దిల్లీ పేలుడు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్ షాహీన్ సయీద్ కుటుంబీకులు, పొరుగువారు ఏం చెప్తున్నారు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లఖ్‌నవూ నుంచి
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి కశ్మీర్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయీ, లఖ్‌నవూ డాక్టర్ షాహీన్ సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అల్-ఫలాహ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ భూపిందర్ కౌర్ ఆనంద్, నవంబర్12న ఒక ప్రకటన విడుదల చేశారు.
''మా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు వైద్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని మాకు తెలిసింది. వారికి యూనివర్సిటీతో కేవలం అధికారిక సంబంధం మాత్రమే ఉంది. దర్యాప్తుకు మేం పూర్తిగా సహకరిస్తున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో కొనసాగుతున్న ఉమ్మడి ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ నుంచి 'అభ్యంతరకర సామగ్రి'ని స్వాధీనం చేసుకున్నట్లు ఫరీదాబాద్ పోలీసులు వెల్లడించారు.

ముజమ్మిల్‌ను అక్టోబర్ 30న అరెస్టు చేశారు.
''అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ముజమ్మిల్ బోధించేవారు. ఆయన నుంచి ఒక కిర్నికోవ్ రైఫిల్, ఒక పిస్టల్, టైమర్, 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. కానీ, ఇది ఆర్డీఎక్స్ కాదు'' అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేంద్ర గుప్తా తెలిపారు.
అలాగే ముజమ్మిల్ వద్ద షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టరై ఉన్న కారును గుర్తించిన తర్వాత, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామని ఫరీదాబాద్ పోలీసులు వెల్లడించారు.
షాహీన్ సయీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బీబీసీకి ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ పీఆర్‌ఓ యశ్‌పాల్ ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, ANI
లఖ్‌నవూలో చదువుకున్న షాహీన్ సయీద్
షాహీన్ సయీద్ వయస్సు 46 ఏళ్లు. ఆమె లఖ్‌నవూలో జన్మించి, అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు.
జేసీ బోస్ వార్డ్‌లో ఆమె కుటుంబం నివసిస్తుంది. లఖ్‌నవూలోని లాల్‌బాగ్ పక్క గల్లీలో ఆమె తండ్రి ఇల్లు ఉంటుంది. ఆమె తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.
లాల్‌బాగ్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది హజ్రత్‌గంజ్‌కు ఆనుకొని ఉంటుంది.
షాహీన్ సయీద్ అరెస్ట్ వార్త గురించి తెలిసినప్పటి నుంచి, లఖ్‌నవూలోని వారి వీధి నిర్మానుష్యంగా మారింది. వారి సమీప బంధువులు కూడా దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు.
సయ్యద్ అహ్మద్ ఇంటి బయట మీడియా గుమిగూడింది. పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు.
షాషీన్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైనదని ఆమె తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
'ఆమె అలహాబాద్‌లో ఎంబీబీఎస్ చదివింది. తర్వాత ఫార్మకాలజీలో స్పెషలైజేషన్ చేసింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పది, పన్నెండు తరగతుల్లో మంచి మార్కులు సాధించింది. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ రాసి వైద్య విద్యలో చేరింది. ఆమె అరెస్టు గురించి నాకు మీడియా ద్వారా తెలిసింది. ఆమె చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుందంటే నేను నమ్మను'' అని ఆయన అన్నారు.
తాను చివరిసారిగా షాహీన్‌తో ఒక నెల క్రితం మాట్లాడానని ఆయన తెలిపారు.
''మేం మాట్లాడుకున్నప్పుడు ఆమె ఎప్పుడు కూడా కశ్మీర్‌కు చెందిన ఏ వ్యక్తుల గురించి ప్రస్తావించలేదు. బాగోగులు మాత్రమే అడిగి తెలుసుకునేది. ఆమె పని గురించి చాలా తక్కువగా మాట్లాడేది'' అని షాహీన్ తండ్రి చెప్పారు.
షాహీన్ సయీద్‌పై వచ్చిన ఆరోపణలను ఆమె అన్నయ్య షోయబ్ సయీద్ వ్యతిరేకించారు.
'మా కుటుంబం అలాంటిది కాదు. ఇదంతా నిజం కాదు. మా చెల్లి చదువులో ముందుండేది. అందరూ చెబుతున్నది నిజమని నేను నమ్మలేకపోతున్నా' అని ఆయన అన్నారు.
షాహీన్‌ను దాదాపు నాలుగేళ్లుగా తాను కలవలేదని ఆయన చెప్పారు. కుటుంబ కారణాల రీత్యా ఇది జరిగిందని, ఈ దూరానికి వేరే కారణమేదీ లేదని ఆయన వెల్లడించారు.
షాహీన్ సయీద్ తమ్ముడు, వైద్యుడు అయిన పర్వేజ్ అన్సారీని కూడా జమ్మూకశ్మీర్ పోలీసులు, యూపీ ఏటీస్ ప్రశ్నిస్తోంది.
పర్వేజ్‌కు సహారన్‌పూర్‌లో ఒక క్లినిక్, లఖ్‌నవూలోని మడియావ్ సమీపంలో ఒక ఇల్లు ఉంది. పోలీసులు మంగళవారం ఈ రెండు ప్రదేశాల్లో సోదాలు చేశారు.
షాహీన్ మాజీ భర్త ఏమన్నారు?
షాహీన్ 2003లో జఫర్ హయాత్ అనే నేత్ర వైద్యుడిని వివాహం చేసుకున్నారు. కానీ, 2013లో వీరు విడాకులు తీసుకున్నారు.
షాహీన్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జఫర్ హయాత్ బీబీసీతో మాట్లాడారు.
'మేం 2012-13లో విడాకులు తీసుకున్నాం. అప్పటినుంచి ఆమెతో ఎలాంటి సంప్రదింపులు లేవు. విడాకుల నాటికే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఏడేళ్లు, మరొకరికి నాలుగేళ్లు. పిల్లలిద్దరూ నాతోనే ఉంటున్నారు' అని ఆయన చెప్పారు.
షాహీన్‌తో తనకున్న సంబంధం గురించి ఆయన మాట్లాడారు.
'మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఆమె యూరప్ లేదా ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమెకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. నేను ఇక్కడే ఉండాలనుకున్నా' అని ఆయన చెప్పారు.

పొరుగువారు ఏం అంటున్నారు?
లఖ్‌నవూలోని షాహీన్ ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఇక్తేదార్ హుస్సేన్ కుటుంబం నివసిస్తుంది.
''వాళ్లది చాలా గౌరవ ప్రదమైన కుటుంబం. సయీద్ సాబ్, ఆయన కొడుకు షోయబ్ చాలా మంచివారు. కానీ, ఇదంతా వింటుంటే షాకింగ్‌గా ఉంది' అని ఇక్తేదార్ హుస్సేన్ అన్నారు.
ఆ వీధిలో తాను పదేళ్లుగా నివసిస్తున్నానని, అందుకే షాహీన్ గురించి తనకు పెద్దగా తెలియదని ఆయన చెప్పారు.
ఇంటి గుమ్మం వద్ద కూర్చున్న రజియా బానో మాట్లాడుతూ తాను 40 ఏళ్లుగా అదే వీధిలో నివసిస్తున్నానని చెప్పారు.
'నేను షాహీన్‌ను చిన్నప్పుడు చూశాను. తరువాత, ఆమె డాక్టర్ అయిందని విన్నాను. కానీ ఆమెను మళ్ళీ చూడలేదు' అని రజియా తెలిపారు.
ఆ కుటుంబంపై పొరుగువారికి ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవు.
మరో పొరుగు వ్యక్తి అమిత్ తివారీ మాట్లాడుతూ, 'ఆ కుటుంబం వారు అందరికీ తెలుసు. షాహీన్ చాలా ఏళ్లుగా ఇక్కడ నివసించడం లేదు' అని అన్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా..
షాహీన్ 2006లో కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (జీఎస్‌వీఎం) మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆమె ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
యూపీ ఏటీఎస్ మంగళవారం కాన్పూర్‌లో కూడా దర్యాప్తు చేసింది.
కాలేజీ రికార్డుల ప్రకారం, 2009లో ఆమెను ఆరు నెలల పాటు కన్నౌజ్ మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. ఆ తర్వాత 2010లో మళ్లీ జీఎస్‌వీఎం కాలేజీకి తిరిగొచ్చారు.
షాహీన్ అరెస్ట్ తనను షాక్‌కు గురి చేసిందని ఫార్మకాలజీ విభాగానికి చెందిన వీరేంద్ర కుష్వాహాను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
'ఆమె నాకు సహోద్యోగిగా తెలుసు. 13, 14 ఏళ్ల క్రితం మేం కలిసి పనిచేశాం' అని ఆయన వీరేంద్ర కుష్వాహా వ్యాఖ్యానించారు.
ఆమె 2013లో చెప్పాపెట్టకుండా కాలేజీకి రావడం మానేశారని బీబీసీతో కాలేజీ యాజమాన్యం చెప్పింది.
'ఆమెను సంప్రదించడానికి చాలాసార్లు ప్రయత్నించాం. కానీ, ఆమె స్పందించలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2021లో ప్రభుత్వం ఆమె ఉద్యోగాన్ని రద్దు చేసింది' అని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
కాన్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన షాహీన్ సయీద్ మాజీ సహచరులు 2013 నుంచి ఆమెతో సంబంధాలు లేవని చెబుతున్నారు.
'ఆమె అకస్మాత్తుగా కాలేజీకి రావడం మానేసింది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. హరియాణాలో ఆమె ఉద్యోగం చేస్తున్నట్లు తర్వాత తెలిసింది' అని బీబీసీతో ఒక మాజీ సహోద్యోగి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















