ఇంట్లో వెలిగించుకునే అగరుబత్తీలు ఎందుకు ప్రమాదకరం?

అగరుబత్తీలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పండగల సమయంలో, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. చాలామంది సువాసన వెదజల్లే అగరుబత్తీలు వెలిగిస్తుంటారు.

అయితే, అగరుబత్తీల నుంచి వచ్చే పొగ, వాటి వాసన చాలామందికి అనారోగ్య సమస్యలను కలగజేస్తున్నాయని వివిధ సైన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

ఇటీవల పల్మనాలజిస్ట్ సోనియా గోయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో.. ప్రతిరోజూ అగరుబత్తీల పొగను పీల్చడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించారు. అగరుబత్తీలు ఊపిరితిత్తులకు స్లో పాయిజన్ లాంటివని ఆమె హెచ్చరించారు.

అగరుబత్తీల నుంచి విడుదలయ్యే పొల్యుటెంట్లు (కాలుష్య కారకాలు) కాలక్రమేణా ఊపిరితిత్తులను నాశనం చేస్తాయని, ఇవి ప్యాసివ్ స్మోకింగ్ అంత ప్రమాదకరమని తెలిపారు.

అగరుబత్తీల పొగను పీల్చడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అలర్జీ, ఆస్తమా ఉన్న వారికి, పిల్లలకు, పెద్దలకు తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని గత ఏడాది బోస్టన్‌లో జరిగిన అమెరికన్ కాలేజీ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ (ఏసీఏఏఐ) తన వార్షిక శాస్త్రీయ సమావేశంలో హెచ్చరించింది.

ఇల్లినాయిస్‌లోని అర్లింగ్టన్‌ హైట్స్‌ ప్రధాన కార్యాలయంగా 6 వేల మందికి పైగా వైద్య నిపుణులతో నడిచే ప్రొఫెషనల్ మెడికల్ సంస్థ ఇది.

ఈ సంస్థ నివేదించిన పేపర్‌లో.. అగరుబత్తీల నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల తలనొప్పి, శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, చర్మ సమస్యలు, అలర్జిక్ రియాక్షన్లు వస్తుంటాయని హెచ్చరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అగరుబత్తీని కాల్చడం వల్ల ఒక్కో గ్రాముకు 45 మిల్లీగ్రాముల సూక్ష్మకణాలు (పార్టిక్యులేట్ మ్యాటర్, పీఎం) విడుదల అవుతుండగా, సిగరెట్ల నుంచి ఒక్కో గ్రాముకు 10 మిల్లీగ్రాములు విడుదల అవుతాయని ఏసీఏఏఐ సంస్థ తన నివేదికలో తెలిపింది.

అంటే, సిగరెట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా దీని నుంచే విడుదల అవుతాయి.

అగరుబత్తీలను కాల్చడం వల్ల విడుదలయ్యే పొగతో గుండె సంబంధిత వ్యాధుల మరణాలు 1.12 రెట్లు , స్ట్రోక్ మరణాలు 1.19 రెట్లు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలిందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.

''అగరుబత్తీలు కాల్చే వాళ్లు దీనివల్ల ఆరోగ్యసమస్యలొస్తాయని ముఖ్యంగా పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించడం లేదు'' అని ఏసీఏఏఐ సభ్యులు, వారు చేసిన అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ రచయిత, అలర్జిస్ట్.. మ్యారీ లీ-వాంగ్ తెలిపారు.

కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా.. అగరుబత్తీలు గాలి కాలుష్యానికి కూడా కారణమవుతాయని, కొన్నిసార్లు అగ్నిప్రమాదాలకు కూడా కారణం కావచ్చని ఏసీఏఏఐ సంస్థ పేర్కొంది.

అగరుబత్తీలు

ఫొటో సోర్స్, Getty Images

అగరుబత్తీల్లో ఉండే కాలుష్య కారకాలు ఏమిటి?

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అగరుబత్తీలు విడుదల చేసే కాలుష్య కారకాల గురించి కింద చూద్దాం.

పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం).. 2.5 మైక్రోమీటర్ (μm) కంటే తక్కువ డయామీటర్ ఉన్న పార్టికల్స్‌ను ఫైన్ పార్టికల్స్‌గా చెబుతుంటారు. ఇవి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఎందుకంటే, ఇవి శ్వాసకోశ వ్యవస్థలో చివరి పాయింట్ వరకు వెళ్తాయి. అగరుబత్తీలు, సిగరెట్, క్యాండిల్స్ వంటివి ఇళ్లల్లో పార్టికల్స్ విడుదలకు ప్రధాన కారకంగా ఉంటున్నాయి. పార్టిక్యులేట్ మ్యాటర్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ సమస్యలు, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ (గుండె సంబంధిత వ్యాధులు), ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం, అకాల మరణం వంటివి సంభవించవచ్చు. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం కూడా ఎక్కువే.

కార్బన్ మోనాక్సైడ్ (సీఓ).. ఆర్గానిక్ కాంపౌండ్లను సరిగ్గా మండించకపోవడం వల్ల ఇవి విడుదల అవుతాయి. ఈ సమ్మేళనాలు కార్బాక్సీహీమోగ్లోబిన్‌ను ఏర్పాటు చేసి రక్తంలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ మోతాదులో ఇవి మన శరీరంలోకి వెళ్తే తలనొప్పి, అలసట, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ మోతాదులో వెళ్తే, ప్రాణాలకు ప్రమాదకరం కావొచ్చు.

సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్... ఇవి అప్పటికే ఉన్న కార్డియోవాస్క్యులర్ వ్యాధిని, ఊపిరితిత్తుల సమస్యను, శ్వాసకోశ సంబంధిత జబ్బులను మరింత తీవ్రం చేస్తాయి. ఊపిరితిత్తుల సహజ రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్.. వివిధ రకాల ఘన, ద్రవ పదార్థాల నుంచి గ్యాస్‌ల రూపంలో విడుదలయ్యే పలు ఆర్గానిక్ కెమికల్స్. ఈ కెమికల్స్ పలు వస్తువులు, ఇండస్ట్రియల్, కమర్షియల్ ప్రొడక్టులలో ఉంటాయి. ఈ కెమికిల్స్ వల్ల కళ్లు ఎర్రగా మారి వాపు రావడం.. ముక్కు, గొంతులో ఇరిటేషన్.. వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. దీర్ఘకాలం పాటు ఈ రసాయన సమ్మేళనాలను పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.

ఆల్డిహైడ్స్.. ఇవి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లలో మరో రకం. ఇవి బాగా ఇరిటేషన్ కలిగించే సమ్మేళనాలు. ముక్కులోని శ్లేష్మ పొరలు (నాసల్ మ్యూకస్ మెంబ్రేన్స్), ఓరల్ ప్యాసేజ్‌లపై ప్రభావం చూపుతాయి. బర్నింగ్ సెన్సేషన్‌ కలిగిస్తాయి. దగ్గు వస్తుంది. ఫార్మాల్డీహైడ్‌లకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం కూడా ఆందోళనకరం. దీన్నొక క్యాన్సర్ కారకంగా వర్గీకరించారు.

పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్.. ఆ రసాయన సమ్మేళనాలు ఫెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) ముప్పును పెంచే అవకాశం ఉంది.

స్మోక్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి ఎక్కువ ప్రమాదకరం?

పిల్లలకు, కుటుంబంలోని పెద్దవారికి, ఆస్తమా ఉన్నవారికి, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్న వారికి అగరుబత్తీల పొగ పీల్చడం వల్ల బాగా ప్రమాదం.

ఏళ్ల పాటు వీటి పొగ పీల్చడం వల్ల ఆస్తమా పెరిగే ప్రమాదం ఉంది. సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి వెలిగించే గదులకు సరైన వెంటిలేషన్ లేనప్పుడు మరింత ప్రమాదకరమవుతుంది.

ఈ పొగ మనిషి డీఎన్ఏపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

''అగరుబత్తీల పొగ వల్ల సీఓపీడీ ప్రమాదం ఎక్కువ . ఎక్కువ వెలిగించేవారికి, పొగ పీల్చే వారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. అప్పటికే ఆస్తమా ఉన్నవారికి సీఓపీడీ త్వరగా వస్తుంది. ఆస్తమా లేని వారికైతే పది నుంచి పదేళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ'' అని నిమ్స్‌ ఆస్పత్రిలోని పల్మనాలజిస్ట్ డాక్టర్ అనుదీప్ పోతిన చెప్పారు.

''పిల్లల్లో పీరియాడిక్ ఆస్తమాలు ఎక్కువయ్యాయి. ఈ డిసీజ్ ఉన్నప్పుడు పిల్లలు నిరంతరం దగ్గుతూనే ఉంటారు. ఈ సమయంలో పిల్లల్ని వెంటనే పల్మనాలజిస్ట్‌కు చూపించాలి. పిల్లలకు ఇబ్బంది కలిగించే అగరుబత్తీల పొగ, బూజు దులపడం, దోమల కాయిల్స్ వంటివి వారికి దూరంగా ఉంచాలి. ఆస్తమా ఉన్నవారికి అగరుబత్తీల పొగ వల్ల మరింత ఇబ్బంది అవుతుంది. అగరుబత్తీలు వెలిగించిన వెంటనే పిల్లలు, ఇబ్బందులు ఉన్నవారు బయటికి రావాలి. ఆ పొగ పీల్చకుండా జాగ్రత్త పడాలి'' అని డాక్టర్ అనుదీప్ పోతిన సూచించారు.

అగరుబత్తీలు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ఎక్కువ సేపు ఈ పొగ బారిన పడకుండా చూసుకోవాలి.
  • అగరుబత్తీలను వెలిగించినప్పుడు కిటికీలు తెరిచి ఉంచండి.
  • చిన్నపిల్లలు ఉంటే అగరుబత్తీలు వెలిగించకపోవడమే మంచిది.
  • ఒకవేళ వెలిగించాల్సి వస్తే, పిల్లలను ఆ పొగకు దూరంగా ఉంచండి.

అయితే, మార్కెట్లో పర్యావరణ అనుకూలమైన అగరుబత్తీలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఎంత ఆర్గానిక్, పర్యావరణహితమైనప్పటికీ, పొగ పీల్చడం వల్ల ప్రజలకు ఎఫెక్ట్ ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఆర్గానిక్, పర్యావరణహితమైనవిగా చెబుతున్న అగరుబత్తీలు పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైనవా? కావా? అన్నది బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)