ఎయిడ్స్‌తో భర్త చనిపోయారు, 11 నెలల కొడుకు ప్రాణాలు పోయాయి, హెచ్‌ఐవీ ఉందని అందరూ దూరం పెట్టారు..

హెచ్ఐవీ పాజిటివ్, మహారాష్ట్ర, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఒంటరి మహిళ, సమాజం, వివక్ష

ఫొటో సోర్స్, WWW.JAMKHED.ORG

ఫొటో క్యాప్షన్, రత్న జాధవ్

పెళ్లైన కొన్ని సంవత్సరాలకే ఆమె భర్త హెచ్ఐవితో మరణించారు. ఆ తర్వాత ఆమె 11 నెలల కొడుకు చనిపోయాడు. ఈ బాధలు భరించలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎనిమిదేళ్ల కిందట 2017 డిసెంబరు 1న స్విట్జర్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరైన రత్న జాధవ్ ఒక ఉపన్యాసం ఇచ్చారు. రత్న జాధవ్ వేదనాభరిత జీవిత కథ ఇది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కర్జాత్ తాలూకాలోని తక్లి ఖండేశ్వరీ అనే గ్రామంలో రత్న జాధవ్‌కు 15 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక డ్రైవర్‌తో పెళ్లయింది.

వారు పన్వేల్‌లో నివసించేవారు. కానీ వారి వివాహం జరిగిన ఏడాదిన్నర లోపే, ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో రత్న గర్భవతి అయ్యారు.

తొమ్మిదో నెలలో ప్రసవం కోసం రత్న పుట్టింటికి వచ్చిన సమయంలో పన్వేల్‌లో ఆమె భర్త ఆరోగ్యం మరింత క్షీణించింది. రత్నకు కొడుకు పుట్టాడు.

బాబు పుట్టి అప్పటికి కొన్నివారాలు మాత్రమే అయింది. రత్త అత్తయ్య వచ్చి ఆమెను హడావిడిగా పన్వేల్‌కు తీసుకెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రత్న భర్తకు ఏమయింది?

పన్వేల్ వెళ్లగానే రత్న షాక్‌కు గురయ్యారు. ఆమె భర్తకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తేలింది.

రత్న కూడా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది.

రత్నకు ముంబయిలో పరీక్షలు జరిగాయి. ఆమె భయాలు నిజమయ్యాయి. రత్నకు కూడా భర్త ద్వారా హెచ్ఐవీ సోకింది. అక్కడి నుంచే చాలా వేదనాభరిత, కష్టమైన ఆమె ప్రయాణం ప్రారంభమైంది.

"మా భార్యాభర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినప్పుడు మాకు మొదటి కష్టం పన్వేల్‌లో నే ఎదురైంది. మేం అప్పటివరకు నివసించే ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సివచ్చింది. మా అనారోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత కొంతమంది మేం అక్కడ నివసించడాన్ని వ్యతిరేకించారు" అని రత్న చెప్పారు.

"తర్వాత మేం బీడ్ జిల్లాలోని నా భర్త గ్రామానికి వచ్చాం. గ్రామంలోని ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండడంతో మేమక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉండగలిగాం. మేం వారితో కలిసి ఉండకూడదని మా అత్తమామలు కూడా అనుకున్నారు. చివరికి మేం గ్రామం వదిలి పొలాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది"

"క్రమంగా, నా భర్త ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. నేను ఆస్పత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ నేను నా భర్తను తాకడానికి కూడా నిరాకరించారు. 2001లో నా భర్త చనిపోయారు'' అని రత్న తెలిపారు.

హెచ్ఐవీ పాజిటివ్, మహారాష్ట్ర, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఒంటరి మహిళ, సమాజం, వివక్ష

ఫొటో సోర్స్, WWW.JAMKHED.ORG

ఫొటో క్యాప్షన్, భర్త ఎయిడ్స్‌తో చనిపోవడం, తనకు కూడా హెచ్ఐవీ సోకడంతో సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని రత్న చెప్పారు.

అన్ని చోట్లా నిరాదరణ

భర్త చనిపోయారు. అత్తమామలు రత్నను తమతో ఉండనివ్వలేదు. దీంతో ఆమె తన పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి జీవించడం మొదలుపెట్టారు.

"కానీ ఆమె తల్లి స్నేహితురాళ్లు ఆమెను హెచ్ఐవీ విషయంలో భయపెట్టారు. 'నువ్వు ఆమెను మీతో ఉంచుకుంటే, నీకు కూడా ఆ వ్యాధి రావచ్చు' అని ఆమె స్నేహితురాళ్లు అమ్మతో చెప్పారు. "అప్పుడు నా వల్ల నా తోబుట్టువులకు హెచ్ఐవి వస్తుందేమో మా అమ్మ కూడా భయపడింది. నన్ను దూరంగా ఉంచసాగింది. నేను నా బిడ్డతో కలిసి విడిగా జీవించడం మొదలుపెట్టాను'' అని రత్న చెప్పారు.

"మొదట్లో నేను ఇంటి పనులు, పొలం పనులు చేసేదాన్ని. కానీ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత, నా అనారోగ్యం గురించి వారికి తెలిసింది. దీంతో వారు నాకు పనిఇవ్వలేదు'' అని ఆమె పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

కొన్ని రోజులు ఆమె ఆకలితో అలమటించిపోయారు. తరువాత ఆమెకు ఉపాధి హామీ పథకం కింద పని దొరికింది.

ఆ తర్వాత ఒకరోజు బాబుకు 11 నెలల వయస్సు ఉన్నప్పుడు, ఆమె పని నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తన బిడ్డ చనిపోయి ఉన్నాడు.

"నా బిడ్డను కోల్పోయిన బాధ భరించలేకపోయా. ఇక నేను బతకడంలో అర్ధం లేదని నాకనిపించింది. ఆత్మహత్యకు ప్రయత్నించాను" అని చెప్పారు రత్న.

కానీ రత్న ఇరుగు పొరుగువారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు.

హెచ్ఐవీ పాజిటివ్, మహారాష్ట్ర, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఒంటరి మహిళ, సమాజం, వివక్ష

ఫొటో సోర్స్, WWW.JAMKHED.ORG

ఫొటో క్యాప్షన్, రత్మ(మధ్యలో ఉన్న మహిళ)

కొత్త జీవితం ప్రారంభం

ఆమె భర్త చనిపోయారు. ఆమె బిడ్డ కూడా లేడు. ఒకసారి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ రత్న జీవితంలో ఏం జరగనుందో ఎవరికి తెలుసు?

"ఆ తర్వాత, జామ్‌ఖేడ్‌లోని గ్రామీణ ఆరోగ్య ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక ఆరోగ్య కార్యకర్త నన్ను సంప్రదించారు. ఆమె నన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్ అరోల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన వెంటనే నాకు చికిత్స ప్రారంభించారు" అని తన తదుపరి ప్రయాణం గురించి రత్న వివరించారు.

దీంతో పాటు డాక్టర్ అరోల్ రత్నకు ప్రాజెక్ట్ పొలంలో పని ఇచ్చారు. ఆమె అక్కడ పనిచేయడం ప్రారంభించారు గానీ వ్యాధి, దాని వల్ల సామాజిక సమస్యలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.

"పొలంలో పనిచేసే ఇతర వ్యక్తులు నన్ను దూరంగా ఉంచసాగారు" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

"డాక్టర్ అరోల్‌కి ఈ విషయం తెలియగానే, ఆయన ఒక రోజు పొలానికి వచ్చారు. అందరూ తినడానికి కూర్చున్నారు. డాక్టర్ అరోల్ నన్ను తన ప్లేట్ దగ్గర కూర్చోబెట్టి తినమని చెప్పారు. నాతో కలిసి పనిచేసే వారు షాక్ అయ్యారు"

కలిసి జీవించడం వల్ల ఈ వ్యాధి రాదని అప్పుడు డాక్టర్ అరోల్ ప్రాజెక్ట్‌లోని ఇతరులకు వివరించి చెప్పారు. "ఆ తర్వాత వారందరూ నన్ను వారితో కలుపుకొన్నారు" అని రత్న తెలిపారు.

హెచ్ఐవీ పాజిటివ్, మహారాష్ట్ర, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఒంటరి మహిళ, సమాజం, వివక్ష

ఫొటో సోర్స్, WWW.JAMKHED.ORG

ఫొటో క్యాప్షన్, నిరంతరం పనిచేస్తూ తన బాధలను మర్చిపోయానని రత్న చెప్పారు.

‘నిరంతరం పని ధ్యాసే’

"ఆ తర్వాత నేను పనిలో మునిగిపోయాను. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నాను. నర్సరీలను ఏర్పాటుచేయడం నేర్చుకున్నాను. వానపాముల పెంపకం, కోళ్ల పెంపకం, మేకల పెంపకంలో కూడా శిక్షణ పొందాను. ఈ పనిలో పడి నా బాధలను మర్చిపోయాను" అని తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న విధానం గురించి రత్న వివరించారు.

గ్రామీణ ఆరోగ్య ప్రాజెక్టు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కార్మికురాలిగా చేరిన రత్న ఇప్పుడు ఆ కేంద్రానికి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె వ్యవసాయంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. మేకల పెంపకం, ఆవులు, ఎద్దుల సంరక్షణవంటివి కూడా చేస్తున్నారు.

ఇది మాత్రమే కాదు, వానపాముల పెంపకం గురించి అక్కడకు వచ్చేవారికి తెలియజేయడం, రైతు సమావేశాల్లో వారికి మార్గనిర్దేశం చేయడం కూడా రత్న బాధ్యత. ఆమె అన్ని బాధ్యతలూ నెరవేరుస్తున్నారు.

వ్యవసాయంతో పాటు స్వయం సహాయక సంఘాలలో కూడా రత్న చురుగ్గా పాల్గొంటున్నారు. స్వయం సహాయక సంఘాలను నడిపే మహిళలకు ఆమె మార్గనిర్దేశం చేస్తున్నారు.

రత్నను దూరంగా పెట్టినవారే ఇప్పుడామెను గౌరవంగా చూస్తారు. పెళ్లిళ్లకు లేదా ఇతర కార్యక్రమాలకు ఆమెను పిలుస్తారు.

తరువాత రత్న తన సోదరి కూతురును మూడేళ్ల వయసులో దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి 11వ తరగతి చదువుతోంది.

హెచ్ఐవీ పాజిటివ్, మహారాష్ట్ర, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఒంటరి మహిళ, సమాజం, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెచ్ఐవీ-ఎయిడ్స్ బాధితులను వివక్షతో చూడవద్దని రత్న విజ్ఞప్తిచేశారు.

ఎయిడ్స్‌ బాధితులకు స్ఫూర్తిదాయకం

రత్న తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. "హెచ్ఐవీతో బాధపడుతున్న వ్యక్తులు, వారి బంధువులు నన్ను చూడటానికి వచ్చినప్పుడు, హెచ్ఐవీ ఉన్నప్పటికీ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానని వారికి చెప్తాను. వారు నన్ను నమ్మరు. అప్పుడు నేను వారికి నా వైద్య నివేదికలను చూపిస్తాను"

" హెచ్ఐవీతో బాధపడుతూ తామూ జీవించగలమన్న నమ్మకం అప్పుడు వారు తెచ్చుకుంటారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి, వారి బంధువులకు మనోధైర్యాన్నివ్వడంలో నాకు చాలా సంతృప్తి ఉంది'' అని రత్న తెలిపారు.

రత్న జీవితంలోని కష్టాలను, ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఆమె చేసిన జీవన పోరాటాన్ని అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రభుత్వేతర సంస్థ జీఐసీఏఎం గుర్తించింది.

2017 డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి రత్నను స్విట్జర్లాండ్‌కు ఆహ్వానించారు.

"నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. హెచ్ఐవీ-ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారి విషయంలో సమాజం నిజంగా తన వైఖరిని మార్చుకోవాలి. వారిని ద్వేషించకండి. ఇది క్యాన్సర్, డయాబెటిస్ లాంటి వ్యాధి మాత్రమే" అని రత్న తన ప్రసంగంలో చెప్పారు.

"హెచ్ఐవీ-ఎయిడ్స్‌తో జీవించేవారికి చికిత్స మాత్రమేకాదు.. వారికి ఉపాధి కూడా లభించాలి. వారు తమ కాళ్ళపై తాము నిలబడితే గౌరవంగా జీవించగలరు. ముఖ్యంగా హెచ్ఐవీ-ఎయిడ్స్‌తో జీవించేవారి పిల్లల విషయంలో వివక్ష చూపొద్దు'' అని రత్న చెప్పారు.

(హెచ్ఐవీ పాజిటివ్ అయినప్పటికీ తన గుర్తింపును దాచుకోవాలని రత్నజాదవ్ భావించడం లేదు)

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)