శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియాలో భారీ వరదలు.. వందల మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
మొదట సెన్యార్, తర్వాత దిత్వా తుపాన్ల కారణంగా ఆగ్నేయాసియాలోని చాలా దేశాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటున్నాయి.
శ్రీలంక, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, మలేషియాలో లక్షలాది మంది తుపాను బారినపడ్డారు.
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల శ్రీలంకలో ఇప్పటివరకు 153 మంది మరణించగా, మరో 191 మంది ఆచూకీ తెలియలేదని చెబుతున్నారు.
ఇండోనేషియాలోని సుమత్రాలో తుపాను కారణంగా 90 మందికి పైగా చనిపోయారు. 10 మందికి పైగా గల్లంతయ్యారు.
దక్షిణ థాయిలాండ్‌పైనా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. వరదల వల్ల 145 మంది ప్రాణాలు కోల్పోయినట్లు థాయిలాండ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
డిసెంబర్‌లో జరగనున్న ఆగ్నేయాసియా క్రీడలకు థాయిలాండ్ సిద్ధమవుతోంది. ఈ వరదల కారణంగా 11 క్రీడా కార్యక్రమాలను బ్యాంకాక్‌కు మార్చారు.
వియత్నాంలో వరదలకు 98 మందికి పైగా మరణించారు. మలేషియాలో 19 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
భారీ వరదల కారణంగా శ్రీలంకలో చోటుచేసుకున్న మరణాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయ సామగ్రి పంపించారు.

"బాధిత కుటుంబాలన్నీ సురక్షితంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ప్రధాన మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"మన పొరుగు దేశానికి సంఘీభావంగా, భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధు కింద తక్షణ సహాయ సామగ్రి, మానవతా సహాయాన్ని పంపింది. పరిస్థితిని బట్టి మరింత సాయం పంపడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆయన అందులో రాశారు.
శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు.
ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో, "ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి కొలంబోలో సహాయ సామగ్రిని అందజేశాయి" అని ఆయన తన సందేశంలో రాశారు.

ఫొటో సోర్స్, CHAIDEER MAHYUDDIN / AFP/Chaideer MAHYUDDIN / AFP via Getty Images
మొదట సెన్యార్, తరువాత దిత్వా
మలక్కా జలసంధిని ఆనుకుని ఈశాన్య ఇండోనేషియా మీదుగా ఏర్పడిన సెన్యార్ తుపాను, ప్రస్తుతం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
సెన్యార్ తుపాను కారణంగా అండమాన్ నికోబార్ దీవులలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సెన్యార్ తుపాను బలహీనపడుతుంటే, నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దిత్వా తుపానుగా మారి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది.
దిత్వా కారణంగా భారత్‌లోనూ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
దిత్వా తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరగా కదులుతోందని, దీని కారణంగా నవంబర్ 29,30 డిసెంబర్ 1న ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Ishara S. KODIKARA / AFP via Getty Images
శ్రీలంకలో పరిస్థితి ఎలా ఉంది?
దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.
బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.
కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కాండీ జిల్లాలో 50 మంది చనిపోయారని, 67 మంది ఆచూకీ తెలియడం లేదని ఆ జిల్లా కార్యదర్శి ఇండికా ఉదవట్టే బీబీసీతో చెప్పారు.
బదుల్లా జిల్లాలో 35 మంది చనిపోయారు. 25 మంది ఆచూకీ తెలియలేదని అధికారులు వెల్లడించారు.
శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడటం వల్ల సమాచార సేకరణ కష్టంగా మారిందని బదుల్లా జిల్లా కార్యదర్శి చెప్పారు.
వరదల కారణంగా అంపారా జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కొండచరియలు విరిగిపడటం వల్ల వరద నీటిలో అనేక ఇళ్లు కొట్టుకుపోయినట్లు సోషల్ మీడియా చిత్రాల్లో కనిపిస్తోంది.
భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
నదుల్లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కొలంబోలోనూ వరద తీవ్రత
శ్రీలంక రాజధాని కొలంబో కూడా వరద ముప్పు ఎదుర్కొంటోంది.
బస్సు వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఏర్పడిన అత్యవసర పరిస్థితి గురించి ఎంపీ అజిత్ పెరీరా శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు.
"కాలా వేవా (నది ఆనకట్ట ప్రాంతం) సమీపంలో బస్సు గంటన్నర సేపు నిలిచిపోయినట్లు నాకు అనేక రిపోర్టులు వచ్చాయి" అని ఆయన అన్నారు.
చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్లను ఉపయోగించేందుకు అనుమతించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
బస్సు చిక్కుకున్న మాట వాస్తవమేనని, అయితే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు బస్సును మందుగానే ఆపే ప్రయత్నం చేశారని న్యాయశాఖ మంత్రి హర్ష నానాయక్కర చెప్పారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి శ్రీలంక ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. సహాయ చర్యలో హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
వరదల దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు.
శ్రీలంకలో ప్రస్తుతం వర్షాకాలమే అయినప్పటికీ, ఈ రోజుల్లో తుపానులు ఇంత విధ్వంసం సృష్టించడం చాలా అరుదు.
2003లో శ్రీలంకలో తుపాను విరుచుకు పడి భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 254 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

ఫొటో సోర్స్, Kiki Cahyadi/Anadolu via Getty Images
ఇండోనేషియాలో భారీ వరదలు
ఇండోనేషియా గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను ఎదుర్కొంటోంది.
సుమత్రా దీవిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా అక్కడక్కడా కొండ చరియలు విరిగిపడ్డాయి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలలో తెగిన నది ఆనకట్టలు, ఛాతీ లోతు నీటిలో నడుస్తున్న ప్రజలు, వరద నీటిలో మునిగిపోయిన ఇళ్ల పైకప్పుల భాగాలు కనిపిస్తున్నాయి.
వీలైనంత ఎక్కువ మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయ, పునరావాస సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం, కొండచరియలు విరిగిపడటం వారి ప్రయత్నాలకు ఆటంకంగా మారాయి.
వరదల వల్ల ఉత్తర సుమత్రా ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైంది.
"మా బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంది" అని సీనియర్ ప్రావిన్షియల్ పోలీస్ కమిషనర్ ఫెర్రీ వాలింటుకాన్ చెప్పారు.
తుపాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఆషే, ఉత్తర సుమత్రా, పశ్చిమ సుమత్రాల్లో మరింత సహాయ సామగ్రి పంపిణీ చేయాలని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంటో ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














