ముఠా ఒకటి కంటే ఎక్కువ వాహనాలేమైనా ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ కంపెనీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దోపిడీకి ఉపయోగించిన ఎస్‌యూవీ వాహనం నకిలీ నంబర్ ప్లేట్‌తో "గవర్నమెంట్ ఆఫ్ ఇండియా" అని రాసి ఉన్న స్టిక్కర్‌తో ఉందని ఒక పోలీసు అధికారి బీబీసీకి తెలిపారు.

కంపెనీ ఉద్యోగులు ఎవరైనా ఈ నేరంలో భాగంగా ఉన్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి తెలిపారు.

ప్రభుత్వం ఏమంటోంది?

దోపిడీకి ఉపయోగించిన ఎస్‌యూవీని పోలీసులు కనుగొన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

కానీ, దోపిడీ తర్వాత దొంగలు ఏ వాహనంలో పారిపోయారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు.

"వారు వాహనాలను మార్చి డబ్బును తరలించారు" అని ఆయన మీడియాతో చెప్పారు.

రాష్ట్రంలో ఇటీవలి భారీ బ్యాంకు దోపిడీ కేసులను ఛేదించినట్లుగానే, దీన్ని కూడా పోలీసులు త్వరలోనే ఛేదిస్తారని విశ్వసిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.

మే నెలలో, విజయపుర జిల్లాలోని ఒక బ్యాంకు నుంచి డూప్లికేట్ లాకర్ కీని ఉపయోగించి 59 కిలోల బంగారం దొంగిలించారు. తరువాత పోలీసులు 39 కిలోల బంగారం, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులతో సహా 15 మందిని అరెస్టు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)