శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

శ్రీలంక మాజీ అధ్యక్షుడు, రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక సీఐడీ, నిధుల దుర్వినియోగం

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్లోరా డ్రురి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీలంకలో మాజీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి.

అయితే ఆయన ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయలేదని యునైటెడ్ నేషనల్ పార్టీ మీడియా విభాగం తెలిపింది.

ఈ కేసులో విచారణ కోసం ఆయన శుక్రవారం ఉదయం కొలంబోలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను ప్రశ్నించిన సీఐడీ అధికారులు, తర్వాత అరెస్ట్ చేశారు.

అనంతరం కొలంబోలోని ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.

రణిల్ విక్రమసింఘే 2022 నుంచి 2024 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ సమయంలో ఆయన 23 విదేశీ పర్యటనలు చేశారు. దీని కోసం 17.39 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఆయన అరెస్టుకు కారణం 2023లో క్యూబాలో జరిగిన జీ77 సదస్సుకు హాజరై వస్తూ బ్రిటన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడ ఆగిన సంఘటనకు సంబంధించినదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

లండన్‌లోని వోల్వర్‌ హాంప్టన్ విశ్వవిద్యాలయ వేడుకకు ఆయనతో పాటు ఆయన భార్య మైత్రి విక్రమ సింఘే హాజరయ్యారు.

ఇది ప్రైవేటు కార్యక్రమమని, దీనికి ప్రభుత్వ నిధులు ఉపయోగించారని శ్రీలంక సీఐడీ ఆరోపిస్తోంది.

అయితే ఈ ఆరోపణలను విక్రమ సింఘే ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీలంక మాజీ అధ్యక్షుడు, రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక సీఐడీ, నిధుల దుర్వినియోగం

ఫొటో సోర్స్, PRADEEPA MAHANAMAHEWA

ఫొటో క్యాప్షన్, న్యాయవాది ప్రదీప మహానామహేవా

మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేయవచ్చా?

శ్రీలంకలో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు జేఆర్ జయవర్దనే 1978లో రూపొందించిన రాజ్యాంగం అమల్లో ఉంది.

ఈ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి అత్యున్నత కార్యనిర్వహక అధికారం ఉంది.

శ్రీలంకలో అనేకమంది మాజీ అధ్యక్షులపై కేసులు నమోదైనప్పటికీ వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు.

దేశ చరిత్రలో తొలిసారి మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను అరెస్టు చేశారని మానవ హక్కుల కమిషన్ మాజీ కమిషనర్, న్యాయవాది ప్రదీప మహానమహేవా బీబీసీతో చెప్పారు.

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేసే అధికారం ఉందా అని ప్రదీప మహానమహేవాను బీబీసీ అడిగింది.

"1978 రాజ్యాంగం ఆర్టికల్ 7లో అధ్యక్షుడికి ప్రత్యేక హక్కు ఉందని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆర్టికల్ 35/1 ప్రకారం అధ్యక్షుడిపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ కేసు నమోదు చేయకూడదు" అని ఆయన చెప్పారు.

అయితే రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తన పదవీకాలంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తే, ఆయనపై కేసు నమోదు చేయవచ్చని ప్రదీప వివరించారు.

"అధ్యక్షుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనపై సివిల్, క్రిమినల్ కేసు పెట్టలేము. అయితే పదవి నుంచి దిగిపోయిన తర్వాత లేదా రాజీనామా చేసినా ఆయనపై అలాంటి కేసులు నమోదు చేయవచ్చు. అందులో ఎలాంటి అడ్డంకులు లేవు" అని ఆయన చెప్పారు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు, రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక సీఐడీ, నిధుల దుర్వినియోగం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రణిల్ విక్రమ సింఘే ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు.

సంక్షోభంలో నాయకత్వం

రణిల్ విక్రమ సింఘే 1977లో తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి శ్రీలంక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన రాజకీయ, వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు.

1994లో యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో అవినీతిపరుల్ని తొలగించడానికి క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

2020 ఎన్నికల్లో ఆయన పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. పార్లమెంట్‌లో ఆయనొక్కరే పార్టీ తరపున సభ్యుడిగా ఉన్నారు.

దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా 2022లో రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో విక్రమ సింఘే అధ్యక్షుడయ్యారు.

2024 ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే చేతిలో ఓడిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)