అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేత భారత్, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

భారత అంధజట్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ భారత్ గెలుచుకుంది.

కొలంబోలో ఆదివారం శరవణముత్తు స్టేడియం వేదికగా జరిగిన 'మొదటి మహిళా టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ 2025' టోర్నీ ఫైనల్లో నేపాల్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ తరఫున అత్యధికంగా ఫూలా సరీన్ 27 బంతుల్లో44 పరుగులు చేయగా, కరుణ కుమారి 27 బంతుల్లో 42 పరుగులు, బసంతి 12 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

నేపాల్ తరఫున సరితా గిమిరే అత్యధికంగా 35 పరుగులు చేయగా, బిమ్లా రాయ్ 26 పరుగులు చేశారు. జమునా రాణి, అనూ కుమారి చెరో వికెట్ తీశారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కరుణ కుమారిది ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామం. పదోతరగతి విద్యార్థిని అయిన ఆమె బీ1 కేటగిరిలో భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని చెప్పారు.

‘‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్ప విషయం. ఇది నిజంగా చరిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

భారత మహిళల విజయంపై ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఎక్స్ పోస్టులో స్పందించారు.

‘‘తొలిసారి జరిగిన అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ అమ్మాయిల సామర్థ్యాలను పునర్నిర్వచించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికలాంగ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం’’ అని తెలిపారు.

అంధుల క్రికెట్, ప్రపంచకప్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొలంబో వేదికగా భారత్, నేపాల్ జట్ల మధ్య ఫైనల్ జరిగింది.

సెమీస్‌లోనూ ఆధిపత్యం

అంతకుముందు, శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ 9 వికెట్ల తేడాతో ఓడించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.

ఆసీస్ ఇన్నింగ్స్‌లో చనకన్ బువాఖావో (34) అత్యధిక పరుగులు చేసింది. అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.

భారత బ్యాటర్లలో బసంతి హన్సా అత్యధికంగా 45 పరుగులు సాధించగా, గంగా కదమ్ (41 నాటౌట్) రాణించారు.

ఒడిషాలోని గిరిజన తెగకు చెందిన ఫూల సెరేన్ తన ఐదేళ్ల వయసులో ఎడమకంటి చూపు కోల్పోయింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిషాలోని గిరిజన తెగకు చెందిన ఫూల సెరేన్ తన ఐదేళ్ల వయసులో ఎడమకంటి చూపు కోల్పోయింది.

ఏయే దేశాలు పాల్గొన్నాయి?

భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా జట్లు పాల్గొన్న టీ20 టోర్నీ నవంబర్ 11న దిల్లీలో ప్రారంభమైంది. బెంగళూరులో కొన్ని మ్యాచ్ ల తరువాత, నాకౌట్ వేదిక శ్రీలంక రాజధాని కొలంబోకు మారింది.

కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, దిల్లీ, అసోం, బీహార్ రాష్ట్రాలకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొంది. పాఠశాల ఉపాధ్యాయులు, వికలాంగుల సంస్థలు, కమ్యూనిటీ క్యాంపుల ద్వారా చాలా మంది ప్లేయర్స్‌ను ఈ ఆటకు పరిచయం చేశారు.

"చాలామంది ప్లేయర్స్ గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చారు" అని జట్టు మేనేజర్ షికా శెట్టి చెప్పారు.

"భాష సంస్కృతి అడ్డంకులు, కుటుంబాలు ఎక్కువటా ఆటలను కొనసాగించడానికి ఇష్టపడరు, పైగా అంధుల క్రికెట్ నియమాలను ప్రవేశపెట్టడానికి కూడా సమయం పట్టింది. కానీ ఇప్పుడు వారందరూ గర్వంతో పోటీ పడుతున్నారు " అన్నారు.

బ్లైండ్ క్రికెట్‌లో మెటల్ బేరింగ్‌తో ఉండే ప్లాస్టిక్ బంతిని ఉపయోగిస్తారు.

ఆటగాళ్లు వారి అంధత్వ స్థాయి ఆధారంగా సమూహంగా విభజిస్తారు.

ఇందులో బీ1, బీ2, బీ3 గ్రేడులు ఉంటాయి.

బీ1 (పూర్తిగా అంధులు): కాంతి కూడా గుర్తించలేని స్థాయిలో దృష్టి లేని ప్లేయర్స్.

బీ2 (పాక్షికంగా అంధులు): కొంతమేర దృష్టి ఉన్నవారు; ఆకృతులు గుర్తించగలరు.

బీ3 (కొంత స్పష్టమైన దృష్టి ఉన్నవారు): బీ2 కంటే ఎక్కువ దృష్టి కలిగినవారు.

ఈ మూడు గ్రేడులకు సంబంధించిన వారందరినీ కలిపి రంగంలోకి దింపాలి. బీ1 వాళ్లకు గైడ్ చేయడం కోసం బీ2, బీ3 వాళ్లకి కీపర్లుగా అవకాశం ఇస్తారు. బంతిని నేల బారుగా బౌలింగ్ చేస్తారు. బీ1 బ్యాటర్లు భద్రత కోసం రన్నర్లను ఉపయోగిస్తారు. వారు స్కోర్ చేసిన ప్రతి పరుగు రెండు పరుగులుగా లెక్కిస్తారు.

ప్రపంచ కప్‌లో ఒకే రౌండ్ రాబిన్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. అలాగే ఫైనల్లో నేపాల్‌పై విజయం సాధించి విజేతగా నిలిచింది.

దీపిక

ఫొటో సోర్స్, Cricket Association for the Blind in India

ఫొటో క్యాప్షన్, చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన దీపిక భారతజట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.

భారత జట్టుకు కర్ణాటకకు చెందిన దీపికా టీసీ కెప్టెన్‌. ఆమెది కర్షక కుటుంబం.

ప్రత్యేక పాఠశాల ద్వారా క్రికెట్ ఆమెకు చేరువైంది. దీపిక సంకోచిస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. కాలక్రమేణా, ఈ ఆట విశ్వాసాన్ని ఇచ్చినట్టు దీపిక గతంలో చెప్పింది.

ప్రపంచ కప్‌లో భారత్‌కు నాయకత్వం వహించడం ఆమె గొప్పగా భావిస్తోంది.

'నాకు, నా జట్టు జీవితంలో ఇదే అతిపెద్ద క్షణం’’ అని దీపిక చెప్పింది.

భారత మహిళల ప్రపంచకప్ విజేత జెమీమా రోడ్రిగ్స్, పురుషుల టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ మద్దతు తమకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించిందని తెలిపింది.

ఇక వైస్ కెప్టెన్ గంగా కదమ్ మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. ఆమె మొత్తం తొమ్మిదిమంది తోబుట్టువులలో ఒకరు. రైతు కుటుంబానికి చెందిన గంగను ఆమె తండ్రి స్థిరమైన భవిష్యత్తు కోసం అంధుల పాఠశాలలో చేర్పించారు.

క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోమని ఓ మెంటార్ చెప్పేవరకు గంగ క్రికెట్‌ను చాలా సాధారణంగా ఆడుతుండేది. క్రికెట్‌కు సంబంధించి శబ్దం, సమయం, అవగాహనను నేర్చుకోవడం సవాలుగా మారింది.

నిరంతర సాధన ద్వారా ఈ 26 ఏళ్ల క్రీడాకారిణి సానుకూల ఫలితాలు సాధించారు. ఇప్పుడు తన గ్రామంలోని అమ్మాయిలు క్రీడలవైపు వచ్చేందుకు ప్రేరణగా నిలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)