మహారాజా దలిప్ సింగ్: క్వీన్ విక్టోరియా‌కు క్లోజ్‌ఫ్రెండ్ స్థాయి నుంచి పేదరికంలో మరణించేదాకా..

పంజాబ్, సిక్కు సామ్రాజ్యం, దలిప్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, కుర్చీలు, బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images, olympiaauctions.com

    • రచయిత, అలైస్ కనింగ్‌హమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సిక్కు రాజ్యానికి చివరి సిక్కు పాలకుడిగా చెప్పే దలిప్ సింగ్‌కు చెందిన 19వ శతాబ్దం నాటి రెండు కుర్చీలను ఇటీవల వేలం వేశారు.

ఈ రెండు కుర్చీలు 8,000 పౌండ్లకు (దాదాపు రూ. 9.45 లక్షల)కు అమ్ముడుపోయాయని ఒలింపియా ఆక్షన్స్ సంస్థ తెలిపింది.

దలిప్ సింగ్ (1838-1893)కు ఐదేళ్ల వయసులో సిక్కు మహారాజా బిరుదు ఇచ్చారు. కానీ 1849లో బ్రిటిష్ వాళ్లు సిక్కు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నతర్వాత దలిప్ సింగ్‌ను సఫెక్-నార్ఫోక్ సరిహద్దుల్లోని ఎల్వెడెన్ హాల్‌కు ప్రవాసం వెళ్లారు.

వేలం వేసిన రెండు కుర్చీలు దలిప్ సింగ్ సంపదలో భాగం.

ఈ కుర్చీలపై ప్రజల్లో చాలా ఆసక్తి ఉందని ఒలింపియా ఆక్షన్స్ నిపుణులు నికోలస్ షా వేలానికి ముందు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పంజాబ్, సిక్కు సామ్రాజ్యం, దలిప్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, కుర్చీలు, బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాజా దలిప్ సింగ్ చిత్రం

మహారాజా రంజిత్ సింగ్ చిన్న కుమారుడు

1799లో పంజాబ్‌లో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ చిన్న కుమారుడే దలిప్ సింగ్.

15 ఏళ్ల వయసులో ప్రవాసిగా ఇంగ్లండ్ వెళ్లారు దలిప్ సింగ్.

ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో ఆయన క్వీన్ విక్టోరియాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు.

1863లో ఆయన ఎల్వెడెన్ ఎస్టేట్ కొన్నారు. 55 ఏళ్ల వయసులో 1893లో దలిప్ సింగ్ మరణించిన తర్వాత ఎడ్వర్డ్ సెసిల్ గిన్నిస్ అనే వ్యక్తి ఆ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు.

వేలం వేసిన రెండు కుర్చీలను 1850 ప్రాంతంలో నాటి బొంబాయిలో తయారుచేశారు. దలిప్ సింగ్ ఎస్టేట్‌ను ఎడ్వర్డ్ గిన్నిస్ కొన్న తర్వాత రెండు కుర్చీలు అక్కడే ఉండిపోయాయి. అంటే అవి ఎడ్వర్డ్ ఆస్తిలో భాగమయ్యాయి.

ఈ కుర్చీలను డార్క్ బాంబే బ్లాక్‌వుడ్‌తో భారతీయ, యూరప్ కళానైపుణ్యాల కలయికగా రూపొందించారని ఒలింపియా ఆక్షన్స్ తెలిపింది.

మహారాజా దలిప్ సింగ్ కళాభిరుచికి ఈ కుర్చీలు అద్దం పడతాయని, అలాగే భారతీయ సంస్కృతిని, ఇంగ్లీష్ సమాజం ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయని నికోలస్ షా చెప్పారు.

పంజాబ్, సిక్కు సామ్రాజ్యం, దలిప్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, కుర్చీలు, బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, olympiaauctions.com

ఫొటో క్యాప్షన్, 40 ఏళ్ల తర్వాత మరోసారి ఈ కుర్చీలను వేలం వేశారు.

ఈ కుర్చీల ప్రత్యేకత

ఎల్వెడెన్ ఎస్టేట్ నుంచి తరలించిన తర్వాత 40 ఏళ్లకు పైగా కాలంలో ఈ కుర్చీలను వేలం వేయడం ఇదే మొదటిసారి.

ఈ కుర్చీలను తయారుచేసిన ''బాంబే బ్లాక్‌వుడ్'' పదాన్ని 1840ల నుంచి తయారుచేస్తున్న విక్టోరియా మోడళ్ల గురించి వర్ణించి చెప్పడానికి ఉపయోగిస్తారు.

ఈ కుర్చీల కోసం ఉపయోగించిన బ్లాక్‌వుడ్ చెక్కను మలబార్ తీర ప్రాంతం నుంచి బాంబేలోని మీడో వీధి, దాని చుట్టుపక్కలున్న చెక్క ఫ్యాక్టరీలకు తరలించేవారు.

ఈ ఫర్నీచర్ ప్రధానంగా రోకోకో రివైవల్ శైలిలో ఉంటుంది. 18వ శతాబ్దపు ఫ్రెంచ్ రాజు 15వ లూయిస్ కాలంనాటి ఫర్నీచర్‌తో ప్రేరణ పొందిన చిత్రాలు ఇందులో ఉంటాయి.

రెండు కుర్చీలను ఎల్వెడెన్ ఎస్టేట్‌లో భాగంగా ఎర్ల్ ఆఫ్ ఇవేగ్ తరఫున 1984లో ఆక్షన్ సంస్థ క్రిస్టీస్ అమ్మింది.

ఆ అమ్మకంలో భాగమైన భారతీయ ఫర్నీచర్‌లో ఈ కుర్చీలు కూడా ఉన్నాయి.

దలిప్ సింగ్ మరణం తర్వాత ఆ ఇంట్లో మిగిలిన కొన్ని వస్తువుల్లో ఈ కుర్చీలు ఒకటని భావిస్తారు.

పంజాబ్, సిక్కు సామ్రాజ్యం, దలిప్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, కుర్చీలు, బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, BRITISH LIBRARY

ఫొటో క్యాప్షన్, ఐదేళ్ల వయసులో దలిప్ సింగ్‌ను రాజుగా ప్రకటించారు.

సిక్కు సామ్రాజ్యపు చివరి మహారాజు

మహారాజా రంజిత్‌ సింగ్‌కు దలిప్ సింగ్ 1838లో జన్మించారు.

ఆయన పుట్టిన ఏడాది తర్వాత తండ్రి మరణించడం పంజాబ్‌లో అంతర్యుద్ధానికి, అశాంతికి దారితీసింది.

ఐదేళ్ల వయసులో దలిప్ సింగ్‌ను షేర్-ఎ-పంజాబ్ సింహాసనంపై కూర్చుండబెట్టారు. వాస్తవానికి పాలనాధికారం ఆయన తల్లి, మేనమామ చేతుల్లో ఉండేది.

అంతర్యుద్ధం తగ్గే సూచన కనిపించకపోగా, మరింత ఉధృతమయింది. సిక్కులకు, బ్రిటిషర్లకు మధ్య రెండో యుద్ధం మొదలయిన తర్వాత అది తీవ్రస్థాయికి చేరింది.

పంజాబ్‌ను ఆక్రమించుకునేందుకు బ్రిటిషర్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు.

1849లో పంజాబ్‌ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశారు. మహారాజా దలిప్ సింగ్‌ను సింహాసనం నుంచి తొలగించారు.

అలా సిక్కు సామ్రాజ్యపు చివరి మహారాజు ఆయనకు పేరొచ్చింది. తల్లి జింద్ కౌర్ జైలులో ఉండడంతో తల్లి ప్రేమకు కూడా దలిప్ సింగ్ దూరమయ్యారు.

1854 మేలో ఆయన్ను ఇంగ్లండ్ తీసుకొచ్చి క్వీన్ విక్టోరియాకు పరిచయం చేశారు. తొలి చూపు నుంచే ఆమె దలిప్ సింగ్‌ను ఇష్టపడ్డారు.

నెమ్మదిగా ఆయన మహారాణికి దగ్గరి స్నేహితుడయ్యారు. పదవితో పాటు గౌరవం పొందారు.

వ్యక్తిగత జీవితంలో ఆయన బ్రిటిష్ బూర్జువా ప్రభువు అయితే, ప్రజాజీవితంలో భారతీయ యువరాజు అన్నట్టుగానే తనను తాను చూపించుకున్నారు.

ఇంగ్లండ్‌లో ఆయన్ను నల్లని రాకుమారుడు (బ్లాక్ ప్రిన్స్) అని పిలిచేవారు.

1861లో అంటే తల్లి నుంచి విడిపోయిన 13 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి తన మాతృమూర్తిని కలుసుకున్నారు. అప్పటికే ఆమె వయసు మళ్లారు. కొడుకుతో కలిసి జింద్ కౌర్ రెండు సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఉన్నారు.

అంతకుముందు తల్లీకొడుకులు ఒకరికొకరు ఉత్తరాలు కూడా రాసుకునేవారు. వాటిలో రెండు ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి.

రెండేళ్ల తర్వాత జింద్ కౌర్ చనిపోయారు.

బాంబా ముల్లర్‌ అనే మహిళను దలిప్ సింగ్ పెళ్లిచేసుకున్నారు. ఆమె ఈజిప్టులోని కైరోలో పుట్టారు. ఆమె క్రైస్తవాన్ని ఎంతగానో నమ్మేవారు. దలిప్ సింగ్, బాంబాలకు ఆరుగురు పిల్లలు. వాళ్లిద్దరూ సఫోక్‌లోని మారుమూల ప్రాంతమైన ఎల్వెడెన్ ఎస్టేట్‌కు వెళ్లిపోయారు.

పంజాబ్, సిక్కు సామ్రాజ్యం, దలిప్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, కుర్చీలు, బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, BRITISH LIBRARY

ఫొటో క్యాప్షన్, దలిప్ సింగ్, ఆయన తల్లి రాసుకున్న ఉత్తరాలు కొన్ని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి.

పారిస్‌లో మరణం

1870లలో దలిప్ సింగ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఆరుగురు పిల్లల పెంపకానికి ఆయన చాలా కష్టపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌పై ఆధారపడి జీవించడం ఆయనకు కష్టంగా ఉండేది. అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

భారత్‌లోని తమ భూమిని, ఆస్తులను ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్‌ను బలవంతంగా విలీనం చేసుకున్నారని కూడా ఆరోపించారు.

తమ భూమికి బదులుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత ప్రభుత్వానికి ఆయన అనేక లేఖలు రాశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది.

1886 మార్చి చివరిలో ఆయన తన జీవితంలోనే అత్యంత ధైర్యవంతమైన అడుగువేశారు. కుటుంబంతో కలిసి భారత్‌కు బయలుదేరారు. సిక్కు రాజ్యాన్ని మళ్లీ స్థాపించి, తన భూమి వాటాను తిరిగి పొందుతానని బ్రిటిష్ ప్రభుత్వంతో చెప్పారు.

తిరుగుబాటును అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. దలిస్ సింగ్ ప్రయాణిస్తున్న ఓడ ఏడెన్ చేరుకోగానే ఆయన్ను నిర్బంధించింది.

తర్వాత ఆయనను గృహ నిర్బంధంలో ఉంచగా, ఆయన కుటుంబం తిరిగి బ్రిటన్ వెళ్లింది.

దలిప్ సింగ్ తన చివరి రోజుల వరకూ బ్రిటిష్ గూఢాచారుల నిఘాలో జీవించాల్సివచ్చింది.

పంజాబ్ చివరి మహారాజుగా చెప్పే దలిప్ సింగ్, 1893 అక్టోబరులో మరణించారు. అప్పుడు ఆయన వయసు 55 ఏళ్లు. పారిస్‌లో కడుపేదరికంలో చివరి శ్వాస విడిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)