తలస్నానం సరిగ్గా చేస్తున్నామా?నాలుగు అపోహలు-నిపుణుల సూచనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎమిలీ హోల్ట్, యాస్మిన్ రుఫో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జుట్టు ఆరోగ్యంగా, అందంగా నిగనిగలాడుతూ కనిపించాలని అందరూ కోరుకుంటారు.
జుట్టుకు సంబంధించి రకరకాల ప్రోడక్టులు, ట్రెండ్‌లు, టిక్‌టాక్ టిప్స్‌కు కొదవే లేదు. అయితే, వీటన్నింటిని ఫాలో అవుతూ ప్రాథమిక అంశాలను మనం మర్చిపోతున్నామని అంటున్నారు నిపుణులు.
ఆరోగ్యమైన జుట్టు కోసం డబ్బులు బాగా ఖర్చు చేయడం, కఠినమైన పద్ధతులు పాటించడం కాదు, సింపుల్ విధానాలను సరిగ్గా పాటించాలని చెబుతున్నారు.
జుట్టు సంరక్షణలోని నాలుగు సాధారణ అపోహల గురించి యూకే హెయిర్ కన్సల్టెంట్స్‌కు చెందిన ట్రైకాలజిస్ట్ ఈవా ప్రోడ్‌మన్, హెయిర్ అండ్ స్కాల్ప్ క్లినిక్‌కు చెందిన హెయిర్ ఎక్స్‌పర్ట్ ట్రేసీ వాకర్ బీబీసీకి వివరించారు. అవేంటో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images

మెరిసే జుట్టు కోసం మీరెప్పుడైనా వణికించేంత చల్లటి నీళ్లతో తల స్నానం చేశారా?
చల్లటి నీరు మీ జుట్టుకు ఎలాంటి అదనపు మెరుపును అందించదని ప్రోడ్‌మన్ చెబుతున్నారు. కాబట్టి, ఇక మీరు ఆ చల్లటి నీటిని వదిలేసి హాయిగా వెచ్చని నీళ్ల స్నానాన్ని ఆస్వాదించవచ్చు.
''బాగా చల్లగా ఉండే నీటితో తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానితో ఏ ప్రయోజనం రాదు. రసాయనాలు, వేడి, కాలుష్యపూరిత వాతావరణం నుంచి మీ జుట్టును ఎలా కాపాడుకుంటారనేది ఇక్కడ ముఖ్యం'' అని ప్రోడ్‌మన్ అన్నారు.
అలాగే బాగా వేడి నీటితో కూడా తల స్నానం చేయకూడదని ఆమె సూచించారు. అలా చేయడం వల్ల జుట్టు డీహైడ్రేట్ కావొచ్చని అన్నారు. వేడి నీళ్లతో ఒళ్లు కాలినట్లే కుదుళ్లు కూడా ప్రభావితమవుతాయని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

హెయిర్ డ్రెస్సర్ వద్దకు వెళ్లకుండా చిట్లిపోయిన జుట్టు చివర్ల( స్ల్పిట్ ఎండ్స్)ను సరిచేసుకోవాలని మీరు అనుకుంటున్నట్లయితే మీకు నిరాశ తప్పదు. ఎందుకంటే స్ల్పిట్ ఎండ్స్ సమస్యకు హెయిర్ కట్ మాత్రమే పరిష్కారమని అంటున్నారు.
'జుట్టు చివర్లు చీలిపోతే దాన్ని సరిచేయడానికి ఇంకో మార్గం లేదు. చీలిపోయినట్లుగా కనిపించే వెంట్రుకను మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఆ వెంట్రుకకు రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువగా చీలికలు ఉన్నట్లు కనిపిస్తాయి. మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులు జిగురులా పనిచేసి ఆ వెంట్రుక మళ్లీ ఒకటిలా అతికేలా చేస్తాయి. ఇది తాత్కాలిక పరిష్కారమే'' అని ప్రోడ్‌మన్ వివరించారు.
జుట్టు సమస్యకు పరిష్కారంగా కనిపించే ఉత్పత్తుల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయొద్దని ఆమె హెచ్చరిస్తున్నారు.
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందనే వాదన తప్పని ఆమె అన్నారు.
‘‘వేగంగా పెరిగేలా చేయడం అసాధ్యం. కాబట్టి ఆ హామీ ఇచ్చే ఏ ప్రోడక్టయినా అబద్ధం చెబుతున్నట్లే’’ అని ఆమె స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

జుట్టును అరుదుగా లేదా అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటామని చెప్పే చాలామందిని మీరు చూసే ఉంటారు.
కానీ, అలా చేయడం జుట్టుకు ఏమాత్రం మంచిదికాదని ప్రోడ్‌మన్ అంటున్నారు.
''మీ కుదుళ్లలో 1,80,000 నూనె గ్రంథులు ఉంటాయి. జుట్టును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోకపోతే జిడ్డు, మురికి పేరుకుపోతుంది'' అని ప్రోడ్‌మన్ చెప్పారు.
వాకర్ కూడా ఈ మాటతో ఏకీభవించారు.
‘‘జుట్టును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోకపోతే దుర్వాసన వస్తుంది. అలాగే తలపై చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. జుట్టు జిడ్డుగా మారడం వల్ల ఈస్ట్, బ్యాక్టీరియా పేరుకుపోయి దురద కలుగుతుంది’’ అని ఆమె చెప్పారు.
మీ జుట్టు చాలా జిడ్డుగా ఉంటే లేదా మీరు ఎక్కువగా ఉత్పత్తులు వాడితే రెండు రోజులకొకసారి తలస్నానం చేయాలని ప్రోడ్‌మన్ సూచిస్తున్నారు.
జుట్టు బాగా జిడ్డుగా అయ్యేవారికి క్లెన్సింగ్ షాంపూలతో ప్రయోజనం కలగొచ్చని, పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్ రహిత షాంపూలను వాడితే మంచిదని హడర్స్‌ఫీల్డ్ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ లారా వాటర్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మనకు ఉండే బిజీ షెడ్యూల్‌లో రోజూ తలస్నానం చేయడం, జుట్టు ఆరబెట్టడం, స్టయిలింగ్ చేయడం కుదరకపోవచ్చు. దీంతో చాలామంది కుదుళ్ల నుంచి జిడ్డు కారకుండా ఉండేందుకు, తలస్నానం చేయకుండానే జుట్టు తాజాగా కనిపించేందుకు డ్రై షాంపూలను ఆశ్రయిస్తారు.
డ్రై షాంపూ వాడటం మంచిదేనని, కాకపోతే రెండు తలస్నానాల మధ్య ఒకసారి మాత్రమే వాడాలని ఆమె సూచిస్తున్నారు.
''తలస్నానం చేయకుండా, వరుసగా రోజూ డ్రై షాంపూ వాడటం సమస్యలకు దారి తీస్తుంది. ఇలా చేయడం వల్ల కుదుళ్లలోని సహజ నూనెల్ని షాంపూ పీల్చేసుకుంటుంది. తలపై ఈస్ట్ పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే దురద, చుండ్రు, పొట్టు రాలడం వంటివి జరుగుతాయి'' అని ప్రోడ్‌మన్ చెప్పారు.
చివరగా ఆమె సలహా ఏంటంటే, మీ ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అదే విధంగా తలలోని చర్మంపై కూడా ధ్యాస పెట్టాలి అని.
ముఖాన్ని కడగకుండా, మేకప్‌ను శుభ్రం చేసుకోకుండా మళ్లీ ముఖంపై మేకప్ వేసుకుంటూనే ఉండరు కదా, ఇది కూడా అంతేనంటారామె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














