"ఎయిడ్స్ ఇక లేదనుకుని.. కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నా", హెచ్ఐవీ బారిన పడిన యువకుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నానికి చెందిన రాజుకి (పేరు మార్చాం) హెచ్ఐవీ ఉన్నట్లు నెల రోజుల కిందట తేలింది. 27 ఏళ్ల రాజు ప్రైవేటు ఉద్యోగి.
"నాకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఎయిడ్స్‌పై ప్రచార కార్యక్రమాలు పెద్దగా కనిపించకపోవడంతో ఆ వ్యాధి లేదని అని నేను అనుకున్నాను. కొన్నిసార్లు కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్న మాట వాస్తవమే" అని రాజు బీబీసీతో చెప్పారు.
హెచ్ఐవీ బాధితుల్లో 91శాతం మంది సురక్షితం కాని సెక్స్ కారణంగానే దీని బారిన పడుతున్నారు. వారిలో 90 శాతం మంది వయసు 15-49 మధ్య ఉంటుందని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెబుతోంది.
ఎయిడ్స్ వ్యాధి లేదని అనుకోవడం వల్ల కండోమ్ వాడకుండా, సురక్షిత మార్గాలు పాటించకుండా సెక్స్ లో పాల్గొనడంతో ఎయిడ్స్ బారిన పడుతున్నారని మూడు దశాబ్దాలకు పైగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ సభ్యులు, విశాఖకి చెందిన వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యరావు బీబీసీతో అన్నారు.
ఎయిడ్స్ రావడానికి గల కారణాలపై ఆయన చేసిన రీసర్చ్ ఒక బ్రిటీష్ జర్నల్‌లో ప్రచురితమైంది.


"గతంతో హెచ్ఐవీపై చర్చకు దారి తీసిన 'పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా?' అనే స్లోగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ఫేమస్. ఇప్పుడు ఆ తరహా ప్రచారం ఎక్కువగా కనిపించడం లేదనే మాటలో వాస్తవం ఉన్నప్పటికీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ జరుగుతున్న ప్రచారం ఎక్కువగానే ఉంది. అయితే దాని తీరు మారింది" అని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు బీబీసీతో చెప్పారు.
అసలు ఒకప్పుడు ఎయిడ్స్ అవగాహన ప్రచారంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని ఊపేసిన 'పులి రాజా' ఇప్పుడు ఎక్కడున్నాడు?
అధికారులు చెప్తున్న కొత్త తరహా ప్రచారం ఎలా సాగుతోంది?
ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి లేదనే భావన కొందరిలో ఎందుకు కలుగుతోంది? ప్రజల్లో ఇప్పటికీ ఎయిడ్స్ అంటే అదే భయం ఉందా?

ఫొటో సోర్స్, ANDHRA PRADSH STATE AIDS CONTROL SOCIETY
హెచ్ఐవీ, ఎయిడ్స్ రెండూ ఒక్కటేనా....?
ఈ రెండూ ఒక్కటి కాదు.
హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫియన్సీ వైరస్( Human Immunodeficiency Virus).
ఇది ఒక వైరస్. రక్త మార్పిడి, రక్షణ లేని సెక్స్, ఇంజెక్షన్లు పంచుకోవడం వంటివి వల్ల ఈ వైరస్ శరీరంలోకి వస్తుంది.
ఈ వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత రోగ నిరోధక శక్తిని క్రమంగా బలహీనపరుస్తుంది. హెచ్ఐవీ ఉన్నవారిని హెచ్ఐవీ పాజిటివ్ అంటారు.
ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్( Acquired Immuno Deficiency Syndrome).
ఇది వైరస్ కాదు. శరీరంలో రోగ నిరోధక శక్తికి బాగా నష్టం జరిగినప్పుడు వచ్చే దశ.
అంటే ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ వల్ల వచ్చే చివరి స్టేజ్ అని అర్థం.

ఫొటో సోర్స్, ANDHRA PRADSH STATE AIDS CONTROL SOCIETY
'పులిరాజా' ఎక్కడున్నాడు?
ఒకప్పుడు 'పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?' అనే ప్రచారం ఊరువాడా హోరెత్తింది. ఎయిడ్స్/హెచ్ఐవీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో పులిరాజా ప్రచారం సఫలమయింది.
అయితే బర్డ్ ప్లూ, ఎబోలా, స్వైన్ ఫ్లూ, జికా వంటి వైరస్‌లతో పాటు కరోనా వచ్చే సమయానికి క్రమంగా ఎయిడ్స్ పై ప్రచారం తగ్గిందనే చెప్పాలి.
పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? వంటి సూపర్ హిట్టైన ప్రచారం ఎయిడ్స్‌పై ఇప్పుడు కనిపించడం లేదు.
ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధిగ్రస్థుల సంఖ్య కూడా కొంతకాలంగా తగ్గుతోంది. కానీ ఇప్పటీకి పూర్తిగా తగ్గలేదు. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీతో జీవిస్తున్నవారు 4.8 కోట్ల మంది ఉండగా, భారత్‌లో 25.44 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల మంది ఉన్నారని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చెబుతోంది.
ప్రస్తుతం ఎయిడ్స్ కేసుల నమోదు ఎలా ఉంది? అనే విషయం తెలుసుకునేందుకు విశాఖ కేజీహెచ్‌లో నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్‌కు (యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ సెంటర్- హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు జీవితాంతం మందులు అందించే ఆరోగ్య కేంద్రం) బీబీసీ వెళ్లింది.
అక్కడి అధికారులు, హెచ్ఐవీ రోగులతో మాట్లాడింది.
"యాంటీ రెట్రో వైరల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఇది ఆశాజనకమైన పరిణామమే. కానీ, దేశం నుంచి ఎయిడ్స్ పూర్తిగా పోలేదనేది వాస్తవం. విశాఖ కేజీహెచ్ ఏఆర్టీ సెంటర్లో నెలకు సగటున 50 నుంచి 60 కేసులు వస్తున్నాయి" అని కేజీహెచ్‌లోని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సురేంద్ర బీబీసీకి చెప్పారు.
ఏఆర్టీ మందులు అందుతున్నాయా?
విశాఖలోని రాజుకు హెచ్ఐవీ సోకినట్లు తేలడంతో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన, ప్రచారం, మందుల పంపిణీ ఎలా జరుగుతుంది అనే విషయాలను బీబీసీ పరిశీలించింది.
అందులో భాగంగా ఏఆర్టీసీ సెంటర్లను సందర్శించడంతో పాటు ఎయిడ్స్ వ్యాధి నిపుణులు, విశాఖ జిల్లాలోని ఆంధప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీఎస్ఏసీఎస్) అధికారులతో మాట్లాడింది.
ఏఆర్టీ సెంటర్‌లో మందుల కోసం వచ్చిన ఒక పురుషుడు, మరో ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో బీబీసీ మాట్లాడినప్పుడు "మందులు ప్రతి నెల ఇస్తున్నారు. అవసరమని అడిగితే రెండు నెలల మందులు ఒకేసారి ఇస్తున్నారు. మందుల కొరత ఎప్పుడూ రాలేదు" అని చెప్పారు.
విశాఖపట్నం జిల్లాలో హెచ్ఐవీ పాజిటివిటీ లెక్కలు చూస్తే 2022-23లో 1,04,823 పరీక్షలు జరగ్గా 927 మంది పాజిటివ్ (0.88%), 2023-24లో 78,556 పరీక్షలు జరగ్గా 827 మంది (1.05%), 2024-25లో 97,679 పరీక్షలు జరగ్గా 754 మంది (0.77%), 2025-26లో (అక్టోబర్ వరకు) 64,991 పరీక్షల్లో 431 (0.66%) మందికి హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధరణ జరిగింది.
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందించిన సమాచారం ప్రకారం విశాఖ జిల్లాలో 2025 అక్టోబర్ వరకు యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ వాడుతున్న వారిలో 5318 పురుషులు, 5687 మహిళలతో పాటు, 67 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఉన్నారు.
జిల్లాలో హెచ్ఐవీ సోకిన వారిలో 369 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 11,441 మంది హెచ్ఐవీ పాజిటివ్స్ ఉన్నారు.

ఆందోళన కలిగించే అంశం: ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
1988 నుంచి ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది థీమ్ "హెచ్ఐవీ పరీక్ష చేయించుకోండి, సమాచారం తెలుసుకోండి, సురక్షితంగా ఉండండి"
ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులు, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనే గ్రామ, పట్టణ స్థాయి గ్రూపులు కలిసి ఎయిడ్స్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను ఎయిడ్స్ డే రోజున నిర్వహిస్తుంటారు.
అయితే ఇటీవల నిధులు తగ్గడంతోపాటు, ఇంతకు ముందు సివిల్ సొసైటీ ద్వారా క్షేత్రస్థాయిలో బాగా పని చేసిన కమ్యూనిటీ గ్రూపులు, ఎన్జీవోలు, వలంటరీలు ఇప్పుడు అంతగా అందుబాటులో ఉండటం లేదు.
ఈ పరిస్థితుల్లో కమ్యూనిటీలు మరింత బలోపేతమై ఎయిడ్స్ వ్యాధిపై పని చేయాల్సిన అవసరం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు బీబీసీతో చెప్పారు.

హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రచారానికి నిధులు తగ్గాయా?
భారతదేశంలో జరుగుతున్న ఎయిడ్స్ వ్యాధి అవగాహన, నియంత్రణ కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల మద్దతు విరాళాల రూపంలో లభిస్తోంది.
వాటిలో ప్రధానంగా గ్లోబల్ ఫండ్, యూఎన్ ఎయిడ్స్, యూనిసెఫ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఎల్టన్ జాన్ ఎయిడ్స్ ఫౌండేషన్, క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనీషియేటివ్, వరల్డ్ బ్యాంక్, యూఎస్ ఎయిడ్ కేర్ ఇండియా, పీఏటీహెచ్ ఇండియా వంటి సంస్థలున్నాయి.
హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు తగ్గడం, వీటి నుంచి ప్రజల దృష్టి మరలడంతో పాటు ఇతర అనేక వైరస్‌ల వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో ఎయిడ్స్‌కి ఇచ్చే విరాళాలు తగ్గించేశాయనే విషయం స్పష్టమవుతోందని, ఇది భారతదేశానికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు చెప్పారు.
ఉదాహరణకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (BMGF) భారతదేశంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన, పరిశోధన కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన అతిపెద్ద సంస్థల్లో ఒకటి.
ఎయిడ్స్ వ్యాధి అవగాహన, నియంత్రణ కోసం భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్ Avahan పేరుతో అతి పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి 2003–2015 కోసం గేట్స్ ఫౌండేషన్ సుమారు రూ. 3,300-3,500 కోట్లు ఖర్చు చేసింది.
కానీ 2013లో Avahan ప్రోగ్రామ్‌కు నిధులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కాలంలో ఈ నిధులు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు BMGF భారతదేశంలో ప్రధానంగా మాత, శిశు ఆరోగ్యం, పోషణ, టీకాలు, శుభ్రత, వ్యవసాయం వంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది.
ఎయిడ్స్ వ్యాధి అవగాహన, నియంత్రణ వంటి అంశాలపై గతంలో వచ్చిన నిధులతో పోల్చుకుంటే ఇప్పుడు వాటి శాతం తగ్గిందంటున్నారు.

'పులిరాజా'కు రూపం మారిందా?
మరో వైపు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ (1 ఏప్రిల్ 2021 నుండి 31 మార్చ్ 2026 వరకు) ఫేజ్-V కోసం రూ. 15,471.94 కోట్ల మొత్తం కేటాయించింది భారత ఆరోగ్యశాఖ.
"ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎయిడ్స్‌పై చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రచారం కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు ఉండదు. కాబట్టి, ఎన్ని నిధులు ప్రచారానికి కేటాయించారనేది చెప్పలేం. అయితే ప్రచారం జరుగుతోంది. గతంలో లాగా 'పులిరాజా' ఫ్లెక్సీలు, జానపద కళాకారుల కార్యక్రమాలు వంటివి తగ్గినా, కాలేజీల్లో, డిజిటల్ మీడియాలో ఎయిడ్స్ వ్యాధిపై అనేక మార్గాల్లో ప్రచారం జరుగుతోంది" అని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిధుల కొరతపై ఆందోళన
వచ్చే ఏడాది జూలైలో బ్రెజిల్‌లో నిర్వహించే ఎయిడ్స్-2026లో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలకు నిధుల కొరతపైనా ప్రధానంగా చర్చించాలని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ ఇప్పటికే ప్రకటించిందని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు చెప్పారు.
‘‘ఈ వేదిక నుంచి శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్స్, ఆరోగ్య నిపుణులు, నిధులు అందించే సంస్థలు, మీడియా కూడా ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలి" అని అంతర్జాతీయ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ 2026 కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














