శ్రీలంకకు భారత్, పాకిస్తాన్ సాయం: శ్రీలంక ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
"వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో భారత్, పాకిస్తాన్ హెలికాప్టర్లు రక్షణ చర్యలలో నిమగ్నమయ్యాయి. ఓ ఉమ్మడి కారణం ఈ పాత శత్రువులిద్దరినీ ఒకే చోటకు చేర్చింది. థాంక్యూ బ్రదర్స్''
దిత్వా తుపాను దేశాన్ని తాకిన తరువాత ఇరుదేశాల సైనిక సేవలను ఉటంకిస్తూ కృతజ్ఞతా సందేశాలు పంపినవారిలో శ్రీలంకకు చెందిన షేన్ ప్రియా విక్రమ ఒకరు.
పాకిస్తాన్, ఇండియా మధ్య ఇటీవల మే నాటి సైనిక సంఘర్షణ సహా దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
దిత్వా తుపాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. 400మందికి పైగా ప్రజలు మరణించారు. వందలాదిమంది గల్లంతయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శ్రీలంకలో ప్రకృతి విపత్తువేళ సహాయక చర్యలలో దక్షిణాసియా ప్రత్యర్థి దేశాలైన భారత్, పాకిస్తాన్ పాల్గొనడాన్ని''స్వాగతించాల్సిన పరిణామం''గా అభివర్ణిస్తున్నారు.

''పొరుగుదేశాలకు సాయం చేయాలనే భారత 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావిత కుటుంబాలకు సాయం అందించేందుకు, కీలక సేవల పునరుద్ధరణకు, శత్రుజిత్ బ్రిగేడ్‌కు చెందిన ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నాం'' అని భారత ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
''ఈ మిషన్ వసుధైవ కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే మన సాంస్కృతిక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆపదలో ఉన్న శీలంకకు భారత సైన్యం అండగా నిలుస్తుంది'' అని తెలిపింది.
దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో కురిసిన వర్షాలు భారీ వరదలకు కారణమయ్యాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 460కి పెరిగింది. ఇంకా వందలాదిమంది జాడ తెలియలేదు.

ఫొటో సోర్స్, X@dgprPaknavy
‘భారత్ అనుమతి’పై పాకిస్తాన్ ఆరోపణలేంటి?
మరోవైపు శ్రీలంకలో వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో తరలిస్తున్నామని, బాధిత ప్రజలకు సాయం పంపించామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది.
''శ్రీలంకకు పాకిస్తాన్ పంపిన మానవతాసాయాన్ని ఇండియా నిరంతరం అడ్డుకుంటోంది. సాయం అందించేందుకు పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు బయల్దేరిన ప్రత్యేక విమానం 60 గంటలు నిలిచిపోయింది'' అని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసినట్టు 'బీబీసీ ఉర్దూ' తెలిపింది.
''48 గంటల తరువాత భారత్ ఇచ్చిన పాక్షిక అనుమతి ఆచరణాత్మకం కాదు. కేవలం కొన్ని గంటలు మాత్రమే అనుమతిచ్చింది. అది కూడా తిరుగు ప్రయణానికి అనుమతివ్వలేదు, శ్రీలంకలో చిక్కుకున్న ప్రజల కోసం ఉద్దేశించిన సహాయ కార్యక్రమానికి తీవ్రమైన ఆటంకం కలిగించింది'' అని ఆప్రకటనలో తెలిపింది.
శ్రీలంకకు పాకిస్తాన్ పంపుతున్న మానవతా సాయాన్ని భారత్ అడ్డుకుందనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ''అసంబద్ధమైనది''గా పేర్కొంది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన అసంబద్ధ ప్రకటనను తిరస్కరిస్తున్నామని, ఇది భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే మరో ప్రయత్నమన్నారు.
"శ్రీలంకకు మానవతా సహాయాన్ని తీసుకెళ్తున్న పాకిస్తాన్ విమానం ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ కోసం 2025 డిసెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు అభ్యర్థన వచ్చింది.
మానవతా సాయం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం అదే రోజు అభ్యర్థనను వేగంగా ఆమోదించింది. 2025 డిసెంబర్ 1న సాయంత్రం 5:30 గంటలకు ఓవర్‌ఫ్లైట్‌కు అనుమతించింది.
ఈ క్లిష్ట సమయంలో శ్రీలంకకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది'' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, X/@adgpi
శ్రీలంకకు సహాయక సామగ్రితో కూడిన నౌకలు, మూడు సహాయ విమానాలను, వైద్య, రక్షణ బృందాన్ని పంపినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి భారత వైమానిక దళం ఎంఐ -17 హెలికాప్టర్లు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించే కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. శ్రీలంక ప్రజలతో పాటు బ్రిటన్, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సహా వివిధ దేశాల ప్రజలను ప్రభావిత ప్రాంతాల నుండి రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, X post
శ్రీలంక ప్రజలు ఏమంటున్నారు?
శ్రీలంకలో సహాయక చర్యలలో ఇరుదేశాల సైనికులు పాల్గొనడాన్ని అనేకమంది సానుకూలంగా చూస్తున్నారు.
''శ్రీలంక కష్టకాలంలో భారత్, పాకిస్తాన్ సాయం చేస్తున్నాయి. ఇరుదేశాల మానవతా సాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అని సెహాన్ మధు అనే యూజర్ ఎక్స్‌లో రాశారు.
"ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ సాయం చేయగల సామర్థ్యం ఉందని ఇండియా మరోసారి నిరూపించింది" అని షేన్ ప్రియాక్ కర్మ అనే యూజర్ ఎక్స్‌లో రాశారు.
''పాకిస్తాన్, భారత్ మధ్య చారిత్రక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ మానవతా దృక్పథంతో పాకిస్తాన్ సహాయ విమానాన్ని శ్రీలంకకు వెళ్లేందుకు భారత్ అనుమతించింది. ఇది శ్రీలంక ప్రజలకు పెద్ద విషయం'' అని ఆయన రాశారు.
''కష్టకాలంలో అత్యుత్తమ సహాయకులమని భారత్, పాకిస్తాన్ మరోసారి నిరూపించుకున్నాయి'' అని ఆయన తన పోస్టులో రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














