దిత్వా తుపాను: శ్రీలంకను ముంచెత్తిన వరదలు, 56 మంది మృతి.. భారత్‌లో తీరం దాటే అవకాశం

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, యెవెట్ టాన్
శ్రీలంకలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 56 మంది మరణించారు. మరో 21 మంది గల్లంతయ్యారు.
ఇటీవలి సంవత్సరాల్లో శ్రీలంకలో సంభవించిన అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తులలో ఇదీ ఒకటి.
టీ తోటలు ఎక్కువగా ఉండే బదుల్లా జిల్లాలో రాత్రివేళ ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 21 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం(డీఎంసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోల్లో, వరద నీరు పట్టణాలను ముంచెత్తి ఇళ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలావరకూ రైలు సర్వీసులు రద్దయ్యాయి.
దిత్వా తుపాను తూర్పు తీరం వెంబడి కదులుతున్నందున శుక్రవారం మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

దిత్వా తూర్పు తీరంలో లోతైన వాయుగుండంగా మొదలై, తుపానుగా మారింది. ఇది భారత్‌లో తీరం దాటే అవకాశం ఉంది.
శ్రీలంకలో నదుల నీటిమట్టాలు పెరుగుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని డీఎంసీ హెచ్చరించింది.
రాబోయే 48 గంటల్లో కెలాని నదీలోయలోని లోతట్టు ప్రాంతాలకురెడ్ అలర్ట్జారీ చేసినట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. ఇందులో రాజధాని కొలంబో కూడా ఉంది.
ఉత్తర, మధ్య శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం 200 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రావిన్సులను అనుసంధానించే కీలక రహదారులను మూసివేశారు. కొన్ని ముఖ్యమైన సేవలు మినహా అన్ని రైళ్లను శుక్రవారం ఉదయం 06:00 నుంచి రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల దాదాపు 44,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని డీఎంసీ తెలిపింది. సహాయక చర్యల కోసం దాదాపు 20,500 మంది భద్రతా దళాలను మోహరించారు.
శ్రీలంకలో ఇప్పుడు వర్షాకాలమే. కానీ, ఇంతటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించడం చాలా అరుదు.
ఈ శతాబ్దంలో 2003 జూన్‌లో భారీ వరదలు శ్రీలంకను ముంచెత్తాయి. ఆ వరదల్లో 254 మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














