దిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, @narendramodi
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్నారు. పుతిన్ విమానం దిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తరువాత ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో బయలుదేరారు.
"నా స్నేహితుడు, అధ్యక్షుడు పుతిన్‌ను దిల్లీకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను" అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"ఈ సాయంత్రం తర్వాత, రేపు మన సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను. భారత్, రష్యాల మధ్య స్నేహం కాల పరీక్షకు నిలిచి, మన ప్రజలకు అపారమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టింది" అని ఆ పోస్టులో తెలిపారు.
"రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నాయకుడిని హృదయపూర్వకంగా స్వాగతించారు" అని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది.
2022లో యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
2023లో భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కూడా ఆయన పాల్గొనలేదు.


ఫొటో సోర్స్, @narendramodi
రూ. 6 లక్షల కోట్ల వాణిజ్యం
భారత్, రష్యాలు దీర్ఘకాలిక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని ఇరుదేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ప్రతిబింబిస్తుంటాయి.
ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అగ్ర నాయకులు ఒకరి దేశంలో మరొకరు రొటేషన్ ప్రాతిపదికన కలుస్తారు. ఇప్పటివరకు, భారత్, రష్యాల మధ్య 22 శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి.
రెండు దేశాల నాయకులు 2022లో ఐదుసార్లు, 2023లో రెండుసార్లు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 2024లో మాస్కోను సందర్శించారు.
భారత్, రష్యాలకు రక్షణ, ఇంధనం, ఇతర వ్యాపార సంబంధాలున్నాయి.
ప్రభుత్వ డేటా ప్రకారం, 2024-25లో భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్ల(రూ. 6.17 లక్షల కోట్లు)కు చేరుకుంది.

ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images
పుతిన్ భారత పర్యటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.
"గత నెలలో మాస్కోలో వాణిజ్యం, ఆర్థిక సహకారంపై భారత్-రష్యా వర్కింగ్ గ్రూప్ 26వ సమావేశం విజయవంతంగా జరగడం, రష్యా నేతృత్వంలోని యురేషియన్ ఆర్థిక యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించడాన్ని మేం స్వాగతిస్తున్నాం" అని రాజ్‌నాథ్ సింగ్ ఒక సమావేశంలో అన్నారు.
"ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నాను" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














