‘పాక్‌ను సైన్యమే ఏలుతోంది’ అన్న జైశంకర్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఎందుకు తీవ్రంగా స్పందించింది?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ సైన్యం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురించి భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
జైశంకర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవనీ, నిరాధారమైనవనీ, బాధ్యత రహితమైనవనీ పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
శనివారంనాడు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జై శంకర్ అసిమ్ మునీర్ గురించి మాట్లాడుతూ "ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్నది దాని 80 ఏళ్ల చరిత్రకు ప్రతిబింబం" అని అన్నారు.
"పాకిస్తాన్‌లో ఏదో ఒక రకంగా సైన్యమే పాలన చేస్తోంది. కొన్నిసార్లు అది బహిరంగంగా, మరి కొన్నిసార్లు తెరచాటుగా అదే జరుగుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
"పాకిస్తాన్ బాధ్యతాయుతమైన దేశం. సాయుధ దళాలతో సహా మిగతా సంస్థలు దేశ భద్రతకు మూల స్తంభాలు. ఈ సంస్థలు సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాయి" అని పాక్ విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ అన్నారు
"2025 మేలో జరిగిన సంఘటనలు పాక్ సైన్యం సామర్థ్యాన్ని, దేశాన్ని రక్షించాలనే వారి సంకల్పాన్ని స్పష్టం చేసింది. ఈ వాస్తవాన్ని ఏ అసత్య ప్రచారం కూడా కాదనలేదు" అని ఆయన తెలిపారు.
"పాకిస్తాన్‌లో ‘సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ’ తమ దేశాన్ని అస్థిరపరిచే కుట్రల నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారంలో భాగంగా పాకిస్తాన్ సంస్థల్ని, నాయకత్వాన్ని కించపరిచేందుకు భారత పాలకులు ప్రయత్నిస్తున్నారు" అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు.
"ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పట్ల భారత్‌కు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే నిదర్శనం" అని అంద్రాబీ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ గురించి జైశంకర్ ఏమన్నారు?
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న జై శంకర్ " ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉన్నట్లే, సైన్యాధిపతుల్లోనూ మంచి వాళ్లు, అంతగా మంచివారు కానివాళ్లు ఉంటారు" అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సదస్సులో ‘‘పాకిస్తాన్ కొత్త ఫీల్డ్ మార్షల్ చేతిలో అధికారాలు కేంద్రీకృతం అయ్యాయి. దీని వల్ల భారత్‌కు లాభమా? నష్టమా’’ జైశంకర్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు స్పందిస్తూ పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఎల్లప్పుడూ ఒక వదిలేయలేని వాస్తవిక అంశమన్నారు.
"మా సమస్యలలో ఎక్కువ భాగం అక్కడి నుంచే ఏర్పడతాయి" అని ఆయన చెప్పారు
దౌత్యపరంగా భారత్ "బాక్స్"లో చిక్కుకుపోయిందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ
"పాకిస్తాన్ పరిస్థితి చూడండి. రెండు దేశాల సామర్థ్యాలు, అంతర్జాతీయంగా ఉన్న ఖ్యాతిని అర్థం చేసుకోండి. మనం పాకిస్తాన్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన, శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలు ఉన్నాయన్నది నిజం. వాటిని మేము పరిష్కరిస్తాం" అని జైశంకర్ వివరించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఇంకేమైనా చేయగలిగేదా అని అడిగినప్పుడు, భారత్ వంటి దేశాలు కొన్ని నియమాలు, నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని చెప్పారు.
‘‘దీన్ని రెండు రకాలుగా చూడాలి. మనం చేసేవి కొన్ని ఉంటాయి. చేయకూడనివి కొన్ని ఉంటాయి. మనకు సొంత ప్రమాణాలు ఉన్నాయి. మనం చేపట్టే చర్యలతో ప్రజలకు, మీడియాకు జవాబుదారీగా ఉండాలి. ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం చాలా తేలిక" అని జై శంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయంపై ..
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడంపై సదస్సులో అడిగిన ప్రశ్నకు జై శంకర్ స్పందించారు.
"ఆమె భారతదేశంలో ఎంతకాలం ఉండాలనుకుంటున్నారో అంత కాలం ఉండగలరా?" అన్నప్రశ్నకు "ఆమె భారత్‌లో ఉండటం గతేడాది దిల్లీకి వచ్చిన ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు.
" పరిస్థితులు అలా హింసాత్మకంగా మారిన తర్వాత ఆమెకు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో నిర్ణయం ఆమే తీసుకోవాలి" అని జైశంకర్ అన్నారు.
2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల నిరసనల్లో "మానవత్వంపై జరిగిన నేరాలకు" గాను ఈ ఏడాది నవంబర్ 17న బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ షేక్ హసీనాను దోషిగా నిర్ధరించి మరణశిక్ష విధించింది. ఆమె గతేడాది ఆగస్టులో భారత దేశానికి వచ్చారు.
బంగ్లాదేశ్ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా మరణశిక్ష విధించింది.
ఈ కేసులో దర్యాప్తుకు సహకరించినందుకు బంగ్లాదేశ్ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌధరి అబ్దుల్లా అల్-మామున్‌కు 5 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
ట్రిబ్యునల్ తీర్పు రాజకీయ ప్రేరేపితమని షేక్ హసీనా అన్నారు
ట్రిబ్యునల్ తీర్పు తర్వాత భారత్‌లో ఉంటున్న షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను అప్పగించాలని బంగ్లాదేశ్ భారతదేశాన్ని కోరింది.
రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరు నాయకుల్ని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ పేర్కొంది.
బంగ్లాదేశ్ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత్ ప్రకటించింది.
"శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం సహా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంది" అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














