పెరిమెనోపాజ్: 'ఎవరో నన్ను దోచుకున్నట్లు అనిపించేది'

ఫొటో సోర్స్, Dan Kennedy
- రచయిత, ఎనాబెల్ రాఖం
- హోదా, కల్చర్ రిపోర్టర్
తనకు 38 ఏళ్ల వయసులో పెరిమెనోపాజ్ దశలోకి వెళ్తున్నట్టు తెలిసినప్పుడు తననెవరో దోచుకున్నట్లు అనిపించిందని బ్రాడ్‌కాస్టర్ ఎమ్మాబార్నెట్ చెప్పారు.
''జీవితంలో మొదటిసారి మహిళగా ఉండాలనిపించలేదు. పురుషుడినై ఉంటే బావుండేదని అనిపించింది'' అని ఇప్పుడు 40 ఏళ్ల వయసులో ఉన్న బార్నెట్ చెప్పారు.
తన కొత్త బీబీసీ పాడ్‌కాస్ట్ రెడీ టు టాక్ విత్ ఎమ్మా బార్నెట్‌లో ఆమె మాట్లాడారు.
సాధారణంగా పెరిమెనోపాజ్ దాదాపు 46 ఏళ్ల వయసులో వస్తుంది. దీనిలో మెనోపాజ్ లక్షణాలే కనిపిస్తాయి. కానీ పీరియడ్స్ ఆగిపోవు. యాంగ్జైటీ, మూడ్ మారుతుండడం, మెదడు చురుకుదనం తగ్గడం, శరీరం నుంచి వేడి ఆవిర్లు రావడం, పీరియడ్ల గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పెరిమెనోపాజ్ వల్ల తన ఐడెంటిటీ కోల్పోయినట్టు అనిపించిందని ఈ ఎపిసోడ్‌లో బార్నెట్ చెప్పారు. పాత పరిస్థితికి "తిరిగి రావాలని" ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తన స్నేహితురాలు, కార్యక్రమంలో పాల్గొన్న అతిథి కేట్ థ్రోంటన్‌తో మాట్లాడుతూ, ''ఏదో దొంగతనం జరిగినట్టు అనిపిస్తుంది. ఎమర్జెన్సీ కాల్ చేసేందుకు నంబర్ ఏదీ లేదన్న భావన కలుగుతుంది. ఏదో నేరం జరిగినట్లు ఫిర్యాదు చేయాలేమో అనిపిస్తుంది. అవును, ఎవరో నన్ను దొంగిలించారు, కానీ ఎవరిపైనా ఫిర్యాదు చేయలేం'' అని బార్నెట్ అన్నారు.


‘నాపై నేను నమ్మకం కోల్పోయా’
థ్రోంటన్ కూడా జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్. ఆమె కూడా పెరిమెనోపాజ్ గురించి తన అనుభవాన్ని వివరించారు. ''చాలా సమర్థురాలు, ఎన్నోపనులు అవలీలగా చేయగలరు" వంటి గుర్తింపు నుంచి అసమర్థురాలిగా కనిపిస్తానేమో అన్నంతగా మారడం తనకు ఎదురైన భయానక అనుభవమని థ్రోంటన్ తెలిపారు.
బార్నెట్ గతంలో తన ఆరోగ్యం గురించి మాట్లాడారు. 2019లో, పీరియడ్: ఇట్స్ ఎబౌట్ బ్లడీ టైమ్ అనే పుస్తకం రాశారామె. అందులో ఆమె ఎండోమెట్రియోసిస్ గురించి తన అనుభవాలను వివరించారు.
తన జీవితంలోని కొన్ని విషయాల గురించి షేర్ చేసుకోవడం చాలా టెన్షన్‌గా అనిపించిందని, కానీ ఇతరులు కూడా తమ అనుభవాలు పంచుకునేందుకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతోనే తన అనుభవాలను పంచుకున్నానని ఆ పాడ్‌కాస్ట్‌లో బార్నెట్ చెప్పారు.
గత ఏడాది వరకు బార్నెట్ రేడియో ఫర్ విమెన్‌కు హోస్ట్‌గా ఉన్నారు. ఇతరుల కథల గురించి చెప్పడానికి మాత్రమే కాకుండా శ్రోతలకు తన అభిప్రాయాలు, అనుభవాల గురించి తెలియజేయడానికి ఎలాగైనా పాడ్‌కాస్ట్ చేయాలని అనుకున్నానని బార్నెట్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అందరూ మాట్లాడుకోవాలి’
''నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తుంటాను. హోస్ట్ చేస్తుంటాను'' అని థ్రోంటన్‌తో బార్నెట్ చెప్పారు.
''ఆ విషయాలు చెప్పడం అంత తేలిక కాదని నాకు తెలుసు. అయితే ఇంటర్వ్యూలు చేసే వారు అన్నివేళలా కాకపోయినా అవసరమైన సమయంలో అలాంటివి చెప్పడం ముఖ్యమని నేననుకున్నా. ముఖ్యంగా ఎదుటివారిని అలాంటి విషయాల గురించి అడిగేటప్పుడు'' అని బార్నెట్ అన్నారు.
పెరిమెనోపాజ్, 30ఏళ్ల తర్వాత మహిళల హర్మోన్లలో వచ్చే మార్పులు వంటి వాటిపై మనం మాట్లాడినట్టుగా అందరూ సాధారణంగా మాట్లాడే స్థితి రావాలని ఎపిసోడ్ చివరిలో బార్నెట్ ఆకాంక్షించారు.
''దాని వల్ల అసాధారణ మార్పు వస్తుందని కాదు. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది మారుతుంది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెనోపాజ్ లక్షణాలకు ఎలాంటి చికిత్స పొందాలి?
మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్ఆర్‌టీ)తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.
ఈస్ట్రోజెన్ స్థాయిలను హెచ్ఆర్‌టీ పెంచుతుంది, స్థిరీకరిస్తుంది. కొన్నిసార్లు దీన్ని సింథటిక్ లేదా బయోఐడెంటికల్ ప్రొజెస్టెరోన్‌తో కలిపి ఇస్తారు.
అయితే, కొన్ని రకాల క్యాన్సర్లు, రక్తం గడ్డకట్టడం, హైబీపీ వంటివి ఉన్నవారికి హెచ్ఆర్‌టీ పనిచేయదు.
మహిళలు తమ ఆరోగ్యాన్ని ఇలా మెరుగుపరుచుకోవచ్చు:
సమతుల్య ఆహారం తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండాలి. ఎముకలు బలంగా మారడానికి, గుండె ఆరోగ్యానికి వీలుగా కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి.
యాంగ్జైటీ, గుండెపై ఒత్తిడి తగ్గేందుకు నిరంతరం వ్యాయామం చేయాలి.
గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే పొగతాగకూడదు.
మద్యానికి దూరంగా ఉండాలి.
సోయా, రెడ్ క్లోవర్ వంటి ఆహారాల్లో ఉండే ఈస్ట్రోజెన్‌లను తీసుకోవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీగా పిలిచే సీబీటీ తీసుకోవచ్చు. మహిళల వ్యక్తిగత పరిస్థితిని బట్టి హెచ్ఆర్‌టీకి బదులుగా లేదా హెచ్ఆర్‌టీతో పాటుగా దీన్ని తీసుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














