కూతురి ఆత్మగౌరవం కోసం రైల్వేతో పోరాడి గెలిచిన తండ్రి కథ

పంకజ్ మారు, మధ్యప్రదేశ్
ఫొటో క్యాప్షన్, పంకజ్ తన కుమార్తె ఆత్మగౌరవం కోసం రైల్వేలపై న్యాయ పోరాటం చేసి గెలిచారు.
    • రచయిత, ఆశయ్ యెడ్గే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్డా అనే ఓ చిన్నపట్టణంలో పంకజ్ ఓ సాధారణ హక్కు అయిన 'ఆత్మ గౌరవం' కోసం అసాధారణ పోరాటం చేస్తున్నారు.

ఆయన కూతురు సోనూకు 65 శాతం మేథోవైకల్యం ఉండటంతో రైల్వే రాయితీ కార్డు కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తి, ప్రభుత్వ పత్రాలలో గౌరవపూర్వక భాష వినియోగంకోసం ఓ కీలక పోరాటంగా మారింది.

పంకజ్ రైల్వేవారు ఇచ్చిన రాయితీ కార్డు ఓపెన్ చేసి చూస్తే అందులో 'వికలత్వానికి కారణం(టైప్ ఆఫ్ డిసెబులిటీ)' అనే చోట 'మానసిక వికలాంగులు (మెంటల్లీ రిటార్డెడ్)' అనే పదం ఉపయోగించినట్లు గమనించారు.

ఆ మాటను చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు.

''ఎవరినైనా ‘మానసిక వికలాంగురాలు’ అని ఎలా చెబుతారు? ఈ మాట వాడటం అమానవీయం'' అన్నారు.

ఆ క్షణం అనేక మార్పులకు కారణమైంది.

భారతీయ రైల్వే వికలాంగులకు ప్రయాణ రాయితీలను అందిస్తుంది. ప్రతి కార్డుపై ఏ రకమైన వైకల్యమో పేర్కొంటుంది. కానీ, సోను కోసం ఉపయోగించిన పదం, 'ఇది కేవలం ఓ ముద్ర కాదు. ఆమె ఆత్మ గౌరవంపై దాడి ' అంటున్నారు ఆమె తండ్రి.

పంకజ్ ఈ విషయాన్ని వికలాంగుల చీఫ్ కమిషనర్ కోర్టుకు తీసుకెళ్లారు. ఫలితంగా, భారతీయ రైల్వే దాని పత్రాలలో ఈ పదాన్ని మార్చవలసి వచ్చింది.

దీంతో రాయితీ కార్డులలో ఇప్పుడు 'మానసిక వికలాంగులు'కు బదులుగా 'మేథోపర వికలాంగులు (ఇంటెలెక్చువల్ డిజేబులిటీ)' అనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది భారత వైకల్య హక్కుల చట్టానికి అనుగుణంగా ఉంది.

సోను అటెన్షన్-డెఫిసిట్, హైపర్‌యాక్టావిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో జీవిస్తున్నారు. ఇది ఆమెను ఏ పనిపైనా ఏకాగ్రతచూపకుండా చేస్తుంది.

ఏడీహెచ్‌డీ అనేది నాడీ సంబంధిత సమస్య అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తరచూ ఏకాగ్రత లేకపోవడం, అతిచురుకుగా ఉండటం దీని లక్షణాలు.

ఏడీహెచ్‌డీ సుమారు 1–7 శాతం పిల్లలను ప్రభావితం చేస్తుందని భారతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇది అధ్యయనం చేసిన పద్ధతి, జనాభాను బట్టి మారుతుంది.

వైద్య పత్రాల ఆధారంతో ఏడీహెచ్‌డీతో పాటు సోనుకు 65 శాతం మేథో వైకల్యం ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ఇది భారతదేశంలో వైకల్య ప్రయోజనాలను పొందేందుకు చేసే అధికారిక అంచనా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మానసిక వికలాంగులు, పంకజ్ మారు, మధ్యప్రదేశ్, సోను
ఫొటో క్యాప్షన్, 'మానసిక వికలాంగులు' అనే పదాన్ని మార్చాలని పంకజ్ రైల్వే అధికారులను కోరారు.

న్యాయపోరాటం

వికలాంగుల హక్కుల (ఆర్పీడబ్ల్యూడీ) చట్టం, 2016 ప్రకారం సోను రాయితీ కార్డు కోసం పంకజ్ దరఖాస్తు చేశారు. కానీ 'మానసిక వికలాంగురాలు' అనే పదాన్ని చదవగానే ఆయనకు బాధేసింది.

"నా కుమార్తె సర్టిఫికేట్‌లో ఆ పదాన్ని చూడటం దిగ్భ్రాంతి కలిగించింది. మీరు ఆమెను 'రిటార్డెడ్' అని ఎలా పిలవగలరు? అది అవమానం" అన్నారు పంకజ్.

మానసిక వికలాంగురాలు అనే మాటను దిద్దాలని కోరుతూ ఆయన రత్లాంలోని డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఈమెయిల్ చేశారు. కానీ ఈ విషయం తమ పరిధిలోని కాదని అధికారులు చెప్పారు.

రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే బోర్డు కూడా ఈ పదం దిద్దుబాటుకు తిరస్కరించాయి. కానీ, పంకజ్ తన పోరాటాన్ని ఆపలేదు.

"ఆ పదాన్ని మార్చడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఇది నా కూతురు గౌరవానికి సంబంధించినది" అని చెప్పారు పంకజ్.

రైల్వేస్, మధ్యప్రదేశ్
ఫొటో క్యాప్షన్, రైల్వేస్ 'మానసిక వికలాంగులు'ను 'మానసిక బలహీనత'గా మార్చింది కానీ, పంకజ్ అంగీకరించలేదు.

నా కుమార్తెను 'రిటార్టెడ్' అని ఎలా పిలుస్తారు?

ఆర్పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థ ద్వారా వివక్షను ఎదుర్కొంటున్న ఎవరైనా వికలాంగుల కోసం చీఫ్ కమిషనర్ (సీసీపీడీ) ను సంప్రదించవచ్చు. ఏ విభాగం కూడా ఈ పదాన్ని సరిదిద్దకపోవడంతో, పంకజ్ 2024 లో సీసీపీడీని ఆశ్రయించారు.

ఆయనీ కేసును స్వయంగా వాదించారు, "నేను వైకల్య హక్కుల చట్టం ముసాయిదా కమిటీలో భాగం, కాబట్టి నా కేసును నేనే వాదించాలని నిర్ణయించుకున్నా" అన్నారు పంకజ్.

కాలం చెల్లిన, అవమానకరమైన పదజాల వాడకాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ మార్గదర్శకాలు, బాంబే హైకోర్టు తీర్పును ఆయన సమర్పించారు.

పబ్లిక్ డాక్యుమెంట్లలో ఇటువంటి భాష చట్ట ప్రకారం వివక్ష లేదా వేధింపు అని ఆయన వాదించారు. పిటిషన్ దాఖలైన మూడు రోజుల తర్వాత కోర్టు రైల్వేలకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 4, 2024 న రైల్వేలు స్పందిస్తూ పదజాలాన్ని మార్చడం అసాధ్యమని పేర్కొన్నాయి.

"నేను మళ్లీ కోర్టుకు వెళ్లి ఎందుకు సాధ్యం కాదనడిగాను. తరువాత, ఒక రైల్వే బృందం మమ్మల్ని సందర్శించి ఒక విచిత్రమైన మార్పు చేసింది: వారు సోను కోసం ఒక కొత్త కార్డును జారీ చేశారు, 'మానసిక వికలాంగురాలు' స్థానంలో 'మానసిక బలహీనత' అని పేరు పెట్టారు. అది ఇంకా అవమానకరమైనది" అని ఆయన అన్నారు.

తల్లితో సోను, పంకజ్, మధ్యప్రదేశ్
ఫొటో క్యాప్షన్, తల్లితో సోను

ఎట్టకేలకు పదబంధం మార్పు

పదజాలాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీసీపీడీ రైల్వేలను ఆదేశించింది. ఆర్‌పీడబ్ల్యుడీ అనుగుణమైన భాషను ఉపయోగించాలని ఒక నెల తరువాత కమిటీ సిఫారసు చేసింది.

మే 2025లో, రైల్వేశాఖ అన్ని జోన్లకు "మానసిక వికలాంగులు" అనే మాటను "మేథో వైకల్యం" అనే పదంతో భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.

తదుపరి విచారణ సందర్భంగా, ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు రుజువులను సమర్పించింది. జూన్ 1, 2025 నుంచి ఈ మార్పు దేశవ్యాప్త విధానంగా మారింది.

"ఈ విజయం భారతదేశం అంతటా దాదాపు 2 కోట్లమంది మేథో వికలాంగుల గౌరవాన్ని పునరుద్ధరించింది" అని పంకజ్ చెప్పారు.

సోను కొత్త సర్టిఫికేట్‌లో ఇప్పుడు: "తోడు లేకుండా ప్రయాణించలేని మేథో వైకల్యం ఉన్న వ్యక్తి'' అని ఉంటుంది.

భారతదేశం ఆమోదించిన వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (యుఎన్‌సీఆర్‌పీడీ) హక్కుల ఆధారిత విధానానికి పునాదిగా సమ్మిళిత, గౌరవప్రదమైన భాషను నొక్కి చెపుతోంది.

పంకజ్ పోరాటం వెనుక ఉన్న చట్టపరమైన నైతిక కోణం అదే. సమాజంలో ఒక పదాన్ని మార్చడం ఎందుకు పెద్ద విషయమో అది చెబుతుంది.

పంకజ్ మారు, మానసిక వికలాంగులు, సోను
ఫొటో క్యాప్షన్, పంకజ్ డిమాండ్‌ను రైల్వేలు అంగీకరించి 'మానసిక వికలాంగులు' అనే పదాన్ని భర్తీ చేశాయి

సోను ఏమంటోంది?

సోనూకు చట్టపరమైన వివరాలు అర్థం కాలేదు. కానీ తన తండ్రి తన కోసం పోరాడుతున్నారని ఆమెకు తెలుసు.

''రైల్వే నాకు తప్పు కార్డు ఇచ్చింది. మా నాన్న చాలా బాధపడ్డాడు . ముంబై, పుణె, కోల్‌కతా వంటి అన్ని చోట్లా తిరిగాడు. చివరకు సరైన కార్డు వచ్చింది" అని ఆమె చెప్పారు.

"సోను వంటి పిల్లలు కోర్టు కార్యకలాపాలను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వికలాంగుల గౌరవాన్ని నిర్ధరించడానికి ఈ తీర్పు చాలా కీలకం" అని పంకజ్ అన్నారు.

వికలాంగుల కోసం పంకజ్ నగ్డాలో స్నేహ్ అనే సంస్థను నడుపుతున్నారు.

"నిర్ణయం తీసుకోవడంలో మేథోపర వికలాంగుల పిల్లలను భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యం. వారి మానసిక వయస్సు కారణంగా వారు చిన్న పిల్లల మాదిరిగా ఉంటారని మేం తరచుగా అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనం గుర్తించలేకపోయిన భావాలు సామర్థ్యాలు వారికి ఉన్నాయి" అని పంకజ్ వివరించారు.

పంకజ్ మారు, మానసిక వికలాంగులు, సోను

'పంకజ్ మారు వర్సెస్ ఇండియన్ రైల్వేస్' కేసు భారతదేశంలో వికలాంగుల హక్కులపై చర్చకు కారణమైంది.

"ఒక పదం వల్ల ఎలాంటి తేడా వస్తుందో చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇటువంటి పదాలు వివక్షకు దారితీస్తాయి. ఈ పదాన్ని మార్చడమనేది చట్టాన్ని సమర్థించడమే కాకుండా, వికలాంగులకు సంబంధించిన గౌరవప్రదమైన భాషను ప్రోత్సహిస్తుంది" అని పంకజ్ చెప్పారు.

ఈ తండ్రీకూతుళ్లిద్దరూ వ్యక్తిగత పోరాటంలో గెలవడమే కాకుండా ఒక భారీ ప్రభుత్వ సంస్థ ఉపయోగించే భాషలో సానుకూల, మానవీయ మార్పును తీసుకువచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)