‘‘సెలవులకు ఇంటికెళ్లి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ అడుగుతున్నారు’’

ఆశ్రమ పాఠశాల

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీపాలి జగ్‌తాప్
    • హోదా, బీబీసీ మరాఠీ

(ఈ కథనంలో పేర్కొన్న విద్యార్థినుల పేర్లు నిజమైనవి కావు. గోప్యత కోసం మార్చి రాశాం)

మహారాష్ట్రలోని పుణె జిల్లాలోగల ఒక ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లోని అనేక మంది విద్యార్థినులు తమకు గర్భస్థ పరీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు.

సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత హాస్టల్‌లోకి వచ్చే ముందు తమతో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ (యూపీటీ) చేయిస్తున్నారని, ఇలా చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవని వారు అంటున్నారు.

ఈ టెస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి కమిషనర్ లీనా బన్సోద్ అన్నారు. అయితే ఈ పరీక్షలను నిలిపేయాలని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని విద్యార్ధినులు అంటున్నారు.

మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి విభాగం నిర్వహిస్తున్న ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్న కళాశాల విద్యార్థిని స్నేహ బీబీసీతో మాట్లాడుతూ, "మేం గర్భపరీక్ష ఎందుకు చేయించుకోవాలి? నేను ఫస్ట్ ఇయర్‌కి వచ్చినప్పటి నుంచి ఈ పరీక్ష చేయించుకోకపోతే హాస్టల్‌లో ఉండనివ్వబోమని మేడం చెప్తున్నారు" అని తెలిపారు.

ఈ హాస్టల్‌లోని చాలామంది విద్యార్థినులు కూడా ఇదే చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆశా కూడా, "ఏడెనిమిది రోజుల సెలవుల నుంచి తిరిగి వచ్చాక మేం యూపీటీ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇది వెంటనే ఆపాలి" అని అన్నారు.

మరో విద్యార్థిని రేఖ మాట్లాడుతూ, "అమ్మాయిలు సెలవులకెళ్లి వస్తే యూపీటీ పరీక్ష చేస్తారని హాస్టల్‌లో నాకు చెప్పారు" అని తెలిపారు.

సెలవుల తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అడుగుతారని, అందుకోసం ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించుకోవాలని ఈ విద్యార్థినులు చెబుతున్నారు.

‘‘యూపీటీ పరీక్ష లేకుండా వారు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వరు’’ అని రేఖ అన్నారు.

యూపీటీ పరీక్ష, హాస్టల్‌
ఫొటో క్యాప్షన్, యూపీటీ పరీక్ష చేయించుకోకపోతే హాస్టల్‌లోకి రానివ్వరని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాస్టల్‌లో ఉండే అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ పరీక్ష తప్పనిసరి కాదు. సంబంధిత అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

యూపీటీ లేకుండా మిగిలిన టెస్టులు చేయిస్తే సరిపోదా? అని విద్యార్థినులను అడిగినప్పుడు..."యూపీటీ తప్పనిసరని వాళ్ళు అంటున్నారు. లేదంటే హాస్టల్‌లోకి రానివ్వరు" అని స్నేహ తెలిపారు.

ఆశా కూడా ఈ పరీక్షను నవంబర్ 24న చేయించుకున్నారు.

"నాకు మెడికల్ టెస్ట్ కోసం ఒక ఫాం ఇచ్చారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చారు. ఆ కిట్‌తో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. టాయిలెట్‌లోకెళ్లి మూత్రం సేకరించాక, వారి ఎదురుగానే ఆ కిట్‌లో వేయాలి. రిజల్ట్‌ నెగటివ్‌గా వస్తేనే ఫామ్‌లో రాస్తారు. దాన్ని తీసుకెళ్లి కాలేజీలో ఇవ్వాలి" అని ఆశా తెలిపారు.

విద్యార్థినులు, వివాహం, పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థినుల ప్రశ్న ఏంటంటే, 'మాకు వివాహం కానప్పుడు, ఈ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?'

మానసిక ఒత్తిడి

ఈ మొత్తం ప్రక్రియ అవమానకరంగా ఉందని విద్యార్థినులు అంటున్నారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని మరో విద్యార్థిని మాట్లాడుతూ, 'నేను ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నానో చెప్పలేను. నేనే కాదు...అమ్మాయిలందరూ ఈ టెస్ట్ చేయించుకోవాల్సిందే’’ అని బీబీసీకి చెప్పారామె.

"ఈ పరిస్థితి కేవలం మా చదువుపై మాత్రమే ప్రభావం చూపడం లేదు. మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నాం" అని ఆశా అన్నారు.

‘‘యూపీటీ టెస్ట్ వెంటనే ఆపాలి. ప్రజలు మమ్మల్ని అనుమానంగా చూస్తారు. వీళ్లకు పెళ్లయింది కాబట్టే ఈ పరీక్ష చేయించుకుంటున్నారు అని జనం అనుకుంటున్నారు" అని ఆమె అన్నారు.

గర్భ పరీక్షలు,హాస్టల్ విద్యార్థినులు

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకూ ఇదే అనుభవం

పుణె జిల్లాలోని ఒక ఆశ్రమ పాఠశాల నుంచి కూడా ఇదే ఆరోపణ వచ్చింది.

మహారాష్ట్రలోని పర్వత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజల సామాజిక, విద్యా పురోగతి కోసం ఆశ్రమ పాఠశాలలు నడుపుతున్నారు.

మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ 552 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 412 హాస్టళ్లు ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలలో, 140 హాస్టళ్లు ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాల వెలుపల ఉన్నాయి.

అదనంగా, రాష్ట్రం వివిధ స్థాయిలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టళ్లను నిర్వహిస్తుంది. ఈ హాస్టళ్లు కూడా గిరిజన అభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి.

పుణె జిల్లాలోని ఒక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు ఈ గర్భ పరీక్ష తప్పనిసరి అని ఒక విద్యార్థి తల్లిదండ్రులు ధృవీకరించారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన తర్వాత ఒక డాక్టర్ కూడా దీనిని ధృవీకరించారు.

ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి తల్లి మాట్లాడుతూ, "రజస్వల అయిన బాలికలు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అది పాజిటివా, నెగెటివా అన్నది ఫాంపై రాస్తారు" అని చెప్పారు.

"ఈ పరీక్ష చేయించుకోవడానికి ప్రతి అమ్మాయి రూ. 150-200 ఖర్చు చేయాలి. ప్రతిసారీ తల్లిదండ్రులే ఖర్చు భరించాల్సివస్తోంది, ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి" అని ఆమె వివరించారు.

ఈ విషయంలో సమాచారం పొందడానికి, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బీబీసీ వెళ్ళింది.

"ఆశ్రమ పాఠశాల సూచనల ప్రకారం, వారు యూపీటీ టెస్ట్ కిట్ తీసుకువస్తారు. మాకు కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మా రిజిస్టర్‌లో నమోదు చేస్తాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వైద్యుడు వివరించారు.

గర్భధారణ పరీక్షల సమయంలో విద్యార్థినులకు తోడుగా ఎవరుంటారని అడిగినప్పుడు,"కొన్నిసార్లు తల్లిదండ్రులు, కొన్నిసార్లు అమ్మమ్మలు, బామ్మలు, ఇంకొన్నిసార్లు తోటి విద్యార్థినులు’’ అని ఆ డాక్టర్ వెల్లడించారు.

పరీక్షను నిలిపేయాలని డిమాండ్

‘‘మేం యూపీటీ పరీక్షకు వెళ్ళినప్పుడు, అక్కడున్నవారంతా మమ్మల్ని చూస్తారు. అక్కడి వైద్యులు కూడా దానిని చూసే విధానం మానసిక హింస లాంటిది’’ అని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పుణె జిల్లా అధ్యక్షురాలు సంస్కృతి గోడే అన్నారు.

‘‘దీనికి వ్యతిరేకంగా మేం పదే పదే నిరసన వ్యక్తం చేస్తున్నాం. బాలికలను యూపీటీ పరీక్ష చేయించడం వారిని మానసికంగా హింసించడమే. యూపీటీ పరీక్షను వెంటనే ఆపాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ పాత్ర

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో పుణెలోని ఒక హాస్టల్‌లో గర్భ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆ పరీక్షలు నిలిపివేయాలని ఆదేశించింది.

‘‘ నేను ఒకరోజు హాస్టల్‌కు ఆకస్మిక తనిఖీకి వెళ్లాను. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, వారిలో కొందరు యూపీటీ పరీక్ష చేయించుకోవాల్సి వస్తోందని నాతో చెప్పారు’’ అని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ తెలిపారు.

‘‘చట్టంలో దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. చదువుకునేటప్పుడు బాలికలను ఈ పరీక్ష చేయించుకొమ్మని చెప్పడం వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయడమే. ఈ ఆదేశాలు ఇచ్చిన సంబంధిత శాఖకు మేం నోటీసు జారీ చేశాం’’ అని రూపాలి తెలిపారు.

ప్రభుత్వ హాస్టళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలాంటి పరీక్ష నిర్వహించకూడదని శాఖ స్పష్టం చేసిందని గిరిజన అభివృద్ధి కమిషనర్ తెలిపారు.

గిరిజన, ఆరోగ్య శాఖలు ఏం చెప్పాయి?

ఈ విషయంలో గిరిజన అభివృద్ధి కమిషనరేట్ సెప్టెంబర్ 30న ఒక లేఖ జారీ చేసింది.

ప్రభుత్వ హాస్టళ్లలో ఆరోగ్య పరీక్షల సమయంలో బాలికలను గర్భ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశించింది.

ఈ విషయంలో, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రదీప్ దేశాయ్ "మేం ఏ అమ్మాయిని యూపీటీ పరీక్ష చేయించుకోవాలని అడగడం లేదు, ఈ విషయంలో మాకు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అందలేదు" అని స్పష్టం చేశారు.

ఈ వాదనలు ఉన్నప్పటికీ, బాలికలు అక్టోబర్, నవంబర్‌లలో గర్భ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిందని చాలా మంది బీబీసీకి చెప్పారు.

‘‘గతంలో సెలవుల్లో ఇంటికొచ్చి మళ్లీ హాస్టల్‌కు వెళ్లినప్పుడు గర్భనిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని అడిగేవారు. కానీ నాలుగు నెలల కిందటే యూపీటీ పరీక్ష నిలిపివేశారు" అని పుణె జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)