అంధుల టీ20 ప్రపంచ కప్ : ‘‘మంచి దుస్తులు వేసుకోగలుగుతున్నా, ప్రధాని మోదీని కలవగలిగాను.. ’’

ఫొటో సోర్స్, Getty Images
"నాకు చూపు లేకపోవడం వల్ల మేలు జరిగింది. దానివల్లే ప్రపంచ కప్ ఆడగలిగాను. చూడగలిగితే, నేనూ నా అక్కచెల్లెళ్ల మాదిరిగానే 7, 8 తరగతుల వరకు చదివి పెళ్లి చేసుకునేదాన్ని"
అంధుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగమైన గంగా ఎస్. కదమ్ అన్న మాటలివి. ఈ టోర్నమెంట్ మొదటిసారి జరిగింది.
ఈ పోటీలో, భారత్ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడమే కాకుండా, టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచింది.
జట్టులోని సభ్యులతో మాట్లాడినప్పుడు, వారు ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నారో తెలిసింది. చిన్న గ్రామాల నుంచి ఇక్కడిదాకా రావడానికి వారు సాగించిన కష్టమైన ప్రయాణాన్ని వారంతా వివరించారు.
బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో, భారత జట్టు క్రీడాకారిణులతో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ మాట్లాడారు. ఈ సంభాషణలో సుష్మా పటేల్, గంగా ఎస్. కదమ్, దీపికా టీసీ, సిమూ దాస్, ఫులా సోరెన్, భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు మేనేజర్ శిఖా శెట్టి పాల్గొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అంధుల క్రికెట్ ఎలా ఆడతారు?
అంధుల క్రికెట్ సాధారణ క్రికెట్‌తో పోలిస్తే అనేక విధాలుగా భిన్నంగా ఉంటుంది. చూపులేనివారి సామర్థ్యాలకు అనుగుణంగా దాని నియమాలు, నిబంధనలు ప్రత్యేకంగా సవరించారు.
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు మేనేజర్ శిఖా శెట్టి దీని గురించి మరింత వివరంగా చెప్పారు.
బ్లైండ్ క్రికెట్‌లో ఉపయోగించే బంతి సాధారణ క్రికెట్ బంతికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ప్లాస్టిక్ బంతిని ఉపయోగిస్తారని శిఖా శెట్టి చెప్పారు.
బంతి లోపల చిన్న మెటల్ బేరింగ్‌లు ఉంటాయి. బంతి కంపించినప్పుడు, వాటి నుంచి గలగల శబ్దం వస్తుంది. బంతి దిశ, వేగాన్ని అంచనా వేయడానికి ఈ శబ్దం ఉపయోగపడుతుంది.
అంధుల క్రికెట్‌లో క్రీడాకారులను, వారి దృష్టి లోపాల ఆధారంగా మూడు వర్గాలుగా విభజించారు: బీ1,బీ2, బీ3.
అంతర్జాతీయ నియమాల ప్రకారం, ఒక జట్టులో సాధారణంగా కేటగిరీ బీ1 నుంచి నలుగురు, కేటగిరీ బీ2 నుంచి ముగ్గురు, కేటగిరీ బీ3 నుంచి నలుగురు ఆటగాళ్లు ఉంటారు.
అంధుల క్రికెట్ పూర్తిగా కమ్యూనికేషన్‌పై ఆధారపడి ఉంటుందని శిఖా శెట్టి చెప్పారు.
బౌలర్ మొదట వికెట్ కీపర్, ఫీల్డర్లను సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. తర్వాత బ్యాటర్‌ను సిద్ధంగా ఉన్నారా? అని అడుగుతారు. బ్యాటర్ అవును అని చెప్పిన వెంటనే, బౌలర్ ‘ప్లే’ అని అరిచి బంతిని విసురుతారు.
బంతిని ఏ లైన్‌లో వేయాలో వికెట్ కీపర్ బౌలర్‌కు నిర్దేశం చేస్తారు.
బ్లైండ్ క్రికెట్‌లో ఉపయోగించే స్టంప్‌లు లోహంతో తయారవుతాయి. బంతి స్టంప్‌లను తాకినప్పుడు, పెద్ద శబ్దం వస్తుంది. వికెట్ పడినట్లు సులభంగా అర్థమవుతుంది.
బీ1 కేటగిరీ ఆటగాళ్లు పరుగులు సాధించినప్పుడు, ఒక్కో పరుగును రెండుగా లెక్కిస్తారని శిఖా శెట్టి చెప్పారు.

'నా తల్లిదండ్రులకు గుర్తింపు ఇచ్చా'
కప్ గెలిచిన క్షణం తనకు ఎంతో గర్వకారణమని భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికా టీసీ అన్నది. ఇది తనకు తొలి టీ20 ప్రపంచ కప్ అని, తమ జట్టు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిందని ఆమె తెలిపింది.
"మా జట్టులోని అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. ఈ ప్రపంచ కప్‌ను వారికి అంకితం చేస్తున్నా" అని దీపిక చెబుతోంది.
విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జట్టు సభ్యులంతా కలిశారు.
"మా నాన్న మాట్లాడినట్టే ఆయన మాతో మాట్లాడారు" అని ఈ సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ దీపిక చెప్పింది.
జట్టులో భాగమైన ఫులా సోరెన్ తన కథను చెబుతూ, ఇక్కడికి చేరుకోవడానికి తాను ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించింది.
‘‘కళ్లు లేవు, ఏం చేయగలదు అని అందరూ అనేవారు. వినడానికి చాలా బాధగా అనిపించేది. కానీ ఇప్పుడు వారే, ‘మేం వెళ్లలేని చోటికి మీరు వెళ్లగలిగారు’ అంటున్నారు. సాధారణంగా పిల్లలు వారి తల్లిదండ్రుల ద్వారా గుర్తింపు పొందుతారు. కానీ నేను నా తల్లిదండ్రులకు గుర్తింపు ఇచ్చా' అని ఫులా చెప్పింది.
"మా నాన్న ఎక్కడికైనా బయటకు వెళితే, ఫులా వాళ్ల నాన్న అని అంటున్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది" అంటూ ఆమె సంతోషం వ్యక్తంచేసింది.

ఎన్నో కష్టాలను దాటుకుని...
తొలిరోజుల్లో పడ్డ కష్టాలను భారత జట్టు క్రీడాకారిణి సిమూ దాస్ గుర్తుచేసుకుంది. తాను క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, ఊళ్లోవాళ్లు చాలా మాటలు అన్నారనీ, 'దిల్లీ వెళ్లి ఏం చేస్తావు?' అని అడిగేవారని ఆమె తెలిపింది.
అమ్మాయిలకు దిల్లీ సురక్షితమైన ప్రదేశం కాదని గ్రామంలోని ప్రజలు తరచుగా అనుకునేవారని సిమూ అన్నది. ''నేను చదువుకోవడానికి దిల్లీకి వచ్చినప్పుడు కూడా వారు చాలా విషయాలు చెప్పారు. కానీ నేను ఎవరి మాటా వినలేదు" అని సిమూ గుర్తుచేసుకుంది.
ఈ ప్రయాణంలో తన తల్లి బాగా మద్దతుగా నిలిచారని ఆమె చెప్పింది. "నేను క్రికెట్‌లో చేరినప్పుడు, ‘కళ్లు లేవు, ఎలా ఆడతావు’ అని జనం అడిగేవాళ్లు. ఆ సమయంలో నేను కూడా ‘ఎలా ఆడగలుగుతాను’ అనుకునేదాన్ని.
కానీ ఆడటం ప్రారంభించిన వెంటనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. నా మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపాల్‌తో జరిగింది. ఆడటానికి అక్కడికి వెళ్లినప్పుడు, చాలామంది 'మేం నేపాల్ ముఖం కూడా చూడలేకపోయాం. మీరు వెళ్లగలిగారు' అని అనేవారు'' అని ఆమె గుర్తుచేసుకుంది.
తనపట్ల ప్రజల దృక్పథం క్రమంగా మారిందని సిమూ చెబుతోంది. "గతంలో నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినప్పుడు, ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ‘మీ అమ్మాయి వచ్చిందా’ అని అడుగుతుంటారు'' అని ఆమె సంతోషంగా చెప్పింది.
"నేను అంధురాలిని కాబట్టి ప్రపంచమంతా తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలామంది కష్టపడి పనిచేస్తారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అయినప్పటికీ చాలామందికి ఇలా వెళ్లే అవకాశం దొరకదు" అని సిమూ అభిప్రాయపడింది.

క్రీడాకారిణుల డిమాండ్లు ఏమిటి?
సాధారణ క్రికెటర్లలాగానే తమను చూడాలని క్రీడాకారిణులు కోరుతున్నారు. తమకు ఇప్పటికీ ప్రాథమిక సౌకర్యాలు లేవని వారు చెప్పారు.
"ప్రభుత్వం మాకు కొంచెం ఎక్కువ సహాయం అందించాలని అభ్యర్థిస్తున్నా. ఇది మా జూనియర్లు ముందుకు రావడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది" అని కెప్టెన్ దీపిక చెప్పింది.
"సాధారణ క్రికెట్‌కు మద్దతు ఇచ్చినట్టే అంధుల క్రికెట్‌కు కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం" అని ఆమె అన్నది.
"మేము చూడలేం కాబట్టి సాధారణ మైదానంలో ఆడలేం. ఆడటానికి మంచి మైదానం, కొంత నిధులు లభిస్తే, మేమింకా బాగా రాణిస్తాం" అని సిమూ దాస్ అన్నది.
అంధుల క్రికెట్‌కు మద్దతు లేదని చెప్పలేమని శిఖా శెట్టి చెప్పారు.
"కొన్ని ప్రభుత్వాలు మాకు చాలా మద్దతు ఇస్తున్నాయి. కానీ క్రీడల విషయానికి వస్తే, ఇక్కడ ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవు. అంధుల కోసం ప్రత్యేక స్టేడియం లేదు" అని ఆమె అన్నారు.
"స్కూల్లో, జిల్లాస్థాయిలో లభించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు వారికి లభించవు. వారికి ఈ మద్దతు లభిస్తే, వారి స్థాయి కూడా మారుతుంది. వారు కూడా మిగతా క్రికెటర్ల స్థాయికి చేరుకుంటారు" అని శిఖా అన్నారు.
"మాకు పెద్దగా నిధులు రావు, మైదానాలు కూడా ఉండవు. మైదానాలు దొరికితేనే మేం ఇంకా బాగా రాణించగలం" అని సిమూ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సమాజం నుంచి సవాళ్లు
తమ గ్రామాల్లో, ఇరుగు పొరుగు దగ్గర ఎదుర్కొన్న సవాళ్ల గురించి, వాటిని పట్టించుకోకుండా లక్ష్యాలను సాధించడం గురించి క్రీడాకారిణులు మాట్లాడారు.
"మేం 8 మంది అక్కాచెల్లెళ్లం. 7-8 తరగతుల వరకు చదివిన తర్వాత అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్లెవరూ ఆటలు ఆడలేదు. వాళ్లంతా చూడగలరు. నాకొక్కదానికే చూపులేదని చాలా బాధపడ్డాను" అని గంగా తన కథను వివరించింది.
"కానీ నాకు చూపులేకపోవడం మంచిదే అయింది. ఎందుకంటే చూడలేకపోబట్టే నేను ప్రపంచ కప్ ఆడాను. చూపు ఉన్నట్టయితే, వారిలాగే నేను కూడా 7-8 తరగతి వరకు చదివి పెళ్లి చేసుకునేదాన్ని" అని గంగా అంది.
"తన పిల్లల్లో ఒకరు క్రికెట్ ఆడాలనేది నాన్న కల. ఆయన ఎక్కువగా కొడుకులను ప్రోత్సహించేవారు. కానీ ఆయన మా కోసం కూడా ఏదో ఒకటి చేసేవారు" అని సుష్మా పటేల్ తెలిపింది.
"జీవితంలో ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటారు. నాకు కూడా అదే జరిగింది. నాన్నకు ఒక కల ఉండేది. కానీ ఊరు వదిలి వెళ్లడం కష్టంగా ఉండేది. మా ఊరిలో ఆడపిల్లలకు 12-14 సంవత్సరాల వయసులోనే పెళ్లిళ్లు చేస్తారు. నాన్న ఆలోచనలు వేరేలా ఉండేవి. ఆయన వల్లే నేను ముందుకు రాగలిగాను'' అని సుష్మా చెప్పింది.
"అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్ల వల్ల మనకు ఏమి ఉపయోగం? అబ్బాయిలను చూడండి, వాళ్లు ఇంటిని నడిపిస్తారు. వాళ్లు ఇంటికి వెలుగు" అని ఊరిలో వాళ్లు మా నాన్నకు చెప్పేవాళ్లు
ఇంతకుముందు, గ్రామంలోని ప్రజలు, ఇదేం క్రికెట్.. వీధి పిల్లల ఆటలా ఉంది అనేవారు. వీళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతారా అని ఎద్దేవగా మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు అందరూ గొప్పగా చెబుతున్నారు" అని సుష్మా సంతోషం వ్యక్తం చేసింది.
‘‘ మేం బయటకు వెళ్లినప్పుడు, గ్రామంలోని ప్రజలు 'వీళ్లు బయటకు వెళ్తున్నారు.. ఏం చేస్తారు?' అని అనేవారు. కొందరు చాలా చెడుగా మాట్లాడేవారు. నేను క్రికెట్ ఆడకపోయినట్లయితే, బహుశా అదే చిన్న ఊళ్లో ఉండేదాన్ని. పెళ్లి చేసుకునేదాన్ని" అని ఫూలా అభిప్రాయపడింది.
"ప్రస్తుతం నేను మంచి దుస్తులు వేసుకోగలుగుతున్నా. ప్రధానమంత్రి మోదీని కలిశాను. ఇది క్రికెట్ వల్లనే సాధ్యమైంది" అని ఆమె సంతోషం వ్యక్తంచేసింది.
‘‘అంధుల క్రికెట్‌లో చాలా సవాళ్లు ఉంటాయి. మనం మొదటిసారి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, అమ్మాయిలు అలా వెళ్లకూడదని జనం అంటుంటారు. మనం ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకుంటున్నామని చెబితే, ప్రతిదాన్నీ ప్రతికూల దృష్టితో చూస్తారు. ఆమె ఎక్కడికి వెళుతుందో, తిరిగి ఏం తెస్తుందో ఎవరికి తెలుసు" అని సిమూ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














