ఆంధ్ర కింగ్ తాలూకా: కరెంట్ లేని ఊరి కుర్రాడు తన అభిమాన హీరో అకౌంట్‌లో రూ. 3 కోట్లు వేశాడు.. ఆ తరువాత ఏమైంది?

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
పదిహేను నెలల గ్యాప్ తర్వాత రామ్ పోతినేని "ఆంధ్ర కింగ్ తాలూకా" సినిమాతో గురువారం థియేటర్‌లోకి వచ్చాడు. వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న రామ్‌కి సక్సెస్ దక్కిందా?
ఇది ఒక అభిమాని, సినిమా హీరోకి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. 2002లో కథ ప్రారంభమవుతుంది.
ఈ సినిమాలో.. సూర్య (ఉపేంద్ర) స్టార్ హీరో. ఒకప్పుడు సూపర్‌హిట్‌లు ఇచ్చాడు. ఇపుడు 9 వరుస ప్లాప్‌లలో ఉన్నాడు. పదో సినిమా ఆయన నూరవ సినిమా కూడా. అయితే డబ్బు సమస్యలతో ఆగిపోయింది.
ఆస్తులు అమ్మడం ఇష్టంలేని సూర్య, మూడు కోట్ల రూపాయల అప్పు కోసం ఒక నిర్మాతతో ప్రయత్నిస్తాడు. అయితే ఆయన పెట్టిన షరతు నచ్చదు.
అయితే అకస్మాత్తుగా సూర్య అకౌంట్‌లో రూ. 3 కోట్లు జమ అవుతాయి. సాగర్ అనే అభిమాని నుంచి డబ్బు వచ్చింది. సూర్యకి సాగర్ ఎవరో తెలియదు. తెలుసుకుందామని రాజమండ్రికి బయల్దేరుతాడు.


ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
ప్రేమ, ఛాలెంజ్
సూర్యకి సాగర్ వీరాభిమాని. రాజమండ్రి దగ్గర్లోని గూడవల్లి లంక అనే కరెంట్ లేని గ్రామంలో ఉంటాడు. క్లాస్‌మేట్ మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సె)ని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి మురళీశర్మ థియేటర్ ఓనర్. పేదవాడైన సాగర్‌ని అవమానిస్తాడు. అయితే సాగర్ అతనితో ఛాలెంజ్ చేస్తాడు. మిగతా కథంతా సూర్యకి, సాగర్‌కి మధ్య ఉన్న ఎమోషన్. సాగర్ తన ప్రేమని ఎలా పొందాడు? సవాల్ నిలబెట్టుకున్నాడా? లేదా? అసలు కథ.
హీరోకి అభిమానికి మధ్య ఉన్న భావోద్వేగం మంచి పాయింట్. గతంలో దాసరి శివరంజని తీశారు. ఆ తర్వాత హీరో బాల్య స్నేహితుడి కథ (కథా నాయకుడు - రజనీకాంత్) వచ్చి కూడా హిట్ అయ్యింది. అభిమాన హీరో కోసం రక్తం చిందించేవాళ్లు కూడా ఉన్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో థియేటర్ల దగ్గర గొడవలు కూడా జరిగేవి. పూజలు, పాలాభిషేకాలు, కొబ్బరికాయలు, కటౌట్‌కి దండలు భారీ హంగామా నడిచేది. ఈ నేపథ్యంలో రాసుకున్న కథ, గోదావరి లొకేషన్స్ కరెక్ట్‌గా కుదిరాయి.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
సెకండాఫ్ గట్టెక్కించింది..
కథలోని కాన్‌ఫ్లిక్ట్ కోసం ఇంటర్వెల్ వరకు ఎదురు చూసే కాలం పోయింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ కథ ఎటు వెళుతూ ఉందో అర్థం కాదు. రిపీటెడ్ సీన్స్‌తో స్లొ నెరేషన్ నడిచింది.
అయితే సెకెండాఫ్ నుంచి వేగం పుంజుకుంది. ఫస్టాఫ్ నీరసంగా వుంది. సెకెండాఫ్‌లో పరిగెత్తడం చాలా అరుదు. ఈ ఫీట్ సినిమాని కాపాడింది.
అయితే హీరో విసిరిన సవాల్‌కి, పెద్దగా సంఘర్షణ ఎదురుకాదు. అన్నీ ఆయనకి అనుకూలంగా జరిగిపోతుంటాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్ పండింది.

ఫొటో సోర్స్, Facebook/T-Series Telugu - Tollywood
ఎవరెలా నటించారు?
ఉపేంద్ర చాలా ఈజీగా నటించాడు. ఈ పాత్రకి ఆయన ఫర్‌పెక్ట్. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయినా, కథ అంతటా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్‌కి ముందు మురళీశర్మ, సెకెండాఫ్‌లో ఆలయ సన్నివేశంలో రావు రమేశ్ నటన పీక్స్. సత్య, రాహుల్ రామకృష్ణల కామెడీ పెద్దగా పండలేదు. భాగ్యశ్రీ నటన బాగుంది. ఒక పాట సూపర్. గోదావరి అందాల్ని కెమెరా పట్టుకుంది.
ఎడిటర్ ఫస్టాఫ్‌లో కనీసం 20 నిమిషాలు కత్తిరించి వుంటే ప్రేక్షకులు రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. హీరో ఎంట్రీ సాంగ్ అనే రొటీన్ నుంచి మనవాళ్లు ఎప్పుడు బయటికొస్తారో తెలియదు. రెండు గంటల 46 నిమిషాలు కొంచెం కష్టమే. ఓపిక చేసుకోవాలి. కథ అంతా కన్వీన్సింగ్‌గా లేకపోయినా, కొన్ని సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. మొత్తంగా రామ్‌కి హిట్ సినిమా కాదు, అలాగని ప్లాప్ కూడా కాదు. యావరేజ్.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
ప్లస్, మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్
1.రామ్ ఎనర్జీ
2.మురళీశర్మ, రావు రమేశ్‌ల నటన
3.సెకండాఫ్
మైనస్ పాయింట్స్
1.ఫస్టాఫ్ సాగదీత
2.రొటీన్ సన్నివేశాలు
ఫస్టాఫ్‌లో రామ్ వాళ్ల ఊరికి కరెంట్ వుండదు, సెకెండాఫ్‌లో కరెంట్ వస్తుంది. సినిమా పరిస్థితి కూడా అదే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














