డల్హౌసీ: 48 ఏళ్లకే మరణించిన ఈ గవర్నర్ జనరల్ తన జీవిత కాలంలో చివరి నాలుగేళ్లు ఎందుకు అజ్ఞాతంగా గడిపారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటిష్ వాళ్ల కోణం నుంచి చూస్తే లార్డ్ డల్హౌసీ మూడు ప్రధాన లక్ష్యాలు సాధించారు. ఆయన సాధించిన మూడు లక్ష్యాల్లో మొదటిది బ్రిటిష్ ఇండియా సరిహద్దులను బాగా విస్తరించడం. 1848లో డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ అయ్యారు.
డల్హౌసీ తన 'డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్' విధానం కింద అనేక రాచరిక సంస్థానాలను మోసపూరితంగానో, బలవంతంగానో, బ్రిటిష్ రాజ్‌లో చేర్చి ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది వేశారు.
డల్హౌసీ సాధించిన మరో గొప్ప విజయం భారతదేశమంతటా రైల్వేలు, రోడ్లు, కమ్యూనికేషన్ మార్గాలు, కాలువల నెట్‌వర్క్‌ను నిర్మించడం.
"భారత గవర్నర్ జనరల్ కావడానికి ముందు, డల్హౌసీకి మూడు బాధ్యతలు అప్పగించారు. సరిహద్దుల విస్తరణ, భారతదేశ ఏకీకరణ, భారత ఆర్థిక వనరుల దోపిడీ" అని డల్హౌసీ జీవిత చరిత్ర రచయిత విలియం విల్సన్ హంటర్ రాశారు
"డల్హౌసీ ఈ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు. అయితే భారత ప్రజలవైపు నుంచి చూస్తే ఈ విధానాలు డల్హౌసీని ప్రజలకు దూరం చేశాయి" అని విల్సన్ హంటర్ అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, ALEPH
అందరికన్నా చిన్న వయస్కుడైన గవర్నర్ జనరల్
"డల్హౌసీ వివాదాస్పద గవర్నర్ జనరల్ అన్న పేరు తెచ్చుకున్నారు. డల్హౌసీ చర్యలే 1857 తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను సృష్టించాయని చాలామంది నమ్ముతారు" అని ప్రఖ్యాత చరిత్రకారుడు అమర్ ఫారూకీ తన 'గవర్నర్స్ ఆఫ్ ఎంపైర్' పుస్తకంలో రాశారు.
డల్హౌసీ భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమితులైనప్పుడు ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు. 1812 ఏప్రిల్ 22న జన్మించిన ఆయన, భారత గడ్డపై అడుగు పెట్టిన అతి పిన్న వయస్కుడైన బ్రిటీష్ గవర్నర్ జనరల్.
"బెంగాల్ పాలకునిగా క్లైవ్ నియమితులయ్యేనాటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలే. కానీ, క్లైవ్, డల్హౌసీ మధ్య వ్యత్యాసం ఏంటంటే, డల్హౌసీకి భారత్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం, భారత్ పరిపాలనావిభాగంలో ఎలాంటి అనుభవం లేకపోవడం. డల్హౌసీని భారతదేశంలోని అత్యున్నత స్థానానికి నేరుగా నియమించారు. బ్రిటన్‌లో ఆయన రాజకీయంగా బాగా ఎదుగుతున్న సమయంలో భారత్‌లో పదవికి నియమితులయ్యారు'' అని ఎల్.జె.ట్రోటర్ తన 'లైఫ్ ఆఫ్ ది మార్క్విస్ ఆఫ్ డల్హౌసీ' పుస్తకంలో రాశారు.
ఈ నియామకం కోసం డల్హౌసీ ఎలాంటి లాబీయింగ్ చేయలేదు. నిజానికి, వేగంగా మారుతున్న బ్రిటన్ రాజకీయ దృశ్యంలో ప్రధాన మంత్రి లార్డ్ జాన్ రస్సెల్, కొత్త పొత్తుల కోసం చూస్తున్నారు. డల్హౌసీ స్నేహితులు తన వెంట ఉండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి ఆయన డల్హౌసీకి ఆ పదవిని ఇచ్చారు. డల్హౌసీని తన మంత్రివర్గంలో చేరమని ఆయన గతంలో ఆహ్వానించారు. కానీ ఆ ప్రతిపాదనను డల్హౌసీ తిరస్కరించారు.
డల్హౌసీ బాగా పేరున్న స్కాటిష్ కుటుంబానికి చెందినవారు. రాజభవనంలాంటి డల్హౌసీ కోట, ఎడిన్‌బ్రాకు కొద్ది దూరంలో ఉంది. దీనిని ఇప్పుడు విలాసవంతమైన హోటల్‌గా మార్చారు.
డల్హౌసీ తండ్రి 1808లో ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేశారు. 1828లో ఆయన భారత దేశంలో బ్రిటిష్ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమితులయ్యారు. రాజీనామా చేయడానికి ముందు ఆయన రెండు సంవత్సరాలు ఈ పదవిలో పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
25 వేల పౌండ్ల జీతంతో నియామకం
1847లో గవర్నర్ జనరల్ హార్డింజ్ పదవీకాలం ముగిసినప్పుడు, డల్హౌసీని ఆ పదవికి నియమించాలనే ఉద్దేశ్యాన్ని బ్రిటిష్ ప్రధాన మంత్రి రస్సెల్ వ్యక్తం చేశారు. పరిపాలనా అనుభవం లేని డల్హౌసీని ఆ పదవికి నియమించడం ద్వారా రస్సెల్ ఆ పదవి స్థాయిని తగ్గించే అవకాశం ఉందని ఆ సమయంలో భావించారు.
తన రాజకీయ నిబద్ధతలను మార్చుకొమ్మని అడగకూడదనే షరతుపై డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ పదవిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆయన నియామకంపై ఆగస్టు 1847లో విక్టోరియా రాణి సంతకం చేశారు.
"బ్రిటన్‌లో ఎక్కువ కాలం లేకపోవడం తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని డల్హౌసీకి పూర్తిగా తెలుసు. గవర్నర్ జనరల్ పదవిని డల్హౌసీ అంగీకరించడానికి గల కారణాలలో ఒకటి, ఆయనకు లభించే 25,000 పౌండ్ల వార్షిక జీతం. ఇది తన కుటుంబ ఆర్థిక సమస్యలనన్నింటినీ పరిష్కరిస్తుందని ఆయన భావించారు'' అని అమర్ ఫారూకీ రాశారు.
ఆ వార్షిక జీతం విలువ ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.30లక్షలు.
జనవరి 12, 1848న, లార్డ్ డల్హౌసీ తన భార్య, తన ప్రైవేట్ కార్యదర్శి కోర్ట్‌నీతో కలిసి కలకత్తా నౌకాశ్రయంలో అడుగుపెట్టారు. చురుగ్గా ఉండే డల్హౌసీకి తీక్షణమైన దృష్టి ఉంది.
"ప్రభుత్వ గృహంలో నివసించే ఈ చిన్న వ్యక్తి మొదట భయాన్ని, తరువాత నమ్మకాన్ని, చివరికి అపారమైన గౌరవాన్ని కలిగించుకున్నారు. 35 ఏళ్ల డల్హౌసీ అంతకంటే తక్కువ వయసున్నట్టు కనిపించేవారు. ఆయన నుదురు విశాలంగా ఉంటుంది. స్పష్టమైన, తీయని స్వరం ఉంది" అని విలియం విల్సన్ హంటర్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
డల్హౌసీ చర్యలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయంటే..
డల్హౌసీ ఉదయం ఆరు గంటలకు నిద్రలేచేవారు. ఎనిమిది గంటల వరకు బెడ్‌పై నుంచే ఆఫీసు పనిచేసేవారు.
"ఎనిమిది గంటలకు ఆయన అల్పాహారం తీసుకుంటారు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న భారతీయ వార్తాపత్రికలను చూస్తారు. తొమ్మిదిన్నర గంటలకు తన డెస్క్ వద్దకు వెళ్లి సాయంత్రం ఐదున్నర గంటల వరకు అక్కడే ఉంటారు. భోజనం కూడా ఆఫీస్ డెస్క్ దగ్గరే తినేవారు. ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేసేవారు. ఆయన ఆహారం కొద్దిమొత్తంలోనే తీసుకుంటారు. మద్యం కొద్దిగా సేవిస్తారు. పెద్ద విందులకు హాజరు కావడం ఆయనకు ఇష్టముండదు. కానీ ఆయన ఇచ్చే విందులు విలాసవంతంగా ఉండేవి" అని కెప్టెన్ ట్రోటర్ రాశారు.
డల్హౌసీకి ముందు భారత్ పాలకులుగా ఉన్న బ్రిటీషర్లు, తమతో స్నేహంగా ఉండే భారతీయ రాజులకు చాలా భూమిని తిరిగి ఇచ్చేవారు. కానీ, డల్హౌసీ ఈ విధానంలో సమూలమైన మార్పు చేసి బ్రిటిష్ రాజ్ పరిధిలోకి మరింత భూమి తీసుకువచ్చే పనిని మొదలుపెట్టారు.
"మధ్య భారత్, అవధ్‌లోని కొన్ని రాజ్యాలను బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేసిన విధానం మొత్తం భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దాని పరిణామాలను డల్హౌసీ వారసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్య భారతదేశంలోని రాచరిక రాష్ట్రాల నుంచి అధికారాన్ని లాక్కోవడానికి కారణం వారసులు లేకపోవడం అని చెప్పారు. అయితే పరిపాలన సరిగా లేదంటూ అవధ్ నవాబును సింహాసనం నుంచి తొలగించారు. ఇది తర్వాత్తర్వాత తమకూ ఇలా కావొచ్చన్న భయాన్ని ఇతర భారతీయ రాజులలో కలిగించింది" అని మారెక్ బెన్స్-జోన్స్ తన 'ది వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Constable London
పంజాబ్ స్వాధీనం
భారత్‌లో అధికారం చేపట్టిన ఏడాదిలోపే డల్హౌసీ పంజాబ్‌ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారు. జనవరి 13, 1849న, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం చిలియాంవాలా యుద్ధంలో సిక్కు సైన్యాన్ని ఓడించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న గుజరాత్ యుద్ధంలో విజయం సాధించింది.
మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు దలిప్ సింగ్ బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారని వార్త అందినప్పుడు డల్హౌసీ చాలా సంతోషించారు.
"నేను ఎగిరి గంతులువేస్తున్నాను. ఐదేళ్ల మహారాజా మాతో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం, కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ రాణికి పంపుతారు. మేం లాహోర్ కోటపై బ్రిటిష్ జెండాను ఎగురవేశాం. పంజాబ్‌లోని ప్రతి అంగుళం ఇప్పుడు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం" అని డల్హౌసీ తన స్నేహితుడికి రాసిన లేఖలో సంతోషం వ్యక్తంచేశారు.
"ఒక బ్రిటిష్ ప్రభుత్వ అధికారి 40 లక్షల జనాభాను బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం చేశారు. మొఘల్ చక్రవర్తుల చరిత్రాత్మక వజ్రాన్ని తన రాణికి సమర్పించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. నేను దాన్ని సాధించా. నేను కారణం లేకుండా సంబరాలు జరుపుకుంటున్నానని అనుకోకండి" అని అదే లేఖలో తనను తాను ప్రశంసించుకున్నారు డల్హౌసీ.
ఒప్పందంపై మహారాజా దలిప్ సింగ్ సంతకం చేస్తున్నప్పుడు, డల్హౌసీ ఆయన్ను పంజాబ్ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేఘర్ కోటకు పంపాలని అనుకున్నారు. దలిప్ సింగ్‌ను ఆయన తల్లి జింద్ కౌర్ నుంచి వేరు చేసి ఒక ఆంగ్ల జంట రక్షణలో ఉంచారు.
తరువాత, దలిప్ సింగ్‌ను క్రైస్తవ మతంలోకి మార్చి ఇంగ్లండ్‌కు పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
బర్మా ఆక్రమణ
పంజాబ్ తర్వాత డల్హౌసీకి తదుపరి విజయం బర్మాలో దక్కింది. 1852 ఏప్రిల్‌లో, బ్రిటిష్ దళాలు బర్మాలోని రంగూన్‌పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాయి. రెండు నెలల తర్వాత, బ్రిటిష్ వారు మరో ముఖ్య నగరమైన పెగును స్వాధీనం చేసుకున్నారు. కౌంగ్‌బౌంగ్ రాజ్యం నుంచి స్వాధీనం చేసుకున్న భూమి అంతా బ్రిటిష్ భూభాగంగా మారిపోయింది. దానికి దిగువ బర్మా అని పేరు పెట్టారు.
బర్మా యుద్ధ సమయంలో డల్హౌసీ తన సైన్యం మనోధైర్యాన్ని పెంచడానికి భారీ వర్షాలను లెక్కచేయకుండా కలకత్తా నుంచి బర్మాకు కవాతు చేశారు. ముప్పై సంవత్సరాల తరువాత 1885లో ఉత్తర బర్మాను కూడా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు.
కౌంగ్‌బౌంగ్ రాజవంశం చివరి పాలకుణ్ని అరెస్టుచేసి భారత్‌లోని రత్నగిరికి ప్రవాసం పంపారు. 1916లో ఆయన అక్కడే మరణించారు. సతారా చివరి రాజు మరణించినప్పుడు, కంపెనీ పరిపాలనను చేపట్టి రాజకుటుంబాన్ని ప్రవాసానికి పంపింది.
ఐదు సంవత్సరాల తరువాత, రాజ్ గంగాధర్ రావు మరణించినప్పుడు ఝాన్సీలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఆయనకు పిల్లలు లేరు.
"రాజా గంగాధర్ రావు భార్య రాణి లక్ష్మీబాయికి రూ. 60వేలను పెన్షన్‌గా ఇచ్చింది కంపెనీ. కానీ ఆమెను ఆమె దత్తపుత్రుడితో పాటు కోట నుంచి బయటకు పంపించారు. దీంతో ఆమె ఒక తిరుగుబాటు నేతగా మారారు. అదే విధంగా, చివరి పేష్వా దత్తపుత్రుడు నానా సాహెబ్‌కు కూడా పెన్షన్ ఇవ్వడానికి కంపెనీ నిరాకరించింది. 1857లో ఆయన కాన్పూర్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు" అని జాన్ విల్సన్ తన 'ఇండియా కాంకర్డ్' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన అవధ్
1856లో డల్హౌసీ పదవీకాలం ముగియడానికి కొంతకాలం ముందు, అవధ్‌ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసే పనిని కూడా ఆయన పూర్తి చేశారు.
"షుజాఉద్ధౌలా మరణం తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు, బ్రిటిష్ వారికి అవధ్‌పై పరోక్ష నియంత్రణ ఉంది. దాని స్వయంప్రతిపత్తి దాదాపుగా కనుమరుగైంది. 18వ శతాబ్దం చివరి నాటికి, అవధ్‌లోని ఈస్ట్ ఇండియా కంపెనీ రెసిడెన్సీ సమాంతర శక్తి కేంద్రంగా ఉద్భవించింది. 1770లలో అవధ్ రాజధానిని ఫైజాబాద్ నుంచి లఖ్‌నవూకు మార్చినప్పుడు, నవాబు కంటే శక్తివంతంగా మారారు బ్రిటిష్ రెసిడెంట్. నవాబు మిగిలిన అధికారాన్ని కూడా తీసేయాలని డల్హౌసీ నిర్ణయించుకున్నారు" అని అమర్ ఫారూకీ రాశారు.
రాజ్య పరిపాలనాయంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని జనవరి 1849లో బ్రిటిష్ రెసిడెంట్ స్లీమాన్ రిపోర్టు చేశారు. అవధ్‌ను విలీనం చేసుకోవాలని బ్రిటిష్ క్యాబినెట్, ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు 1855లో నిర్ణయించాయి. ఫిబ్రవరి 1856లో అవధ్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. నవాబ్ వాజిద్ అలీ షాను కలకత్తాకు ప్రవాసం పంపారు. ఇది పూర్తయిన తర్వాత డల్హౌసీ తన విధులను కొత్తగా నియమితులైన గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్‌కు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘2.5 లక్షల చదరపు మైళ్ల భూభాగం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం’
డల్హౌసీని బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అందరిలోకి అత్యంత దూకుడైన వ్యక్తిగా భావిస్తారు. తన పదవీకాలంలో ఆయన దాదాపు 2,50,000 చదరపు మైళ్ల భూభాగాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారు.
"1847లో డల్హౌసీ భారతదేశానికి వచ్చినప్పుడు ఉన్న భారతదేశ పటం, ఆయన తన తర్వాత పాలకుడికి అప్పగించిన పటానికి చాలా వ్యత్యాసం ఉంది. పంజాబ్, సిక్కిం, కఛార్, బర్మాలోని ఒకభాగం, సతారా, సింధ్‌లోని ఒక భాగం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. అదనంగా, అవధ్, సంబల్‌పూర్, జైత్‌పూర్, ఉదయపూర్, ఝాన్సీ, బేరార్, ఖాందేశ్‌లోని ఒకభాగం కూడా వారి చేతికి చిక్కాయి'' అని విలియం విల్సన్ హంటర్ రాశారు.
డల్హౌసీని విస్తరణవాదిగా విమర్శించవచ్చు, కానీ భారతదేశంలో రోడ్లు, రైల్వేలు, కాల్వలు, జలమార్గాలు, టెలిగ్రాఫ్, పోస్టల్ వ్యవస్థ, విద్య, వాణిజ్యం విస్తరణ ఘనతలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
"డల్హౌసీ కాలంలోనే భారతదేశంలో మొదటి రైల్వే నడిచింది. డల్హౌసీ భారతదేశ ప్రజలకు విద్యను అందించారు. నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు. భారతదేశానికి పోస్టల్, టెలిగ్రాఫ్ సేవలను అందించారు. కానీ ఈ విజయాలు సాధించినప్పటికీ అక్కడ ఆయనను ప్రజలు ఇష్టపడలేదు. ఆయన చాలా నిరంకుశుడు, అహంకారి అని చెప్పుకునేవారు. తన కింది అధికారులతో చాలా కఠినంగా ఉండేవారు. కోపం, షార్ట్ టెంపర్‌తో సహోద్యోగులలో ఆయనకు ఆదరణ లేకుండా పోయింది. తన కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ హ్యూ గోఫ్, రాబర్ట్ నేపియర్‌లతో ఘర్షణ పడ్డారు" అని మార్క్ బెన్స్-జోన్స్ రాశారు.

ఫొటో సోర్స్, Constable London
చివరి నాలుగేళ్లు అజ్ఞాత జీవితం
భారతదేశం విడిచి వెళ్లేనాటికి, డల్హౌసీకి తీవ్రమైన కాలి ఎముక వ్యాధి వచ్చింది. పరిపాలనలో తన వారసుడు లార్డ్ కానింగ్ కలకత్తాకు వచ్చినప్పుడు, గవర్నర్ జనరల్ నివాసంలో చేతికర్ర పట్టుకుని డల్హౌసీ ఆయన్ను పలకరించారు.
మార్చి 6, 1856న, డల్హౌసీ కలకత్తా నుంచి తన స్వదేశానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణానికి తన కోసం పంపిన 'కారడోక్' అనే నౌక అస్సలు బాగా లేదంటూ ఆయన చిరాకు పడ్డారు.
కైరో నుంచి తన స్నేహితుడు జార్జ్ కూపర్‌కు లేఖ రాస్తూ, తనను తీసుకెళ్లడానికి కారాడోక్ లాంటి పాత ఓడను పంపడంలో ప్రభుత్వం చూపిన ఉదాసీనతపై తన కోపాన్ని వ్యక్తం చేశారు.
"నేను భారతదేశం నుంచి బయలుదేరే ముందు తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు లేదా ప్రభుత్వం నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక్కమాట కూడా చెప్పలేదు" అని కూడా ఆయన అన్నారు.
కూపర్ గతంలో డల్హౌసీ తండ్రికి ఏడీసీగా పని చేశారు. ఆయనకంటే 26 సంవత్సరాలు సీనియర్. లండన్ చేరుకున్న తర్వాత, ప్రభుత్వం తనకు ఐదు వేల పౌండ్ల వార్షిక పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించిందనే వార్త విన్నప్పుడు డల్హౌసీ కాస్త కుదుటపడ్డారు.
డల్హౌసీ తన జీవితంలోని చివరి నాలుగు సంవత్సరాలు రాజకీయంగా అజ్ఞాతంలో గడిపారు.
"గవర్నర్ జనరల్‌గా, డల్హౌసీ భారతదేశాన్ని క్రమపద్ధతిగా పరిపాలించారు. ఈ విధానం ఆయన్ను విస్తరణవాదిగా మార్చింది. డల్హౌసీకి తన పనిలో తాను మునిగిపోయే అలవాటు కూడా ఉంది. భారతదేశ పరిపాలకునిగా రోజుకు ఎక్కువ గంటలు పనిచేయడం ఆయన శరీరాన్ని అలసిపోయేలా చేసింది. ఇది ఆయన అకాల మరణానికి కారణం కావచ్చు'' అని అమర్ ఫారూకీ రాశారు
డల్హౌసీ డిసెంబరు 1860లో కేవలం 48 సంవత్సరాల వయసులో మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














