దిలీప్: హీరోయిన్ కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నిర్దోషిగా మలయాళ నటుడు..

కేరళ, దిలీప్, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, నటి

ఫొటో సోర్స్, Arun Chandra Bose

    • రచయిత, గీత పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓ ప్రముఖ నటి అపహరణ, అత్యాచారం కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది.

ఈ కేసులో మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. కానీ దిలీప్‌పై ఉన్న ఆరోపణలను కొట్టివేసింది.

నటి కిడ్నాప్, వేధింపులకు సంబంధించిన కుట్ర కేసులో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 80కిపైగా సినిమాల్లో నటించి.. వివిధ అవార్డులు గెలుచుకున్న ఓ నటిపై 2017లో త్రిస్సూర్ నుంచి కోచి వెళ్తుండగా కొందరు దాడి చేశారు.

లైంగిక దాడికి గురైన బాధితుల గుర్తింపును బయటపెట్టడం భారత చట్టాలకు వ్యతిరేకం.

కానీ 2022లో ఆ నటి తన పేరు బయటకు చెప్పడానికి అంగీకరించారు. తనకు జరిగిన అన్యాయంపై బీబీసీతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆమె హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేరళ, దిలీప్, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, నటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నటిపై దాడి, కిడ్నాప్ కేసులో 12 మంది నిందితుల్లో దిలీప్ ఒకరు.

ఆరుగురు దోషులకు ఈ నెల 12న శిక్ష ఖరారు

ఎర్నాకుళంలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి హానీ ఎం వర్గీస్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు.

కోర్టురూమ్ బయట గట్టి భద్రతఏర్పాట్లు చేశారు. కోర్టులోకి ప్రవేశించే రెండు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు.

తనపై వచ్చిన ఆరోపణలను దిలీప్ ఖండించారు. 2017లో ఆయన్ను అరెస్ట్ చేశారు. మూడు నెలల కస్టడీ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న పన్నెండు మందిలో దిలీప్ ఒకరు. సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర, అపహరణ, లైంగిక దాడివంటి కేసులు పోలీసులు వారిపై నమోదు చేశారు.

ఈ కేసులో దోషిగా తేలిన ఆరుగురికి ఈ నెల 12న కోర్టు శిక్ష ఖరారుచేస్తుంది.

కేరళ, దిలీప్, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, నటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆ ఘటనతో తనకు నరకానికి వెళ్లినట్టు అనిపించిందని నటి ఆవేదన వ్యక్తంచేశారు.

''నా జీవితం మొత్తం తలకిందులైంది’’

దాడి జరిగిన ఐదేళ్ల తర్వాత 2022లో నటి మౌనం వీడి తన కష్టతరమైన ప్రయాణాన్ని వివరించారు. తనపై జరిగిన దాడి ప్రభావం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలను తెలిపారు.

మోహన్‌లాల్, మమ్ముట్టి సహా కేరళలోని ప్రముఖ నటులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టును షేర్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీమణులు ఆమెకు మద్దతుగా మాట్లాడారు.

దాడి జరిగిన రోజు తాను త్రిస్సూర్ నుంచి కోచి వెళ్తున్నానని, తర్వాతి రోజు ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉందని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆమెపై దాడిచేసిన వారు వీడియోలు తీయడంపై ''బహుశా వాళ్లు నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని భావించుండొచ్చు'' అని ఆమె తెలిపారు.

తనకు ఎదురైన ఘోర అనుభవంపై ఆమె మాట్లాడారు. ‘‘ ఆ సంఘటన నా జీవితం మొత్తాన్ని తలకిందులు చేసింది. నేను నరకానికి వెళ్లి తిరిగొచ్చినట్టు అనిపించింది'' అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఆ నటితో పాటు దిలీప్ సెలబ్రిటీ స్టేటస్ వల్ల ఈ కేసుపై మీడియా దృష్టి చాలా ఉండేది. మీడియా ఈ కేసును ఎక్కువగా కవర్ చేయడం ''బాధాకరంగా ఉండేది'' అని ఆమె చెప్పారు.

కేరళ, దిలీప్, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, నటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఘటన తర్వాత సినీపరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం జరిపేందుకు కేరళ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటుచేసింది.

బాధితురాలిపైనే ఎదురుదాడి

బాధితురాలినే నిందించే పరిస్థితులను ఆమె ఆన్‌లైన్‌లో ఎదుర్కొన్నారు. రాత్రి ఏడు గంటలప్పుడు ఆమె ఎందుకు ప్రయాణిస్తున్నారు వంటి ప్రశ్నలతో పాటు ఆమె నైతికతను, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు. ఆమెను దూషించారు.

ఈ దాడి సంచలనం కలిగించడంతో మలయాళ సినీపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు కేరళ హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్యానెల్ ఏర్పాటుచేసింది.

భారత్‌లో ప్రముఖ సినీపరిశ్రమల్లో ఒకదాంట్లో పరిస్థితుల గురించి హేమ కమిటీ రిపోర్టు గత ఏడాది తీవ్రమైన విషయాలను వెల్లడించింది. ''శక్తిమంతులైన మగవారి మాఫియా'' మలయాళ సినీ పరిశ్రమను శాసిస్తోందని, మహిళలపై లైంగిక వేధింపులు విస్తృత స్థాయిలో ఉన్నాయని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)