సోల్ సిస్టర్స్: ‘‘15 ఏళ్ల వయసులో నేనెప్పటికీ తల్లిని కాలేనని తెలిసింది.. అప్పుడు నా స్నేహితురాలు ఓ మాటిచ్చింది...’’

ఫొటో సోర్స్, Georgia Barrington
- రచయిత, యాస్మిన్ రూఫో
జార్జియా బారింగ్టన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. కానీ, ఆ బిడ్డకు ఆమె స్వయంగా జన్మనివ్వలేదు. ఆ మధుర క్షణం ఆమె బెస్ట్ ఫ్రెండ్ డైసీ హోప్‌ది. చిన్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జార్జియా కోసం 9 నెలలపాటు బిడ్డను మోశారు డైసీ హోప్.
వీరిద్దరూ చాలామంచి మిత్రులు. తమను తాము ‘సోల్‌సిస్టర్స్’ ని పిలుచుకుంటుంటారు. వీరి తండ్రులు కూడా బెస్ట్ ఫ్రెండ్సే కావడంతో వీరిద్దరూ కలసిమెలిసి పెరిగారు.
బాల్యంలో మొదలైన ఈ అనుబంధం తరువాత కాలంలో జీవితాన్నే మార్చేంత పనికి కారణమైంది.
జార్జియా గర్భాశయం లేకుండా పుట్టడంతో ఆమె ఎన్నటికీ బిడ్డను కనలేరని 15 ఏళ్ల వయసులో తెలిసింది.
జార్జియాకు వచ్చిన సమస్యను మేయర్ -రోకిటాన్స్కీ-క్యూస్టర్-హౌజర్ (ఎంఆర్‌కేహెచ్) సిండ్రోమ్ అంటారు. ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరికి వచ్చే అరుదైన పరిస్థితి. కానీ జార్జియాకు మాత్రం క్షణంలోనే భవిష్యత్తు మొత్తం చీకటైన భావం కలిగింది.
‘‘అదో భయంకరమైన విషయం. నా ప్రపంచమే కూలిపోయినట్టు అనిపించింది’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
‘‘నేనూ ఏదో ఒకరోజు తల్లవుతాను అనుకుంటూనే పెరిగాను. కానీ నా నుంచి దాన్ని లాక్కున్నట్టనిపించింది. నా కల కరిగిపోయింది’’ అన్నారు.
ఆ సమయంలో డైసీకి పిల్లలను కనాలని, లేదా పెంచాలనే ఆశ ఎక్కువగా ఉండేది కాదు. కానీ జార్జియాకు అలా జరగడాన్ని మాత్రం బాగా గుర్తుంచుకున్నారు. తల్లి కావాలని కలలుగన్న జార్జియాకు ఈ పరిస్థితి రావడం ఎంతో బాధ అనిపించిందని, ఆ విషయాన్ని ఇప్పటికీ మరువలేనని అంటారు.
‘‘అందుకే ఆమె కోసం నేను బిడ్డను మోస్తాను అని మాట ఇచ్చాను’’ అని రెడీ టు టాక్ విత్ ఎమ్మా బార్‌నెట్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
‘‘ఆ సమయంలో నేనేం చెప్పానో నాకు అర్థమైందని అనుకోవడం లేదు. కానీ జార్జియా కోసం నేనొకరోజు తప్పకుండా ఈ పని చేస్తానని మాత్రం ఎప్పటి నుంచో అనిపించేది’’ అన్నారు డైసీ.

దాదాపు దశాబ్దం గడిచిన తరువాత డైసీ తన మాటను నిలబెట్టుకున్నారు. 2023లో వీరిద్దరూ ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు.
జార్జియా మిడ్‌వైఫ్‌గా శిక్షణ తీసుకున్నారు.
‘‘ఒకసారి నన్ను ఇది నిజంగా నీకు సరైన కెరీరేనా’’ అని అడిగారు. ‘‘కానీ ఇదే నాకు మానసికంగా సాయం చేసింది. ఏదో ఒక రోజు నేనూ తల్లినవుతాననే నమ్మకం ఉండేది’’
కొన్నేళ్ల తరువాత డైసీ తన బిడ్డకు జన్మనిచ్చారు. ఆ ప్రసవ సమయంలో మిడ్‌వైఫ్‌గా ఉన్నది జార్జియానే. తాను తల్లిగా మారిన ఆ అనుభవం జార్జియాకు ఇచ్చిన మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయాన్ని ఇచ్చింది డైసీకి.
‘‘నా బిడ్డపై నాకు కలిగిన ప్రేమ అద్భుతం. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని పొందగలగాలి’’ అనుకున్నా అంటారు డైసీ.
మొదట్లో తాను కొంత అమాయకంగా ఆలోచించానంటారు డైసీ. తన మొదటి గర్భధారణ చాలా సులభంగా సాగింది. అందుకే ‘‘ఈ సారి కూడా అన్నీ అలాగే సజావుగా జరుగుతాయి’’ అనుకున్నారు.

ఫొటో సోర్స్, Georgia Barrington
మొదటి పిండంతోనే డైసీ గర్భవతి అయ్యారు. అన్నీ బాగా జరుగుతున్నాయనిపించింది. కానీ ఏడువారాల సమయంలో చేసిన స్కాన్‌లో డైసీ గర్భాశయం ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
‘‘స్కాన్‌లో ఏం కనిపించడం లేదని నర్సు చెప్పిన క్షణం జార్జియా ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు.
‘‘అప్పుడు నేను కుంగిపోయినట్టనిపించింది. ఆశలన్నీ ఆవిరైపోయాయి’’ అని ఆమె చెప్పారు.
ఒకవారం తరువాత ఆ పిండం బిడ్డగా అభివృద్ధి చెందలేదని నిర్ధరించారు.
‘‘ఇది మొత్తం నా తప్పు అనుకున్నా’’ అని డైసీ కన్నీంటిపర్యంతమవుతూ ఒప్పుకున్నారు. తన బాధను ఆమె తట్టుకోలేకపోయారు. తాను జార్జియాను నిరాశపరిచినట్టనిపించిందన్నారు. అయితే వారు అక్కడితో ఆగిపోలేదు. మరోసారి ప్రయత్నించారు. రెండో ప్రయత్నంలో డైసీకి ఏదో భిన్నమైన భావన కలిగింది. ‘‘మళ్లీ గర్భవతిని అయ్యాను అని తెలిసినప్పుడు, ఈ ప్రపంచం రెండోసారి కూడా ఇలా క్రూరంగా వ్యహరించదని నా మనసు చెప్పింది’’ అని డైసీ చెప్పారు.

ఫొటో సోర్స్, Georgia Barrington
స్క్రీన్‌పై చిన్నారి హృదయ స్పందన, అంతలోనే బ్లీడింగ్
ఆరువారాలయ్యేసరికి, వీరిద్దరూ ఆస్పత్రి గదిలో ఊపిరి బిగబట్టి కూర్చున్నారు. స్క్రీన్‌పై ఆ చిన్న హృదయస్పందన కనపడింది. కానీ తరువాత రోజు డైసీకి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది.
‘‘మళ్లీ గతంలోలానే జరుగుతుందని భయంతో వణికిపోయాను’’ అంటారు డైసీ.
రక్తస్రావం ఆరుగంటలకుపైగా కొనసాగింది. గర్భస్రావం అయిపోయి ఉంటుందని డైసీ భయపడ్డారు. కానీ డాక్టర్లు పరీక్షించిన తరువాత లోపలి బిడ్డ హృదయ స్పందన బాగుందని, గర్భం నిలిచిందని చెప్పారు. అలా ఆ బిడ్డ ప్రసవం వరకు సురక్షితంగా ఎదిగింది.
అంచనా వేసిన తేదీకి కొద్దిగా ముందుగానే డైసీకి నొప్పులు మొదలయ్యాయి. కొన్ని నెలల కిందట ఆమె ఒక పాపాయికి జన్మనిచ్చారు.
అ క్షణంలో జార్జియా ఎంత సంబరంగా ఉన్నారంటే... ‘‘బిడ్డతల కనిపించినప్పుడు మేమంతా కన్నీటితో మునిగిపోయాం’’ అన్నారు.
ఇప్పటికీ నిజంగా నాకు బిడ్డ ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను అన్నారు జార్జియా.
‘‘నేను ఎంత అదృష్టవంతురాలిని. ఎంత కృతజ్ఞతతో ఉన్నానో చెప్పలేను’’ అని జార్జియా అంటుంటే అదే సమయంలో డైసీ చాలా మామూలుగా స్పందించారు. ‘‘నా బెస్ట్ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగినంత సాయం చేస్తాను అనే నమ్మకం నాకు ఎప్పటి నుంచో ఉంది’’ అన్నారు డైసీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














