కొత్త కార్మిక చట్టాలతో మీకు ప్రతినెలా వచ్చే జీతం తగ్గనుందా? సెలవుల పరిస్థితేంటి?

ఉద్యోగుల నెలవారీ జీతం, కొత్త లేబర్స్ కోడ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అజిత్ గధ్వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో నవంబర్ 21 నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి.

ఈ నియమావళిలోని వివిధ ప్రతిపాదనల కారణంగా, ఉద్యోగుల నెలవారీ జీతం (ఇంటికి తీసుకెళ్లే జీతం)లో తేడా ఉండనుంది. దీంతో పాటు, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యుటీ చెల్లింపు కూడా మారనుంది.

దేశంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చారు.

  • దీని వల్ల కార్మిక నిబంధనల సంఖ్య 1,400 నుంచి దాదాపు 350కి తగ్గింది.
  • కంపెనీలు పూరించాల్సిన ఫారమ్‌ల సంఖ్య 180 నుంచి 73కి తగ్గింది.

వేతన నియమాలు గతవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కానీ, వివరణాత్మక నియమాలు వచ్చే నెలన్నరలోపు ప్రకటించనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పీఎఫ్, గ్రాట్యుటీ, కొత్త లేబర్ కోడ్స్

ఫొటో సోర్స్, Getty Images

జీతం తగ్గే అవకాశం..

కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, ఇక నుంచి ఉద్యోగి కాస్ట్-టు-కంపెనీ (సీటీసీ)లో బేసిక్ పే(మూల వేతనం) కనీసం 50 శాతం ఉండనుంది. దీంతో, కంపెనీలు తమ శాలరీ ప్యాకేజీ విధానం మార్చే అవకాశాలున్నాయి.

ఈ మార్పుతో పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు రాబడి ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, చేతికందే నెలవారీ జీతం మాత్రం తగ్గే అవకాశం ఉంది.

ఇంతకుముందు వరకు, చాలా కంపెనీలు బేసిక్ పేను 50 శాతం కన్నా తక్కువగా ఉంచేవి. ఇపుడు బేసిక్ పేలో వచ్చే మార్పు ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యుటీలకు ఎక్కువ జీతం పంపనుంది.

ప్రస్తుతం, ప్రాథమిక జీతంలో 12 శాతం పీఎఫ్‌కి వెళుతోంది. అదే సమయంలో గ్రాట్యుటీ అనేది ఉద్యోగి చివరి బేసిక్ పే , కంపెనీలో సర్వీస్ కాలంపై లెక్కిస్తారు.

కొత్త లేబర్ కోడ్స్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఉద్యోగులను సులభంగా తొలగించవచ్చు..

  • ఇక నుంచి, 300 కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తొలగించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 100 మంది ఉద్యోగులుగా ఉండేది.
  • ఫ్యాక్టరీలో సమ్మెకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. సామూహిక సాధారణ సెలవు కూడా సమ్మెగా పరిగణించవచ్చు.
  • దేశంలో మొదటిసారిగా గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను (ఓలా, ఉబెర్ డ్రైవర్లు, జొమాటో లేదా స్విగ్గీ వంటి డెలివరీ పార్ట్‌నర్స్) లేబర్ కోడ్‌లో ప్రస్తావించారు.
  • కంపెనీలు ఉద్యోగులను రోజుకు 8 నుంచి 12 గంటలు పని చేయించుకోవచ్చు. అయితే, వారానికి గరిష్టంగా 48 గంటల వరకే అనుమతి ఉంది.
  • ఓవర్‌టైమ్‌లో సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి.
  • దేశంలో ఏ ప్రాంతంలోనైనా పని చేయడానికి కాంట్రాక్టర్లకు ఒక లైసెన్స్ సరిపోతుంది. ఇది ఐదేళ్ల వరకు చెల్లుతుంది.
  • ప్రతి ఉద్యోగికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలి. అందులో ఉద్యోగి పాత్ర, జీతం, సామాజిక భద్రత వివరాలు ఉండాలి.
  • గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా అందరు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలి.
  • 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు అందించాలి.
లేబర్ కోడ్స్, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళా ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సమాన పనికి సమాన వేతనం వర్తిస్తుంది. దీనర్థం స్త్రీలకు పురుష ఉద్యోగులతో సమానమైన వేతనం చెల్లించాలి.

సరైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తే, మహిళలు కూడా తమ అభీష్టం మేరకు రాత్రి షిఫ్టులలో పని చేయవచ్చు.

అసంఘటిత రంగంలోని మహిళలు 26 వారాల వేతనంతో కూడిన సెలవుతో సహా ప్రసూతి ప్రయోజనాలను కూడా పొందుతారు.

కనీస జీవన ప్రమాణానికి చట్టపరమైన ప్రమాణం ఏర్పాటు చేయనున్నారు. ఏ రాష్ట్రమూ వేతనాలను దీని కంటే తక్కువగా ఉంచరాదు.

కొత్త లేబర్ కోడ్స్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

సెలవులు, గ్రాట్యుటీ నియమాలు

కొత్త కార్మిక చట్టం ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ) ఇక నుంచి ఏడాది సర్వీస్ తర్వాత గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. గతంలో ఇది ఐదేళ్లుగా ఉండేది.

ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీ పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది, దానిని కొనసాగించారు. 2018లో, ఈ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే ఉద్యోగి గ్రాట్యుటీని రూ. 20 లక్షలకు మించి పొందినప్పుడు, దానిని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. తదనుగుణంగా పన్ను స్లాబ్ వర్తిస్తుంది.

ఇక నుంచి 180 రోజులు పని చేసిన తర్వాత, ఉద్యోగులు ప్రతి 20 రోజులకు ఒక రోజు వార్షిక సెలవు(యాన్యువల్ లీవ్)కు అర్హులు. గతంలో, ఈ సెలవు 240 రోజుల పని తర్వాత అందుబాటులో ఉండేది. ఇది కాంట్రాక్ట్, సీజనల్, వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

పని గంటల తర్వాత, ఓవర్ టైంకు రెట్టింపు వేతనాలు అందించడం పరిశ్రమల కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, కార్మికుల అంగీకారం లేకుండా ఓవర్ టైం చేయించకూడదని పేర్కొంది.

కొత్త లేబర్ కోడ్స్‌, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ దిల్లీలో వామపక్ష ట్రేడ్ యూనియన్ల నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

నిపుణులు ఏమంటున్నారు?

గతంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు మాత్రమే సమ్మెకు ముందు 14 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలలో కూడా నోటీసు వ్యవధి వర్తిస్తుంది. దీనిని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్తా వ్యతిరేకించారు.

గతంలో, 100కు పైగా కార్మికులున్న కర్మాగారాలు మాత్రమే కార్మికులను తొలగించడానికి ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉండేది. ఇప్పుడీ పరిమితిని 300 కార్మికులకు పెంచారు. అంటే, 299 మంది ఉంటే, ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించుకోవచ్చు.

సుదీప్ దత్తా బీబీసీతో మాట్లాడుతూ, "పెద్ద సంఖ్యలో కార్మికులను కార్మిక చట్టాల నుంచి మినహాయించేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?" అని ప్రశ్నించారు.

"మన దేశంలో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులున్న కంపెనీలు ఐదు శాతం కూడా లేవు. ఇపుడు చాలామంది కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు" అని అఖిల గుజరాత్ మజ్దూర్ సంఘ్ న్యాయవాది, రిటైర్డ్ న్యాయమూర్తి ఎం.జె. మెమన్ బీబీసీతో అన్నారు.

ఈ వ్యక్తులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వారు ఏ న్యాయవాదిని లేదా యూనియన్‌ను కూడా సంప్రదించలేరు. 2025 నవంబర్ 21 తర్వాత, ఉద్యోగం నుంచి తొలగింపుకు గురైన కార్మికుల ఫిర్యాదులను కూడా లేబర్ కమిషనర్ స్వీకరించడం లేదని ఆరోపించారు మెమన్.

ఒక ఉద్యోగి ఏడాది పాటు పనిచేస్తే, 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, కంపెనీలు 11 నెలల్లోపు ఉద్యోగిని తొలగిస్తే, గ్రాట్యుటీ ఇవ్వరు, ఆ వ్యక్తి ఫిర్యాదునూ విచారించరు.

"కొత్త చట్టంలో ప్రభుత్వం లేబర్ కోర్టును రద్దు చేసి, ఇండస్ట్రియల్ జస్టిస్ కమిషన్ అనే నిర్మాణాన్ని సృష్టించింది. అయితే, దీనికి అవసరమైన ఇద్దరు న్యాయమూర్తులను మాత్రం నియమించలేదు" అని మెమన్ అన్నారు.

ఓవర్ టైం చట్టం గురించి మెమన్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు, ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు డబుల్ ఓవర్ టైం పేమెంట్ ఇవ్వలేదు. కేవలం ఒక శాతం పరిశ్రమలు మాత్రమే దీనిని అనుసరిస్తున్నాయి" అన్నారు.

మరోవైపు, ఉద్యోగుల తొలగింపులను నియంత్రించే పాత నిబంధన 'చాలా కఠినమైనది' అని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ పనగారియా అంటున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాం, చైనాలతో పోలిస్తే భారత దేశ పోటీతత్వం దెబ్బతింటోందని అభిప్రాయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)