రాచకొండ రాజ్యం: కుతుబ్ షాహీలకు ముందు తెలుగు నేలను పాలించిన ఈ రాజుల పాలన ఎందుకు అంతమైంది? ఆ రాజులు ఏమయ్యారు?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల గురించి తెలిసిందే కదా.. ఈ రెండు ప్రాంతాల పేరుతో పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. ఇది కాకుండా హైదరాబాద్ లో అంతర్భాగంగా మరో పోలీసు కమిషనరేట్ ఉంటుంది.. అదే రాచకొండ. అసలీ రాచకొండ పేరు ఎందుకు వచ్చింది? దీని చరిత్ర ఏమిటి..?
తెలుగు నేలపై కుతుబ్ షాహీల సామ్రాజ్య స్థాపన క్రీ.శ.1518లో జరిగింది. అంతకు ముందు క్రీ.శ.1323లోనే కాకతీయుల రాజ్యం పతనమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
మరి, క్రీ.శ.1323-1518 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించారు?
ఈ ప్రశ్నకు సమాధానం... రేచర్ల పద్మనాయకులు. వీరు హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాచకొండను కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు.
బహమనీ సుల్తానుల పాలనా కాలంలోనే రాచకొండ రాజుల పాలన కూడా సాగింది. అయితే రేచర్ల పద్మనాయకుల పాలనా కాలమే ఎక్కువ. 150 ఏళ్లపాటు వీరి పాలన సాగినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి.


కనిపించని 'కోట' ఆనవాళ్లు
హైదరాబాద్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ రాచకొండ. ఈ పేరుతోనే రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడింది.
రాచకొండ గుట్టలు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల మధ్య కనిపిస్తుంటాయి.
పచ్చని ప్రకృతి అందాల మధ్య చుట్టూ ఎత్తైన గుట్టల మధ్య రాచకొండ కోట జాడలు మాత్రం కనిపిస్తాయి. కోట మాత్రం లేదు.
శిథిలావస్థకు చేరిన కోట గోడలే అక్కడ గతంలో ఒక కోట ఉందనడానికి సాక్ష్యాలు.
రాచకొండకు రాజాచలం, రాజగిరి అనే పేర్లు కూడా ఉన్నాయని 'తెలుగు విజ్ఞాన సర్వస్వము' మూడో సంపుటిలో మల్లంపల్లి సోమశేఖర శర్మ రాశారు.

అనపోత నాయకుడితో మొదలు
రాచకొండలో సింగమనాయకుడు నుంచి పాలన మొదలైందని తెలంగాణకు చెందిన చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ బీబీసీతో చెప్పారు. సింగమనాయకుడు తర్వాత ఆయన కుమారుడు అనపోత నాయకుడు క్రీ.శ.1361లో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రాచకొండలో పూర్తిస్థాయిలో రాజ్యస్థాపన జరిగిందని చరిత్ర చెబుతోంది.
సింగమనాయకుడు కుమారుడు అనపోత నాయకుడు క్రీ.శ.1361 నుంచి 1384 వరకు పాలించాడు.
''సింగమనాయకుడు సమయంలో మొదట ఆమనగల్లు రాజధానిగా ఉండేది. తర్వాత రాచకొండకు మార్చి కోట నిర్మించి ఉండొచ్చు'' అని తెలుగు విజ్ఞాన సర్వస్వములో ప్రస్తావించారు.
అయితే, సింగమనాయకుడు హయాం కన్నా ముందు నుంచే కోట ఉండే అవకాశం ఉందని, దాన్ని శత్రుదుర్భేద్యంగా అనపోత నాయకుడు మార్చారని మల్లంపల్లి సోమశేఖర శర్మ రాశారు.
రాచకొండ రాజ్యమనేది తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతంగా ఉండేదని అప్పటి శాసనాలను బట్టి తెలుస్తోందని ద్యావనపల్లి సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

కాపయ నాయకుడిని చంపి..
ఓరుగల్లు రాజ్యంలో కాకతీయుల పతనం తర్వాత దాన్ని పాలించిన ముసునూరు నాయకులకు సింగమనాయకుడు సానుకూలంగా ఉంటూ వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ఆ తర్వాత క్రీ.శ.1357లో సింగమనాయకుడు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారని ''తెలంగాణ చరిత్ర- సంస్కృతి- ఉద్యమాలు (చరిత్ర పూర్వ యుగం నుండి రాష్ట్ర ఏర్పాటు వరకు)'' పుస్తకంలో అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ రాశారు.
''సింగమనాయకుడు స్వతంత్రం ప్రకటించుకున్నాక, జల్లిపల్లి యుద్దంలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత క్రీ.శ.1368లో ముసునూరు వంశపు రాజు కాపయ నాయకుడిని ఓరుగల్లు భీమవరం వద్ద సింగమనాయకుడి కుమారులు అనపోత, మాదా నాయకులు చంపడంతో రేచర్ల పద్మనాయకుల పాలన మొదలైంది'' అని చెప్పారు ద్యావనపల్లి సత్యనారాయణ.
ఇదే విషయాన్ని, తెలుగు విజ్ఞాన సర్వస్వములో ''ఓరుగల్లు రాజ్యాన్ని పాలిస్తున్న కాపయ నాయకుడిని ఓడించి తెలంగాణను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు రాచకొండ రాజులు'' అని మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రస్తావించారు.

కచేరీ గుట్ట, గుర్రాల గుట్ట..
రాచకొండ ప్రాంతంలో ఎన్నో గుట్టలు (కొండలు) ఉన్నప్పటికీ రెండు గుట్టలు కీలకమైనవి.
అందులో ప్రధానమైనది కచేరీ గుట్ట. ఇది ప్రధాన కోట లేదా రాజు ఆస్థానం ఉండే ప్రదేశం.
మరొకటి.. గుర్రాల గుట్ట. ఇది గుర్రాలు కట్టడానికి, సైనికులు ఉండటానికి వాడేవారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఈ గుట్టపైన కూడా కోట గోడ తరహా నిర్మాణం పూర్తిగా శిథిలమైపోయింది. అటువైపు వెళ్లే మార్గంలో ఉన్న ద్వారం కూడా కూలిపోయింది.
గోడకు ఒకవైపు రాళ్లపై రెండు చిరుత బొమ్మలు, మరోవైపు హనుమంతుడి బొమ్మ చెక్కినట్లుగా కనిపిస్తున్నాయి.
ఇక కచేరీ గుట్టపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం సరిగా లేదు. రాచకొండ రాజుల కాలంలో నిర్మించిన ఈ మార్గమంతా శిథిలమై కనిపిస్తోంది.
కోట వరకు చేరుకునేందుకు ఏడు ద్వారాలుంటాయి. ప్రస్తుతం కోట గానీ, దాని ఆనవాళ్లు గానీ ఎక్కడా కనిపించవు.
కాకతీయుల కాలం నుంచే ఏడు ద్వారాల పద్ధతి ఉందని చెప్పారు ద్యావనపల్లి సత్యనారాయణ.
''రాచకొండ ప్రాంతంలోనూ అదే తరహా నిర్మాణ శైలి కనిపిస్తుంది. కానీ, రాచకొండ రాజులవి అంత బలమైన కోట గోడలు కావు'' అని చెప్పారాయన.
మూడు ప్రాకారాలుగా కోట గోడల ఆనవాళ్లు నేటికీ కనిపిస్తుంటాయి.

పాలన అంతా యుద్ధాలతోనే..
రాచకొండ రాజుల పాలన ఎక్కువగా యుద్ధాలతోనే గడిచిపోయిందని చెప్పారు ద్యావనపల్లి సత్యనారాయణ.
''బహమనీ సుల్తానులతో స్నేహం చేసి కోస్తాంధ్రను పాలిస్తున్న రెడ్డి రాజులను అణిచారు. కళింగ గజపతి రాజులతో స్నేహం చేసి బహమనీ సుల్తానులను ఓడించారు. తర్వాత విజయనగర (కర్ణాటాంధ్ర) రాజులతో స్నేహం చేస్తున్న సమయంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడి రాజ్యం పోగొట్టుకున్నారు'' అని వివరించారు.
క్రీ.శ.1435 నుంచి 1460, క్రీ.శ.1475 నుంచి 1503 మధ్య రాచకొండ బహమనీ సుల్తానుల పాలన కేంద్రంగా ఉండేదని చరిత్ర చెబుతోంది.
గోల్కొండ కుతుబ్ షాహీల పాలన మొదలయ్యాక క్రీ.శ.1536 నుంచి కొంత కాలంపాటు రాచకొండ కీలక కేంద్రంగా పనిచేసిందని ద్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు.
యుద్ధాలతోనే ఎక్కువ సమయం గడిచిపోవడంతో గొప్ప కట్టడాలు నిర్మించేందుకు వీరికి సమయం సరిపోలేదని చెబుతుంటారు.
గుప్త నిధుల కోసం ధ్వంసం
ప్రస్తుతం రాచకొండలో కచేరీ గుట్ట కింద ఒక మండపం, గుట్టపైన మరో చిన్న మండపం కనిపిస్తున్నాయి.
కోట ఎప్పుడు ధ్వంసమైందనే దానిపై స్పష్టమైన చరిత్ర ఆధారాలు లేకపోయినా, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆనవాళ్లూ కనిపించడం లేదు.
''కోటలో గుప్త నిధులున్నాయంటూ తవ్వకాలతో చాలా వరకు పాడు చేశారు'' అని రాచకొండకు చెందిన రాజు నాయక్ బీబీసీతో చెప్పారు.
రాచకొండ కోట ప్రాంతాన్ని ప్రభుత్వం రాచకొండ అర్బన్ పార్కుగా ప్రకటించి అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యటకులను అనుమతిస్తోంది.
హైదరాబాద్ దగ్గర్లో సినిమా షూటింగులు కూడా చేసుకునేలా రాచకొండ లొకేషన్లు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని హైదరాబాద్‌కు చెందిన అనురాధ బీబీసీతో చెప్పారు.
''సందర్శకులు నడవడానికి వీలుగా మెట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది'' అని ఆమె అన్నారు.
రాచకొండలో నిర్వహణపరంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజా రాణి చెప్పారు.
"ఇక్కడ శిథిలమైన ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు చేశాం. అలాగే, మెయింటెనెన్స్ చూసుకునేందుకు ఒక వ్యక్తిని నియమించి, పర్యవేక్షిస్తున్నాం. భవిష్యత్‌లో ఆర్కియాలజీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది" అని పద్మజా రాణి చెప్పారు.

‘గ్రావిటీతో నీటిపారుదల’
రాచకొండ రాజులు కాకతీయుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారని చెప్పవచ్చని 'తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు' పుస్తకంలో ప్రస్తావన ఉంటుంది.
''అనపోత సముద్రం, రాయ సముద్రం సహా చెరువులు, కుంటలు, బావులు తవ్వించారని శాసనాల్లో ఉంది'' అని అందులో రాసి ఉంది.
రాచకొండ రాజుల సమయంలో 'గ్రావిటేషనల్ టెక్నాలజీ'తో నీరు పారించినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇప్పటికీ ఈ కాలువలు కనిపిస్తుంటాయి.
ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు పారించారని చెప్పారు ద్యావనపల్లి సత్యనారాయణ.
''ఈ తరహా విధానం సింధు నాగరికతలో చూశాం. అలాగే మధ్య ప్రదేశ్‌లో భోజపాలుడు అనే రాజు ''సరస్వతి కంఠాభరణం'' అనే తన పుస్తకంలోనూ రాశారు. ఆ తర్వాత రాచకొండ రాజుల కాలం నాటి కాలువలు బయటపడ్డాయి'' అని చెప్పారు.
హోలీ తరహా వసంతోత్సవాలు
రాచకొండ రాజుల సమయంలో వసంతోత్సవాలు ప్రత్యేకంగా జరిపినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. కోలాహలంగా ఈ ఉత్సవాలు జరిపేవారని, కళాకారులు, ప్రజలతో కలిసి రాజులు పండుగలా జరుపుకొనేవారని ద్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు.
''ప్రస్తుతం చేసుకునే హోలీతో ఈ ఉత్సవాలను పోల్చవచ్చు. సుగంధ ద్రవ్యాలు, పసుపు, రంగులు వంటివి జల్లుకునేవారు. తెలుగునాట 'హోలీ' రాచకొండ పాలన సమయంలోనే వచ్చిందని చెప్పవచ్చు'' అని ఆయన చెప్పారు. ఆ సమయంలో కవులు, కళాకారులను సన్మానించేవారు.
రాచకొండ రాజుల ఆస్థానంలో 'బమ్మెర పోతన'
రాచకొండ రాజుల పాలన సమయంలో సాహిత్యానికి పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.
'సహజకవి’గా పేరొందిన బమ్మెర పోతన మూడో సింగమనాయకుడి ఆస్థానంలో ఉండేవారు.
ఈయన భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. 'భోగినీ దండకం'తో పాటు 'వీరభద్ర విజయం' అనే కావ్యాన్ని రాశారు.
సర్వజ్ఞ సింగభూపాలుడు 'రత్న పాంచాలిక' అనే నాటకాన్ని రచించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
తాతల పేర్లే మనవళ్లకు
రాచకొండను పాలించిన వారసుల పేర్లు విచిత్రంగా ఉంటాయి. తాత పేరు మనవడికి పెట్టినట్లు ఉంటుంది.
సింగమనాయకుడు తర్వాత అనపోత నాయకుడు 1361 నుంచి 1384 వరకు పాలించాడు. ఆ తర్వాత 1384 నుంచి 1399 వరకు రెండో సింగమ నాయకుడు, 1399 నుంచి 1421 వరకు రెండో అనపోత నాయకుడు, 1421 నుంచి 1430 వరకు రావు మాధవ, 1430 నుంచి 1475 వరకు మూడో సింగమనాయకుడు పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది.
1425 - 1435 మధ్యకాలంలో బహమనీలు (గుల్బర్గా) నుంచి పాలన సాగించారు. బహమనీలు రేచర్ల పద్మనాయకులపై దాడి చేసి ఓడించినట్లు చరిత్రలో ఉంది.

' బహమనీలు పది, పదిహేనేళ్లు రాచకొండను సామంత రాజ్యంగా మార్చుకుని పాలించారు. కళింగ రాజ్యానికి చెందిన కపిలేశ్వర గజపతి సాయంతో అతని కుమారుడు వినాయక దేవుడ్ని పంపించగా, వారి సాయంతో బహమనీలను ఓడించారు రేచర్ల పద్మనాయకులు'' అని ద్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు.
ఆ తర్వాత 1498 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి వచ్చిన కుతుబ్ షాహీలు, 1512లో గోల్కొండ కోటకు వచ్చారు.
అనంతరం 1518 నుంచి కుతుబ్ షాహీలు రాజ్యాధికారం చేపట్టారు. 1535 సమయంలో రాచకొండను వారు స్వాధీనం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
''అప్పటికి అరవై ఏళ్ల ముందే అంటే.. 1475లోనే రాచకొండలో పద్మనాయకుల పాలన ముగిసిందని చెప్పాలి. అప్పట్నుంచి బహమనీల పాలన సాగింది. వారి నుంచి పాలనాపగ్గాలు కుతుబ్ షాహీలు తీసుకున్నారు'' అని ద్యావనపల్లి సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














