పులికి మద్యం తాగించడం, పులి మనిషిని లాక్కెళ్లి తిరిగి తీసుకురావడం చూశారా.. ఇలాంటి ఏఐ వీడియోలను గుర్తించడానికి 8 సూత్రాలు

ఫొటో సోర్స్, youtube/sora
- రచయిత, అమృత దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంటి బయట కూర్చుని ఉన్న ఒకరిపై పులి అమాంతం దాడి చేసి, లాక్కెళ్లిన వీడియో ఇటీవల బాగా వైరలైంది. ఇది మహారాష్ట్రలో జరిగిందంటూ ప్రచారమైంది.
కానీ రెండు మూడు రోజుల తర్వాత, అదే పులి ఆయన్ను నోటితో పట్టుకుని క్షేమంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసినట్లు ఇంకో వీడియో రావడంతో ఇదంతా ఫేక్ అని, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వీడియో అని తేలిపోయింది.
మహారాష్ట్ర అధికారులు కూడా ఇవి ఫేక్ వీడియోలని ప్రకటించారు.
ఇదొక్కటే కాదు.. అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ మందుబాబు పులికి మద్యం తాగిస్తున్న వీడియో, లఖ్‌నవూలో చిరుతపులి, పుణెలో చిరుతపులి అంటూ సోషల్ మీడియాలో చాలానే వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి.
ఇలా, మీ సోషల్ ఫీడ్‌లలో కనిపించిన చాలా వీడియోలు నకిలీవి.
మన సోషల్ మీడియా ఫీడ్‌ను క్రమంగా ఏఐ ఆక్రమించేస్తోంది. వాటిలో మనం చూస్తున్న పులులు, సింహాలు, చిరుతలు, ఎలుగుబంట్ల వీడియోలు దాదాపు నకిలీవే.
మరి ఇంతలా పెరిగిపోతున్న ఈ ఏఐ వీడియోలను ఎలా గుర్తించాలి? వాటిని చూసి మోసపోకుండా ఉండడం ఎలా?

ఏఐ వీడియోలను ఎలా గుర్తించాలి?
గత 6 నెలల కాలంలో, ఏఐ వీడియోలను క్రియేట్ చేసేందుకు వినియోగించే ఏఐ వీడియో జనరేటర్ యాప్‌లు ఎక్కువయ్యాయి.
ఫలితంగా, ఏఐ సాయంతో క్రియేట్ అవుతున్న కంటెంట్ విపరీతంగా పెరిగింది.
వీటిలో, ఇవి నిజమైన వీడియోలేమో అనిపించేలాంటివి కూడా చాలానే ఉంటున్నాయి.
ఏఐ తనను తాను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ, తప్పులను సరిచేసుకుంటోంది. ఏఐ ఇంజిన్లు కూడా భారీ మొత్తంలో డేటాను అందించడం ద్వారా శిక్షణ పొందుతాయి కాబట్టి, ఇవి చాలా వేగంగా వృద్ధి చెందుతూనే ఉంటాయి.
అయితే, ఈ ఏఐ వీడియోలను గుర్తించడంలో ప్రధానంగా ఏమేం గమనించాలి?

వీడియో క్వాలిటీ(నాణ్యత) నాసిరకంగా ఉంటుంది. ఇలా అస్పష్టంగా కనిపించే వీడియోలు ఏఐ వీడియోలకు ఒక సంకేతం కావొచ్చు.
ఈ రోజుల్లో ఎలాంటి సాధారణ ఫోన్ చూసినా, దాని కెమెరా 4Kలో వీడియో షూట్ చేస్తుంది. రాత్రిపూట తీసే వీడియోలు కూడా స్పష్టంగానే రికార్డ్ అవుతాయి.
కాబట్టి ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఇదెందుకు క్వాలిటీ లేదు అనే ప్రశ్న రావాలి.

వీడియో క్వాలిటీ బాలేదన్న విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ఏఐ వీడియోను సీసీటీవీ ఫుటేజీ తరహాలో కనిపించేలా క్రియేట్ చేస్తున్నారు.
వైరల్ అయిన చాలా వీడియోలు సీసీటీవీ ఫుటేజీ రూపంలోనే ఉంటాయి. అయితే, తేదీ, సమయం దగ్గర నంబర్లు కనిపిస్తాయి.
అలాంటి వీడియోల క్వాలిటీ కూడా అంతంతమాత్రమే.
కాబట్టి, నాసిరకంగా కనిపించే దృశ్యాలు, ఆడియో సరిగ్గా లేకపోవడం, సీసీటీవీ ఫుటేజీ వంటివి ఆ వీడియో నకిలీదని చెప్పడానికి సంకేతాలు.

వాటికి తోడు, అసంబద్ధంగా అనిపించే చిత్రాలు కూడా వీడియో నకిలీదనే విషయాన్ని సూచిస్తాయి. అంటే, వీడియోలో ఉన్న వ్యక్తుల చర్మం మరింత ఆకర్షణగా, మెరుస్తూ ఉంటుంది. ముక్కు, కళ్లు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. జుత్తు, దుస్తులు అపసవ్య దిశలో కదులుతుంటాయి.
వీడియోలో ఉన్న వ్యక్తి ముఖ కవళికలు, కంటి కదలికలు గమనిస్తే.. అసహజంగా అనిపిస్తాయి.
ఇలాంటి సూక్ష్మమైన విషయాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇప్పటి వరకూ ఏఐ చేతులు, వేళ్లను కూడా సరిగ్గా చూపడంలేదు. ఈ గందరగోళం ఇప్పటికీ కొన్ని యాప్‌లలో ఉంది.

ఫొటో సోర్స్, x/greg16676935420

సాధారణంగా, ఏఐ వీడియోల్లో ఏదో ఫన్నీగా జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాసలో పడి అందులోని సూక్ష్మమైన విషయాలను పట్టించుకోం.
కొద్దికాలం కిందట ట్రాంపోలిన్‌పై దూకుతున్న కుందేళ్ల వీడియో వైరలైంది. కానీ, మీరు దానిని నిశితంగా గమనిస్తే.. అది ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోగా గుర్తించవచ్చు.
వీడియో ప్రారంభమైన మొదట్లో 6 కుందేళ్లు ఉంటాయి. దూకుతున్నప్పుడు వాటిలో ఒకటి దానంతట అదే అదృశ్యమవుతుంది. మరో కుందేలు ఆకారం మారిపోతుంది. అంతేకాకుండా, దీనిని సీసీటీవీ ఫుటేజీలా క్రియేట్ చేశారు.

ఏఐ వీడియోలను గుర్తించే మరో మార్గం దాని నిడివి. ఈ వీడియో క్లిప్‌లు చాలా చిన్నవిగా, కొన్నిసెకన్లు మాత్రమే ఉంటాయి. అంటే, మనం ఇన్‌స్టాగ్రామ్, షార్ట్స్‌లో చూసే వీడియోల కంటే నిడివి తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే, ఏఐలో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు క్రియేట్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి.
ఉచిత వెర్షన్‌లో కొన్ని సెకన్ల క్లిప్‌లను మాత్రమే క్రియేట్ చేయగలరు. కాబట్టి, ఈ వీడియోలు చాలావరకూ 6, 8,10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

ఫొటో సోర్స్, youtube/sora

ఉదాహరణకు, ఓపెన్ ఏఐకి చెందిన సోరా యాప్‌ను ఉపయోగించి వీడియో క్రియేట్ చేస్తే, దానిపై సోరా వాటర్‌మార్క్ వస్తుంది.
ఒకవేళ మీరు చూస్తున్న వీడియో స్క్రీన్‌పై సోరా అనే పేరు కనిపిస్తే, అది ఏఐ వీడియో.
ఇక తరచూ ఏఐ వీడియోలు క్రియేట్ చేసే వ్యక్తులు ఈ వాటర్‌మార్క్ కనిపించకుండా చేసేందుకు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తారు.
అయితే, అలా చేయడం వల్ల వీడియోపై కొంత భాగం అస్పష్టమైన పాచెస్ కనిపిస్తాయి. వాటిని కూడా గమనించాలి.

ఏఐ చాలా విషయాలను మెరుగ్గానే కాపీ చేస్తున్నప్పటికీ, ఫిజిక్స్ పరంగా కాదు.
ఉదాహరణకు, పుణెలో తిరుగుతుందని చెబుతున్న చిరుతపులి ఫోటో.
ఈ చిరుతపులి శరీరాకృతి భిన్నంగా ఉంది, దాని తోక బూడిద రంగులో ఉంది. అలాగే వెలుతురు ఎటు వైపు నుంచి పడుతోంది, నీడ ఎక్కడ పడింది, ఆ రెండింటిలో దాని సైజు సరిపోలకపోవడం వంటివి. ఇది ఏఐ వీడియో అని అటవీ శాఖ కూడా స్పష్టం చేసింది.
వీడియోలో ఎవరైనా దూకుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు కూడా ఇలాంటివి గమనించవచ్చు.

ఫొటో సోర్స్, youtube

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీడియో చూస్తున్నప్పుడు, నిజంగా ఇలా జరుగుతుందా? అని ఆలోచించడం.
ఇలా, రోడ్డుపై కూర్చుని ఉన్న పులికి ఒక వ్యక్తి మందు తాగించడం నిజంగా సాధ్యమేనా? ఇలాంటివి ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి.
ఈ వైరల్ వీడియో పెంచ్‌లో జరిగింది కాదని స్పష్టం చేస్తూ, ఈ వీడియో పోస్ట్ చేసిన ముంబయి వ్యక్తికి నాగ్‌పూర్ రూరల్ పోలీసులు లీగల్ నోటీస్ ఇచ్చారు.
అందువల్ల భయాన్ని కలిగించే వీడియోలను క్రియేట్ చేయొద్దు, అలాంటివి పోస్ట్ చేయొద్దు. లేదంటే చట్టపరమైన చర్యలకు గురయ్యే అవకాశం ఉంది.
డీప్‌ఫేక్‌లు క్రియేట్ చేయడాన్ని ఏఐ సులభతరం చేసింది. అందువల్ల, ఇలాంటి ఫోటోలు, వీడియోలు రోజురోజుకు ఇవి నిజమేనేమో అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అవి నిజమైనవేనని అనుకుంటాం కూడా. కాబట్టి, మనం కూడా కొన్ని అలవాట్లను పెంపొందించుకోవాలి.
వాట్సాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు, ఆఫర్లంటూ వచ్చే ఫోన్ కాల్స్ గురించి ఎంత అప్రమత్తంగా ఉంటున్నామో.. ఇకపై ఇలాంటి వీడియోల విషయంలోనే అంతే అప్రమత్తంగా ఉండడం మంచిది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














