పపువా న్యూ గినీ: చైనా అమ్ముల పొదిలో కొత్త అస్త్రం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కరిష్మా వాస్వానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''రక్షణాత్మక విధానాలను అవలంబించే దేశాలు తప్పకుండా నాశనం అవుతాయి.''
'అమెరికా ఫస్ట్' అన్న విధానంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్య ఇది. జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలను ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు (అపెక్) లో చేశారు.
రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగవచ్చని కూడా జిన్‌పింగ్ అన్నారు.
అమెరికా, చైనాల మధ్య గత కొన్నాళ్లుగా వాణిజ్య యుద్ధం జరుగుతోంది.
చైనా అక్రమ వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగానే తాము సుంకాలు విధిస్తున్నామని అమెరికా వాదిస్తోంది.
పపువా న్యూ గినీ రాజధాని పోర్ట్ మెరెస్బీలో జరిగిన అపెక్ సదస్సు మొదటిసారి ఎలాంటి అధికారిక ప్రకటనలూ లేకుండా ముగిసింది. చైనా, అమెరికాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయని ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన పపువా న్యూ గినీ ప్రధాని పీటర్ ఓ నీల్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులో ఆర్థికపరమైన ఆంక్షలను విధించడం వాణిజ్య నియమాలను ఉల్లంఘించడమే అన్న జిన్‌పింగ్.. ''ఇది దూరదృష్టితో చేసింది కాదు. ఇది తప్పకుండా వినాశనానికి దారి తీస్తుంది'' అన్నారు.
ఇలా తలుపులను మూస్తున్నవారు మిగతా ప్రపంచం నుంచి తమను తాము దూరం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
చైనా మారేంత వరకూ మేం ఇలాగే ఉంటాం
జిన్‌పింగ్ వ్యాఖ్యల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. చైనా సుంకాల గురించి మాట్లాడుతోంది కానీ నిజానికి ఆ దేశపు అక్రమ వాణిజ్య విధానాల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు.
''చైనా తన విధానాలను మార్చుకోనంత వరకు అమెరికా తన పంథాను మార్చుకోదు'' అని ఆయన అన్నారు.
అయితే వచ్చే నెలలో అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో, కొన్ని ముఖ్యాంశాలను ఈ ఒప్పందంలో పొందుపర్చలేదని తెలిపారు.

ఫొటో సోర్స్, SAEED KHAN
ఎందుకు ఇంత పెద్ద సమావేశం ఇంత పేద దేశంలో జరిగింది?
పోర్ట్ మెరెస్బీలో చైనా ఎందుకు ప్రధాన రహదారుల నిర్మాణానికి అంగీకరించింది అన్న విషయంపై ఒక జోక్ బాగా ప్రాచుర్యంలో ఉంది.
తమ రాజధాని మధ్యలో అతి విశాలమైన రహదారులు కావాలనుకుంటున్నట్లు ఇటీవల చైనా పర్యటనకు వెళ్లినపుడు పపువా న్యూ గినీ అధ్యక్షుడు చైనా అధ్యక్షునితో అన్నారు.
''దానికేం సమస్య లేదు'' అని జిన్‌పింగ్ ఆయనకు సమాధానమిచ్చారు. ''అవి మా దేశంలో మాదిరే ట్యాంకులు వెళ్లేంత విశాలంగా ఉంటే సరిపోతుందా?'' అని ప్రశ్నించారు.
చైనా పెట్టుబడులపై ఇలాంటి కల్పిత గాథలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగానే చక్కర్లు కొడుతున్నాయి.

ఫొటో సోర్స్, MAST IRHAM
ఎందుకు చైనా ఇన్ని పెట్టుబడులు పెడుతోంది?
అపెక్ సదస్సుకు ముందు పోర్ట్ మెరెస్బీలో తిరుగుతుండగా, చైనా సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులన్నిటినీ నా స్థానిక గైడ్ నాకు చూపించారు. రహదారులు, భవనాలు, చివరికి బస్ స్టాపులను కూడా చైనా సాయంతో నిర్మిస్తున్నారు.
ఈ పేద దేశం ప్రపంచంలోని రెండు అతి సంపన్న దేశాల రాజకీయ, వాణిజ్య ప్రతినిధులకు ఆతిథ్య దేశంగా మారింది.
ఈ నెల 17, 18న జరిగిన ఆ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ రెండ్రోజుల ముందే అక్కడికి విచ్చేశారు.
పసిఫిక్ ప్రాంతంలో గత దశాబ్ద కాలంలో చైనా ఆర్థిక సహాయం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
పపువా న్యూ గినీలో చైనా ప్రయోజనాలు కొత్తవేం కావు.
2016లోనే చైనా ఈ దేశానికి సుమారు రూ.150 కోట్ల ఆర్థిక సాయం అందించింది. మరో ఏడాది తర్వాత సరిగ్గా దానికి మూడు రెట్ల సాయం అందించింది.
చైనా ఈ దేశంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా, ఆస్ట్రేలియానే మొదటి స్థానంలో ఉంది. ఈ దేశానికి అందుతున్న సాయంలో 70 శాతం ఆస్ట్రేలియా నుంచే వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా మల్టీ బిలియన్ ప్రాజెక్ట్ వెనుక లక్ష్యాలేంటి?
అపెక్ దేశాల్లో అత్యంత పేద సభ్యదేశం పపువా న్యూ గినీనే. ఇక్కడ 40 శాతం ప్రజలు రోజుకు రూ.70 రూపాయలకన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తారు.
ఆస్ట్రేలియా విద్యలాంటి రంగాలలో పెట్టుబడులు పెట్టి మరింత మెరుగైన పాలన కోసం సహాయం అందిస్తోందని స్థానికులు నాకు చెప్పారు.
అయితే చైనా మాత్రం ఆ దేశానికి వెంటనే అవసరమైన మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబుడులు పెడుతోంది.
''చైనా ఇక్కడ రహదారులు, బ్రిడ్జిలు నిర్మించింది. ఇంకా నిర్మిస్తోంది'' అని పపువా న్యూ గినీ వాణిజ్య మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డౌవేరి హెనావో నాతో చెప్పారు.
కేవలం ఆ ఒక్క దేశంలోనే కాదు, పసిఫిక్ ప్రాంతమంతటా చైనా ఇలాంటి కార్యకలాపాలు చేపడుతోందని వెల్లడించారు.
ఇదంతా వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా మిగతా ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకోవాలన్న చైనా మల్టీ బిలియన్ ప్రాజెక్ట్ 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్' (బీఆర్‌ఐ)లో భాగం.
చైనా ప్రయత్నాలకు ప్రతిగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో సుమారు రూ.7 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
రాజకీయ ప్రయోజనాల కోసమే పెట్టుబడులు
పసిఫిక్ ప్రాంతంలో చైనా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక, దౌత్యపరమైన కారణాలున్నాయి.
పపువా న్యూ గినీ అనేక అరుదైన ఖనిజాలకు నిలయం. ఇక పసిఫిక్ ద్వీపంలోని చాలా దేశాలు తైవాన్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఆ దేశాలను తన వైపు తిప్పుకోవాలని చైనా భావిస్తోంది.
కానీ చైనా దీర్ఘకాలిక లక్ష్యాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి.
''ఇదంతా రాజకీయపరమైన సహాయం'' అని స్వతంత్ర మేధోసంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జొనాథన్ ప్రైక్ నాతో అన్నారు.
''రాబోయే 20-30 ఏళ్లలో పసిఫిక్‌లోని ఏదో ఒక ప్రాంతంలో చైనా ఒక శాశ్వత మిలటరీ బేస్ ఏర్పాటు చేసుకుంటుందని ఆస్ట్రేలియా, అమెరికాలు భయపడుతున్నాయి'' అని ఆయన వెల్లడించారు.
అమెరికా మిలటరీ బేస్ అయిన గ్వామ్‌కు పపువా న్యూ గినీ కేవలం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, United States Marine Corp
కొత్త యుద్ధక్షేత్రం.. పపువా న్యూ గినీ
ఇటీవల అమెరికా రక్షణ శాఖ చైనా మిలటరీ శక్తిపై ఒక నివేదికను వెలువరించింది. దానిలో చైనా సైన్యం దేశం వెలుపల కూడా తన కార్యకలాపాలను విస్తరించాలనుకుంటోందని పేర్కొంది. గ్వామ్ సహా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని మిలటరీ స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం తనకు ఉందని అమెరికా, దాని మిత్రదేశాలకు వెల్లడించాలని చైనా భావిస్తోంది.
అయితే చాలా మంది విశ్లేషకులు ఇది జరుగుతుందని భావించడం లేదు.
అమెరికా, ఆస్ట్రేలియాలు పసిఫిక్ ప్రాంతంపై మరింత దృష్టి పెట్టడానికి ఈ భయమే కారణం.
అందుకే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఈ ద్వీప దేశానికి సాయం అందించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.
చైనా, పాశ్చాత్య దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక, రాజకీయ ఆధిపత్య పోరులో పపువా న్యూ గినీ ఇప్పుడు తాజా యుద్ధక్షేత్రం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








