హెల్మెట్ పెట్టుకున్నా బంతి తగిలి యువ క్రికెటర్ మృతి

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా బాల్ తగిలి ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు.
మంగళవారం ఫెర్న్‌ట్రీ గల్లీలోని క్రికెట్ నెట్స్‌లో 'హ్యాండ్‌హెల్డ్ బాల్ లాంఛర్' నుంచి విసిరిన బంతి 17 ఏళ్ల బెన్ ఆస్టిన్‌ను తాకింది.
ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించినప్పటికీ, నెక్ గార్డు వేసుకోలేదు. దీంతో గాయమైంది. ఘటన గురించి తెలుసుకున్న ఎమర్జెన్సీ వర్కర్స్, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. లైఫ్ సపోర్ట్‌పై ఉన్న బెన్ గురువారం మరణించాడు.

'క్రికెట్ అతనికి ఎంతో సంతోషాన్నిచ్చేది'
"బెన్ మృతితో మా కుటుంబం పూర్తిగా కుంగిపోయింది" అని బెన్ తండ్రి జేస్ ఆస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బెన్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ కమ్యూనిటీ సంతాపం తెలియజేస్తోందని క్రికెట్ విక్టోరియా తెలిపింది.
"ఈ విషాదం మా నుంచి బెన్‌ను దూరం చేసింది. కానీ, అతను ఆడిన ఆటను గుర్తు చేసుకుని ఓదార్పు పొందుతాం. నెట్స్‌లో క్రికెట్ ఆడేందుకు తన స్నేహితులతో వెళ్తుండేవాడు" అని జేస్ ఆస్టిన్ ఒక ప్రకటనలో చెప్పారు.
"క్రికెట్ అంటే అతనికి చాలా ఇష్టం. అది అతని జీవితానికి ఎంతో సంతోషాన్నిస్తుంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫిలిప్ హ్యూస్‌కు తగిలినట్లుగానే'
యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి మద్దతుగా ఉన్న స్థానిక క్రికెట్ కమ్యూనిటీకీ ఆస్టిన్ ధన్యవాదాలు తెలిపారు. తమ కొడుకుకు గాయం తగలగానే స్పందించిన వారిని, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
"అది సవాలుతో కూడిన సమయం" అని క్రికెట్ విక్టోరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిక్ కమిన్స్ అన్నారు.
"పది సంవత్సరాల కిందట ఫిలిప్ హ్యూస్‌కు తగిలినట్లుగానే ఇపుడు బెన్ మెడకు బాల్ తగిలింది" అని కమిన్స్ చెప్పారని ఆస్ట్రేలిన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) వార్తాసంస్థ తెలిపింది.
2014లో షెఫ్పీల్డ్ షీల్డ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా మెడకు బంతి తగలడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు కోల్పోయారు.
ఆయన మరణానికి సంబంధించి ఎవరూ బాధ్యులు కారని శవ పంచనామా అధికారి తేల్చారు. అయితే క్రీడల్లో సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను ఆ ఘటన నొక్కి చెప్పింది.
హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌ను ఉపయోగించి ఓ త్రోయర్ బంతిని విసిరినప్పుడు బెన్‌కు అది తగిలింది.
"విక్టోరియా సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం క్రికెటింగ్ కమ్యూనిటీ బెన్ మృతితో విచారంలో ఉంది" అని కమిన్స్ ఓ ప్రకటనలో చెప్పారు.
"మెల్‌బోర్న్ సౌత్ ఈస్ట్‌లోని అండర్ 18 సర్కిల్‌లో బెన్ ప్రతిభావంతమైన ఆటగాడు, పాపులర్ టీమ్‌మేట్, కెప్టెన్" అని కమిన్స్ చెప్పారు.
'బెన్నీ కోసం బ్యాట్లు తీయండి'
"ఓ ఈ యువ జీవితం అర్ధంతంరంగా ముగిసిపోవడాన్ని చూడటం హృదయ విదారకరం. బెన్ తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతుండగా ఇది జరిగింది" అని కమిన్స్ అన్నారు.
ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ తరఫున బెన్ ఆడాడు. ఎంతోమందిని తన ఆటతో సంతోషపెట్టిన బెన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్లు ఈ క్రికెట్ క్లబ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.
"బెన్నీ కోసం బ్యాట్లు బయటకు తీయండి" అని బెన్ స్నేహితులు, మద్దతుదారులకు క్లబ్ పిలుపునిచ్చింది.
హ్యూస్ మృతి సమయంలో సంతాప సూచికగా ఇలానే చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














