‘సారీ’ చెప్పడం బలమా, బలహీనతా? స్త్రీ,పురుషులలో ఎవరు ఎక్కువసార్లు సారీ చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, అరియాన్నే కోహెన్, లిండా గెడ్డెస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
‘‘సారీ ఎందుకు చెప్పాలి?’’
"బాధ్యత తీసుకోవడం, ఇతరులకు మన వల్ల కలిగిన హాని లేదా బాధను గుర్తించడం, మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడటం, మన ప్రవర్తన పట్ల మనం నిజాయితీగా ఉన్నామని చెప్పడానికి 'సారీ' లేదా 'అపాలజీస్' అనే పదాలను తప్పకుండా ఉపయోగించాలి"
క్షమాపణలు ఎందుకు కోరాలి అనే ప్రశ్నకు మనోవాలోని యూనివర్సిటీ ఆఫ్ హవాయ్‌లో కమ్యూనికాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ అమీ ఇబెసు హుబ్బార్డ్ ఇచ్చిన వివరణ ఇది.
జర్మన్లు తాము చేసిన తప్పులకు భగవంతుడి ముందు ప్రకటించే పశ్చాత్తాపం తర్వాత కాలంలో క్షమాపణగా మారింది. ఇంగ్లీష్ మాట్లాడనివారు, రాని వారు కూడా తాము ఏదైనా తప్పు చేసినప్పుడు 'సారీ' అనే పదాన్ని ఉపయోగించడం సర్వ సాధారణమైంది. గతంలో పెద్ద పెద్ద పొరపాట్లు, చిన్న,చిన్న తప్పులకు ఉపయోగించే ఈ పదాన్ని ఇప్పుడు నలుగురి మధ్య తుమ్మినా లేదా దగ్గినా ఉపయోగిస్తున్నారు.

కానీ ఇటీవల ఈ ట్రెండ్ కొంచెం మారిందని అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్ ఆఫ్ మార్కెటింగ్ తాజా అధ్యయనం చెబుతోంది.
చిన్న చిన్న తప్పుల విషయంలో సారీకి బదులు థ్యాంక్యూతో మొదలు పెట్టవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
"రావడం ఆలస్యం అయినందుకు క్షమించండి" అనడానికి బదులు "మీ సహనానికి ధన్యవాదాలు" అనే మాట ఉపయోగించవచ్చని ఒహాయో యూనివర్సిటీలో ఫిషర్ కాలేజ్ ఆఫ్ బిజినెస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ షియాయోన్ డెంగ్ చెప్పారు.
సారీ అనేది ఆంగ్ల పదం. అయినా, సారీని ఉపయోగించడంలో ఇంగ్లిషు మాట్లా డే అమెరికన్లు, బ్రిటిషర్ల మధ్య తేడా ఉందంటున్నాయి అధ్యయనాలు.

ఫొటో సోర్స్, Allison Turrell/Flickr/CC BY-NC-ND 2.0
బ్రిటీషర్లు- అమెరికన్ల మధ్య తేడా
వెయ్యి మందికి పైగా బ్రిటీషర్లపై జరిపిన సర్వేలో ఒక వ్యక్తి రోజుకు 8 సార్లు, ఎనిమిది మందిలో ఒకరు రోజుకు 20 సార్లు 'సారీ' అనే పదాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది.
బ్రిటీషర్లు తాము చేయని తప్పుకు కూడా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. అది చాలా గొప్ప విషయం. అని 'సారీ!: ది ఇంగ్లీష్ అండ్ దెయిర్ మేనర్స్' అనే పుస్తకంలో హెన్రీ హిచింగ్స్ రాశారు.
అయితే మిగతా దేశాల ప్రజల కంటే బ్రిటీషర్లు తమ దైనందిన జీవితంలో క్షమించండి అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారా? ఇదే నిజమైతే వాళ్లు ఎందుకలా చేస్తారు? కానీ, ప్రపంచ దేశాల్లో ఎంత తరచుగా సారీ అనే పదాన్ని ఉపయోగిస్తారనే డేటాను సాధించడం చాలా కష్టమైన వ్యవహారం.
"కెనెడియన్లు, బ్రిటీషర్లు అమెరికన్ల కంటే ఎక్కువ సార్లు సారీ అని చెబుతారనే ఊహాగానాల్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. దాన్ని నిర్దిష్టంగా నిరూపించే అధ్యయనం నిర్వహించడం కొంత కష్టమైన వ్యవహారం" అని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో అపాలజీస్ అండ్ ఫర్‌గివ్‌నెస్ మీద అధ్యయనం చేస్తున్న సైకాలజిస్ట్ కరినా షూమన్ చెప్పారు.
ఈ విషయం తెలుసుకునేందుకు అనుసరించిన ఒక విధానం ఏంటంటే, నిజంగా అలాంటి సంఘటన ఎదురైనప్పుడు వారేం చేస్తారో ప్రజలను అడిగి తెలుసుకోవడం.
తాజాగా 1600 మంది బ్రిటీషర్లు, 1000 మంది అమెరికన్లపై యుగవ్ ఒక పోల్ నిర్వహించారు. ఇందులో తాము తుమ్మినప్పుడు, ఎదుటి వ్యక్తిని చూసుకోకుండా ఢీకొన్నప్పుడు, తెలియకుండా ఏదైనా తప్పు చేసినప్పుడు 15 మంది బ్రిటిషర్లు సారీ చెబుతుంటే, అమెరికన్లు 10 మంది మాత్రమే ఇలాంటి సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
అయితే ఈ విషయంలో అమెరికన్లు, బ్రిటిషర్ల స్పందన ఒకేలా ఉందని సర్వేలో తేలింది. ఇతరులతో అమర్యాదకరంగా ప్రవర్తించామని భావించినప్పుడు ఏ దేశస్తులైనా మూడొంతుల మంది క్షమాపణలు అడుగుతున్నారు. మీటింగ్‌లకు ఆలస్యంగా వచ్చినప్పుడు 84 శాతం బ్రిటీషర్లు క్షమాపణలు అడిగితే, అమెరికన్లలో ఇది 74శాతంగా ఉంది.

ఫొటో సోర్స్, Alamy
బాధితులైనా సరే సారీ చెబుతున్నారా?
కొన్ని సందర్భాలను సృష్టించి ప్రజల స్పందనను నమోదు చేయడం కాదు. అసలు నిజ జీవితంలో వాళ్లు ఎలా స్పందిస్తున్నారో చూడాలి.
ఉదాహరణకు యూగవ్ సర్వేను తీసుకుంటే, 36 శాతం బ్రిటీషర్లు ఇతరుల తప్పులకు కూడా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అమెరికన్లలో ఇది 24శాతం మాత్రమే.
"వాచింగ్ ది ఇంగ్లీష్" అనే పుస్తకంలో సోషల్ ఆంత్రోపాలజిస్ట్ కేట్ ఫాక్స్ తనకు ఎదురైన అనుభవాల గురించి వివరించారు.
ఇందులో భాగంగా కేట్ పట్టణాలు, నగరాల్లో వందల మంది ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఢీ కొన్నారు.ఇతర దేశాల్లో ప్రజలు ఎలా స్పందిస్తున్నారో పోల్చి చూసేందుకు అక్కడ ఉన్న తన సహచరులను కూడా అలాగే చేయాలని చెప్పారు. 80శాతం బ్రిటిషర్లు తాము బాధితులైనప్పటికీ, కేట్ ఉద్దేశపూర్వకంగా వారిని డీకొన్నప్పటికీ వారే సారీ చెప్పినట్లు ఆమె గుర్తించారు.
ఎదురుగా వస్తున్న వ్యక్తులపై పడిపోతున్నట్లుగా ఆమె నటించినప్పుడు వారేదో గొణిగినట్లుగా దాన్ని గుర్తించకుండానే క్షమాపణలు చెప్పేవారు. ఇదే విదేశీ టూరిస్టుల విషయంలో జరిగినప్పుడు "కేవలం జపనీయులు మాత్రమే బ్రిటిషర్ల తరహాలో ప్రవర్తించినట్లు" కేట్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సారీ ఎలా పుట్టింది?
సారీ అనే పదం మూలాలు పాత ఇంగ్లీష్ పదం 'సరిగ్'లో ఉన్నాయి. ఈ పదానికి "బాధ పడటం, దుఃఖించడం, విషాదంలో మునిగిపోవడం" అనే అర్థాలు ఉన్నాయి. బ్రిటీషర్లలో ఎక్కువమంది ఈ పదాన్ని చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు. ఇందులో భాషకు సంబంధించిన అంశాలతో పాటు సాంస్కృతిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి.
"సారీ అనే పదాన్ని మేం అనేక మార్గాల్లో ఉపయోగిస్తాం" అని ఓరేగావ్ యూనివర్సిటీలో భాషా నిపుణుడు ఎడ్విన్ బట్టిస్టెల్లా అన్నారు.
బ్రిటీష్ ప్రజలు తరచుగా క్షమించండి అని చెబుతూ ఉండవచ్చు. అయితే దీనర్థం వాళ్లు సారీ చెప్పిన ప్రతీసారి పశ్చాత్తాప పడుతున్నారని కాదు. బ్రిటీష్ సమాజం ప్రజల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడాన్ని తప్పుగా భావిస్తుంది.
కానీ, అమెరికన్ సమాజంలో వ్యక్తులతో స్నేహం, సాన్నిహిత్యం కోసం వారి వ్యక్తిగత జీవితాల్లోకి అడుగుపెట్టడం తప్పు కాదని భావిస్తుంది. ప్రజలు తాము చేసిన తప్పులకు కాకుండా తమ నియంత్రణలో లేని అంశాలకు క్షమాపణలు కోరడం వల్ల వారిపై నమ్మకం, గౌరవం పెరగవచ్చు.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో పని చేస్తున్న అలిసన్ ఉడ్ బ్రూక్స్, ఆమె సహచరులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు అమెరికాలో వర్షం పడుతున్నప్పుడు ఒక వ్యక్తిని రైల్వే స్టేషన్‌కు పంపించి, అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ తీసుకోవాలని సూచించారు.
ఫోన్ గురించి అడిగేటప్పుడు "సారీ.. వర్షం కురుస్తోంది. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా" అని అడిగినప్పుడు 47 శాతం మంది తమ ఫోన్ ఇచ్చారు. అలా కాకుండా " ఒకసారి ఫోన్ ఇస్తారా" అని అడిగినప్పుడు కేవలం 9శాతం మంది మాత్రమే తమ ఫోన్ ఇచ్చారు.
దీంతో పాటు ఇలాంటి మరి కొన్ని ప్రయోగాల్లోనూ తేలింది ఏమిటంటే మనం చెప్పే సారీ వాతావరణం గురించి కాకుండా.. మనం అవతలి వారికి ఇస్తున్న గౌరవాన్ని మన భాషలో చేర్చినందుకు స్పందన ఎలా ఉందో తెలియజేస్తుంది.
క్షమాపణలు చెప్పే విషయంలో బ్రిటీషర్లు మాత్రమే ప్రసిద్ది చెందలేదు. ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా సారీ చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవడానికి షూమాన్ తమ యూనివర్సిటీలో విద్యార్థులకు వివిధ టాస్కులు ఇచ్చి 12రోజులు వాటిని అమలు చేసి ఫలితాలను నమోదు చేయాలని కోరారు.
వాళ్లు తమకు ఎదురైన అనుభవాలను రికార్డు చేశారు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన చోట చెప్పారా లేదా అనేది వారు నమోదు చేశారు.
ఈ సంఘటనల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా 'సారీ' చెప్పారు. తాము క్షమాపణ చెప్పిన పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు తమకు క్షమాపణ చెప్పాలని కూడా వారు కోరారు.కొన్ని సందర్భాల్లో పురుషులు, స్త్రీల స్పందన దాదాపు ఒకేలా ఉంది.
"పురుషులు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడకపోవడం అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్లు కొన్ని చిన్న చిన్న తప్పులని పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు" అని షూమాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
బలహీనతకు సంకేతమా?
వాస్తవంగా ఒకరికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరైతే ఏం చేస్తారు? మీలో అహాన్ని అణచివేసి క్షమించండి అని అడుగుతారా లేక బాలీవుడ్ స్టార్ జాన్ వేన్ మాదిరిగా క్షమాపణ చెప్పడాన్ని బలహీనతగా భావిస్తారా?
"జరిగిన పొరపాటు లేదా తప్పుకు క్షమాపణ చెప్పడం ద్వారా ఎదుటి వారికి గౌరవం ఇచ్చినట్లు భావించడానికి బదులు కొంతమంది అవమానంగా భావిస్తారు" అని ఉడ్ బ్రూక్స్ చెప్పారు.
"మనస్ఫూర్తిగా చెప్పే క్షమాపణ అవతలి వారి మనోభావాలను గుర్తిస్తుంది. దాని వల్ల ఎలాంటి నష్టం లేదు. క్షమాపణ చెప్పకపోవడం వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తుంది" అని ఆమె చెప్పారు.
మనలో చాలా మంది తప్పు చేసినవాళ్లు సారీ చెప్పే తీరు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా, క్యాజ్‌వల్‌గా ఉంటుంది. ఇది సరైన పద్దతి కాదని బట్టిస్టెల్లా అంటున్నారు. క్షమాపణ ఎలా చెప్పాలో మీ తల్లి మీకు చిన్నప్పుడు నేర్పించి ఉంటారని ఆమె గుర్తు చేస్తున్నారు.
"ఉదాహరణకు చిన్నతనంలో మీరు మీ సోదరుడిపై రాయి విసిరితే, మీ తల్లి వచ్చి తమ్ముడికి సారీ చెబుతూనే మరో సారి అలా చేయనని చెప్పాలని కూడా చెబుతారు"
"మీరు ఏం తప్పు చేశారో గుర్తించడం, దానికి పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, మరోసారి అలా జరగదని సూచించేలా వ్యవహరించడం ముఖ్యం" అని బట్టిస్టెల్లా చెప్పారు.
మీరు రోజులో ఎన్నిసార్లు సారీ అనే పదాన్ని ఉపయోగిస్తారు అనేది మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు.
ఉడ్ బ్రూక్స్, హార్వర్డ్‌లో పీహెచ్‌డీ విద్యార్ధి గ్రాంట్ డానెల్లీ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం..పొరపాటు లేదా తప్పు చిన్నదైనప్పుడు ఒకసారి 'ఐయామ్ సారీ' అంటే సరిపోతుంది.అయితే అది పెద్దగా ఉంటే మాత్రం రెండుసార్లు క్షమాపణలు కోరాల్సిందే. "ఎందుకంటే మీరు పశ్చాత్తాపాన్ని ప్రకటించడంతో పాటు మీ నమ్మకాన్ని పునరుద్దరించుకోవడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది" అని ఉడ్ బ్రూక్స్ చెప్పారు.
"మీరు బ్రిటీషర్లు అయితే ఒక సారి 'సారీ' అంటే సరిపోదు. దాన్ని పునరావృతం చేస్తూనే కొన్ని విశేషణాలు జోడించాలి" అని కేట్ ఫాక్స్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














