9 నిమిషాలలోనే అర్ధశతకం, వరుసగా 8 సిక్సర్లు... ఎవరీ ఆకాశ్ చౌధరి, ఇంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరిట ఉంది?

ఆకాశ్ చౌధరి

ఫొటో సోర్స్, Facebook/Cricket Addictor

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ చౌధరి
    • రచయిత, పవన్ కుమార్.డి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో ఆకాశ్ చౌధరి అనే 25 ఏళ్ల క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో వరుసగా 8 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా, అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.

ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సులు కొట్టడమేకాక, తర్వాతి ఓవర్‌లోనూ మరో రెండు సిక్సులు బాది, కేవలం 11 బంతుల్లోనే ఆకాశ్ అర్ధశతకం పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతతో గతంలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల పేరిట ఉన్న రికార్డులను ఆకాశ్ చెరిపేశాడు.

మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మధ్య సూరత్‌లో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌ రెండో రోజున ఆకాశ్ చౌధరి ఈ అద్భుత ప్రదర్శన చేశాడు.

మేఘాలయ 576-6 పరుగుల వద్ద ఉండగా 8వ స్థానంలో బరిలోకి దిగిన అతడు ఓ డాట్ బాల్, రెండు సింగిల్స్‌తో తన ఆట మొదలుపెట్టాడు. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిమార్ దాబి బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సులు బాదాడు.

వరుసగా ఆరు సిక్సులు బాదిన మూడో ఆటగాడిగా...

వరుసగా ఆరు సిక్సులు బాదిన తరువాత ఆఫ్-స్పిన్నర్ టీఎన్ఆర్ మోహిత్ బౌలింగ్‌లోనూ ఆకాశ్ తొలి రెండు బంతులను సిక్సు కొట్టాడు. దీంతో అతని అర్ధశతకం పూర్తయింది.

ఫస్ట్- క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో ఆటగాడిగా ఆకాశ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 1968లో వెస్టిండీస్ దిగ్గజం సర్ గారీఫీల్డ్ సోబర్స్ 1985లో భారత మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి సాధించారు.

లిసెస్టర్‌షైర్ తరఫున 2012లో వేన్ వైట్… ఎసెక్స్ జట్టుపై 12 బంతుల్లో 50 పరుగులు నమోదు చేశాడు. తాజాగా, 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఆకాశ్… వేన్ వైట్‌ రికార్డును చెరిపేశారు.

ఆకాశ్ చౌధరి

ఫొటో సోర్స్, Facebook/Cricket Addictor

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ చౌధరి

బంతితోనూ మెరిసిన ఆకాశ్..

మొత్తం 14 బంతులు ఆడిన ఆకాశ్ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 629-8 పరుగుల వద్ద మేఘాలయ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆకాశ్ బంతితోనూ మెరిశాడు.

అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించగానే, 10 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఆకాశ్ పడగొట్టాడు. దీంతో మొత్తంగా ఆ జట్టు 73 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. తరువాత కూడా ఆ జట్టును ఆకాశ్ దెబ్బతీశాడు. ఆ జట్టు పరుగులు సాంతం రెండంకెలకు చేరకముందే 7 పరుగుల వద్ద 2 వికెట్లు తీశాడు. మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆకాశ్ చౌధరి

ఫొటో సోర్స్, Facebook/Republic

ఎవరీ ఆకాశ్?

ఆకాశ్ చౌధరికి ఇది 31వ ఫస్ట్- క్లాస్ మ్యాచ్. అంతకుముందు అతను 14.37 సగటు, రెండు అర్ధ శతకాలతో 503 పరుగులు చేశాడు.

అలాగే 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 30 టీ20లు ఆడారు. బిహార్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ అతను వరుసగా నాలుగు సిక్సులు బాదాడు.

ఇక బంతితో 29.97 సగటుతో ఫస్ట్- క్లాస్ క్రికెట్‌లో 87 వికెట్లు పడగొట్టాడు.

లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో( 29.24 సగటు) 37, టీ20ల్లో(26.25 సగటు) 28 వికెట్లు తీశాడు.

ఆకాశ్ చౌధరి తమ టీమ్‌కు ఓపెనింగ్ బౌలర్‌గా ఉండేవాడని, కానీ, గత రెండేళ్లుగా ఆయన ఆల్-రౌండర్‌గా ఎదిగారని మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నబా భట్టాచార్య బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు దిలీప్ కుమార్ శర్మతో అన్నారు.

గతంలో అండర్-16, అండర్-19 లో అతను తమ జట్టు తరఫున బాగా ఆడాడన్నారు. 2021 నుంచి రంజీ ట్రోఫీలో ఆడుతున్నారని చెప్పారు.

ఆకాశ్ చౌధరి తండ్రి మేఘాలయలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నబా భట్టాచార్య తెలిపారు. షిల్లాంగ్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదువుకున్న ఆకాశ్ .. స్కూల్ డేస్ నుంచి క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పారు. ఆకాశ్ కుటుంబం బిహార్‌కు చెందినప్పటికీ ప్రస్తుతం మేఘాలయలో నివసిస్తోందని చెప్పారు.

ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో ఆడేలా ఆకాశ్‌కు అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నట్లు నబా తెలిపారు.

రెండో వేగవంతమైన ఆర్ధ శతకం..

సమయం ప్రకారం చూస్తే.. ఫస్ట్- క్లాస్ క్రికెట్‌లో ఆకాశ్ చౌధరి రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించారని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.

ఆకాశ్‌కు 50 పరుగులు పూర్తి చేయడానికి 9 నిమిషాల సమయం పట్టగా, క్లైవ్ ఇన్‌మ్యాన్ 8 నిమిషాల్లోనే ఆ ఘనత సాధించాడు.

నాటింగ్‌హామ్ షైర్‌తో 1965లో జరిగిన మ్యాచ్‌లో లిసెష్టర్‌షైర్ తరఫున క్లైవ్ ఇన్‌మ్యాన్ 8 నిమిషాల్లో అర్ధశతకాన్ని పూర్తి చేశారు.

ఇక 10 నిమిషాల వ్యవధిలో 50 పరుగులు చేసిన ఆటగాడిగా గ్లెన్ చాపెల్ నిలిచాడు. గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంక్‌షైర్ తరఫున ఆయన ఈ రికార్డు నమోదు చేశారు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మైక్ ప్రోక్టర్ కూడా 1979 ఆగస్టు 27న టాంటన్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో.. వరుసగా ఆరు సిక్సులు సాధించారు.

గ్లౌసెస్టర్‌షైర్ తరఫున ఆడిన మైక్ ప్రోక్టర్ సోమర్‌సెట్‌పై డెన్నిస్ బ్రేక్‌వాల్ వేసిన ఓవర్‌లో ఈ రికార్డు నమోదు చేశారు.

వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు ఎవరెవరంటే..

ఐసీసీ 2007 నాటి ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెర్షెల్లె గిబ్స్ వరుసగా ఆరు సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

వార్నర్ పార్క్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్-ఏ 7వ మ్యాచ్‌లో ఆయన ఈ రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్ పార్ట్- టైమ్ లెగ్‌స్పిన్నర్ డాన్ వ్యాన్ బంగ్ వేసిన 29వ ఓవర్లో గిబ్స్ ఆరు సిక్సులు బాదారు.

అల్ అమెరాత్ వేదికగా 2021లో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు జేఎస్ మల్హోత్రా వన్డేలో వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. పపువాన్యూగినితో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్ జీటోకా వేసిన ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి 36 పరుగులు తీశాడు మల్హోత్రా.

యువరాజ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

టీ20ల్లో యువరాజ్ సింగ్.. ఇంకా ఎవరెవరంటే..

ఇక 2007లోనే టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సులు బాది చరిత్ర సృష్టించాడు. 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో ఆయన ఈ ఘనత సాధించాడు. ఆంటిగ్వా వేదికగా శ్రీలంకతో 2021లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొల్లార్డ్ కూడా వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. శ్రీలంక బౌలర్ ధనంజయ బౌలింగ్‌లో పొల్లార్డ్ ఈ రికార్డు సృష్టించాడు.

2024లో నేపాల్ తరఫున దీపేంద్ర సింగ్ ఐరీ, 2025లో బల్గేరియా ఆటగాడు మనన్ బషీర్ కూడా టీ20ల్లో వరుసగా ఆరు సిక్సులు నమోదు చేశారు.

ఒకే ఓవర్లో ఏడు సిక్సులు…

2022లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సులు కొట్టాడు.

శివసింగ్ బౌలింగ్‌లో ఒక నో బాల్‌ను కూడా రుతురాజ్ గైక్వాడ్ సిక్స్‌గా మలిచి, మిగిలిన ఆరు బంతులను కూడా సిక్స్ కొట్టాడు. దీంతో ఒకే ఓవర్లో ఏడు సిక్సులతో 43 పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)