కర్ణాటక : మహిళలకు నెలసరి సెలవుపై కీలక నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ న్యూస్
సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు నెలకోరోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు అందించాలని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న18 నుంచి 52 ఏళ్ల వయస్సున్న మహిళలు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు తీసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు.
ఫార్మల్ సెక్టార్‌లోని 3,50,000 నుంచి 4 లక్షల మహిళలకు ఈ పాలసీ వర్తించనుంది. అయితే, దీని పరిధిలోకి రాని వారి సంఖ్య భారీగా ఉంది. ఇంటిపని, రోజువారీ కూలీలు, గిగ్‌వర్కర్లుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య 60 లక్షలుగా ఉంటుందని అంచనా.

అసంఘటిత రంగానికి కూడా ఈ పాలసీని వర్తింపచేయాలని నిపుణులు అంటున్నారు.
కాంట్రాక్ట్, జాబ్ టైప్‌తో సంబంధం లేకుండా తొలిసారి ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా నెలసరి సెలవు దక్కనుండటంతో ఈ పాలసీని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా వంటి దేశాలు ఇప్పటికే నెలసరి సెలవును అందిస్తున్నాయి. బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు రెండు రోజులు సెలవు ఇస్తుండగా, కేరళ తమ రాష్ట్రంలోని యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బందికి మాత్రమే దీన్ని వర్తింపచేస్తోంది.
అయితే, మహిళలకు అదనంగా ఒకరోజు సెలవు ఇవ్వాలనే నిర్ణయం లింగ వివక్ష, సమానత్వం సమస్యలపై చర్చలకు దారితీస్తోంది.
మహిళలు భరించలేని నొప్పిని తట్టుకుంటూ పనిచేయకుండా, జీతాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.
మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రగతిశీల విధాన నిర్ణయాల్లో ఇదొకటని బీబీసీతో కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'కర్ణాటకలోని చాలా కంపెనీలు ఇప్పటికే మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆదేశాన్ని అమలు చేయడం పెద్ద సమస్య కాదు' అని బీబీసీతో నాస్‌కామ్ అధికారి ఒకరు అన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక గార్మెంట్ అండ్ టెక్స్‌టైల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు స్వాగతించారు. గార్మెంట్ ఉద్యోగుల్లో చాలామంది మహిళలకు ఏడాదికి 11 సెలవులే లభిస్తాయని ఆమె చెప్పారు.
ఈ విధానాన్ని అమలు చేయడం చాలా కష్టమని కొంతమంది మహిళలు భావిస్తున్నారు.
'పీరియడ్స్ గురించి బహిరంగంగా ఎవరూ మాట్లాడరు. అలాంటప్పుడు వెళ్లి నెలసరి సెలవు కావాలని ఎవరైనా ఎలా అడుగుతారు. మన సమాజం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు' అని బీబీసీతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్ అనునితా కందు అన్నారు.
'నన్నడిగితే అసలు ఆ సెలవే అక్కర్లేదు. చాలామంది మహిళలు ఎం అనే పదాన్ని ప్రస్తావించకుండానే ఉన్నత స్థానాలకు ఎదిగారు' అని ఐటీ ఉద్యోగి అరుణా పాపిరెడ్డి అన్నారు.
నెలసరి చుట్టూ లోతుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడమే నిజమైన సవాలు అని సామాజిక శాస్త్రవేత్త పుష్పేంద్ర అభిప్రాయపడ్డారు.
'ఒకవేళ బిహార్‌లో ఒక మహిళ రెండు రోజుల లీవ్ అడిగారంటే ఆమెకు నెలసరి అని అర్థం స్ఫురిస్తుంది. ఈ సెలవు మహిళలకు సౌకర్యాన్నిచ్చింది. కానీ, సాధికారతను కల్పించలేదు' అని ఆయన అన్నారు.
దశాబ్దాలుగా నెలసరి సెలవును అందిస్తున్న బిహార్‌తో సహా దేశంలోని చాలా చోట్లా దుకాణదారులు ఇప్పటికీ శానిటరీ ప్యాడ్లను పాత న్యూస్‌పేపర్లలోనే చుట్టిఇస్తారని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














