శ్రీలంక: ‘‘మా ప్రాంతంలో 15 ఇళ్లు బండరాళ్లు, బురద కింద కూరుకు పోయాయి,అందులో ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు’’

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో భారీ వరదలు రావడం, కొండచరియలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య 330 దాటింది. కొన్నేళ్లుగా ఎప్పుడూలేని అత్యంత దారుణమైన వాతావరణ విపత్తును ఎదుర్కొంటోంది శ్రీలంక. దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
ఈ వరదల్లో 200 మందికి పైగా గల్లంతయ్యారనీ, దాదాపు 20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయనీ, 108,000 మందిని ప్రభుత్వం నడిపే తాత్కాలిక ఆశ్రయాలకు తరలించామనీ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది.
దిత్వా తుపాను తర్వాత అత్యవసర పరిస్థితి ప్రకటించారనీ, దేశంలో దాదాపు మూడో వంతు ప్రాంతంలో విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
దేశ చరిత్రలో ఇది "అత్యంత కఠినమైన ప్రకృతి వైపరీత్యం" అని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు.
విధ్వంసం చాలా తీవ్రంగా ఉందని, పునర్నిర్మాణ అంచనాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

కెలాని నది నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నందున కొన్ని ప్రాంతాలలో ప్రజలను తరలించాలన్న ఆదేశాలు అమల్లో ఉన్నాయి.
"మా ప్రాంతంలో దాదాపు 15 ఇళ్ళు బండరాళ్లు, బురద కింద కూరుకుపోయాయి, నివాసితులలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు" అని సెంట్రల్ శ్రీలంకకు చెందిన ఒక మహిళ చెప్పారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోవడంతో కాండీ, బదుల్లాలలో సహాయం అందక మరణాలు ఎక్కువయ్యాయి.
"కొండచరియలు విరిగిపడటంతో అన్ని రోడ్లు మూసుకుపోయాయి. మేం ఊరు వదిలి బయటకు వెళ్లలేం, ఎవరూ లోపలికి రాలేరు. ఆహారం లేదు, తాగునీరు నిండుకుంటోంది" అని సమన్ కుమార అనే బందుల్లావాసి న్యూస్ సెంటర్ వెబ్‌సైట్‌కు టెలిఫోన్ ద్వారా చెప్పారు.
బాధితుల్లో శనివారం మధ్యాహ్నం ఉత్తర-మధ్య జిల్లా కురునెగల్లోని వరదలు ముంచెత్తిన వృద్ధాశ్రమంలో 11 మంది నివాసితులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
24 గంటల పాటు జరిగిన సహాయక చర్యల తర్వాత ఒక నిర్వాసితుడు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సమీపంలోని భవనం పైకప్పుపైకి ఎక్కడానికి నేవీ ఎలా సహాయం చేయాల్సి వచ్చిందో చెప్పారు.
" మేం పైకప్పు మీద ఉన్నాం. దానిలో కొంత భాగం కూలిపోయింది. ముగ్గురు మహిళలు నీటిలో పడిపోయారు. కానీ తిరిగి పైకప్పు మీదకు రావడానికి వారు సహాయం చేశారు. మేం చాలా అదృష్టవంతులం" అని శాంత అనే మహిళ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. ప్రభావిత వర్గాలకు మద్దతు ఇవ్వడానికి విదేశాలలో ఉన్న శ్రీలంక ప్రజలు డబ్బును విరాళంగా ఇవ్వాలని కోరింది.
శుక్రవారం నాడు దిత్వా తుపాను శ్రీలంక తూర్పు తీరాన్ని తాకింది. ఆ తర్వాత శ్రీలంకకు దూరంగా కదిలింది.
శ్రీలంకలో ప్రస్తుతం వర్షాకాలమే. కానీ అక్కడ ఈ స్థాయిలో తీవ్రమైన వాతావరణం కనిపించడం చాలా అరుదు.
ఈ శతాబ్దంలో శ్రీలంకలో అత్యంత దారుణమైన వరదలు జూన్ 2003లో సంభవించాయి. ఆ వరదల్లో 254 మంది మరణించారు, లక్షలమంది నిరాశ్రయులయ్యారు.
ఆగ్నేయాసియా కూడా కొన్నేళ్లుగా ఎన్నడూ చూడని దారుణమైన వరదలను ఎదుర్కొంటోంది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌లలో లక్షలాది మందిపై ఈ ప్రభావం పడింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














