లివ్-ఇన్ రిలేషన్ నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదన్న హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఒక జంట తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది.
అయితే, లివ్-ఇన్ సంబంధాలు నైతికంగా, సామాజికంగా అంగీకారం కాదని వ్యాఖ్యానిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు వారి పిటిషన్ కొట్టి వేసింది.
సహజీవనంలో ఉన్నవారికి ఎలాంటి రక్షణ అందించలేమని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ గత వారం తీర్పు ఇచ్చారు.
ఈ జంట తరపున వాదిస్తున్న లాయర్ జేఎస్ ఠాకూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని బీబీసీకి తెలిపారు.
పంజాబ్‌కు చెందిన ఒక 19 ఏళ్ల యువతి, 22 ఏళ్ల యువకుడు లివ్-ఇన్ సంబంధంలో కొనసాగుతున్నారు.
తమకు రక్షణ కల్పించే దిశగా పంజాబ్ పోలీసులకు, తర్న్ తరన్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్టులో పిటిషన్ వేశారు.
ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న జంటలు, తమకు రక్షణ కల్పించాలంటూ స్థానిక కోర్టుల్లోనూ పంజాబ్, హర్యానా హై కోర్టులోనూ పిటీషన్ దాఖలు చేసుకోవడం తరచూ జరిగే విషయమే.
కోర్టులు కూడా ఇలాంటి జంటలకు ఉదారంగా రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తాయి.
అయితే, ఇటీవల కాలంలో లివ్-ఇన్‌లో ఉంటున్న జంటలు కూడా రక్షణ కల్పించమంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నాయి.
ప్రస్తుత కేసులో ఆ అమ్మాయి సొంత ఊరు ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాగా, వీరిప్పుడు పంజాబ్‌లోని లుథియానాలో స్థిరపడ్డారు. ఆ అబ్బాయి పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లా నివాసి.
తామిద్దరం మేజర్లమని, గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటామని వారిద్దరూ కోర్టుకు తెలిపారు.
వీరిద్దరూ కూడా అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ అబ్బాయి వేరే కులానికి చెందినవాడు కావడంతో వీరి ప్రేమను బంధువులు అంగీకరించట్లేదని పిటిషన్లో రాశారు.
ఇరు వైపు కుటుంబాలూ వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు.
వారి ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ సమస్యల కారణంగానే ప్రస్తుతం పెళ్లి చేసుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో వివాహం చేసుకునే ఆలోచన ఉందని వారిద్దరూ చెబుతున్నారు.
వీరికి భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందన్న సంగతి జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు.
అయితే, ప్రస్తుతం వారిద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి, లివ్-ఇన్ సంబంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించలేమని, ఇలాంటి సహజీవనాలు నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కావని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








