సింధ్: జనగణమనలో వినిపించే ఈ ప్రాంతం భారతదేశంలో ఎందుకు భాగం కాలేదు?

ప్రపంచంలోనే మూడు గొప్ప ప్రాచీన నాగరికతలలో ఒకటైన సింధులోయ నాగరికత సువిశాల ప్రాంతంలో విస్తరించింది (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వకార్ ముస్తాఫా
    • హోదా, పాత్రికేయుడు, పరిశోధకుడు

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ను ''నాగరికతా కోణంలో చూస్తే, ఎప్పుడూ భారతదేశంలో భాగమే'' అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ''అది అవాస్తవం, రెచ్చగొట్టే వ్యాఖ్య, చరిత్రను ప్రమాదకరరీతిలో వక్రీకరించే ప్రయత్నం'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.

మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీని ఉటంకిస్తూ, ‘‘సింధ్ హిందువులు ముఖ్యంగా మా తరానికి చెందిన ప్రజలు, భారతదేశం నుంచి సింధ్ వేరుకావడాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోయారు’’ అని ఆయన తన ఒక పుస్తకంలో రాశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

‘‘సరిహద్దులు మారవచ్చు, ఏమో ఎవరికి తెలుసు, రేపు సింధ్ మళ్లీ భారతదేశంలో భాగం కావొచ్చు'' అని కూడా రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఈ కొత్త వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, అసలు సింధ్ గురించి చరిత్రలో ఏం జరిగింది, రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నరనేదీ తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1700 వరకూ ఉన్న మొహంజోదారో నగరంలో కనీసం 40 వేల మంది జనాభా నివసించేవారని భావిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1700 వరకూ ఉన్న మొహంజోదారో నగరంలో కనీసం 40 వేల మంది జనాభా నివసించేవారని భావిస్తున్నారు

సువిశాల ప్రాచీన నాగరికతా నిలయం...

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, సింధూనదీ డెల్టాలో భాగమైన ప్రస్తుత సింధ్ ప్రావిన్స్ ప్రాంతం ఒకప్పుడు ప్రాచీన సింధులోయ నాగరికతకు కేంద్ర స్థానం.

మొహంజోదారో, కోట్‌డిజి వంటి ప్రదేశాలు ఈ నాగరికతకు సాక్షులు. ఈ ప్రాచీన నాగరికత సుమారు క్రీ.పూ.2300 నుంచి క్రీ.పూ.1750 వరకూ ఉనికిలో ఉంది.

ప్రపంచంలో మూడు గొప్ప ప్రాచీన నాగరికతల (మెసపటోమియా, ఈజిప్టు, సింధులోయ)లో ఒకటైన సింధులోయ నాగరికత సువిశాలమైన ప్రాంతంలో కొనసాగింది. తొలుత 1921లో కనుగొన్న హరప్పా (పంజాబ్), తర్వాత 1922లో కనుగొన్న మొహంజోదారో (సింధు నది ఒడ్డున)తోపాటు ఈ నాగరికత వెలుగులోకి వచ్చింది.

సోహైల్ జహీర్ లారి రాసిన 'ఎ హిస్టరీ ఆఫ్ సింధ్' ప్రకారం, సింధులోయ నాగరికత విరాజిల్లిన ప్రదేశంలో ప్రస్తుత పాకిస్తాన్ భూభాగం దాదాపుగా ఉంది. దక్షిణ, తూర్పు దిశల్లో ప్రస్తుత భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో, పశ్చిమాన అఫ్గానిస్తాన్ వరకూ ఈ నాగరికత విస్తరించింది.

చీర ధరించిన సింధ్ మహిళ, 1945 నాటిది ఈ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చీర ధరించిన సింధ్ మహిళ, 1945 నాటిది ఈ ఫోటో

ఎన్నో సామ్రాజ్యాల్లో భాగంగా సింధ్...

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, దీని (క్రీ.పూ.2500) తర్వాత చారిత్రక రికార్డులో వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒక గ్యాప్ ఉంది.

''క్రీ.పూ. ఆరో శతాబ్దం చివర్లో డారియస్-1 సింధ్‌ను జయించినప్పుడు దాన్ని అకెమెనిడ్ సామ్రాజ్యం (ఇరాన్)లో విలీనం చేసినట్లుగా ప్రస్తావన ఉంది''

''సుమారు రెండు శతాబ్దాల తర్వాత, క్రీ.పూ.326- క్రీ.పూ.325 మధ్యకాలంలో అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించాడు. ఆయన మరణానంతరం, సింధ్‌ను సెల్యూకస్-1 నికేటర్, చంద్రగుప్త మౌర్యుడు (సుమారు క్రీ.పూ.305), ఆ తర్వాత ఇండో-గ్రీక్, పార్థియన్ పాలకులు, తర్వాత క్రీ.పూ.1వ శతాబ్దం నుంచి క్రీ.శ.2వ శతాబ్దం వరకు శకులు, కుషాణులు పాలించారు.''

''క్రీ.శ. ఒకటో శతాబ్దంలో కుషాణుల కాలంలో సింధ్ ప్రాంతంలోని జనాభాలో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని స్వీకరించారు. సింధ్ క్రీ.శ. మూడో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం వరకూ ఇరాన్‌కు చెందిన ససానియన్ సామ్రాజ్యం ప్రాబల్యంలో ఉంది''

1930 కాలంలో కరాచీ పోర్టులో నౌకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1930 కాలంలో కరాచీ పోర్టులో నౌకలు

ఇస్లాం మతానికి పునాది...

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పరిశోధన ప్రకారం, క్రీ.శ.711లో అరబ్బులు సింధ్‌కు చేరుకోవడంతో దక్షిణాసియాలో ఇస్లాం మతానికి పునాది పడింది. సింధ్ ప్రాంతం క్రీ.శ.712 నుంచి సుమారు క్రీ.శ.900 వరకూ ఉమయ్యాద్, అబ్బాసిద్ సుల్తానేట్‌ల అల్-సిద్ అనే ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. ఈ ప్రావిన్స్ రాజధాని అల్‌-మన్సూరా. ఇది ప్రస్తుతం పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు ఉత్తరాన 72 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఖలీఫేట్ కేంద్ర అధికారం బలహీనపడిన తర్వాత అల్-సింధ్ ప్రావిన్స్‌లో అరబ్ గవర్నర్లు 10 నుంచి 16వ శతాబ్దం వరకూ తమ సొంత స్థానిక, వంశపారంపర్య పాలనను కొనసాగించారు.

పదహారో, పదిహేడో శతాబ్దాల (1591-1700)లో సింధ్ ప్రాంతం మొఘలుల పాలనలో ఉంది.

తదనంతరం, పలు సింధీ రాజకుటుంబాలు స్వతంత్రంగా పాలించాయి.

1843 సంవత్సరంలో ఆఖరి సింధీ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఓడించారు. ఆ సమయంలోనే, దాదాపుగా సింధ్‌ ప్రాంతమంతా బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైంది.

బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను విభజించాలని జిన్నా డిమాండు చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను విభజించాలని జిన్నా డిమాండు చేశారు

పాకిస్తాన్‌లో విలీనమవ్వాలనే సింధ్‌ నిర్ణయం వెనుక...

పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా తన 14 పాయింట్లలో బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను వేరు చేయాలనే డిమాండు ఒకటి.

ముస్లింల డిమాండ్లను అంగీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం, 1936 సంవత్సరంలో బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్ ప్రాంతాన్ని విభజించి, దీనికి ప్రత్యేక రాష్ట్ర హోదా (సేపరేట్ ప్రావెన్సియల్ స్టేటస్) కల్పించింది.

1947 సంవత్సరంలో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, ముస్లిం మెజార్టీ ప్రావిన్స్‌గా ఉన్న సింధ్ ఆ దేశంలో విలీనమైంది.

1927 నాటి సింధ్ (హైదరాబాద్) చిత్రమిది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1927 నాటి సింధ్ లోని హైదరాబాద్ ప్రాంతం ఇది.

బౌద్ధమతాన్నీ ఆచరించిన ప్రాంతం...

పరిశోధకుడు, రచయిత డాక్టర్ మహమ్మద్ అలీ షేక్ ఒక వ్యాసంలో పేర్కొన్న ప్రకారం, బౌద్ధరాజు సిహాసి-2 తన 28 ఏళ్ల పాలనలో రాజ్య వ్యవహారాల్లో అధిక భాగం తనకు నమ్మకస్తుడైన బ్రాహ్మణ మంత్రి చాచ్‌కు అప్పగించారు.

సుమారు క్రీ.శ.642 సంవత్సరంలో సింధ్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్, అక్కడ లెక్కలేనన్ని స్తూపాలు, సుమారు పది వేల మందికి సన్యాసులకు ఆశ్రయం కల్పించే వందలాది మఠాలు ఉన్నాయని రాశారు.

బ్రిటిష్ చరిత్రకారుడు జాన్ కేయె తన 'ఇండియా: ఎ హిస్టరీ' పుస్తకంలో, బౌద్ధమతం సింధ్‌లో అత్యంత శక్తిమంతమైన మతంగా ఉండేదని, అయితే హిందూ మతం కూడా ఉనికిలో ఉందని, అక్కడ సుమారు 30 హిందూ దేవాలయాలు ఉండేవని రాశారు.

ఏడో శతాబ్దంలో, ఉత్తర భాగం మినహా దాదాపు సింధు లోయ ప్రాంతమంతా సింధ్ సామ్రాజ్యంలో ఉండేది. సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత దండయాత్రలను ప్రారంభించిన చాచ్, తన రాజ్యం సరిహద్దులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు: అదే, వివిధ ప్రాంతాలను గుర్తించడానికి చెట్లను నాటడం.

ఈ సందర్భంలోనే కేయె ఇలా రాశారు: వాయువ్య దిశలో ఉన్న ప్రాచీన గాంధార ప్రాంతాన్ని మాత్రమే చేర్చి ఉంటే, చాచ్ సామ్రాజ్యం ఒక రకమైన ప్రోటో-పాకిస్తాన్ అయ్యేది.

చరిత్రకారుడు డాక్టర్ తాహిర్ కమ్రాన్ ప్రకారం, సింధులోయ నాగరికత కేంద్ర స్థానం ఇప్పుడు పాకిస్తాన్‌గా ఉన్న ప్రాంతమే.

"తక్షశిల నాగరికత సమయంలో పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలతో పాటు సింధ్, మొహెంజోదారో మొదలైనవి చాచ్ సామ్రాజ్యంలో ఉండేవి. ఇదే కేంద్రం, ఇదే మూలం. ఇక్కడి నుంచే సింధులోయ నాగరికత ఉద్భవించి విస్తరించింది. దాని ప్రభావం గుజరాత్‌ వరకు కూడా చేరింది'' అని డాక్టర్ తాహిర్ కమ్రాన్ బీబీసీకి చెప్పారు.

"సాంస్కృతికంగా, ఈ ప్రాంతం ఏకమైతే, అది చాలా సహజంగా అనిపిస్తుంది. సింధ్ విడిపోయి భారతదేశంలో చేరడం చాలా అసహజంగా ఉంటుంది. చారిత్రక కోణం, నాగరికత దృక్కోణంలో చూస్తే, ఇది అర్థవంతంగా ఉండదు'' అని అన్నారు.

"సింధ్ అంటే ఒకే ప్రాంతం లేదా ప్రావిన్స్ కాదు. ఇది సింధు లోయ నాగరికతకు కేంద్రంగా ఉన్న ప్రాంతం. ఇందులో పంజాబ్, బలూచిస్తాన్, సింధ్ ఉన్నాయి. వాటి సంయుక్త సాంస్కృతిక యూనిట్ నేడు పాకిస్తాన్ ఉన్న చోట ఉంది. ఈ కేంద్రం నుంచి ఉప్పొంగిన సాంస్కృతిక ప్రవాహాలు తర్వాత ఇతర ప్రాంతాలలో తమ ప్రభావాన్ని చూపించాయి" అని ఆయన చెప్పారు.

''భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సింధ్‌పై ఎలాంటి విషయ పరిజ్ఞానం కానీ లేదా దానిపై లోతైన అవగాహన లేకుండా ఒక టపాసు పేల్చారు'' అని డాక్టర్ తాహిర్ కమ్రాన్ వ్యాఖ్యానించారు.

''భారత రక్షణ మంత్రి ప్రకటన 'స్పష్టంగా సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది, 'ఆక్రమణ వాసన' వెదజల్లుతోంది'' అని సింధీ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ అమీర్ అలీ చాండియో అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, చరిత్రను నిశితంగా పరిశీలిస్తే సింధ్ ఎప్పుడూ హిందుస్థాన్ లేదా భారతదేశంలో భాగం కాలేదనే వాస్తవం తెలుస్తుందని చెప్పారు.

"మొఘల్ సామ్రాజ్యం కొద్దికాలం పాటు సింధ్‌ను ఆక్రమించినప్పటికీ, సింధీ ప్రజలు దానిని గట్టిగా వ్యతిరేకించారు. షా ఇనాయత్ షహీద్‌ను చరిత్రలో మొదటి సోషలిస్ట్ సూఫీ అని పిలుస్తారు. అతను భూస్వామ్య వ్యవస్థకు, దాన్ని సమర్థించిన మొఘలుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు'' అని తెలిపారు.

చాండియో ప్రకారం, 1843లో, బ్రిటిష్ సామ్రాజ్యం, ఈస్ట్ ఇండియా కంపెనీ సింధ్‌ను ఆక్రమించినప్పుడు, సింధ్ అప్పటికీ భారతదేశంలో భాగం కాకుండా స్వతంత్ర రాష్ట్రంగా, ప్రత్యేక భూభాగంగా ఉంది.

"1847లో, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా సింధ్‌ను బలవంతంగా బొంబాయి ప్రెసిడెన్సీలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింధ్ ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు. చివరకు సింధ్ ప్రత్యేక గుర్తింపు పునరుద్ధరించారు'' అని చాండియో పేర్కొన్నారు.

"దాని తర్వాత కూడా, సింధ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పార్లమెంటరీ, ప్రజాస్వామ్య పోరాటం చేయడమే గాకుండా, హుర్స్ (స్వేచ్ఛ అని అర్థం) సాయుధ ఉద్యమం కూడా సింధ్ ప్రతిఘటన చరిత్రలో ఒక ఉజ్వల అధ్యాయం. బ్రిటిష్‌వారు సింధ్‌లో మార్షల్ లా విధించాల్సి వచ్చింది, కానీ బానిసత్వాన్ని మాత్రం సింధ్ అంగీకరించలేదు" అని అన్నారు.

1940 నాటి లాహోర్ తీర్మానాన్ని (పాకిస్తాన్ తీర్మానం) అంగీకరించిన వారిలో సింధ్ ప్రజలు ముందున్నారని, అంతకుముందే, 1938లో, సింధ్ అసెంబ్లీ "మేము భారతదేశంతో ఉండము" అని ప్రకటించిందని చాండియో తెలిపారు.

"పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా సింధ్‌కు చెందినవారే. 1943 మార్చి 3న, పాకిస్తాన్‌కు అనుకూలంగా మొదటి తీర్మానాన్ని సింధ్ అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో జి.ఎం.సయ్యద్ ముఖ్య పాత్ర పోషించారు" అని ఆయన చెప్పారు.

1931లో మహాత్మా గాంధీకి కరాచీలో స్వాగతం పలుకుతున్న చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1931లో మహాత్మా గాంధీకి కరాచీలో స్వాగతం పలుకుతున్న చిత్రం

'సింధ్ ఎప్పుడూ భారతదేశ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు...'

చుగ్తాయ్ మీర్జా ఐజాజుద్దీన్ పరిశోధన ప్రకారం, అవిభక్త భారతదేశంలో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి ప్రావిన్స్ సింధ్. ఈ తీర్మానాన్ని షేక్ అబ్దుల్ మజీద్ సింధీ సమర్పించారు.

''హిందూస్థాన్ ఎప్పుడూ ఒకే (ఐక్య) దేశం కాదని, ముస్లిం హిందూస్థాన్ ఎప్పుడూ ఒక ప్రత్యేక సంస్థగా ఉందని పాకిస్తాన్ వ్యవస్థాపక పితామహుడు భావించారు. ఈ విషయాన్ని అప్పటి ముస్లిం లీగ్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ప్రముఖ సింధీ నాయకుడు జి.ఎం.సయ్యద్ ప్రకటనలో కూడా ప్రతిధ్వనించింది'' అని అందులో ఉంది.

"మొహెంజోదారోలో కనుగొన్న సింధులోయ నాగరికత పాకిస్తాన్‌లోని ప్రాంతాలు ఎప్పుడూ భారతదేశంలో భాగం కాలేదనడానికి రుజువని జి.ఎం.సయ్యద్ పేర్కొన్నారు. సింధ్, పంజాబ్, అఫ్గానిస్తాన్, సరిహద్దు ప్రాంతాలు సుదూర తూర్పు ప్రాచ్యంలో కాకుండా మధ్య ప్రాచ్యంలో భాగంగా ఉండేవి" అని పేర్కొన్నారు.

"దక్షిణాసియాలోని అన్ని ప్రావిన్సులలో, సింధ్ అసెంబ్లీ మాత్రమే 1943 మార్చి 3న జి.ఎం.సయ్యద్ ప్రతిపాదించిన తీర్మానం ద్వారా లాహోర్ తీర్మానం తరహాలో పాకిస్తాన్‌ను సృష్టించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది."

"తర్వాత, 1947 జూన్ 26న సింధ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో, కొత్త పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులో భాగం కావాలని నిర్ణయించింది. అలా పాకిస్తాన్‌లో చేరిన మొదటి ప్రావిన్స్‌గా సింధ్ నిలిచింది''

పాకిస్తాన్ ఏర్పాటుకు అనుకూలంగా ఓటు వేసిన సింధ్ సభ్యులే పాకిస్తాన్ దేశ సృష్టికర్తలు అని జి.ఎం.సయ్యద్ వ్యాఖ్యానించారు.

1947లో స్వాతంత్ర్యానికి ముందు, దిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి కార్మికులను తీసుకొచ్చిన రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1947లో స్వాతంత్ర్యానికి ముందు, దిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి కార్మికులను తీసుకొచ్చిన రైలు

'భారతదేశంలో భాగం కావడమనే ప్రశ్నే లేదు...'

చాండియో నేటికీ చెబుతున్న విషయం, "సింధ్ ప్రజలు చెప్పేది ఏమిటంటే, మేము పాకిస్తాన్‌లో భాగమే, 1940 తీర్మానం ప్రకారం మా రాజ్యాంగ, రాజకీయ హక్కులను మాకు ఇవ్వాలి"

"ఈ విధంగా, స్వతంత్ర దేశంగా ఉంటూ బ్రిటిష్ ఆక్రమణలో ఉన్న సింధ్ స్వచ్ఛందంగా పాకిస్తాన్‌లో భాగమైంది. బెంగాల్‌తో పాటు, పాకిస్తాన్ ఉద్యమంలో సింధ్ పాత్ర చాలా ముఖ్యమైనది, చారిత్రాత్మకమైనది"

"సింధ్ ప్రజలు భారతదేశ ఆధిపత్యాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. భారతదేశ సామ్రాజ్యవాద ఆశలు నేటికీ వారికి ఆమోదయోగ్యం కాదు, ఎప్పటికీ కాబోవు. భారతదేశంలో భాగం కావడం లేదా దాని ఆధిపత్యాన్ని అంగీకరించడం అనే ప్రశ్నే లేదు" అని చాండియో అన్నారు.

చాండియో ప్రకారం, చారిత్రాత్మకంగా సింధ్ స్వతంత్ర దేశంగా ఉంటూ స్వచ్ఛందంగా పాకిస్తాన్‌లో చేరింది.

స్థానిక మేధావి వజాహత్ మసూద్ ఏమంటారంటే, ఒకవేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాదన సరైనదేనని అంగీకరిస్తే భవిష్యత్తులో దిల్లీ, అవధ్, హైదరాబాద్ దక్కన్ పాకిస్తాన్‌లో భాగమవుతాయి.

''భారతదేశం విభజన జరిగింది. రెండు దేశాలు ఏర్పడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఆనాటి నాయకత్వం అంగీకరించింది'' అని వజహత్ మసూద్ అన్నారు.

''గత ఏడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిలో ప్రత్యేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు, రాజ్‌నాథ్ వంటి ప్రకటనలు అనవసరమైన వైషమ్యాలను తప్ప మరేమీ సాధించలేవు'' అని వజావత్ మసూద్ అభిప్రాయపడ్డారు.

‘‘ఉభయ దేశాలు మంచి పొరుగు దేశాలుగా జీవించడం నేర్చుకొని, వారివారి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది'' అని వజాహత్ మసూద్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)