ట్రంప్ చెబుతున్న 'థర్డ్‌‌ వరల్డ్ కంట్రీస్' అంటే ఏంటి? భారత్ కూడా అందులో భాగమేనా?

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

వాషింగ్టన్‌లో, వైట్ హౌస్ సమీపంలో బుధవారం(నవంబరు 26) జరిగిన దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓ పకటన చేశారు. మూడో ప్రపంచ దేశాలకు చెందిన పౌరులు అమెరికా రాకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తానని అన్నారు.

అయితే, మూడో ప్రపంచ దేశాలు అంటే ఏవి? ఏ దేశాలకు ఆయన ప్రకటన వర్తిస్తుందో చెప్పలేదు.

ట్రంప్ ప్రకటన తర్వాత అసలు మూడో ప్రపంచం అంటే ఏమిటి? ఏయే దేశాలు అందులో ఉన్నాయి? వాటిలో భారత్ కూడా ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేద, వెనుకబడిన దేశాలను గతంలో మూడో ప్రపంచ దేశాలనేవారు.

ఏమిటీ మూడో ప్రపంచం?

మూడో ప్రపంచం అనే దానికి స్పష్టమైన భౌగోళిక చిత్రంగానీ, రాతపూర్వక నిర్వచనంగానీ లేవు. పేద, వెనుకబడిన దేశాల గురించి చెప్పడానికి సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

యూరోపియన్ వలస పాలన నుంచి ప్రపంచంలోని చాలా దేశాలు స్వాతంత్య్రం పొందిన 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో, ముఖ్యంగా ఈ పదం బాగా వాడుకలో ఉంది.

అంతర్జాతీయంగా పారిశ్రామికీకరణ చెందిన దేశాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలు లేని దేశాల గురించి వివరించేందుకు మూడో ప్రపంచం అనే పదం వాడేవారు. వీటిలో చాలా వరకు యూరోపియన్ వలస దేశాలు.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య పెట్టుబడుదారుల కూటమిలోగానీ, సోవియట్ కమ్యూనిస్టు కూటమిలోగానీ భాగంకాని దేశాల గురించి చెప్పేందుకు మూడో ప్రపంచం అనే పదం తొలిసారి వాడారు.

మొదటి ప్రపంచానికి అమెరికా, రెండో ప్రపంచానికి సోవియట్ యూనియన్ నేతృత్వం వహిస్తోంటే, ఈ రెండింటి పరిధిలో లేని మూడో ప్రపంచం ఉద్భవించింది.

కానీ, ఆ తర్వాత మూడో ప్రపంచం అనే పదాన్ని పేద, అభివృద్ధిపరంగా వెనుకబడిన దేశాల గురించి చెప్పడానికి ఉపయోగించారు.

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ జనాభా శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సావీ 1952లో మూడో ప్రపంచం పదాన్ని ఉపయోగించారు.

ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?

మూడో ప్రపంచం అనే పదాన్ని ఫ్రెంచ్ జనాభా శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సావీ 1952లో మొదటిసారి ఉపయోగించారు.

''థర్డ్ ఎస్టేట్‌లాగా నిర్లక్ష్యానికి గురైన, దోపిడీకి, మోసానికి గురైన మూడో ప్రపంచం కూడా ఏదో ఒకటి కావాలని కోరుకుంటోంది'' అని ఆయన ఒక ఆర్టికల్‌లో రాశారు.

ఇందులో ఫస్ట్ ఎస్టేట్ అంటే – మతాధికారులు, సెకండ్ ఎస్టేట్ అంటే -ప్రభువులు, థర్డ్ ఎస్టేట్ అంటే- ఇతర దోపిడీ వర్గాల చేతిలో మోసపోయిన, దోపిడీకి గురైన (రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు) వారు. వీరి గురించి చెప్పడానికి జనాభా శాస్త్రవేత్త, ఆర్థికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ సావీ మూడో ప్రపంచం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించారు.

అయితే, ప్రస్తుతం మూడో ప్రపంచ దేశాల నిర్వచనం, వాటిని అర్థం చేసుకునే విధానం మారిపోయింది. ప్రస్తుతం మూడో ప్రపంచం అనే పదాన్ని రాజకీయ, ఆర్థిక సందర్భాల్లో అరుదుగా ఉపయోగిస్తున్నారు.

అలాంటి దేశాల గురించి చెప్పడానికి ఇప్పుడు గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ, మధ్యస్థాయి ఆదాయాలున్న దేశాలు వంటి పదాలను ఉపయోగిస్తున్నారు.

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మూడో ప్రపంచం అనే మాట వాడటం సరికాదంటోంది ఐక్యరాజ్య సమితి.

అవమానంగానే భావించాలా?

ప్రస్తుతం మూడో ప్రపంచం అనే పదాన్ని.. ఏ దేశాన్ని ఉద్దేశించి అయినా ఉపయోగించడం అవమానకరంగా పరిగణిస్తున్నారు.

"మూడో ప్రపంచం అనే పదానికి కాలం చెల్లిపోయింది, అది అవమానకరమైనది. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు, లేదా గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడుతున్నాం" అని 2022లో ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

సాధారణంగా, జీడీపీ తక్కువగా ఉన్న దేశాలు, పేదరికం ఎక్కువగా ఉండడం, సరైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలు లేకపోవడం, రాజకీయ అస్థిరత్వం, ముడిపదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాల వంటి ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను ఇందులో భాగంగా చూస్తున్నారు.

మూడో ప్రపంచం అన్నది ఆర్థిక కోణం కన్నా రాజకీయపరమైన అంశంగా నిపుణులు కూడా పరిగణిస్తున్నారు.

''ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీనంగా ఉన్నదేశాలను ఇది సూచిస్తుంది'' అని అమెరికా సోషియాలజిస్ట్, రచయిత, ప్రొఫెసర్ ఇర్విన్ లూయిస్ హోరోవిట్జ్ తన పుస్తకం ''త్రీ వర్డ్స్ ఆఫ్ డెవలప్‌మెంట్: ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్ట్రాటిఫికేషన్''లో రాశారు.

''మూడో ప్రపంచం అనే పదం దాని ఉపయోగాన్ని కోల్పోయింది. దక్షిణ కొరియా వంటి అధునాతన దేశాలను విఫలమైన సోమాలియా వంటి దేశాలతో కలిపి ఈ పదం సూచిస్తోంది'' అని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త హోలిస్ చెనెరీ 1970లలో తన పుస్తకంలో రాశారు.

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలను గ్లోబల్ సౌత్ అంటున్నారు.

మూడో ప్రపంచం అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే...

ప్రస్తుతం ఏ దేశాన్ని ఉద్దేశించి అయినా మూడో ప్రపంచం అనే పదం ఉపయోగించడం అవమానకరంగా పరిగణిస్తున్నారు.

ఇప్పుడు ఏ దేశాన్నైనా సంబోధించేందుకు, డెవెలపింగ్ (అభివృద్ధి చెందుతున్న) లేదా ఫ్రాంటియర్ దేశాలుగా పిలుస్తున్నారు.

విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, ప్రజలకు నాణ్యమైన జీవితం కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భావిస్తున్నారు. ఈ విధానాలు ప్రారంభ దశల్లో ఉన్న ఉన్న దేశాలను ఫ్రాంటియర్ దేశాలుగా పిలుస్తున్నారు.

అంటే, ఫ్రాంటియర్ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పొచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఫ్రాంటియర్ దేశాలు కావు.

ఐక్యరాజ్యసమితి కూడా కొన్ని దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు(గతంలో నాలుగో ప్రపంచం)గా పేర్కొంది.

ఇవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు, సాంకేతికతకు, రాజకీయాలకు దూరంగా ఉన్నదేశాలు.

ప్రపంచాన్ని రాజకీయ, ఆర్థిక కోణంలో వర్గీకరించడానికి అనేక పదాలు ఉపయోగిస్తున్నారు.

ఉదాహరణకు, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల గురించి చెప్పడానికి మొదటి ప్రపంచం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు.

ఫస్ట్ వరల్డ్ అనే పదానికి కాలం చెల్లినప్పటికీ, భారీగా పారిశ్రామికీకరణ చెందిన పెట్టుబడిదారీ దేశాల గురించి చెప్పడానికి ఈ పదం ఉపయోగించేవారు. అప్పట్లో ఆ జాబితాలోని దేశాల్లో ఇప్పటి జపాన్, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ ఉన్నాయి.

కొన్ని తూర్పు యూరప్ దేశాలు, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలు కూడా ఇందులో ఉన్నాయి.

మూడో ప్రపంచం అనేది ఇప్పుడు వాడుకలో లేని, అవమానకరంగా భావించే పదం అయినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని తక్కువ ఆదాయం, లేదా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల గురించి చెప్పడానికి ఉపయోగిస్తున్నట్టు భావించాలి.

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడో ప్రపంచ దేశాల పౌరులను అమెరికాకు రానివ్వబోమని ట్రంప్ అన్నారు.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. వాటిలో 32 ఆఫ్రికాలో ఉన్నాయి.

ఆఫ్రికా(32)

అంగోలా, బెనిన్, బుర్కినా ఫాసో, బురుండీ, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, కొమొరోస్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జిబూతీ, ఇరిట్రియా, ఇథియోపియా, గాంబియా, గినీ, గినీ-బిసావూ, లెసోథో, లైబీరియా, మెడగాస్కర్, మలావీ, మాలీ, మౌరితానియా, మొజాంబిక్, నైగర్, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టోగో, ఉగాండా, టాంజానియా, జాంబియా.

ఆసియా(8)

అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, లావో పీడీఆర్, మియన్మార్, నేపాల్, తైమోర్-లెస్తె, యెమెన్

కరేబియన్(1)

హైతీ

ఇంకా ఇతర దేశాల్లో కిరిబాతీ, సోలోమన్ ఐస్‌లాండ్స్, తువాలు ఉన్నాయి.

మూడో ప్రపంచం, భారత్, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రచ్ఛన్నయుద్ధకాలంలో అలీనదేశాలను మూడో ప్రపంచ దేశాలుగా పిలిచారు.

మూడో ప్రపంచంలో భారత్ ఉందా?

భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో తక్కువ ఆదాయం ఉన్న దేశాల జాబితాలో భారత్ లేదు. అయితే, మూడో ప్రపంచం చారిత్రక కోణం నుంచి చూస్తే అలీన ఉద్యమంలో భారత్ భాగంగా ఉండేది. అందువల్ల, మూడో ప్రపంచంలో భాగంగా ఉండేది.

అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారత్ అందులో భాగంగా లేదు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తోంది. కానీ, దేశంలో ఆర్థిక అసమానతలు ఆందోళనకరంగానే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)