పుతిన్ భారత పర్యటన: అంతర్జాతీయంగా దీని ప్రాధాన్యం ఏంటి, ప్రపంచ మీడియా ఏమంటోంది? అమెరికా స్పందిస్తుందా?

భారత్, రష్యా, పుతిన్, మోదీ, ట్రంప్, యుక్రెయిన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4,5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యమిస్తారు.

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వ్లాదిమిర్ పుతిన్ దిల్లీ రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి.

భారత్, రష్యా మధ్య 'విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం' ఉంది. అనేక కీలక సందర్భాలలో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి.

పుతిన్ పర్యటనలో భారత్, రష్యా మధ్య అదనంగా ఎస్-400 సిస్టమ్స్, సుఖోయ్-57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరగవచ్చు.

అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన ఒక అవకాశాన్ని అందిస్తుంది.

అంతర్జాతీయ సమస్యలపై లోతైన చర్చలు జరగాల్సి ఉందని, ఈ పర్యటన అద్భుతంగా సాగుతుందని, విజయవంతమవుతుందని రష్యా అధికార టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ దేశ విదేశాంగ విధాన సలహాదారు యూరి యుషకోవ్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, రష్యా, పుతిన్, మోదీ, ట్రంప్, యుక్రెయిన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో చివరిసారి పుతిన్ భారత్‌లో పర్యటించారు.

‘ప్రపంచ భద్రతకు కొత్త రూపం’

పుతిన్ పర్యటన భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి కూడా నిదర్శనంగా నిలుస్తుంది. యుక్రెయిన్ సంక్షోభంలో రష్యాను ఒంటరి చేయాలనుకున్న పాశ్చాత్య దేశాల ఒత్తిడిని భారత్ ప్రతిఘటించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై భారీ సుంకాలు, ఆంక్షలు విధించారు. ఇది భారత్, అమెరికా మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది.

పుతిన్ పర్యటన భారతదేశం, రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇవ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ప్రపంచంలోని రెండు ముఖ్యమైన దేశాలైన భారత్, రష్యాల మధ్య బలమైన సంబంధాలు ఉండడం చాలా ముఖ్యమైన విషయం" అని మాజీ దౌత్యవేత్త మేజర్ జనరల్ (రిటైర్డ్) మంజీవ్ సింగ్ పురీ దూరదర్శన్‌తో అన్నారు.

"ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో, రష్యా దగ్గర తీసుకున్న ఆయుధాలు, ముఖ్యంగా ఎస్-400, భారత్ విషయంలో కీలక పాత్ర పోషించాయి. అత్యంత అధునాతనమైన ఎస్‌యు-57 యుద్ధ విమానాల గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు చారిత్రాత్మకంగా మిత్రదేశాలే కాకుండా అణుశక్తి వంటి అనేక రంగాలలో కొత్త భాగస్వామ్యాలవైపు కూడా ముందడుగు వేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

భారత్, రష్యా, పుతిన్, మోదీ, ట్రంప్, యుక్రెయిన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబరులో చైనాలో మోదీ, పుతిన్ సమావేశమయ్యారు.

ఇంతకుముందు పుతిన్ భారత్‌కు ఎప్పుడొచ్చారు?

యుక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు భారత్, రష్యా రెండూ అగ్రనాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాయి. యుక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ బెదిరించిన తర్వాత, భారత అగ్రనాయకత్వం డిసెంబరు 2022లో పుతిన్‌తో సమావేశం కాలేదని ఉన్నత వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ తెలిపింది .

గత ఏడాది అక్టోబర్ 2024లో రష్యా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. ఆ సమయంలో పుతిన్, మోదీ సమావేశమయ్యారు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2024లో తొలిసారి రష్యా వెళ్లారు. ఆ సమయంలో కూడా ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. నరేంద్ర మోదీ మూడవ పదవీకాలంలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన కూడా ఇదే.

కియేవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి తర్వాత అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో మోదీ, పుతిన్‌లు కలిశారు. ఆ సమావేశంలో మోదీని కౌగిలించుకున్న పుతిన్ భారత ప్రధానిని తన ‘స్నేహితుడు’గా అభివర్ణించారు.

పుతిన్ ప్రస్తుత భారత పర్యటన గురించి మీడియాలో కథనాలు వచ్చాయి.

భారత్-రష్యా సంబంధాలు, పుతిన్ భారత పర్యటనపై బ్లూమ్‌బెర్గ్ లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఇలా ఉంది. "ఈ ఏడాది భారత ప్రధాని మోదీ రష్యాలో పుతిన్‌తో సమావేశమైనప్పుడు అమెరికా ఆందోళన పడింది. యుక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడిని ఒంటరిని చేయాలని అమెరికా కోరుకుంటోంది. అయితే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బ్యాలన్స్ చేయడానికి భారత్ కూడా తనకు అవసరమని అమెరికా అర్థం చేసుకుంది" అని రాశారు.

భారత్, రష్యా, పుతిన్, మోదీ, ట్రంప్, యుక్రెయిన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్, రష్యాల మధ్య చారిత్రక స్నేహం ఉంది.

భారత్-రష్యాల మధ్య పాత స్నేహం

ప్రచ్ఛన్నయుద్ధ కాలం నుంచి భారత్, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ దేశపు ఆయుధాలను ఎక్కువగా కొనే దేశాలలో భారత్ ఒకటి.

యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు రష్యా ముడి చమురుపై ఆంక్షలు విధించినప్పటి నుంచి రష్యా చమురును భారత్ ఎక్కువగా కొంటోంది.

"యుక్రెయిన్‌లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో భారత్‌కు వెళ్లడం ద్వారా విదేశీ పర్యటనలు చేయగలనని పుతిన్ ప్రపంచానికి చెప్పినట్టు ఉంటుంది" అని బ్లూమ్‌బెర్గ్ తన వ్యాసంలో రాసింది.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో భారత్‌ సభ్యురాలు కాదు. దాని వారెంట్లను అమలు చేయాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ, పుతిన్ 2023లో భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాలేదు.

2024 సెప్టెంబర్‌లో పుతిన్ మంగోలియాను సందర్శించినప్పుడు మంగోలియా ఐసీసీ వారెంట్‌ను అమలు చేయలేదు. వారెంట్‌ను అమలు చేయనందుకు ఐసీసీ సభ్యదేశమైన మంగోలియా అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది.

ఈ నెల 4,5 తేదీలలో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం పుతిన్ భారత్‌ రావడాన్ని 'క్లిష్ట సమయంలో జరుగుతున్న పర్యటన' గా అంతర్జాతీయ మీడియా చెబుతోంది

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెలలో మాస్కో వెళ్లారు. అక్కడ ఆయన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) ప్రతినిధి బృందంతోపాటు పుతిన్‌తో సమావేశమయ్యారు.

ఆగస్టు ప్రారంభంలో జైశంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా మాస్కో వెళ్లారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంతో పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఆగస్టులో ట్రంప్, పుతిన్ అలాస్కాలో సమావేశమయ్యారు, కానీ ఆ చర్చలు సక్సెస్ కాలేదు.

అలాస్కా సమావేశం తర్వాత నుంచి ట్రంప్ ప్రభుత్వం నాటో మిత్రదేశాల ద్వారా యుక్రెయిన్‌కు పరిమిత సంఖ్యలో ఆయుధాలను పంపుతోంది.

భారత్, రష్యా, పుతిన్, మోదీ, ట్రంప్, యుక్రెయిన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్ పర్యటన విషయంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

పుతిన్ భారత పర్యటనపై ట్రంప్ ఎలా స్పందిస్తారు?

"భారత్, రష్యా ఒకదానికొకటి మరింత దగ్గరవుతున్నాయి. దీనికి కారణం రెండు దేశాలూ అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి" అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌ సీనియర్ ఫెలో సుమిత్ గంగూలీ, ఫారిన్ పాలసీలో ప్రచురితమైన ఒక వ్యాసంలో రాశారు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తరహా విధానం ట్రంప్ అనుసరించకపోయినప్పటికీ, యుక్రెయిన్‌ బాగా రాజీపడాల్సిన శాంతి ప్రణాళికను ప్రకటించినప్పటికీ, యుక్రెయిన్‌కు అమెరికా నిరంతరం మద్దతివ్వడంపై రష్యా అసంతృప్తిగా ఉంది.

రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తుండటంతో ట్రంప్ ప్రభుత్వం భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ట్రంప్ కోపానికి అసలు కారణం మే నెలలో భారత్, పాకిస్తాన్ సంక్షోభం ముగింపు క్రెడిట్‌ను అమెరికా అధ్యక్షునికి మోదీ ఇవ్వకపోవడమేనని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.

"భారత్-పాకిస్తాన్ సంక్షోభం ముగిసిన తర్వాత, ట్రంప్ నుంచి వచ్చిన నాలుగు ఫోన్ కాల్స్‌కు మోదీ స్పందించలేదని తెలుస్తోంది. ఆ వెంటనే ట్రంప్ అనేక భారతీయ ప్రోడక్టులపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కుప్పకూలాయి" అని ఫారిన్ పాలసీ ఆర్టికల్ పేర్కొంది.

భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించిన ఈ సమయంలో, రష్యాకు భారత్ బహిరంగంగా చేయి అందించడం ఆశ్చర్యం కలిగించదు.

"వచ్చే వారం జరగనున్న సమావేశం ముఖ్యమైనదని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సమావేశంలో సుఖోయ్-57 యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై చర్చ జరుగుతుంది" అని ఆ వ్యాసం పేర్కొంది.

పుతిన్ దిల్లీ పర్యటన భారత్, రష్యా రెండింటివైపు నుంచి ప్రపంచానికి కచ్చితంగా 'రెండూ శక్తివంతమైన మిత్రదేశాలు' అన్న సందేశాన్ని పంపుతుంది.

ఈ సందేశం కచ్చితంగా అమెరికాకు చేరుతుంది. కానీ భారత్, రష్యా మధ్య ఈ స్నేహపూర్వక వాతావరణంపై ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సిఉంది" అని ఫారిన్ పాలసీ రాసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)