వందేమాతరంపై చర్చ: గాంధీ, నెహ్రూ, జిన్నా గురించి ప్రధాని మోదీ ఏమన్నారు?

ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

''వందేమాతరం'' 150వ వార్షికోత్సవంపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఈ చర్చ ప్రారంభమైంది.

చర్చ సందర్భంగా మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నాను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అనేక వాదనలు చేశారు.

'వందేమాతరం'ను బాపు(మహాత్మ గాంధీ) జాతీయ గీతంగా చూసినప్పుడు, దానికి ఎందుకు అన్యాయం జరిగిందని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

వందేమాతరంపై మహమ్మద్ అలీ జిన్నా ప్రశ్నలు లేవనెత్తారని, జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతరంపై దర్యాప్తు ప్రారంభించారని మోదీ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వందేమాతరానికి జాతీయ గేయం హోదాను ఇచ్చింది తామే అని కాంగ్రెస్ చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, వందేమాతరానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

లోక్‌సభలో ప్రధాని మోదీ ఏం చెప్పారు?

'ముఖ్యమైన సమస్యల నుంచి దేశం దృష్టిని మళ్లించడానికే సభలో ఈ చర్చలు జరుగుతున్నాయి' అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.

వందేమాతరం మోసానికి గురయిన పరిస్థితుల గురించి కొత్త తరాలకు చెప్పడం తన బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.

"1937 అక్టోబర్ 15న లఖ్‌నవూ నుంచి మహమ్మద్ అలీ జిన్నా వందేమాతరానికి వ్యతిరేకంగా నినాదం ఇచ్చారు. దాన్ని చూసి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ తన సింహాసనం వణుకుతున్నట్టు భావించారు. ముస్లిం లీగ్ నిరాధారమైన వాదనలకు తగిన సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఆయన వందేమాతరంపై దర్యాప్తు ప్రారంభించారు" అని ప్రధాని మోదీ అన్నారు.

"జిన్నా నిరసన తెలిపిన ఐదు రోజుల తర్వాత అక్టోబర్ 20న, నేతాజీ సుభాష్ బాబుకు నెహ్రూ ఒక లేఖ రాశారు. నేను నెహ్రూ ప్రకటన చదివాను. ఆ లేఖలో జిన్నా భావాలతో నెహ్రూ ఏకీభవించారు. వందేమాతరం ఆనంద్ మఠం నేపథ్యం ముస్లింలను రెచ్చగొడుతుందని నేను భావిస్తున్నాను' అని రాశారు" అని ప్రధాని మోదీ చెప్పారు.

"ఆ తర్వాత, అక్టోబరు 26న కోల్‌కతాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, వందేమాతరం వినియోగంపై ఆ సమావేశంలో సమీక్షిస్తామని కాంగ్రెస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. దేశం మొత్తం నివ్వెరపోయింది. దేశం నలుమూలలా ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు''

"దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ వందేమాతరం విషయంలో అక్టోబరు 26న రాజీ పడింది. వందేమాతరం ముక్కలు ముక్కలయింది. ఆ నిర్ణయం సామాజిక సామరస్య చర్యగా ముసుగు వేసుకుంది. కానీ కాంగ్రెస్ ముస్లిం లీగ్‌కు లొంగిపోయి ముస్లిం లీగ్ ఒత్తిడితో ఇలా చేసిందనే దానికి చరిత్ర సాక్ష్యం" అన్నారు మోదీ.

"బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడిలో కాంగ్రెస్ వందేమాతరం విభజనకు తలొగ్గింది. అందుకే ఒక రోజు కాంగ్రెస్ భారతదేశ విభజనకు తలొగ్గాల్సి వచ్చింది" అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, చర్చ సమయంలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విషయం కూడా ప్రస్తావించారు.

మహాత్మాగాంధీ గురించి మోదీ ఏమన్నారంటే...

"దక్షిణాఫ్రికా నుంచి ప్రచురితమయ్యే ఇండియన్ ఒపీనియన్ అనే వారపత్రికలో డిసెంబరు 2, 1905న మహాత్మాగాంధీ ఇలా రాశారు - బంకిమ్ చంద్ర స్వరపరిచిన వందేమాతరం గేయం బెంగాల్ అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్‌లో భారీ సమావేశాలు జరిగాయి. అక్కడ లక్షలాది మంది ప్రజలు గుమిగూడి బంకిం పాటను పాడారు"

"ఈ గేయం ఎంత ప్రజాదరణ పొందిందంటే అది మన జాతీయ గీతంగా మారింది. పాటలోని భావాలు గొప్పగా ఉంటాయి. ఇతర దేశాల పాటల కంటే మధురంగా ఇది ఉంటుంది. దీని ఏకైక ఉద్దేశం మనలో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పడం. ఇది భారతదేశాన్ని తల్లిగా చూస్తుంది. ఆమెను ప్రశంసిస్తుంది" అని గాంధీజీ ఆ ఆర్టికల్‌లో రాశారాని మోదీ లోక్‌సభలో చెప్పారు.

"1905లో మహాత్మా గాంధీ జాతీయ గీతంగా చూసిన వందేమాతరాన్ని, అందులోని శక్తిని దేశంలోని ప్రతి మూలలోని ప్రతి వ్యక్తి గౌరవించారు. వందేమాతరం చాలా గొప్పది. దాని స్ఫూర్తి చాలా గొప్పది. మరి గత శతాబ్దంలో దానికి ఇంత పెద్ద అన్యాయం ఎందుకు జరిగింది? వందేమాతరం ఎందుకు మోసానికి గురయింది?'' అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

"పూజ్యులైన బాపు భావాలను కూడా అధిగమించిన ఆ శక్తి ఏది? వందేమాతరం వంటి పవిత్ర భావాన్ని కూడా వివాదంలోకి లాగిన శక్తి అది" అని మోదీ అన్నారు.

ఈ చర్చ సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ అత్యవసర పరిస్థితిని కూడా ప్రస్తావించారు.

''150 ఏళ్ల వందేమాతరం ప్రయాణం అనేక దశలను దాటింది. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం బానిసత్వంలో జీవించవలసి వచ్చింది. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర సంకెళ్లలో బంధించి ఉంది" అని మోదీ అన్నారు.

"వందేమాతరానికి 100 సంవత్సరాలు నిండినప్పుడు, దేశభక్తి కోసం చావుబతుకులకు తెగించినవాళ్లను జైలులో బంధించారు. దేశ స్వాతంత్ర్యానికి శక్తినిచ్చిన వందేమాతరం గేయానికి 100 సంవత్సరాలు నిండినప్పుడు దురదృష్టవశాత్తూ మన చరిత్రలో ఒక చీకటి కాలం ఆవిష్కృతమైంది.. ఆ అద్భుతమైన అధ్యాయానికి తిరిగి గౌరవం కల్పించడానికి 150 సంవత్సరాలు ఒక అవకాశం. సభ, దేశం ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నేను భావిస్తున్నా. 1947లో దేశానికి స్వేచ్ఛను తెచ్చిపెట్టింది వందేమాతరం" అని ప్రధాని అన్నారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత వాస్తవాన్ని దాచాలని కేంద్రం అనుకుంటోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

‘సమస్యలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే’- ప్రియాంకగాంధీ

ప్రధాని మోదీ ప్రసంగంపై సభ లోపల, వెలుపల ప్రతిపక్షాలు స్పందించాయి.

లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ వందేమాతరానికి జాతీయ గేయం హోదాను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా చర్చలో పాల్గొన్నారు.

"ముఖ్యమైన సమస్యల నుంచి దేశం దృష్టిని మళ్లించడానికి 'వందేమాతరం'పై సభలో చర్చ జరుగుతోందని" ఆమె విమర్శించారు.

"ఈ ప్రభుత్వం ప్రస్తుత వాస్తవాన్ని దాచాలనుకుంటోంది. ఇప్పుడు దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేపర్ లీకేజీలు వంటి అంశాలను సభలో ఎందుకు చర్చించడం లేదు? రిజర్వేషన్లను దెబ్బతీసే అంశాలు, మహిళల స్థితిగతులపై సభలో ఎందుకు చర్చించడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు.

"నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ఎన్నేళ్లుగాఉన్నారో, అన్నేళ్లు జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జైలులో ఉన్నారు''.

"నెహ్రూ ఇస్రోను సృష్టించకపోతే మంగళయాన్ ఉండేది కాదు. డీఆర్‌డీవోను సృష్టించకపోతే తేజస్ ఉండేది కాదు. ఐఐటీలు ఏర్పాటుచేయకపోతే మనం ఐటీలో ముందుండేవాళ్ళం కాదు. ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయకపోతే మనం కరోనాను ఎలా ఎదుర్కొనేవాళ్ళం. బీహెచ్‌ఈఎల్-సెయిల్ వంటి పీఎస్‌యూలు లేకపోతే భారతదేశం ఎలా అభివృద్ధి చెందేది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ దేశం కోసం జీవించి దేశానికి సేవ చేస్తూ మరణించారు" అని ప్రియాంకగాంధీ అన్నారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, దేశ సమస్యలేమీ ప్రధాని ప్రసంగంలో లేవని కాంగ్రెస్ ఆరోపించింది.

‘దిల్లీ బాంబు పేలుడు గురించి ఎందుకు మాట్లాడడం లేదు?’

"రాజ్యాంగ సభలో ముస్లిం లీగ్‌కు మేం తగిన సమాధానం ఇచ్చాం. వారు మొత్తం వందేమాతరాన్ని బహిష్కరించాలని అన్నారు. మేం ముస్లిం లీగ్ చెప్పేది వినబోమని, వందేమాతరానికి జాతీయ గేయం హోదా ఇస్తామని స్పష్టంగా చెప్పాం అని గౌరవ్ గొగోయ్ అన్నారు.

"అదే రాజ్యాంగ సభలో 'జన-గణ-మన' మన జాతీయ గీతం అవుతుందని, వందేమాతరం మన జాతీయ గేయం అవుతుందని కూడా నిర్ణయించారు. మా ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన వారిలో రాజేంద్ర ప్రసాద్, సి. రాజగోపాలాచారి, జిబి పంత్, మౌలానా ఆజాద్, రవిశంకర్ శుక్లా ఉన్నారు"

"ఈ రోజు దేశ ప్రజలు అనేక సమస్యలను లేవనెత్తుతున్నారు. కానీ ప్రధానమంత్రి ప్రసంగంలో ఆ విషయాలు లేవు. దేశ రాజధానిలో బాంబు పేలుడు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు"

"మనం వందేమాతరం 150వ జయంతిని జరుపుకుంటున్నాము. కానీ ప్రస్తుత భారతదేశానికి భద్రత కల్పించగలిగామా? దిల్లీ, జమ్మూకశ్మీర్ ప్రజలకు భద్రత కల్పించామా?" అని గౌరవ్ గొగొయ్ ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సభ, వందేమాతరం

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు.

‘ఆర్ఎస్ఎస్ వైఖరిపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్తారా?’

"ప్రధానమంత్రి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నప్పుడు, ముంబయిలో 'క్విట్ ఇండియా' నినాదం ఇచ్చినప్పుడు, మీరు సభ్యుడిగా ఉన్న మీ మాతృ సంస్థ, బ్రిటిష్ సైన్యంలో చేరమని ప్రజలను ఎందుకు కోరింది?"

"మమ్మల్ని బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వమని ఎందుకు అడిగింది? ఆ సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చినందుకు మీరు లోక్‌సభలో క్షమాపణ చెబుతారా? స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మీ వైఖరి దేశభక్తులతో కాకుండా బ్రిటిష్ వారి వైపు ఉన్నందుకు మీరు మొత్తం దేశానికి క్షమాపణ చెబుతారా?" అని పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ప్రశ్నించారు.

ఏ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో దానిని ప్రశంసించారో, ఏ నాయకుడు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారో, రోడ్డుపై కర్రలతో దెబ్బలుతిన్న తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఏ నినాదాలు చేశారో చరిత్రను తిరగేసి తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సూచించారు.

"గురు రవీంద్రనాథ్ ఠాగూర్ అందులో రెండు పేరాలు చేర్చారు కాబట్టి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించండి. మీకు చరిత్ర తెలియదు. అసంపూర్ణమైన విషయాలు చెబుతారు. నెహ్రూ దేశానికి స్వావలంబన కల్పించారు. ఆయన శాస్త్రీయ ఆలోచనను సృష్టించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)