నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు దగ్గు మందుగా పనిచేస్తాయా?

దగ్గు మందు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెక్స్ టైలర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలామందికి శీతాకాలంలో దగ్గు రావడం సహజమే. దగ్గు వచ్చినప్పుడు వెంటనే మందులు వాడకుండా.. దానంతటదే తగ్గేందుకు కొద్దిగా సమయం ఇవ్వాలి, నీళ్లు తాగుతూ ఉండాలి.

ఖరీదైన దగ్గు మందులు ఇచ్చే ఉపశమనాన్నే తేనె,నిమ్మరసం కలిపిన నీటిని సేవించడం లాంటి చిట్కా వైద్యం కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు రాగానే చాలామంది దగ్గు టానిక్‌ల వైపు పరుగులు తీస్తారు. కానీ అవి నిజంగా పనిచేస్తాయా లేదంటే నిమ్మరసం తేనెలాంటి గృహ వైద్యం మంచిదా?

యూకేలో మాంచెస్టర్ యూనివర్సిటీలోని శ్వాసకోశ సంబంధిత నిపుణురాలు, ప్రొఫెసర్ జాకీ స్మిత్ ఈ విషయంపై బీబీసీ రేడియో 4 స్లైస్డ్ బ్రెడ్ ప్రొగ్రామ్‌లో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రాండ్ అవసరం లేదు

జలుబు లేదా ఫ్లూ వల్ల దగ్గు వస్తుంటుంది. దగ్గు మందులు వైరస్‌లకు పనిచేయవు. కానీ, ఇవి గొంతుకు ఉపశమనం కలిగించి, దగ్గుకు కారణమయ్యే గరగరను తగ్గిస్తాయి.

పొడి దగ్గు అయితే బాల్సమ్‌ సిరప్, గ్లైసరల్ వంటి స్వీట్ సిరప్‌‌లు గొంతును తేమగా ఉంచి ఉపశమనాన్ని అందిస్తాయని ప్రొఫెసర్ స్మిత్ తెలిపారు.

దీనికి పెద్ద ఖరీదైన బ్రాండ్ల మందులను తీసుకోవాల్సిన అవసరం లేదని, ధర తక్కువ ఉండే సాధారణ మందులు కూడా అంతే సమర్థవంతంగా పనిచేసి, ఇబ్బందిని తగ్గిస్తాయని చెప్పారు.

అయితే, కాఫ్ సిరప్ లేబుల్‌పై గమనించాల్సిన అంశం చక్కెర. స్వీట్ సిరప్‌లలో ఇది అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉంది.

ఒకవేళ చక్కెర ఆందోళనకరంగా అనిపిస్తే.. చక్కెర కలపని దగ్గు మందులు కూడా ఉంటాయి. ఇవి ఉత్తమమైన ఎంపిక.

దగ్గు మందులలో కొన్ని నిర్దిష్టమైన ‘‘చురుకైన పదార్థాలు’’ ఉన్నట్టుగా దగ్గు మందుల కంపెనీలు తరచూ తమ ప్రకటనలలో చెబుతుంటాయి.

ఈ పదార్థాలలో డెక్స్‌ట్రోమెథోర్ఫన్ ఉంటుంది. ఇది దగ్గును తగ్గిస్తుందని చెబుతుంటారు. కానీ, దీని ప్రభావం చాలా తక్కువని ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

అయితే, ఈ మందు మోతాదును సరైన మొత్తంలో తీసుకోవాల్సి ఉందని స్మిత్ తెలిపారు. ఎందుకంటే, డెక్స్‌ట్రోమెథోర్ఫన్ వంటి పదార్థాలు మోతాదుకు మించి తీసుకుంటే, అవి వ్యసనంగా మారతాయి.

''కాఫ్ సిరప్ లేబుల్‌పై ప్రతిపాదించిన మోతాదుకు మించి తీసుకోవడానికి వీలు లేదు'' అని డాక్టర్ స్మిత్ చెప్పారు.

చెస్టీ కాఫ్ సిరప్‌లలో లెవోమెంథాల్ అనే మరో ఇన్‌గ్రేడియంట్‌ను గుర్తించవచ్చు.

ఇది గొంతు భాగంలో చల్లదనాన్ని అందిస్తుంది. గొంతు గరగరను తగ్గించి, దగ్గును తగ్గిస్తుంది.

దగ్గు మందు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మంచి నీరు తాగి, కాస్త సమయం ఇవ్వండి

ఛాతీలో కఫం ఉంటే... ఛాతీ గట్టిగా, నిండుగా, బిగుతుగా అనిపిస్తుంది.బ్రాంకైటిస్ వంటి ఇతర ఇన్‌ఫెక్షన్ల కారణంగా తరచూ ఇది వస్తుంటుంది. దీనివల్ల, శ్వాసనాళాల్లో వాపు లేదా ముక్కు, సైనస్‌లలో ఎక్కువ చీమిడి ఏర్పడుతుంది.

మందుల షాపుకు వెళ్లి దగ్గు సిరప్‌లు కొనడం సాధారణంగా మారిపోయింది. కానీ, సిరప్ చాలా బాగా పనిచేస్తాయనుకోవద్దంటారు ప్రొఫెసర్ స్మిత్.

ఉదాహరణకు.. గ్వైఫెనెసిన్ (guaifenesin) పదార్థం కఫాన్ని తొలగించేందుకు సాయపడుతుంది. కానీ, దీనికి ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవు.

డైఫెన్‌హైడ్రామైన్ వంటి సెడెటివ్ యాంటిహిస్టమైన్స్ రాత్రిపూట నిద్రపోయేందుకు సహకరిస్తాయి. కానీ, దగ్గును ఆపవు.

తైమ్ లేదా స్క్విల్ వంటి మొక్కల నుంచి తీసేవి దగ్గుకు కాస్త సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆధారాలు ఉన్నాయి.

అయితే, దగ్గు వచ్చిన తర్వాత కొంతకాలం వేచిచూసి, ఆ సమయంలో తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని, లాజెంజస్ తీసుకోవాలని ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

చిన్నగా, రుచికరంగా ఉండే దగ్గుబిళ్లలు తీసుకుని చప్పరించడం ద్వారా దగ్గును కొంతకాలం పాటు తగ్గించుకోవచ్చు.

దగ్గు మందు

ఫొటో సోర్స్, Getty Images

తేనె, నిమ్మరసం తాగితే..

పొడి దగ్గుకు ఇంట్లోనే వేడినీటిలో తేనె, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే, మందుల దుకాణాల్లో కొనే మందుల తరహా ఉపశమనాన్ని అందిస్తుంది.

దగ్గు, జలుబుతో బాధపడే ఏడాది కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు తేనె, నిమ్మరసాన్ని కలిపి నీటిని తాగించడం వల్ల కాస్త ఉపశమం కలుగుతుండొచ్చని కోక్రాన్ రివ్యూ గుర్తించిందని ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

కాఫ్

ఫొటో సోర్స్, Getty Images

కాస్త సమయం తీసుకోండి

మన శరీరం నుంచి కఫాన్ని బయటకు పంపేందుకు దగ్గు రావడం అవసరం.

''తెమడ బయటికి వచ్చేంత వరకు దగ్గుతూనే ఉంటా. నా దగ్గును లోపలే ఉంచుకోను. ఒకవేళ మీరు కూడా అలానే చేస్తే, టిస్యూను వాడండి'' అని ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

ఒకవేళ దాన్ని మింగినా, ఎలాంటి హాని కలిగించదు. కడుపులో వేగంగా కరిగిపోతుంది.

ఒకవేళ దగ్గినప్పుడు వచ్చే కఫం గోధుమ ముదురు రంగులో ఉంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, దానిలో రక్తం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

కొన్ని వారాల తర్వాత దగ్గు దానికదే పోతుంది. యాంటీబయోటిక్స్ అవసరం లేదు. కానీ, మూడు వారాలకు మించి దగ్గు ఉంటే, కచ్చితంగా డాక్టర్‌కు చూపించుకోవాలని ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)