చేప వీర్యం: దీంతో తయారైన ఫేషియల్ ఇంజెక్షన్లు ముఖాలను అందంగా మార్చుతాయా?

ఫేషియల్ ఇంజెక్షన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రత్ క్లెగ్
    • హోదా, హెల్త్, వెల్‌బీయింగ్ రిపోర్టర్

చాలా ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న నేను, ముఖంలోకి ట్రౌట్ స్పెర్మ్‌ను (చేప వీర్యకణాలను) ఎక్కించుకోవడం ఎలా ఉంటుందో ఒకరిని అడగాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

నేను దక్షిణ మాంచెస్టర్‌లోని ఒక ఈస్తటిక్స్ క్లినిక్‌కి వెళ్లాను. అక్కడ పెద్దగా, వాలుగా ఉన్న నలుపు రంగు కుర్చీలో అబ్బీ ( ఓ మహిళ పేరు) పడుకుని ఉన్నారు.

ఒక చిన్న కాన్యులాను (సూదిని) ఆమె బుగ్గలోకి సున్నితంగా చొప్పిస్తుండగా, ఆ నొప్పితో ఆమె మొహం చిట్లిస్తున్నారు. ''ఔచ్.. ఔచ్'' అంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు.

ట్రౌట్ లేదా సాలమన్ చేపల స్పెర్మ్ నుంచి తీసిన పాలీన్యూక్లియోటైడ్స్ అని పిలిచే డీఎన్ఏ తునకలను ఆమె ముఖం కింద భాగంలో ఎక్కిస్తున్నారు.

చేపల వీర్యం నుంచి తీసిన డీఎన్ఏను ఎక్కించడం వెనకున్న కారణం మనుషులు, చేపల డీఎన్ఏల మధ్య సారూప్యతే.

అబ్బీ, ఫేషియల్ ఇంజెక్షన్

అబ్బీ తన చర్మంలోకి చేప డీఎన్ఏకు చెందిన ఈ చిన్న కణాలను ఎక్కించుకోవడం వల్ల...ఆమె చర్మ కణాలు చర్యకు గురై, మరింత కొల్లాజెన్, ఎలాస్టిన్‌ ఉత్పత్తి చేస్తాయి.

ఈ రెండు ప్రొటీన్లు చర్మం బిగుతుగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడతాయి.

అబ్బీ దృష్టిలో ఈ చికిత్స ఆమె చర్మానికి తాజాదనం ఇస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే, ఎన్నో ఏళ్లుగా తనను ఇబ్బంది పెడుతున్న మొటిమల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందనీ, ముఖం మీద మరకలు, ఎరుపు రంగు తగ్గుతాయని ఆమె భావిస్తున్నారు.

పాలీన్యూక్లియోటైడ్స్ అనేది స్కిన్‌కేర్ రంగంలో ''మిరాకిల్'' కాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అనేకమంది ప్రముఖులు ''సాలమన్ వీర్యంతో ఫేషియల్స్'' గురించి ఓపెన్‌గా మాట్లాడుతుండటంతో దీనికి చాలా వేగంగా ప్రాచుర్యం లభిస్తోంది.

ఈ ఏడాది మొదట్లో చార్లీ ఎక్స్‌సీఎక్స్ (బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ ) తన 90 లక్షల మంది ఫాలోయర్స్‌తో మాట్లాడుతూ, ఫిల్లర్ల కథ ముగిసిపోయిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

డీప్ విటమిన్స్ వంటి పాలీన్యూక్లియోటైడ్స్‌ చికిత్సకు తాను మారినట్లు ఆమె వివరించారు.

ప్రారంభంలో ఈ చికిత్సపై అనుమానాలు ఉన్నప్పటికీ, నిజంగా పాలీన్యూక్లియోటైడ్స్ మన చర్మ సంరక్షణను మార్చేస్తున్నాయా?

''బెంజమిన్ బటన్ మూవ్‌మెంట్‌ను మనం చూస్తున్నాం'' అని ఈస్తటిక్స్ కంపెనీ డెర్మాఫోకస్‌లో పనిచేసే సుజానే మాన్స్‌ఫీల్డ్ నాతో చెప్పారు.

ఇది 2008లో వచ్చిన 'ది క్యూరియస్ కేసు ఆఫ్ బెంజమిన్ బటన్' చిత్రంలోని హీరో బ్రాడ్ పిట్ వృద్ధాప్యం నుంచి బాల్యంలోకి వెళ్లే కథను చూపించారు.

వయస్సు వెనక్కి మళ్లడం చాలా వరకు అసంభవం. ఇది కాస్త కలవరపెట్టే విషయమైనప్పటికీ, రీజనరేటివ్ స్కిన్‌కేర్ (చర్మాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే చర్మ సంరక్షణ విధానం) విషయంలో పాలీన్యూక్లియోటైడ్స్ మార్గం చూపిస్తున్నాయని మాన్స్‌ఫీల్డ్ చెబుతున్నారు.

పాలీన్యూక్లియోటైడ్స్‌ను శరీరంలోకి చొప్పించుకోవడం ద్వారా చర్మాన్ని పునరుద్ధరించుకోవచ్చని క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయి.

ఇవి కేవలం చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడమే కాకుండా.. ఫైన్ లైన్స్‌ను (గీతలను), రింకిల్స్‌ను (ముడతలను), స్కార్స్‌ను (మచ్చలను) తగ్గించే అవకాశం ఉంది.

అయితే, పాలీన్యూక్లియోటైడ్స్ చికిత్స ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

పాలీన్యూక్లియోటైడ్స్ ఇంజెక్షన్లు వేయించుకునేందుకు సింగిల్ సెషన్‌లోనే 200 పౌండ్ స్టెర్లింగ్ నుంచి 500 పౌండ్ స్టెర్లింగ్ వరకు ఖర్చువుతుంది. అంటే భారత కరెన్సీలో రూ.23,451 నుంచి రూ.58,628.

అంతేకాక, ఇలాంటి సెషన్లను కొన్ని వారాల వ్యవధిలో మూడుసార్లు తీసుకోవాలని క్లినిక్‌లు సూచిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అబ్బీ

పాలీన్యూక్లియోటైడ్స్ తీసుకున్న తర్వాత ఆ అందాన్ని కొనసాగించేందుకు ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకు ఒకసారి టాప్ అప్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నాయి.

పాలీన్యూక్లియోటైడ్స్‌కు గత 18 నెలలుగా చాలా పాపులారిటీ పెరిగిందని అబ్బీకి చికిత్స చేసిన స్కిన్ హెచ్‌డీ క్లినిక్‌ యజమాని, ఈస్తటిక్ నర్స్ ప్రాక్టీషనర్ హెలెనా డంక్ చెప్పారు.

''నా క్లయింట్స్‌లో సగం మంది చాలా తేడాను గమనించారు. వారి చర్మం మరింత హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యకరంగా, చిన్నవయసు వారిలా మారిపోయినట్లు భావించారు. సగం మంది పెద్దగా తేడాను చూడనప్పటికీ, వారి చర్మం బిగుతుగా, తాజాగా మారింది'' అని తెలిపారు.

అబ్బీ ఇప్పటికే ఈ క్లినిక్‌లో మూడుసార్లు చేయించుకునే ట్రీట్‌మెంట్ సెషన్స్‌లో భాగంగా తన కళ్ల కింద ఇంజెక్షన్లను తీసుకున్నారు. దీని ఫలితాలపై ఆమె సంతోషంగా ఉన్నారు.

పాలిన్యూక్లియోటైడ్స్‌కు చెందిన చాలా చిన్న ఇంజెక్షన్లను అబ్బీ పొడిపించుకున్నారు. ఇది చాలా బాధాకరమైన ప్రక్రియ. అయితే, తన కంటి కిందనున్న డార్క్ సర్కిల్స్ తగ్గాయని అబ్బీ చెబుతున్నారు.

అయితే, ఇది సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అని చాలా అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, ఇది పూర్తిగా కొత్త చికిత్స విధానమనీ, ఈ ప్రచారం సైన్స్‌ను మించిపోనుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

''మన శరీరాల్లో న్యూక్లియోటైడ్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయని మనకు తెలుసు. ఇవి డీఎన్ఏకు చెందిన బిల్డింగ్ బ్లాక్స్ (ప్రాథమిక నిర్మాణ భాగాలు). అయితే, సాలమన్ డీఎన్ఏను చిన్న తునకలుగా చేసి మన ముఖంలోకి ఎక్కించుకున్నప్పుడు అవి మన సొంత న్యూక్లియోటైడ్స్ లాగా పనిచేస్తాయా అన్నది ప్రశ్నార్థకం'' అని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టన్ జాన్ పగ్లియారో అన్నారు.

పాలిన్యూక్లియోటైడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాలమన్ చేపలు

పాలీన్యూక్లియోటైడ్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన విధానాన్ని ''సాలమన్ గేట్'' లాగా చార్లోట్ బిక్లీ వర్ణించారు.

న్యూయార్క్‌కు చెందిన ఈ 31 ఏళ్ల యువతి గతేడాది తన వివాహానికి కొద్ది రోజుల ముందు ''వెడ్డింగ్ గ్లోఅప్''(పెళ్లికి ముందు అందంగా, ఆకర్షణీయంగా మారేందుకు సిద్ధమవ్వడం)లో భాగంగా ఈ చికిత్సను తీసుకున్నారు.

కానీ, ఈ చికిత్స తర్వాత చార్లెట్‌కు స్కిన్ ఇన్‌ఫెక్షన్‌, వాపు వచ్చింది. చికిత్స చేయించుకోకముందు కంటే, ఆ తర్వాతనే ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ రింగ్స్) మరింత పెరిగాయి.

''నేను కావాలనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఈ చికిత్స ఫలితం ఉంది'' అని ఆమె తెలిపారు. ''నేను వైద్యుడిని నమ్మాను. కానీ, ఆయన నన్ను భయపెట్టారు'' అని చెప్పారు.

‘‘కళ్ల కింద మరింత లోతుగా ఇంజెక్షన్లు ఇచ్చారు, అందుకే ఈ రియాక్షన్లు’’ అని చార్లోట్ అన్నారు.

ఈ చికిత్స ద్వారా కళ్ల కింద ఎర్రబడటం, వాపు వంటి దుష్ప్రభావాలు వస్తాయి. కానీ, అవి తాత్కాలికంగా మాత్రమే ఉండే అవకాశం ఉంది.

కొన్ని కేసుల్లో ప్రజలకు అలర్జిక్ రియాక్షన్లు ఉంటాయి. పాలీన్యూక్లియోటైడ్స్‌ను సరిగ్గా ఎక్కించకపోతే, స్కిన్ పిగ్మెంటేషన్, ఇన్‌ఫెక్షన్లు వంటి దీర్ఘకాల ప్రమాదాలు వెంటాడుతాయి.

పాలీన్యూక్లియోటైడ్స్‌ను యూకే వ్యాప్తంగా బాగా వాడుతున్నారు. మెడిసిన్స్ హెల్త్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) కింద వైద్య పరికరాల కింద రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఔషధాల మాదిరిగా వీటిని నియంత్రించడం లేదు.

అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు సమానమైన యూకేలోని సంస్థ దీన్ని ఆమోదించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)