ప్రియుడి శవానికి పసుపు, కుంకుమలు రాసి అవే తన నుదుటిపై దిద్దుకున్న యువతి

ప్రేమ, నేరాలు, మహారాష్ట్ర, నాందేడ్
ఫొటో క్యాప్షన్, పరువు హత్య అనంతరం, ఆ యువతి తన ప్రియుడి మృతదేహానికి పసుపు, కుంకుమ పూసి వివాహం చేసుకున్నారు.
    • రచయిత, ముస్తాన్ మీర్జా
    • హోదా, బీబీసీ కోసం

(ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

మహారాష్ట్రలోని నాందేడ్‌, జునా ఘాట్ (జునా గంజ్) ప్రాంతంలో జరిగిన దారుణ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది.

యువతి ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిని హత్య చేశారు.

నాందేడ్‌లోని ఇత్వారా ప్రాంతానికి చెందిన సాక్షమ్ తాటే (వయస్సు 20 ఏళ్లు), అచల్ మామీడ్వార్ (వయస్సు 21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు. సాక్షమ్ దళిత వర్గానికి చెందిన యువకుడు. అచల్ ప్రేమను ఆమె కుటుంబం వ్యతిరేకించింది.

సాక్షమ్ హత్యకు గురయ్యారు. కానీ, అతని ప్రియురాలు అచల్ మాత్రం ఆయన మృతదేహానికి పసుపు, కుంకుమ రాసి.. ఆ పసుపు కుంకుమను తన నుదిటిపై దిద్దుకున్నారు. ఇకపై తాను సాక్షమ్ ఇంట్లోనే ఉంటానని ఆమె చెప్పారు.

''నా బాయ్‌ఫ్రెండ్ చచ్చిపోతూ కూడా గెలిచాడు, కానీ నా తల్లిదండ్రులు అతన్ని చంపేసి కూడా ఓడిపోయారు'' అని అచల్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''మావి వేర్వేరు కులాలు కావడంతో మా కుటుంబాలు మా ప్రేమను అంగీకరించలేదు'' అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

''సాక్షమ్ కొద్దికాలం కిందటే జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి మా కుటుంబం వైపు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అతన్ని ట్రాప్ చేసి, గురువారం సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎటాక్ చేశారు'' అని ఆమె తెలిపారు.

అచల్ తండ్రి గజానన్ మామీడ్వార్, సోదరులు సాహిల్, హిమేష్ కలిసి సాక్షమ్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన వ్యక్తికి, అలాగే నిందితులకూ గతంలో నేర చరిత్ర (క్రిమినల్ రికార్డు) ఉందని తెలిపారు.

ప్రేమ, నేరాలు, మహారాష్ట్ర, నాందేడ్

'నా తల్లిదండ్రులు, సోదరులను ఉరి తీయండి..'

హత్య జరగడానికి రెండు గంటల ముందు, అచల్ తల్లి జయశ్రీ స్వయంగా సాక్షమ్ ఇంటికి వెళ్లి, బహిరంగంగానే ఆయన్ను బెదిరించారు. ఈ విషయమై సాక్షమ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అచల్ మీడియాతో మాట్లాడుతూ, ''సాక్షమ్, నేను ప్రేమించుకుంటున్నాం. కానీ, మా కుటుంబం దీన్ని అంగీకరించలేదు. సాక్షమ్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన్ను హత్య చేయాలని కుట్రపన్నారు. నన్ను కూడా బెదిరించారు. నా తల్లిదండ్రులను, సోదరులను ఉరి తీయండి. కులం, ద్వేషం కారణంగానే ఈ హత్య చేశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే, ''సాక్షమ్ భౌతికంగా లేకపోవచ్చు, కానీ నేను ఆయన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఆయన ఇంట్లోనే ఉంటాను.''

సాక్షమ్ తల్లి ఫిర్యాదు మేరకు, ఇత్వారా పోలీసులు గజానన్ మామీడ్వార్ సహా ఆరుగురిపై హత్య, చిత్రహింసలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు.

నిందితులందరినీ కేవలం 12 గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

అచల్ తల్లిదండ్రులు, సోదరులు సహా నిందితులంతా కస్టడీలో ఉన్నారు.

నిందితుల కుటుంబ సభ్యులు లేదా వారి తరఫు న్యాయవాది వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది, కానీ ఎవరూ అందుబాటులోకి రాలేదు. వారి వివరణ వస్తే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.

ప్రేమ, నేరాలు, మహారాష్ట్ర, నాందేడ్

'మా ప్రేమ సజీవం..'

జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ అచల్, ''మా నాన్న, నా సోదరులు నా సాక్షమ్‌ను చంపేశారు. అయితే, వారు ఆయన్ను చంపేసి ఓడిపోయారు, సాక్షమ్ చనిపోతూ కూడా గెలిచారు. ఎందుకంటే మా ప్రేమ సజీవంగా ఉంటుంది'' అని అన్నారు.

''నేను గత మూడేళ్లుగా సాక్షమ్ తాటేను ప్రేమిస్తున్నా. దీనికి మా కుటుంబం అంగీకరించలేదు. అందుకే వారు ఆయన్ను ఇలా హత్య చేశారు'' అని ఆమె చెప్పారు.

ప్రేమ, నేరాలు, మహారాష్ట్ర, నాందేడ్
ఫొటో క్యాప్షన్, సాక్షమ్, అచల్

'వేరే కులమని మాట్లాడొద్దన్నారు...'

''మా ప్రేమను మా నాన్న అంగీకరించలేదు. ఎందుకంటే, సాక్షమ్‌ది వేరే కులం కావడమే. 'నేను నీకు పెళ్లి చేసేస్తా, అతనితో మాట్లాడడం మానెయ్' అని నన్ను హెచ్చరించేవారు' అని అచల్ చెప్పారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ హత్య తర్వాత నిందితులు పరారయ్యారు. పర్భాని జిల్లాలోని మాన్వత్ పట్టణంలో, బంధువుల ఇళ్లలో ఉన్నట్లు తెలిసింది.

అనంతరం, వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్లాన్ ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు అచల్ తండ్రి గజానన్ మామీడ్వార్, సోదరుడు సాహిల్ అంగీకరించారని పోలీసులు చెప్పారు.

నాందేడ్, మహారాష్ట్ర
ఫొటో క్యాప్షన్, నాందేడ్ డీఎస్పీ ప్రశాంత్ శిందె

‘సాక్షమ్‌ను కొట్టి చంపేశారు...’

''సాక్షమ్ తాటేను కొట్టి చంపేశారు. నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది" అని నాందేడ్ డీఎస్పీ ప్రశాంత్ శిందె చెప్పారు.

నిందితులపై ఐపీసీ 103, 61(2), 189, 190, 191(2), 193(3) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

''ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు. జయశ్రీ మదన్‌సింగ్ ఠాకూర్, గజానన్ బాలాజీరావు మామీడ్వార్, సాహిల్ మామీడ్వార్, హిమేష్ మామీడ్వార్, సోమేష్ సుభాష్ లకే, వేదాంత్ అశోక్ కుందేకర్‌‌లను అరెస్టు చేశాం'' అని పోలీసులు వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)