షేక్‌హ్యాండ్: దీనికున్న చరిత్ర ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ మ్యాచ్‌ల సందర్భంగా భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఆ విషయాన్ని పక్కన పెడితే...అసలు మనుషులు షేక్ హ్యాండ్స్ ఎందుకు ఇచ్చుకుంటారు?
షేక్‌హ్యాండ్ చరిత్ర ఏంటి? ఎక్కడ మొదలైంది? అని మీకెప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Reuters
షేక్‌హ్యాండ్ ఎలా పుట్టింది?
ఒకరికొకరు పలకరింపుగా షేక్‌హ్యండ్ ఇచ్చుకోవడం అనేది 5వ శతాబ్దం నుంచీ ఉందని పలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఆ రోజుల్లో చెక్కిన అనేక శిల్పాలు, వేసిన చిత్రాలపై ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించే దృశ్యాలు ఎన్నో ఉన్నాయి.
వాటినిబట్టి పలకరింపు కోసం చేతులు కలపడం అన్నది చాలా పురాతన సంప్రదాయమే అని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
షేక్‌హ్యాండ్ వెనుక ఆసక్తికర కథలు..
అయితే, ఇలా చేతులు కలపడం వెనక ఓ ఆసక్తికర కథ ఉంది.
అప్పట్లో సైనికులు, రాజులంతా తమ నడుముకు ఎడమవైపు ఒర పెట్టుకొని అందులో కత్తులు పెట్టేవారు. అవసరమైతే క్షణాల్లో తమ కుడిచేత్తో ఆ కత్తిని బయటకు తీసి ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని అలా చేసేవారు.
దానికి బదులుగా ఒకరి ఖాళీ కుడి చేతిని మరో కుడి చేత్తో కలుపుతూ పలకరించుకోవడం ద్వారా, తమకు ఎదుటి వ్యక్తితో శత్రుత్వం లేదనీ, కాబట్టి కత్తిని బయటకు తీసే అవసరం రాదని సూచించేవారు. అంటే స్నేహానికి, ఎదుటి వ్యక్తిపై నమ్మకానికి ప్రతీకగా ఇలా షేక్‌హ్యాండ్ ఇవ్వడం మొదలైందని చెబుతారు.
రోమన్లు షేక్‌హ్యాండ్‌కు ముందు ఒక వ్యక్తి మోచేతిని మరో వ్యక్తి అరి చేత్తో పట్టుకొని పలకరించుకునేవారని, దానివల్ల ఎదుటి వ్యక్తి దగ్గర ఆయుధాలు లేవని నిర్ధరించుకునేవారని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్‌హ్యాండ్ ఇచ్చేటప్పుడు చేతుల్ని బలంగా పైకీ కిందికి కూడా ఊపుతుంటారు. చొక్కా లోపల ఎక్కడైనా చాకులాంటి చిన్నచిన్న ఆయుధాలు దాచుకుంటే, ఆ షేక్‌హ్యండ్ కుదుపులకు అవి జారిపడిపోతాయని అలా చేసేవారు. కానీ, క్రమంగా అది పలకరింపులో భాగమైపోయిందనే కథలు ఉన్నాయి.
రాజకీయాల్లో, క్రీడల్లో, వ్యాపార సమావేశాల్లో.. ఇలా అనేక సందర్భాల్లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాలక్రమంలో చాలా కీలకంగా మారింది.
ఒకవేళ షేక్‌హ్యండ్ ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో దాన్ని దురుసుతనంగా కూడా భావిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతా ఇంతేనా?
షేక్‌హ్యాండ్ ఇచ్చే అలవాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో పలకరింపు కోసం ఇతర పద్ధతుల్ని కూడా ఉపయోగిస్తుంటారు.
భారత్‌నే తీసుకుంటే, ఒకచేతిని మరో చేత్తో జోడిస్తూ, కాస్త కిందకు వంగి నమస్తే చెప్పే సంప్రదాయం ఎప్పట్నుంచో ఉంది.
థాయిలాండ్‌లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఫ్రాన్స్, మొరాకో లాంటి దేశాల్లో పలకరింపుగా బుగ్గ మీద ముద్దు పెడతారు. జపాన్‌లో అయితే చేతుల్ని కాస్త దూరంగా పెట్టి, పలకరింపుగా ముందుకు వంగుతారు. ఇలా వేర్వేరు దేశాల్లో ఒక్కో విధమైన పలకరింపు ఉన్నప్పటికీ షేక్‌హ్యాండ్ అనేది ఒక యూనివర్సల్ పలకరింపుగా మారిపోయింది.
రష్యాలో ఆడవాళ్లు ఎక్కువగా షేక్‌హ్యండ్ ఇవ్వరు. అరబ్ దేశాల్లో కూడా అంతే. నార్వే, అమెరికా లాంటి దేశాల్లో చాలా బలంగా షేక్ హ్యాండ్ ఇస్తారు. కొరియా దేశాల్లో అయితే పెద్దవాళ్లే ముందుగా షేక్‌హ్యండ్ కోసం చేయి జాపుతారు.
ఇలా షేక్ హ్యాండ్‌కు చాలా ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత అనారోగ్యకర పలకరింపు షేక్‌హ్యాండేనని యూకేలోని అబెరీస్ట్విత్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. వేరే పద్ధతులతో పోలిస్తే షేక్‌హ్యండ్ ద్వారా 90 శాతం ఎక్కువగా క్రిములు ఇతరులకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
(ఈ కథనం తొలిసారి 2020 మార్చి 4న బీబీసీ తెలుగులో ప్రచురితమైంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














