టెస్ట్ క్రికెట్‌లో ఇక భారతజట్టు తిరుగులేని శక్తి కాదా, లోపం ఎక్కడుంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, అజయ్ మెమన్
- హోదా, క్రీడా రచయిత
సొంత గడ్డ మీద సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో ఓడిపోవడం భారత జట్టును కుంగదీసింది.
ఈ వారం ప్రారంభంలో భారత్‌లో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా భారత్‌ను 408 పరుగుల తేడాతో ఓడించింది. ఈ గెలుపు భారత జట్టుపై అందరి అంచనాలను తారుమారు చేసింది.
పాతికేళ్ల తర్వాత సాతాఫ్రికా భారత్‌లో సాధించిన తొలి టెస్ట్ సిరీస్ విజయం. 12 ఏళ్ల వరుస విజయాల తర్వాత భారత్ 12 నెలల్లో ఎదుర్కొన్న రెండో స్వదేశీ టెస్ట్ సిరీస్ పరాజయం.
గత ఆరునెలలుగా విజయాలు సాధిస్తున్న భారత క్రికెట్ జట్టు ప్రతిభాపాటవాలపై తాజా పరాజయం అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
అనేక మంది ఆటగాళ్లతో పాటు కోచ్ గౌతం గంభీర్ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడింది.
రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు వరుసగా రిటైర్ అయినా, భారత జట్టు విజయ పథంలో దూసుకెళ్లగలదని కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఈ వేసవిలో ఇంగ్లండ్‌లో సాధించిన విజయాలు నిరూపించాయి.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమికి ముందు స్వదేశంలో వెస్టిండీస్ మీద 2-0 సాధించిన విజయం ఆ అవగాహనకు మరింత బలం చేకూర్చింది.


ఫొటో సోర్స్, AFP via Getty Images
స్వదేశంలోనూ పరాజయాలా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో వైదొలగడం భారత జట్టుకు దురదృష్టకరమనే చెప్పాలి.
అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత ఓటమికి పేలవమైన ప్రదర్శనకు ఇదొక్కటే కారణమని చెప్పలేం.
భారత జట్టు ఖ్యాతి దెబ్బ తింది. టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ కోసం ఎదురు చూస్తున్న భారత ఆటగాళ్లలో చాలా మంది సాంకేతికంగా, మానసికంగా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఇంకా సిద్ధం కాలేదని రుజువైంది.
ఏడాది కాలంలో భారత్‌కు ఇది రెండో వైట్‌వాష్ ఓటమి. 2024లో న్యూజీలాండ్ భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఊహించని రీతిలో 3-0తో సొంతం చేసుకుంది. ఈ ఓటమి కారణంగా భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో తాజా ఓటమి ఈ సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను దెబ్బ తీసేలా కనిపిస్తోంది.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు తాజా ఓటముల తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది.
ఈ సీజన్‌లో భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉన్నప్పటికీ, ఇందులో ఐదు టెస్టు మ్యాచుల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి ఉంది.
సహజంగా ఏ జట్టుకైనా స్వదేశంలో ఆడటం పెద్ద సానుకూల అంశం. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్లపైన కూడా స్వదేశంలో భారత్ రాణిస్తుంది. అయితే న్యూజీలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఓటమి తర్వాత భారత్ స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచుల్లో గెలవడం కూడా కష్టం అనే అభిప్రాయం ఏర్పడింది.
టెస్ట్ క్రికెట్‌లో భారత్ దుర్భలత్వం బయటపడింది. ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచుల్లో భారత ప్రదర్శన ఇంత పేలవంగా మారడం దిగ్భ్రాంతికరంగా ఉంది.
ఈ శతాబ్దం ఆరంభం నుంచి టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు అజేయ శక్తి అని భావించారు.
వేడి, తేమతో కూడిన, బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగపడే స్పిన్ పిచ్‌లపై భారత జట్టు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించింది. అందుకే 2012-13లోఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమిని అరుదైన విషయంగా పరిగణించారు.
అయితే ఇప్పుడు భారత్‌ను స్వదేశంలో చాలా తేలిగ్గా ఓడించవచ్చనే అభిప్రాయం బలపడుతోంది.
భారత్ మీద 2024లో న్యూజీలాండ్, ఈ ఏడాది సౌతాఫ్రికా జట్లు భారీ స్కోర్లతో ఘన విజయం సాధించాయి.
భారత జట్టులోని ఆటగాళ్ల శక్తి, సామర్థ్యాలకు అనుకూలంగా వాళ్లు తయారు చేసుకున్న పిచ్‌ల మీదనే వారి ప్రత్యర్థులు మెరుగైన ప్రదర్శన చేసి భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లను చిత్తు చేశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎక్కడ తప్పు జరిగింది?
భారత జట్టు విదేశాల్లో రాణించేందుకు వీలుగా స్వదేశంలోని స్పిన్ పిచ్‌లను కూడా పేస్‌కు అనుకూలంగా మార్చడం వల్లనే భారత ఆటగాళ్లు స్వదేశీ పిచ్‌ల మీద తడబడుతున్నారనేది కొందరి అభిప్రాయం.
ఐపీఎల్ కారణంగా కొంతమంది విదేశీ ఆటగాళ్లు భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డారని, భారత పర్యటనకు విజృంభించడానికి వారికది సానుకూలంగా మారిందని మరి కొందరు చెబుతున్నారు.
ఈ రెండు రకాల విశ్లేషణల్లోనూ కొంత నిజం ఉన్నప్పటికీ, స్వదేశంలో భారత జట్టు ఆటతీరు ఎందుకింత పేలవంగా మారిందనే దానికి కారణాలను వివరించడం లేదు.
స్వదేశంలో భారత జట్టు ఓటములకు ఒకటి రెండు కాక అనేక కారణాలు ఉన్నాయని మాజీ క్రెకిటర్లు విశ్లేషిస్తున్నారు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత సీనియర్ క్రికెటర్లు భారత ఆటగాళ్లలో అనేక వైఫల్యాలను ఎత్తి చూపారు.
ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం, ఆటగాళ్ల ఎంపికలో తప్పులు, అతి విశ్వాసం, సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం, జట్టులో తరచుగా మార్పులు చేర్పులు, టెస్ట్ క్రికెట్ కంటే వన్డేలు, టీ ట్వంటీలకు ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి తాజా వైఫల్యాలకు కారణాలుగా చెబుతున్నారు సీనియర్ క్రికెటర్లు.
జట్టు ప్రదర్శనలో ఇవ్వన్నీ కనిపిస్తున్నాయి.
రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్ల నుంచి చాలా ఆశించినప్పటికీ నిర్లక్ష్యంగా ఆడి వాళ్లు నిరుత్సాహపరిచారు.
ఇక జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్ దగ్గర స్థిరత్వం, టెక్నిక్ లోపించింది.
రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే అంతో ఇంతో ప్రతిభ కనబరిచారు. అయితే వారి ఆటతీరు కూడా జట్టును గెలిపించే స్థాయిలో లేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
గంభీర్ భవిష్యత్ ఏంటి?
టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత జరుగుతున్న పోస్ట్ మార్టం ఆటగాళ్లనే కాకుండా, సెలక్టర్లు, జట్టు సహాయ సిబ్బందిపైనా విమర్శలతో విరుచుకుపడింది. ఓటమితో నిరుత్సాహపడిన అభిమానులు, సీనియర్ క్రికెటర్లు ఆన్‌లైన్‌లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
ఈ విమర్శల్లో ఎక్కువ భాగం కోచ్ గౌతం గంభీర్ కేంద్రంగా సాగుతున్నాయి.
టెస్ట్ సిరీస్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ విమర్శల్ని ఖండించారు. టెస్ట్ క్రికెట్‌కు బలమైన ఆటగాళ్లు కావాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఫలితాలు అందించడంలో ఆయన వైఫల్యాన్ని అధిగమించలేకపోయాయి.
మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో నలుగురు స్పిన్నర్లు, అందులో ముగ్గురు ఎడం చేతి వాటం స్పిన్నర్లతో ఆడటం వంటి గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో స్పెషలిస్ట్ ఆటగాళ్లను పక్కన పెట్టి ఆల్‌రౌండర్లతో టీమ్‌ను ప్యాక్ చేయడం, వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం వంటి నిర్ణయాలపై గంభీర్ సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
సౌతాఫ్రికా సిరీస్ ఫలితం ప్రత్యేకించి గౌతం గంభీర్‌కు వ్యతిరేకంగా కనిపిస్తోంది.ఆయన నాయకత్వంలో జరిగిన ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ ఐదు మ్యాచులలో ఓడిపోయింది. భారత క్రికెట్‌లో ఇది చెత్త రికార్డని ఆయన నాయకత్వంపై నమ్మకం లేదని సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.
గంభీర్ విజన్, ఆటగాళ్ల ప్రతిభ, జట్టు ఎంపిక, గేమ్ ప్లాన్, జట్టు నైపుణ్యం, గెలవాలనే కసి రగిలించడంలో దారుణంగా విఫలమైందని అంటున్నారు.
గంభీర్ భవిష్యత్ గురించి క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, టెస్ట్ క్రికెట్‌లో విఫలమైన ఆటగాళ్ల గురించి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే భారత టెస్ట్ క్రికెట్ ఖ్యాతి ప్రస్తుతానికి మసకబారిందనేది వాస్తవం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














