భారత్: క్యాన్సర్ కేసులు మహిళల్లోనే ఎక్కువ, మరణాలు మాత్రం పురుషుల్లో ఎక్కువ, ఎందుకు?

క్యాన్సర్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసుల్లో సగానికి పైగా మహిళలే, కానీ ఈ రోగ కారణాలతో మృతి చెందినవారిలో అధిక భాగం పురుషులే
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయ మహిళలలో క్యాన్సర్ విస్తరిస్తోంది. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా మహిళలే ఉన్నారు. కానీ క్యాన్సర్ కారణంగా చనిపోయినవారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.

ఈ వైరుధ్యం దేశవ్యాప్తంగా నమోదైన క్యాన్సర్ కేసులపై తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ గణాంకాల ప్రకారం, భారతదేశంలో క్యాన్సర్ ఒక అసాధారణ వ్యాధిగా కనిపిస్తోంది.

2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల క్యాన్సర్ కేసులు నిర్ధరణ అయ్యాయి. వారిలో దాదాపు 1.03 కోట్ల మంది పురుషులు కాగా, మహిళలు 97 లక్షల మంది.

సగటున ప్రతి లక్ష మంది జనాభాలో 197 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. లింగపరంగా చూస్తే, పురుషుల పరిస్థితి 212 కాగా, మహిళలకు ఇది 186గా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్యాన్సర్

ఫొటో సోర్స్, MIT

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులే ఎక్కువ

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అందిస్తున్న వివరాల ప్రకారం, అమెరికాలో క్యాన్సర్ వచ్చే జీవితకాల ప్రమాదం మహిళలకు, పురుషులకు దాదాపు సమానంగా ఉంటుంది.

భారతదేశంలోని మహిళల్లో రొమ్ము, గర్భాశయం, అండాశయ క్యాన్సర్లే అత్యంత సాధారణంగా కనిపిస్తున్నాయి. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులే 40 శాతం వరకూ ఉన్నాయి.

గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువగా హ్యూమస్ పాపిల్లోవైరస్ (హెచ్‌పీవీ) వంటి ఇన్ఫెక్షన్లతో ముడిపడినవే. రొమ్ము, అండాశయ క్యాన్సర్లు మాత్రం హార్మోన్ల కారకాలతో తరచుగా ప్రభావితమవుతున్నాయి. ఈ హార్మోన్ సంబంధిత కారణాలతో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు జీవనశైలి మార్పులతోనూ సంబంధం ఉంటోంది. ఆలస్యంగా గర్భధారణ, పిల్లలకు తల్లిపాలు పట్టకపోవడం, ఊబకాయం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొనే శారీరక శ్రమలేని ఉద్యోగాలు తదితరవన్నీ జీవనశైలి మార్పులే.

పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల, ప్రోస్టేట్ క్యాన్సర్లే అధికంగా ఉంటున్నాయి. వాటిలో నివారించగల ముఖ్యంగా నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు 40 శాతం పొగాకు కారణమవుతోంది.

క్యాన్సర్ పేషెంట్లు, సిగరెట్ స్మోకింగ్

ఫొటో సోర్స్, Gautam Bose

ఫొటో క్యాప్షన్, పురుషులకు ఎక్కువగా వస్తున్న నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు 40 శాతం ధూమపానమే కారణం

మగవారే ఎందుకు ఎక్కువగా చనిపోతున్నారు?

మహిళలకు సాధారణంగా వచ్చే క్యాన్సర్లను అవగాహన కల్పించేలా ప్రచారాలు, మెరుగైన సౌకర్యాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు.

కొన్ని క్యాన్సర్లు చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అలాంటివాటిని తొందరగా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి చికిత్సా ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ కారణంవల్ల మహిళలలో మరణాల రేటు తక్కువగా ఉంటుంది.

పురుషుల పరిస్థితే దారుణంగా ఉంది. వారికి తరచుగా వచ్చే క్యాన్సర్లు జీవనశైలితో ముడిపడి ఉంటాయి.

పొగాకు, మద్యం ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను ప్రేరేపిస్తాయి. ఈ రెండు రకాల క్యాన్సర్లు దూకుడుగా విస్తరిస్తాయి, అలాగే చికిత్సకు తక్కువగా ప్రతిస్పందిస్తాయి. ముందస్తు వైద్య పరీక్షలకు వెళ్లడం, తగిన వైద్య సహాయం తీసుకోవడం పురుషుల్లో తక్కువ.

మహిళలతో పోలిస్తే క్యాన్సర్‌కు గురికావడం పురుషుల్లో తక్కువగా ఉన్నప్పటికీ, మరణాలు ఎక్కువగా, చికిత్సతో ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి.

''ప్రజారోగ్య ప్రచారాల్లో మహిళల ఆరోగ్యం అధిక ప్రాధాన్యంగా మారింది. అది రెండు వైపులా కత్తి లాంటిది. విస్తృత అవగాహన, స్క్రీనింగ్ అంటే ఎక్కువ క్యాన్సర్ కేసులను ముందుగానే గుర్తించడం. పురుషులకు సంబంధించి ఇలాంటి చర్చ చాలా అరుదు. పొగాకు, నోటి క్యాన్సర్‌లను దాటి అరుదుగా వెళుతుంది'' అని సెంటర్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ (సీహెచ్ఐపీ) పౌండేషన్ అధినేత డాక్టర్ రవి మెహ్రూత్రా బీబీసీకి చెప్పారు.

పునరుత్పత్తి ఆరోగ్య పరీక్షల ద్వారా మహిళలు ఏదొక దశలో వైద్యుడిని సంప్రదించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకు భిన్నంగా చాలామంది పురుషులు జీవితాంతం వైద్యుడి దగ్గకు వెళ్లకుండానే గడిపేసే అవకాశం ఉందని డాక్టర్ మెహ్రూత్రా అన్నారు.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

అసమాన విస్తరణ

కానీ గణాంకాల విషయానికొచ్చేసరికి అసలు కథ వెలుగులోకి వస్తుంది.

భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అన్ని రకాల క్యాన్సర్ల భారం అసమానంగా విస్తరించింది.

43 క్యాన్సర్ రిజిస్ట్రీల నుంచి వచ్చిన డేటా ప్రకారం, భారతదేశంలోని ప్రతి వంద మందిలో 11 మందికి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. పర్వతాలతో కూడిన మారుమూల ఈశాన్య ప్రాంతం భారతదేశంలో క్యాన్సర్ హాట్‌స్పాట్‌గా మారిపోయింది.

జాతీయ సగటు కంటే రెండింతలు జీవితకాల ముప్పులను మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లా నమోదుచేస్తోంది.

ఈ పరిస్థితికి జీవనశైలి కూడా చాలావరకూ కారణమని వైద్యులు చెబుతున్నారు.

''ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రకాల క్యాన్సర్లకు జీవనశైలి కీలకమైన అంశమని నేనే భావిస్తున్నాను. ఇక్కడ పొగాకు వాడకం విపరీతంగా ఉంది. ఇతర చోట్ల కంటే చాలా ఎక్కువ'' అని అస్సాంలోని కాచర్ క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రం అధిపతి రవి కన్నన్ బీబీసీతో అన్నారు.

''అస్సాంలోని బరాక్‌ లోయలో ఎక్కువ మంది పొగాకు నములుతారు. మిజోరాంలో కేవలం 25 కిలోమీటర్ల దూరంలో, ధూమపానం అత్యధికంగా ఉంటుంది. దీనికితోడు మద్యం, అరేకా గింజలు, మాంసం ఎలా వండుతారనేదీ ముఖ్యం. ఆహార పదార్థాల ఎంపిక, వాటి తయారీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ప్రత్యేక క్యాన్సర్‌ను కలిగించే జన్యువు ఏదీ లేదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే వంశపారంపర్య క్యాన్సర్లు ఇక్కడ ఎక్కువుగా కనిపించవు'' అని డాక్టర్ కన్నన్ వివరించారు.

కానీ ఈ ధోరణి ఈశాన్య ప్రాంతానికే పరిమితం కాలేదని డాక్టర్ కన్నన్ వెల్లడించారు.

''పురుషుల ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో కాశ్మీర్‌లోని శ్రీనగర్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ రొమ్ముక్యాన్సర్‌ కేసుల్లో అగ్రస్థానంలో ఉంది. దేశ రాజధాని దిల్లీలోని పురుషుల వయసు వ్యత్యాసాలను సరిదిద్దిన తర్వాత కూడా, ఇతర ప్రాంతాల్లోని పురుషుల కంటే ఎక్కువ రేటుతో అన్ని రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు'' అని కన్నన్ చెప్పారు.

క్యాన్సర్, ఈశాన్య రాష్ట్రాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో క్యాన్సర్ హాట్‌స్పాట్‌గా ఈశాన్య రాష్ట్రాలు మారుతున్నాయి

క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయడంలో అనేక సవాళ్లు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం, సంపన్న దేశాల్లో ప్రతి 12 మంది మహిళల్లో ఒకరికి తమ జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అవుతోంది. కానీ ప్రతి 71 మందిలో ఒకరు మాత్రమే క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

పేద దేశాల్లో చిత్రం తారుమారు అవుతోంది. ప్రతి 27 మంది మహిళల్లో ఒకరికి మాత్రమే రోగ నిర్ధరణ జరుగుతోంది. అయినప్పటికీ, ప్రతి 48 మందిలో ఒకరు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

''మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ) తక్కువగా ఉన్న దేశాల్లో మహిళలు అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాల్లో కన్నా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే అవకాశం 50 శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ, ఆలస్యంగా రోగ నిర్ధరణ, నాణ్యమైన చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల వారు క్యాన్సర్‌తో చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది'' అని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ)లో క్యాన్సర్ సర్వైలెన్స్ బ్రాంచ్ డిప్యూటీ హెడ్ ఇసాబెల్లే సోర్జోమాతరం చెప్పారు.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోనున్న అమెరికా మూలవాసులు అత్యధిక క్యాన్సర్ మరణాలను ఎదుర్కొంటున్నారు. మూత్రపిండాలు, కాలేయం, కడుపు, గర్భాశయ క్యాన్సర్ మరణాలు శ్వేతజాతీయుల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ. నల్ల జాతీయుల్లో ప్రోస్టేట్, కడుపు, గర్భాశయ క్యాన్సర్ల వల్ల మరణాలు శ్వేత జాతీయుల కన్నా రెట్టింపుగా ఉన్నాయి.

భారతదేశంలో క్యాన్సర్ భారం పెరగడమే కాదు మరింత క్లిష్టంగా మారుతోంది.

రిజిస్ట్రీ డేటా పరివర్తన చెందుతున్న సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ దీర్ఘాయువు, జీవనశైలి, పర్యావరణం ఆరోగ్యపరమైన సవాళ్లను పునర్నిర్మిస్తున్నాయి.

అయినప్పటికీ, అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లతో సహా జీవనశైలి మార్పు అత్యవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)