పుతిన్ ఇద్దరు కూతుళ్లపై గతంలో అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? అసలు వాళ్లు ఏం చేస్తారు?

పుతిన్, కుమార్తెలు

ఫొటో సోర్స్, Getty/Alamy/Reuters

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. దీంతో పుతిన్‌కు సంబంధించిన వార్తలు భారత మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా పుతిన్, ఆయన కుటుంబం గురించి చర్చ నడుస్తోంది.

యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక, రష్యాపై అమెరికా విస్తృత ఆంక్షలు విధించింది. ఆ సమయంలో పుతిన్ కుటుంబం గురించిన వార్తలు ముఖ్యాంశాలుగా మారాయి. 2022లో పుతిన్ కుమార్తెల సహా ఆయన సన్నిహితులపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది.

ఈ జాబితాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కుటుంబం, కొన్ని రష్యన్ బ్యాంకులున్నాయి.

అయితే, పుతిన్ కుటుంబానికి సంబంధించి బయట చాలా తక్కువ సమాచారం ఉంది. పుతిన్ కూడా తన కుటుంబం గురించి చాలా తక్కువ మాట్లాడతారు. 2015లో జరిగిన ఒక మీడియా సమావేశంలో, తన కుమార్తె గురించి అడిగిన ప్రశ్నను పుతిన్ దాటవేశారు.

"నా కుమార్తెలు రష్యాలో నివసిస్తున్నారు, రష్యాలోనే చదువుకున్నారు. నేను వారి విషయంలో గర్విస్తున్నాను. వారు మూడు అంతర్జాతీయ భాషలు మాట్లాడతారు. నా కుటుంబం గురించి నేనెవరితోనూ మాట్లాడను. ప్రతి వ్యక్తికి తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కు ఉంది. వారు గౌరవంగా తమ జీవితాలను గడుపుతున్నారు" అని చెప్పారు పుతిన్.

అమెరికా ఆంక్షలు విధించినవారిలో పుతిన్ ఇద్దరు కుమార్తెలు,మారియా వొర్నోత్సోవ్, కాటెరినా తిఖ్నోవా పేర్లు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పుతిన్, తల్లి లియుడ్మిలాతో మారియా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2007లో జరిగిన రష్యన్ ఎన్నికల్లో తన తండ్రి పుతిన్, తల్లి లియుడ్మిలాతో కలిసి ఓటు వేసిన మారియా. (ఫైల్)

పుతిన్ కుటుంబం

పుతిన్, లియుడ్మిలా దంపతుల సంతానం కాటెరినా, మారియా. పుతిన్ దంపతులకు 1983లో వివాహం జరిగింది. ఆ సమయంలో ఆమె ఫ్లైట్ అటెండెంట్, పుతిన్ కేజీబీ (సోవియట్ యూనియన్ నిఘా సంస్థ) అధికారి.

వారి వివాహ జీవితం 30 సంవత్సరాలు కొనసాగింది. ఈ కాలంలో పుతిన్ రష్యన్ రాజకీయాల్లో వేగంగా అగ్రస్థానానికి ఎదిగి, తన పట్టును బలోపేతం చేసుకున్నారు. అయితే 2013లో పుతిన్ దంపతులు విడిపోయారు.

దీనిపై పుతిన్ స్పందిస్తూ "ఇది ఉమ్మడి నిర్ణయం. మేం ఒకరినొకరు అరుదుగా చూసుకుంటాం. మా ఇద్దరికీ సొంత, ప్రత్యేక జీవితాలున్నాయి" అన్నారు.

ఇక, లియుడ్మిలా తన పనిలో తాను 'పూర్తిగా మునిగిపోయాను' అని చెప్పారు.

మారియా, పుతిన్ కూతురు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, పుతిన్ పెద్ద కుమార్తె మారియా వయస్సు 40 సంవత్సరాలు

పుతిన్ పెద్ద కుమార్తె మారియా

పుతిన్ పెద్దకుమార్తె మారియా 1985లో జన్మించారు. ఆమె సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం చదువుకున్నారు. మాస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి వైద్య పట్టా పొందారు.

మారియా ఇప్పుడు బోధన, రచనలలో నిమగ్నమై ఉన్నారు. ఆమె ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్. వ్యాపారవేత్త కూడా.

ఆమెకు ఒక కంపెనీ ఉంది. ఒక పెద్ద వైద్య కేంద్రాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్టు బీబీసీ రష్యా తెలిపింది.

మారియా డచ్ వ్యాపారవేత్త జోరిట్ జూస్ట్ ఫాసెన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె గతంలో రష్యన్ గ్యాస్ కంపెనీ గాజ్‌ప్రోమ్‌లో పనిచేశారు. మారియా దంపతులు ప్రస్తుతం విడిపోయారు.

కాటెరినా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పుతిన్ చిన్న కుమార్తె కాటెరినా 2013లో ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు (ఫైల్)

కాటెరినానే ఎక్కువగా తెలుసు

మారియాతో పోలిస్తే పుతిన్ చిన్న కుమార్తె కాటెరినా గురించి బయటి ప్రపంచానికి ఎక్కువ తెలుసు. ముఖ్యంగా రాక్ అండ్ రోల్ డ్యాన్సర్‌గా పేరుగాంచారామె. 2013లో ఆమె బృందం అంతర్జాతీయ పోటీలో ఐదవ స్థానంలో నిలిచింది.

అదే ఏడాది, పుతిన్ స్నేహితుడి కుమారుడైన కిరిల్ షామలోవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. రష్యా ఇంధన రంగంలో తన పాత్రకు గాను షామలోవ్‌పై అమెరికా 2018లో ఆంక్షలు విధించింది. అయితే, కాటెరినా, షామలోవ్ తరువాత విడిపోయారు.

కాటెరినా విద్య, వ్యాపారం రెండింటిలోనూ భాగమవుతుంటారు. 2018లో, రష్యన్ ప్రభుత్వ మీడియాలో నిర్వహించిన న్యూరోటెక్నాలజీపై చర్చలో ఆమె పాల్గొన్నారు. 2021లో ఆమె ఒక వాణిజ్య వేదికపై కూడా కనిపించారు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ అధ్యక్షుడితో ఆమెకున్న సంబంధం గురించి ప్రస్తావించలేదు.

పుతిన్, ఆయన కుటుంబం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, పుతిన్, ఆయన కుటుంబం. ఇది 2002నాటి ఫోటో

‘రాచబిడ్డల్లా పెరగాలని కోరుకోలేదు’

ఇద్దరు కుమార్తెలలో ఎవరూ కూడా అధ్యక్షుడు పుతిన్‌తో ఎక్కువ సమయం గడపలేదని చెబుతుంటారు. పుతిన్‌కు గ్రాండ్‌చిల్ట్రన్ కూడా ఉన్నారు.

2017లో జరిగిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో ఆయన వారి గురించి ప్రస్తావించారు. కానీ, వారు ఎంతమంది, తన కూతుళ్లలో ఎవరి సంతానమనేది పేర్కొనలేదు.

"నా గ్రాండ్‌చిల్డ్రెన్‌లో ఒకరు నర్సరీ స్కూల్‌లో చదువుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, వారు రాచబిడ్డల్లా పెరగాలని నేను కోరుకోవడం లేదు. సాధారణ వ్యక్తుల్లానే పెరగాలని కోరుకుంటున్నా" అని పుతిన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)