గూగుల్ 'ఇన్‌కాగ్నిటో మోడ్': ఇందులో ఏం సెర్చ్ చేస్తున్నామనే వివరాలు సీక్రెట్ అనుకోవడం భ్రమేనా?

ఇన్‌కాగ్నిటో మోడ్, 'ప్రైవేట్ బ్రౌజింగ్', గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ఇన్‌కాగ్నిటో మోడ్' లేదా 'ప్రైవేట్ బ్రౌజింగ్' అనే పదాలు ఇంటర్నెట్ యుగంలో కొత్తేమీ కాదు.

'ఇంటర్నెట్‌లో డేటా కోసం శోధిస్తున్నప్పుడు లేదా నిర్దిష్ట వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు, బ్రౌజర్‌లో ఈ ఫీచర్‌ని ఉపయోగించడం వల్ల మనం వెతికిన సమాచారం లేదా మనం చూసిన వెబ్‌సైట్‌ వివరాలను గోప్యంగా ఉంచుతుంది' - ఇది చాలామందికి ఉన్న అవగాహన.

అయితే, అలాంటి వారికి ఇపుడు చెప్పబోయే ఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ విషయంపైనే 2020లో గూగుల్‌పై ఒక దావా పడింది. యూజర్లు తమ బ్రౌజర్‌లకి 'ఇన్‌కాగ్నిటో' ఫీచర్ (గూగుల్ క్రోమ్) ఉపయోగించినప్పుడు కూడా గూగుల్ వారి కార్యాచరణను పర్యవేక్షిస్తూనే ఉందనేది ఆరోపణ.

అయితే, చాలామంది యూజర్లు 'ఇన్‌కాగ్నిటో మోడ్'ని తప్పుగా అర్థం చేసుకున్నారనీ, ఆ మోడ్‌లో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు సేకరించిన డేటాపై పారదర్శకత పాటించినట్లు గూగుల్ తెలిపింది.

తరువాత, 2024లో గూగుల్ ఈ కేసును పరిష్కరించుకోవడానికి అప్పటికే సేకరించిన చాలావరకు డేటాను తొలగించడానికి, యూజర్ ట్రాకింగ్‌పై కొన్ని పరిమితులకూ అంగీకరించింది.

ఆ సమయంలో గూగుల్ నిర్ణయం చర్చనీయాంశమైంది. 'ఇన్‌కాగ్నిటో మోడ్' పై చాలామంది సందేహాలను లేవనెత్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇన్‌కాగ్నిటో మోడ్, 'ప్రైవేట్ బ్రౌజింగ్', గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ డివైజ్ ఉపయోగించే ఇతర యూజర్ల నుంచి మీ బ్రౌజింగ్ వివరాలను దాచడానికి ఇన్‌కాగ్నిటో మోడ్ సహాయపడుతుందని గూగుల్ చెబుతోంది.

ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ అంటే ఏమిటి?

ఇన్‌కాగ్నిటో మోడ్ లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది చాలా బ్రౌజర్‌లలో ఉంది. గూగుల్ క్రోమ్ - ఇన్‌కాగ్నిటో మోడ్ , మొజిల్లా ఫైర్‌ఫాక్స్ , సఫారీ - ప్రైవేట్ బ్రౌజింగ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్- 'ఇన్‌ప్రైవేట్' పేర్లతో నడుస్తోంది.

"మీ డివైజ్ ఉపయోగించే ఇతర యూజర్ల నుంచి మీ బ్రౌజింగ్ వివరాలను దాచడానికి ఇన్‌కాగ్నిటో మోడ్ సహాయపడుతుంది." - ఇది గూగుల్ ఇచ్చిన వివరణ.

అంటే, మీరు కంపెనీ కంప్యూటర్‌లో బ్రౌజ్ చేస్తుంటే, ఒకవేళ ఇతరులకు ఆ కంప్యూటర్‌కు యాక్సెస్ ఉన్నపుడు, ఇన్‌కాగ్నిటో మోడ్ అనేది మీ బ్రౌజింగ్ డేటాను ఇతర యూజర్లకు తెలియకుండా దాచడానికి మీకు సహాయపడుతుంది. వారు మీ బ్రౌజర్ 'హిస్టరీ' పేజీకి వెళ్లినా, మీ బ్రౌజింగ్ సెషన్ డేటా అక్కడ ఉండదు.

ఇన్‌కాగ్నిటో మోడ్ తాత్కాలిక బ్రౌజింగ్ సెషన్‌ సృష్టిస్తుంది. మీరు బ్రౌజింగ్ విండోను మూసివేసిన తర్వాత హిస్టరీ, కుకీస్ లేదా లాగిన్ సమాచారం సేవ్ కాదు. అదేవిధంగా, మీరు మీ ప్రధాన బ్రౌజింగ్ సెషన్ నుంచి కూడా ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.

"కొంతమంది బ్యాంకింగ్ లావాదేవీలను ప్రైవేట్ బ్రౌజింగ్ ద్వారా కూడా చేస్తారు. కానీ, డేటా ఆ డివైజ్‌లో మాత్రమే స్టోర్ అవుతుందనుకోవద్దు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) వద్ద కూడా ఆ డేటా స్టోర్ అవుతుంది" అని సైబర్ నిపుణులు మురళీకృష్ణన్ చిన్నదురై అంటున్నారు.

ఎందుకంటే ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో మీ ఐపీ చిరునామా దాగదు. మీ డివైజ్‌లో ప్రైవేట్ బ్రౌజింగ్ ద్వారా ఒక నిర్దిష్ట వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసినప్పటికీ, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తెలుసుకుంటుందని ఆయన తెలిపారు.

"మీరు ఆఫీస్ కంప్యూటర్‌లో ఇన్‌కాగ్నిటో ఉపయోగించినప్పుడు, ఆ ఆఫీస్ నెట్‌వర్క్ అడ్మిన్‌కు కూడా అన్ని వివరాలు తెలుసు. అదేవిధంగా, ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో చట్టవిరుద్ధమైన విషయాలకు మీరు శోధించినా రికార్డ్ అవుతుంది. అవసరమైతే ప్రభుత్వ సంస్థలూ దానిని యాక్సెస్ చేయగలవు" అని మురళీకృష్ణన్ చెప్పారు.

"మీ కంప్యూటర్ లేదా డివైజ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడానికి రౌటర్ ఉపయోగిస్తుంటారు. రౌటర్ ద్వారా, మీరు చూసే అన్ని వెబ్ అడ్రస్‌లను పర్యవేక్షించవచ్చు. మీరు ప్రైవేట్ బ్రౌజింగ్‌ను ఉపయోగించినప్పటికీ, మీరు దానిని నిరోధించలేరు" అని తెలిపారు.

అదేవిధంగా, మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేవి, ఉదాహరణకు వీడియోలు లేదా డాక్యుమెంట్స్ ఆటోమేటిక్‌గా తొలగిపోవని (డిలీట్ కావని) మురళీకృష్ణన్ చెప్పారు.

"ఆ ఫైల్స్ మీ కంప్యూటర్ లేదా డివైజ్‌లోనే స్టోర్ అవుతాయి. దానిని మీరే డిలీట్ చేయాలి. మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్‌ను మూసివేస్తే డౌన్‌లోడ్ వివరాలు మాత్రమే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి" అని ఆయన చెప్పారు.

ప్రైవసీ, ఇన్‌కాగ్నిటో మోడ్,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'ఇన్‌కాగ్నిటో షీల్డ్ కాదు'

"ఇన్‌కాగ్నిటో మోడ్ అనేది సైబర్ షీల్డ్ కాదు కానీ, చాలామంది అలానే భావిస్తారు" అని ఒక అధ్యయనం పేర్కొంది.

"చాలామంది ఇంటర్నెట్ యూజర్లు 'ప్రైవేట్ బ్రౌజింగ్' అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. 'ఇన్‌కాగ్నిటో మోడ్ సురక్షితమైనది' అనే భావన ఉన్నందున, ఎన్‌క్రిప్టెడ్ ఇమెయిల్‌ను పంపడానికి, వారి గుర్తింపును దాచడానికి లేదా ఫిషింగ్ వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని చాలామంది భావించారు" అని అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం పేర్కొంది.

"చాలామంది ఇంటర్నెట్ యూజర్లకు 'ఇన్‌కాగ్నిటో' మోడ్‌లో కూడా వారి ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వారి కంపెనీ లేదా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పర్యవేక్షించవచ్చని తెలియదు" అని మరొక అధ్యయనం పేర్కొంది.

ప్రైవసీ, ఇన్‌కాగ్నిటో మోడ్,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సర్వేలో పాల్గొన్న వారిలో 27 శాతం మంది ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది వైరస్‌లు, మాల్‌వేర్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందని భావించారు. అయితే, ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షించదని మురళీకృష్ణన్ చెబుతున్నారు.

"మీరు సాధారణ బ్రౌజింగ్‌లో మోసపూరిత లింక్‌పై క్లిక్ చేస్తే మీరు ఎదుర్కొనే అదే ప్రభావం, ప్రైవేట్ బ్రౌజింగ్‌లో కూడా జరుగుతుంది" అని ఆయన అన్నారు.

"ఇది ఆన్‌లైన్ నిఘా నుంచి కూడా మిమ్మల్ని రక్షించదు. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు సరికొత్త 'బ్రౌజింగ్ సెషన్'ని మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు" అన్నారు మురళీకృష్ణన్.

  • మీ సెర్చ్ ఆధారంగా (సెషన్‌లో) యాడ్స్ చూపించకూడదనుకుంటే,
  • కుకీస్/క్యాషే డేటా వద్దనుకుంటే,
  • ఒకేసారి రెండు జీమెయిల్ ఖాతాలకు (లేదా లాగిన్ కావాల్సిన ఇతర సైట్‌లకు) లాగిన్ చేయాల్సి వస్తే ప్రైవేట్ బ్రౌజింగ్ మీకు సహాయపడుతుందని మురళీకృష్ణన్ చెప్పారు.

"ఈ రోజుల్లో, చాలామంది ప్రైవేట్ బ్రౌజింగ్‌కు ప్రత్యామ్నాయంగా వీపీఎన్ ఉపయోగిస్తున్నారు. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు సరైన భద్రతతో తమ రోజువారీ పని కోసం దీనిని ఉపయోగిస్తున్నాయి. అయితే, వీపీఎన్ ఉపయోగించినప్పుడు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త అవసరం" అని ఆయన సూచించారు.

" సో...మీరు ఇక నుంచి ఇన్‌కాగ్నిటో విండోను ఓపెన్ చేసేటపుడు, పూర్తి గోప్యత అనేదేమీ లేదని గుర్తు పెట్టుకోవాలి" అని మురళీకృష్ణన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)