శ్రీ చరణి: వరల్డ్ కప్‌లో మెరిసిన ఈ తెలుగమ్మాయి అథ్లెటిక్స్ నుంచి క్రికెట్‌లోకి ఎందుకు వచ్చింది?

శ్రీ చరణి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత మహిళల క్రికెట్ జట్టులో దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ.. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోపీని అందుకుంది టీమిండియా.

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

''ఈ క్షణం కోసం ఎంతో వేచిచూశాం. ఇవాళ ఈ క్షణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కింది. దీన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జట్టును చూసి చాలా గర్వపడుతున్నా'' అని మ్యాచ్‌ గెలిచిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ 5 బౌలర్లలో ఒకరిగా శ్రీ చరణి

మహిళల ఈ ప్రపంచ కప్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో ఒకరిగా శ్రీ చరణి నిలిచింది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ 2025లో ఆమె ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో ఈ జాబితాలో శ్రీ చరణి నాలుగో స్థానంలో నిలిచినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ జాబితాలో దీప్తి శర్మ తొలి స్థానంలో ఉంది. ఆమె తర్వాత నిలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి శ్రీ చరణే.

శ్రీ చరణి

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా శ్రీ చరణి దక్షిణాఫ్రికా బ్యాటర్ ఆనికే బోష్‌ను డకౌట్ చేసి, కీలక వికెట్ తీయడంలో సహకరించింది.

భారత్ విధించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. సింగిల్స్, అప్పుడప్పుడూ బౌండరీలతో స్కోరు బోర్డును పెంచుకుంటూ పోయారు.

అయితే, 51 పరుగుల వద్ద భారత్‌కు బ్రేక్ వచ్చింది. తజ్మిన్ బ్రిట్స్‌ను అమన్‌జోత్ రనౌట్ చేసింది. ఆ తర్వాత, కొద్దిసేపటికే ఆనికేను ఖాతా తెరవకుండానే శ్రీ చరణి ఔట్ చేసింది.

ఈ రెండు వికెట్లు పడటం భారత్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

శ్రీ చరణి

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

కడప నుంచి కప్‌ అందుకునే దాకా..

భారత్‌లో యువ టాలెంట్లలో శ్రీ చరణి ఒకరు. పూర్తి పేరు నల్లపురెడ్డి శ్రీ చరణి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఈమె. 2004 ఆగస్టు 4న జన్మించింది.

లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా శ్రీ చరణికి పేరుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా.

తన చిన్నతనంలో ఆమె చాలా ఆటల్లో పాల్గొన్నా.. క్రికెట్‌పై అమితమైన అభిమానం పెంచుకుంది. తన మావయ్య నుంచి మంచి సపోర్టు లభించిందని ఆమె పలు సందర్భాల్లో చెప్పింది.

భారత అండర్-19 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. అయితే, ఆ తర్వాత అండర్-23 స్థాయిలో తనదైన ప్రతిభ చూపింది.

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంలో తన కోసం ముంబై ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరికి శ్రీ చరణిని దిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు దక్కించుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె డబ్ల్యూపీఎల్ లీగ్‌లో అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన వికెట్లు తీసింది. ఈ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది.

ఇదే ఏడాది శ్రీ చరణి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

శ్రీ చరణి

ఫొటో సోర్స్, Insta/indiancricketteam

‘నాన్న ఏడ్చేశారు’

కోకో, కబడ్డీ వంటి ఆటలను తాను ఆడినట్లు శ్రీ చరణి చెప్పిన వీడియోను ఇండియన్‌క్రికెట్‌టీమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.

తన మావయ్య వల్ల క్రికెట్ ఆడటం ప్రారంభించినట్లు చెప్పింది శ్రీ చరణి. అయితే, తాను ప్రొఫెషనల్‌ ప్లేయర్ అవుతానని అప్పుడు అనుకోలేదని తెలిపింది.

‘‘ఆరవ తరగతిలో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్‌లో చేర్చారు నాన్న. బ్యాడ్మింటన్ ఆడి, ఇంటికి వచ్చి మళ్లీ క్రికెట్ ఆడేదాన్ని. ఆ తర్వాత ప్రొద్దుటూరు అకాడమీలో చేర్చారు. కోచింగ్ తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడటం ప్రారంభిస్తున్నట్లు నాన్న కోచ్‌లకు కూడా ఫిర్యాదు చేసేవారు’’ అని అంతకుముందు ‘ది హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ చరణి చెప్పింది.

‘‘అథ్లెటిక్స్‌కు వెళ్తున్నా, నా మైండ్‌లో ఎప్పుడూ క్రికెట్‌ ఉండేది’’ అని తెలిపింది.

అయితే, నాన్న మొదట్లో క్రికెట్ ఆడతానంటే ఒప్పుకోలేదని, చివరికి ఏడాది తర్వాత ఒప్పుకున్నట్లు పేర్కొంది.

దిల్లీ క్యాపిటల్స్‌కు తాను ఎంపికైనప్పుడు నాన్న ఏడ్చేశారని శ్రీ చరణి చెప్పింది.

స్మృతి, హర్మన్ గురించి తన మావయ్య చెప్పేవారని, వాళ్లు ఎలా ఆడేవారో వివరించేవారని చెప్పింది.

శ్రీ చరణి

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

శ్రీ చరణిని టీమిండియా ఎప్పుడు గుర్తించింది?

2025 విమెన్స్ ప్రీమియర్ లీగ్ సమయంలో శ్రీ చరణి ఆటతీరు తమను ఆకట్టుకుందని అంతకుముందు ఓ సందర్భంలో హర్మన్‌ ప్రీత్ కౌర్ చెప్పినట్లు ఇండియాటుడే రిపోర్టు చేసింది.

ఈ లీగ్‌లో కేవలం రెండు మ్యాచ్‌లనే ఆడిన ఆమె, 8.87 ఎకానమీ రేటుతో నాలుగు కీలక వికెట్లు తీసింది.

'' ఆమె మాకు కీలక ప్లేయర్. డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ కోసం తాను ఆడిన రెండు మూడు మ్యాచ్‌లలో కూడా చాలా ఆకట్టుకుంది. ఆమె మాకు మంచి ఆప్షన్ అవుతుందని అప్పుడే మా మధ్య (టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్ల మధ్య) సంభాషణ జరిగింది'' హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపినట్లు ఇండియాటుడే కథనం పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)