నాసిక్ కుంభమేళా కోసం 1,800 చెట్లు నరికేస్తున్నారా? అసలు విషయమేంటి?

నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ ఠాక్రే
    • హోదా, బీబీసీ కోసం

"గతంలో చెట్లను నరకడానికి ఇలా గుర్తులు వేసేవారు, ఇప్పుడు వాటిని లెక్కించడానికి గుర్తులు వేస్తున్నామని చెబుతున్నారు. చెట్లను నరకమని సాధువులు చెప్పలేదు."

"చెట్లను నరకడం ఏ ఆధ్యాత్మిక వ్యక్తికీ ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని చెట్లను నరికివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి."

'కుంభమేళా వంటి ఏదైనా మతపరమైన కార్యక్రమం సారాంశం ప్రకృతితో మమేకమవడం. మరి ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం ద్వారా ఇదంతా చేస్తుంటే, సాధువులు ఇక్కడ ఎలా ఉండగలరు?'

ఇవి నాసిక్ పర్యావరణ కార్యకర్తల ఆందోళనలు.

తపోవన్ ప్రాంతంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా వారు నిరసన తెలుపుతున్నారు.

కుంభమేళా సమయంలో సాధువులు, మహంత్‌ల కోసం నాసిక్‌లో నిర్మిస్తున్న సాధుగ్రామం కోసం ఈ చెట్లను నరికివేస్తారని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్
ఫొటో క్యాప్షన్, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా తపోవన్ ప్రాంతంలో పర్యావరణ వేత్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

అసలు విషయమేంటి?

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా జరిగిన దాదాపు ఏడాదిన్నర తర్వాత, 2026 అక్టోబర్‌లో నాసిక్‌లో సింహస్థ కుంభమేళా జరగనుంది. ప్రస్తుతం దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కుంభమేళా సమయంలో సాధువులు, మహంత్‌ల నివాసం కోసం తపోవన్‌లో ఒక సాధుగ్రామం ఏర్పాటు చేస్తారు. రాబోయే కుంభమేళా కోసం సుమారు 1,150 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి సాధుగ్రామాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.

తపోవన్‌లో మున్సిపల్ కార్పొరేషన్‌కు దాదాపు 54 ఎకరాల భూమి ఉంది. అక్కడున్న వివిధ జాతులకు చెందిన సుమారు 1,700 చెట్లను తిరిగి నాటడానికి సంబంధించి అభ్యంతరాలు, సూచనలను కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు జారీ చేసింది.

దీని గడువు మంగళవారం (నవంబర్ 18)తో ముగిసింది.

బాగా పెరిగిన చెట్లు, నీడ ఎక్కువనిచ్చే చెట్లు, పర్యావరణపరంగా ముఖ్యమైన చెట్లకు పసుపు రంగు మార్క్‌లు వేశారు.

చాలా చెట్లు బాగా పాతవని, అవి పెద్దవిగా, బాగా విస్తరించి ఉన్నాయని వాటిని పురాతన చెట్లుగా నమోదు చేయవచ్చని పర్యావరణవేత్తలు అంటున్నారు.

పర్యావరణం దృష్ట్యా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక కోణంలోనూ అలాంటి చెట్లను నరికివేయడం తప్పుడు నిర్ణయం అవుతుందని వారు అంటున్నారు.

నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్
ఫొటో క్యాప్షన్, పర్యావరణవేత్తలు భారతీ జాధవ్, రోహన్ దేశ్‌పాండే

పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత

ఈ స్థలంలో దాదాపు 1,800 చెట్లను నరికివేయాల్సి ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు జారీ చేసినట్టు కథనాలు వచ్చాయి.

"ఇక్కడ గతంలో నరికివేయడానికి చెట్లను మార్క్ చేసేవారు. ఇప్పుడు వారు చెట్లను లెక్కించడానికి వాటిపై గుర్తులు వేస్తున్నామని చెబుతున్నారు. పర్యావరణానికి ఈ చెట్లు చాలా అవసరం" అని పర్యావరణవేత్త భారతీ జాధవ్ అన్నారు.

"ఇక్కడికి అనేక రకాల పక్షులు, జంతువులు వస్తుంటాయి. ఇది నాసిక్‌లో పచ్చదనం ఉండే ప్రాంతం. నిజానికి రుషులు చెట్లను నరికివేయమని అడగలేదు. రుషులు అడవికి వెళ్లి తపస్సు చేస్తారు. ఈ చెట్లను నరికివేయకుండానే కుంభమేళాకు సన్నాహాలు చేయవచ్చు" అని ఆమె అన్నారు.

పర్యావరణవేత్త రోహన్ దేశ్‌పాండే కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

"కుంభమేళా వంటి ఏ మతపరమైన కార్యక్రమానికైనా ప్రధాన అంశం ప్రకృతి. మీరు ప్రకృతిని నాశనం చేయడం ద్వారా ఇవన్నీ చేస్తుంటే, సాధువులు ఇక్కడ కూర్చోవడానికి ఎలా అంగీకరిస్తారు? కుంభమేళా జరిగేది కొన్నిరోజులే. కానీ ఈ చెట్ల కారణంగా, ఇక్కడ జీవవైవిధ్యం అనేక తరాలు ఉంటుంది" అని రోహన్ దేశ్‌పాండే అన్నారు.

నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్

ఫొటో సోర్స్, Sayaji Shinde

ఫొటో క్యాప్షన్, చెట్లను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని సయాజీ షిందే అన్నారు.

పర్యావరణ కార్యకర్తలకు సయాజీ శిందె మద్దతు

సినీ నటుడు, 'సహ్యాద్రి దేవరాయ' సంస్థ అధిపతి సయాజీ శిందె కూడా దీనిని తీవ్రంగా విమర్శించారు.

"నాసిక్ నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను అక్కడికి వెళ్లలేను. కానీ, అక్కడ లక్షలాది మంది అటవీ ప్రేమికులు అలాంటి చెట్ల కోసం పోరాడుతున్నారు. అలాంటి ఉద్యమాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను" అని సయాజీ శిందె ఓ టీవీ చానల్‌తో అన్నారు.

"నేను అక్కడి పర్యావరణ ప్రేమికులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా. ఒక చెట్టును నరికితే పది మొక్కలు నాటుతామని వారు చెబుతున్నారు" అని ఆయన అన్నారు.

నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్
ఫొటో క్యాప్షన్, సాధుగ్రామం ఏర్పాటు చేయడం తప్పనిసరని రాష్ట్ర మంత్రి అన్నారు.

మంత్రి గిరీశ్ మహాజన్ ఏమన్నారు?

రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కూడా ఆ స్థలాన్ని సందర్శించి పర్యావరణవేత్తలతో మాట్లాడారు.

"నాసిక్‌లో పర్యావరణ ప్రేమికులు చెబుతున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. అయితే, 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ కుంభమేళా నిర్వహిస్తున్నారు. ప్రపంచం దృష్టి ఈ కుంభమేళాపై ఉంది. ఈసారి జనసమూహం మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. పంచవటిలోని ఈ ప్రదేశం సాధుగ్రామానికి కేటాయించారు. ఇది వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం" అని ఆయన అన్నారు.

"కుంభమేళాకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. వాటిని తొలగించకుండా సాధువుల కోసం ఏర్పాట్లు సాధ్యం కాదు" అని ఆయన అంటున్నారు.

"ఒక చెట్టుకు బదులుగా 10 చెట్లను నాటుతాం. దీనికి మేం బాధ్యత తీసుకున్నాం. కానీ అందరి వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే, ఇక్కడ సాధుగ్రామం ఏర్పాటు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు" అని ఆయన అన్నారు.

నాసిక్, కుంభమేళా, చెట్లు, పర్యావరణం, తపోవన్
ఫొటో క్యాప్షన్, 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చెట్లనే తొలగిస్తామని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వివరణ

దీనిపై వివరణ ఇస్తూ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కరిష్మా నాయర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"సాధుగ్రామంలో మునిసిపాలిటీ చెట్ల సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 1,825 చెట్లను గుర్తించారు. ఈ సమయంలో చెట్ల నరికివేత వార్తలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి" అని అందులో పేర్కొన్నారు.

"మొదట, చెట్ల సర్వే నిర్వహించిన తర్వాత, నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న చెట్లను మాత్రమే నరికివేస్తారు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చెట్లనే నరికేస్తారు. అలాగే, చిన్నచిన్న పొదలను కూడా నరికివేస్తారు.

పాత చెట్లను సంరక్షిస్తాం. అలాగే 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చెట్లను నరికివేసినట్లయితే.. నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల విభాగం ద్వారా అంతే సంఖ్యలో చెట్లను నాటుతాం.

ఉదాహరణకు, 7 సంవత్సరాల చెట్టును నరికివేస్తే 7 కొత్త చెట్లను నాటుతాం'' అని తెలిపారు.

అయితే, ఈ వివరణపై కూడా పౌరులు ప్రశ్నలు లేవనెత్తారు. అనేక పాత చెట్లకు కూడా గుర్తులు ఉన్నాయని వారు అంటున్నారు. మరి దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)