లివ్-ఇన్ రిలేషన్‌షిప్: భారత్‌లాంటి దేశాల్లో సమాజం ఆమోదిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మమీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్‌కు చెందిన ఒక యువ జర్నలిస్ట్ బలవన్మరణం తర్వాత లివ్-ఇన్ రిలేషన్‌షిప్, అందులో ఉండే సమస్యల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. లివ్-ఇన్‌లో బతకాలంటే సమాజాన్ని ధిక్కరించే ధైర్యం ఉండాలా?
"నాకు కమిట్‌మెంట్ ఫోబియా ఉంది. కేర్ ఫ్రీ లైఫ్ ఇష్టం. కుటుంబ బరువు బాధ్యతలు అంటే భయం. కానీ, నాకు కంపానియన్ కావాలి. అందుకే లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండటానికి ఇష్టపడతాను" అని లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో కొంతకాలం పాటు ఉన్న 40 ఏళ్ల ప్రదీప్ (పేరు మార్చాం) చెప్పిన మాటలు ఇవి. ఈయన హైదరాబాద్‌లో డిజైన్ ఆర్కిటెక్ట్.
ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. కానీ ఇప్పుడు సమాజం మారుతోంది. ఆధునిక సమాజంలో పెళ్లి కంటే కూడా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి బ్రతకడానికి పెళ్లే ఎందుకు చేసుకోవాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు, ఎప్పటికీ అలానే ఉండిపోతారా లేదా పెళ్లి చేసుకుంటారా అనేది తర్వాత విషయం.
లోప తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి గత ఐదేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉంది. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు.అమెరికాలో ఉంటారు.
వీళ్ల బంధం సంగతి ఇంట్లో వాళ్లకి కూడా చెప్పారు.
ప్రేమలో పడిపోయి, వెంటనే పెళ్లి చేసుకుని కొన్నిరోజుల తర్వాత విడిపోయేకంటే ఇలా ఉంటూ ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం మంచిదే కదా అని రాఘవ్ అన్నారు.
ఈ బంధంలో తను కోరుకునేది కంపానియన్ షిప్ మాత్రమే అని అన్నారు.
భారతదేశంలో కూడా ముఖ్యంగా నగరాల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌లో ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. 18 సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ఉండటాన్ని లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు కూడా లివ్- ఇన్ రిలేషన్ షిప్స్ నేరం కాదని వివిధ సందర్భాల్లో చెప్పింది.


ఫొటో సోర్స్, Getty Images
లివ్-ఇన్ రిలేషన్ షిప్స్‌లో ఎందుకు ఉంటారు?
‘‘మా ఇద్దరికీ చాలా స్పేస్ ఉంటుంది. నేను మరొక స్నేహితురాలితో ట్రిప్‌కి వెళ్లినా కూడా నా పార్టనర్ అర్ధం చేసుకోగలదు. అలా నేను మరో స్నేహితురాలితో కలిసి మెక్సికో వెళ్లాను. అప్పుడు తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి స్పేస్ పెళ్లిలో కూడా ఉండాలి. జెండర్‌తో సంబంధం లేకుండా స్నేహాన్ని చూడగలగాలి" అని రాఘవ్ అన్నారు.
ఆ అబ్బాయి వాళ్ల అమ్మ కూడా నాతో మాట్లాడారు. "అవును..మా అబ్బాయి లివ్-ఇన్‌లో ఉన్నాడు. మేము పూర్తిగా ఆమోదించాం. ఇది పూర్తిగా వాళ్ల చాయిస్. మేము ఈ బంధాన్ని ఎంగేజ్‌మెంట్ పేరుతో అందరికీ చెప్పాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే, ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లేదంటే విడిపోతారు" అని అన్నారు.
ఇలా ఆలోచించేవాళ్లు ఎంత మంది ఉంటారనేది పెద్ద ప్రశ్న.
సహచర్యం, జీవితాంతం కలిసి బ్రతకగలమా లేదోననే అనుమానం, పెళ్లి పట్ల ఉండే భయం, లేదా వారి వివాహాన్ని ఇంట్లో వాళ్లు అంగీకరించలేనప్పుడు లివ్-ఇన్ రిలేషన్షిప్స్ లో ఉండే అవకాశముందని లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ ఇన్ ఇండియా - ఏ సోషియో లీగల్ స్టడీ అనే అంశంపై ఎస్‌ఓఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా లో ప్రచురించిన పత్రం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
విడిపోతే తలెత్తే మానసిక సంఘర్షణను తట్టుకునేదెలా?
"లివ్-ఇన్‌లో ఉండటంలో ఒక కంపానియన్ షిప్ మాత్రమే కోరుకుంటాం. పెళ్లిలో ఉండే కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం ఇలాంటివేవీ లివ్-ఇన్‌లో ఉండవనే కారణంతోనే ఈ రకమైన బంధాన్ని కోరుకుంటాం" అని ప్రదీప్ అన్నారు.
"కానీ, లివ్-ఇన్‌లోకి వచ్చే ముందు ఉండే మనస్తత్వం కొన్ని రోజుల తర్వాత ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్యా మానసిక, శారీరక బంధం బలపడటం, ఈ బంధాన్ని పెళ్లి ద్వారా చట్టబద్ధం చేయమని ఎవరో ఒకరు అడగటం మొదలుపెడతారు. ఒత్తిడి పెరుగుతుంది" అని ప్రదీప్ అన్నారు.
ఇలాంటి సందర్భాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది లివ్-ఇన్‌లో ఉండేవారేనని, ఇదే కారణంతో తన పార్టనర్ నుంచి విడిపోయినట్లు చెప్పారు.
ఇలా విడిపోయినప్పుడు మానసిక సంఘర్షణ ఉండదా అని అడిగాను.
"ఒక మనిషికి దూరమవ్వడం సంఘర్షణే. కానీ, వీటికి సిద్ధంగా ఉండే మేము ఇలా ఉండటాన్ని కోరుకుంటాం. ఇద్దరూ స్వతంత్రంగా ఉన్నంత వరకు పర్వాలేదు. ఇలా నేను ఇద్దరు, ముగ్గురితో లివ్-ఇన్‌లో ఉండి విడిపోయాను. ప్రస్తుతం ఒక సౌత్ కొరియన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాను. ఇక లివ్-ఇన్ రిలేషన్ షిప్స్‌కి పుల్‌స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను. ఈమె నాకు తగిన భాగస్వామి అని అనిపిస్తోంది" అని ప్రదీప్ అన్నారు.
లివ్-ఇన్‌లో ఉండేవారందరి మనస్తత్వం ఇలాగే ఉంటుందా అనేది కచ్చితంగా చెప్పలేం.
హైదరాబాద్‌కు చెందిన ఒక యువ జర్నలిస్ట్ మరణం తర్వాత సోషల్ మీడియాలో, మీడియాలో లివ్-ఇన్ రిలేషన్షిప్స్ గురించి రకరకాల చర్చలు, వాదనలు మొదలయ్యాయి.
ఇద్దరు వ్యక్తులు కలిసి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లో ఉండటం వేరు. కానీ, ఒక పెళ్లైన వ్యక్తితో లివ్-ఇన్ లో ఉండటం వేరు. ఇలాంటి బంధాల్లో అవతలి వ్యక్తి కుటుంబం, పిల్లలు కూడా ఉంటారు.
"ఇదొక వలయంలా అయిపోతుంది" అని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల్ అన్నారు.
"ఇవి వ్యక్తిగత నిర్ణయాలు. సామాజిక నియమాలు, నిబంధనలను ధిక్కరించి బతకలేని వారు ఇలాంటి బంధాల్లోకి ప్రవేశించకుండా ఉంటేనే మంచిది. వీటిని అధిగమించి సహజీవనం చేయగలిగితే సమస్య లేదు" అని అభిప్రాయపడ్డారు.
2019 లో విడుదలైన 'లుకా చుప్పి' సినిమా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సామాజిక సమస్యలను చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
సమాజం ఆమోదంతో పని లేదా?
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి కోర్టులు ఆమోదం తెలిపినప్పటికీ, సమాజంలో దొరికే ఆమోదం చాలా తక్కువ.
"అన్నిటి కంటే ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ కి పార్టనర్ ని తీసుకుని వెళ్లడం కష్టంగానే ఉంటుంది. ఇంట్లో అందరూ ఒప్పుకోకపోవచ్చు. వ్యక్తిత్వాన్ని చులకన చేయవచ్చు. ఇలాంటి వాటిని ధిక్కరించి తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండగలిగితే, పర్వాలేదు" అని ప్రదీప్ అభిప్రాయపడ్డారు.
కానీ, సమాజం గురించి అలోచించి మానసిక ఒత్తిడిలో కూరుకుపోతే సమస్యల బారిన పడక తప్పదు అని హెచ్చరించారు.
రాఘవ్ పరిస్థితి వేరు. తన గర్ల్‌ఫ్రెండ్‌ని తన అక్క పెళ్లికి తీసుకుని వచ్చారు. నేను కూడా వీళ్లను స్వయంగా చూశాను.
ఇక్కడ సామాజిక నేపథ్యం కూడా ఒక పాత్ర పోషిస్తుంది. రాఘవ్ దిల్లీలో చదువుకున్నారు. ప్రదీప్ తండ్రి డిఫెన్స్‌లో ఉన్నతోద్యోగంలో రిటైర్ అయ్యారు. ఇద్దరి సామాజిక నేపథ్యం గమనిస్తే ఇద్దరూ విద్యావంతులు, సంపన్నులు, ఉన్నత వర్గానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లన్నది అర్ధమవుతోంది.
వీళ్ల నేపథ్యం, ఆలోచనా ధోరణి, సమాజాన్ని చూసే దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయి.
అందరూ ఇలాగే ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లయిన వ్యక్తితో లివ్-ఇన్‌లో ఉంటే?
విశాఖపట్టణానికి చెందిన ఒక ప్రముఖ రచయిత్రి మరొక స్నేహితునితో కొంతకాలం పాటు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆమె ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయారు. సమాజాన్ని ఎదుర్కోలేకపోయారు. ఆమె ఒకరోజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌లో ఏ ఒక్కరికైనా ముందే పెళ్లై, విడాకులు తీసుకోకుండా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి" అని శ్రీకాంత్ అంటారు. చట్టపరంగా వీళ్లకు లభించే హక్కులు కూడా ఏవీ ఉండవు అని చెప్పారు.
"ఒక పెళ్లైన వ్యక్తి లివ్-ఇన్‌లో ఉంటే - ఇద్దరి భాగస్వాములతో బతికే క్రమంలో రకరకాల అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. లేదా గొడవలు పడే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులు విడిపోయే వరకు మాత్రమే కాకుండా ప్రాణాలు తీసుకునేవరకూ దారితీసే అవకాశం ఉంది. లీగల్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది" అని శ్రీకాంత్ అన్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఉదాహరణలు చాలా వార్తల్లో చూశాం.
ఇవి కేవలం లివ్-ఇన్‌కి మాత్రమే పరిమితం కాదు. వివాహ బంధంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
లివ్-ఇన్ రిలేషన్షిప్స్ గురించి సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?
లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు కూడా వారసత్వ హక్కులు వస్తాయి. లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న భాగస్వామికి ఆస్తి హక్కు మాత్రం రాదు.
వీటికి రిజిస్ట్రేషన్ ఉండదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల్ చెప్పారు.
పెళ్లిలో ఒక సామాజిక భద్రత దొరుకుతుంది. లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఎదురయ్యే సమస్యలు చాలా దారుణాలకు దారి తీయవచ్చు. పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు. ఇవన్నీ మాట్లాడినంత సులభంకాదని "ది అడ్వొకేట్స్ లీగ్" లో ప్రచురించిన పత్రం పేర్కొంది.
భారత్‌లాంటి దేశాల్లో లివ్-ఇన్ బంధాలను సమాజం ఆమోదించి మద్దతు ఇచ్చే పరిస్థితి తక్కువ. పెళ్లి, కుటుంబ వ్యవస్థ ఒక భద్రతను చేకూరుస్తాయని నమ్ముతారు. న్యాయ వ్యవస్థ, చట్టం కూడా వివాహితులకు ఇచ్చినంత హక్కులను లివ్-ఇన్ బంధాల్లో ఉండేవారికి ఇవ్వదు.
ఇలాంటి సామాజిక నేపథ్యంలో తాము తీసుకున్న నిర్ణయాల పట్ల నమ్మకం, పరిస్థితులను ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడే లివ్-ఇన్ బంధాల్లో అడుగు పెడితే మంచిది.
(అభిప్రాయాలు రచయిత్రి వ్యక్తిగతం)
గమనిక:
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














